Wednesday, October 31, 2012

మన ‘చరిత్ర’ మెరిసేనా...!



 హైదరాబాద్... ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రాచీన నగరం. అద్భుత చారిత్రక కట్టడాలకు నిలయం. చార్మినార్, గోల్కొండ, కుతుబ్‌షాహీ సమాధులు.. ఇలా చెబుతూ పోతే అలనాటి రాజవంశాల ఠీవికి దర్పణంగా నిలిచిన కట్టడాలెన్నో. కానీ వీటిలో ఏ ఒక్కదానికీ ‘యునెటైడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో)’ అధికారికంగా గుర్తించిన ప్రపంచ వారసత్వ కట్టడాల (హెరిటేజ్ బిల్డింగ్) జాబితాలో చోటు దక్కలేదు. నిర్మాణశైలి, చారిత్రక నేపథ్యం పరంగా ఆ కట్టడాలన్నీ అద్భుతమైనవే అయినప్పటికీ.. యునెస్కో రూపొందించిన నిబంధనలు అడ్డుగా మారటంతో ఇవి ఆ జాబితాలో చోటు దక్కించుకోలేదు. తొలుత పెద్దగా పట్టించుకోని పురావస్తు శాఖ గత మూడేళ్లుగా పట్టువదలకుండా చేస్తున్న ప్రయత్నాలు తుది దశకు చేరుకున్నాయి.


చార్మినార్, కుతుబ్‌షాహీ సమాధులు, గోల్కొండ కోట... ఈ మూడింటికీ ప్రపంచ వారసత్వ హోదా కల్పించాల్సిందిగా అభ్యర్థిస్తూ గత సంవత్సరం దరఖాస్తు చేసింది. దీంతో వీటికి ఆ అర్హత ఉందా లేదా అని తేల్చేందుకు ఈనెల 31న ప్యారిస్ నుంచి యునెస్కో ప్రతినిధి ఆడ్లర్ హైదరాబాద్‌కు వస్తున్నారు. కొందరు ఇతర నిపుణులతో కలిసి ఆయా కట్టడాలను పరిశీలించనున్నారు. మూడురోజుల కూలంకషంగా పరిశీలన అనంతరం వాటి అర్హతను తేల్చనున్నారు. ఆయన సంతృప్తి వ్యక్తం చేస్తేనే ఈ మూడు కట్టడాలకు ప్రపంచ వారసత్వ గుర్తింపు లభిస్తుంది.

మన నిర్లక్ష్యం అంతాఇంతా కాదు...

ప్రపంచవ్యాప్తంగా 820 నిర్మాణాలకు యునెస్కో ప్రపంచవారసత్వ సంపద హోదాను కట్టబెట్టింది. వీటిల్లో మన దేశం నుంచి 29 కట్టడాలు స్థానం సంపాదించుకోగలిగాయి. మన రాష్ట్రం నుంచి ఒక్కటి కూడా అందులో లేకపోవటం ఒకరకంగా వింతే. పొరుగున ఉన్న హంపి, మహాబలిపురం, తంజావూరు... లాంటి వాటికి ఆ ఘనత దక్కినా చార్మినార్, గోల్కొండ లాంటి ఘన చరిత్ర ఉన్న మన కట్టడాలు గుర్తింపునకు నోచుకోలేదు. యునెస్కో గుర్తింపు కోసం 12 ఏళ్ల క్రితమే పురావస్తు శాఖ ప్రయత్నాలు మొదలుపెట్టినా... ఇన్నాళ్లూ యునెస్కో నిబంధనల ప్రకారం వ్యవహరించలేకపోయింది. దీంతో అసలు మన కట్టడాల వైపు యునెస్కో కన్నెత్తి కూడా చూడలేదు. మూడేళ్లక్రితం తారామతి బారాదరిలో ‘భారతీయ నగర వారసత్వ సంపద’పై జరిగిన అంతర్జాతీయ సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన యునెస్కో డెరైక్టర్ మింజా యంగ్ ఆ కట్టడాలను చూసి అధికారుల నిర్లక్ష్యంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆమె సూచనల మేరకు డోజియర్ (ప్రతిపాదన దరఖాస్తు)ను రూపొందించి దరఖాస్తు చేయటంతో తాజాగా కదలిక వచ్చింది. గత సంవత్సరం యునెస్కో- ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితా పర్యవేక్షణ విభాగం సలహా సంఘం నగరంలో పర్యటించి ఈ మూడు కట్టడాలను పరిశీలించింది. నిర్మాణ చాతుర్యం పరంగా కట్టడాలు అద్భుతంగా ఉన్నాయని పేర్కొన్నప్పటికీ... నిర్వహణ తీరుపైనా, వాటి చుట్టూ వెలసిన అక్రమ నిర్మాణాలపైనా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే యునెస్కో రూపొందించిన ప్రమాణాల మేరకు కొన్ని చర్యలు తీసుకోవాలని సూచించింది.

