Friday, October 26, 2012

గర్భం ధరించాలనుకున్నప్పుడు ఆహారం...

మన రోజువారీ వ్యవహారంలో కొన్ని పనులు చేయబోయే ముందు కొంత ప్రత్యేకమైన ఆహారం మీకు ఉపయోగిస్తుంది. మనం సరిగ్గా ఇలాగే తింటామని, లేదా ఇలాగే తినాలని కాకపోయినా... ఇలా తినడం వల్ల అదనపు ప్రయోజనం తప్పకుండా ఉంటుంది. ఈ వివరాలు ఇలా...

గర్భం ధరించాలనుకున్నప్పుడు...

కొత్తగా పెళ్లయ్యాక పిల్లలప్పుడే వద్దనుకుంటే పర్వాలేదు. అయితే పిల్లలు కావాలనుకోగానే మహిళలు కార్బోహైడ్రేట్లు, ఫోలిక్ యాసిడ్ పాళ్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.

ఇది ట్రై చేయండి: కార్బోహైడ్రేట్ల కోసం పొట్టుతో ఉండే గోధుమలతో చేసిన చపాతీలు లేదా దంపుడుబియ్యంతో వండిన అన్నం తినాలి. ఇందులో పప్పులు, ఆకుకూరలు, పెరుగు పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. ఫోలిక్ యాసిడ్ కోసం ముదురాకుపచ్చగా ఉండే ఆకుకూరలు, నిమ్మజాతి పండ్లు, తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. ప్రీ-నేటల్ విటమిన