దీంతో స్పందించిన ప్రభుత్వం ఓ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసి చర్యలకు పురమాయించింది. కానీ ఇబ్బడిముబ్బడిగా వెలిసిన అక్రమ నిర్మాణాలను తొలగించటం వెంటనే సాధ్యం కాదని తేల్చి, కట్టడాలకు అడ్డుగా ఉన్న కొన్ని ఎత్తయిన నిర్మాణాలను తొలగించవచ్చని తేల్చింది. అది కూడా ఒక్క కుతుబ్‌షాహీ సమాధుల వద్దనే సాధ్యమని సర్కారుకు విన్నవించింది. దీంతో టూంబ్స్ వెనుకవైపు 10 మీటర్ల కంటే ఎత్తుగా ఉన్న రెండు నిర్మాణాలను ఇటీవల తొలగించారు. కానీ చార్మినార్, గోల్కొండల వద్ద మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు.

చార్మినార్, గోల్కొండలకు అనుమానమే...

ప్రపంచ వారసత్వ సంపద హోదా కేటాయింపు విషయంలో యునెస్కో కచ్చితంగా వ్యవహరిస్తుంది. ప్రధాన కట్టడానికి వంద మీటర్ల లోపు (నిషేధిత ప్రాంతం) ఎలాంటి చారిత్రక ప్రాధాన్యం లేని కట్టడాలు ఉండకూడదు. రెండొందల మీటర్ల లోపు (ఆంక్షలు అమలులో ఉన్న ప్రాంతం) 15 మీటర్ల కంటే ఎత్తున నిర్మాణాలుండకూడదు. కానీ గోల్కొండ, చార్మినార్‌లకు అతి చేరువగా భారీ నిర్మాణాలుండటంతో యునెస్కో వీటికి ప్రాధాన్యం ఇవ్వకపోవచ్చనే అభిప్రాయం ఉంది. కానీ కుతుబ్‌షాహీ టూంబ్స్‌కు ఈ సమస్య లేకపోవటంతో దానికి గుర్తింపు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

ఇవీ ప్రత్యేకతలు....

కుతుబ్‌షాహీ సమాధులు

170 సంవత్సరాల పాటు సాగిన కుతుబ్‌షాహీ పాలనలోని ఏడుగురు పాలకులకు గుర్తుగా వారి వారసులు సమాధులను ఒకే ప్రాంగణంలో నిర్మించారు.

ఒక వంశానికి సంబంధించి అందరి సమాధులు ఒకే చోట ఉండటం ఇక్కడ మినహా ప్రపంచంలో ఎక్కడా కనిపించదు.

ఇండో-పర్షియన్ నిర్మాణశైలితో అద్భుతంగా ఆ నిర్మాణాలను తీర్చిదిద్దారు.

మహ్మద్ కులీ కుతుబ్‌షా సమాధి ఏకంగా 42.5 మీటర్ల ఎత్తుతో అలరారుతూ సందర్భకులను ఆకట్టుకుంటుంది.

అడ్డంకి

సమాధులున్న ప్రాంతంలో కొంత భూమికి హక్కుదారులుగా పేర్కొంటూ కొందరు స్థానికులు కోర్టును ఆశ్రరుుంచారు.

గోల్కొండ కోట

400 అడుగుల ఎత్తుతో కోట అద్భుతంగా రూపుదిద్దుకుంది. దాని చుట్టూ ఏడు కిలోమీటర్ల మేర కోట గోడ (సఫిల్) విస్తరించింది.

 
చుట్టూ 8 ప్రాంతాల్లో విశాలమైన భారీ దర్వాజాలు ఆకట్టుకుంటాయి.

అడ్డంకి

కోటగోడ లోపలి వైపు కూడా పెద్ద సంఖ్యలో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. ప్రధాన కట్టడాన్ని ఆనుకునే ఆక్రమణలు రూపుదిద్దుకున్నాయి.

చార్మినార్

మహ్మద్ కులీకుతుబ్‌షా 1591లో నిర్మించిన చార్మినార్ హైదరాబాద్ ల్యాండ్‌మార్క్‌గా మారింది.

గ్రానైట్, డంగు సున్నంతో రూపుదిద్దుకున్న ఈ నిర్మాణానికి 48.7 మీటర్ల ఎత్తుతో ఉండే నాలుగు మీనార్లు ప్రత్యేక ఆకర్షణ. అవి తాజ్‌మహల్ మీనార్లను పోలి ఉండటం విశేషం.

 
పైకి ఎక్కి నగర అందాలను వీక్షించేలా 149 మెట్లను నిర్మించారు. ఎగువన మసీదు, దిగువన భాగ్యలక్ష్మి దేవాలయం మతసామరస్యానికి ప్రతీకగా నిలిచాయి.

అడ్డంకి

చార్మినార్‌కు అతి చేరువలో వేల సంఖ్యలో వెలిసిన నిర్మాణాలు దాన్ని ఎందుకూ కొరగాకుండా చేస్తున్నాయి. ఇరుకైనదారులు, కాలుష్యం పర్యాటకులను ఇబ్బంది పెడుతున్నాయి.

1 comment:

Chiranjeevi said...

ప్రతీ సంవత్సరం యునెస్కో గుర్తింపు కోసం దరకాస్తు చేయడం, వారు రావడం రేజేక్టు చేయడం పరిపాటి అయిపొయింది.. ప్రభుత్వ పరంగా, పరిపాలనా పరంగా, సంరక్షణా స్పృహపరంగా సరైన చర్యలు తీసుకుంటేనే మన చారిత్రిక కట్టడాలకు ఆ గుర్తింపు దక్కేది, అప్పటివరకు వాళ్ళు రావడం, వెళ్ళడం తప్ప ఇంకేం జరగదు....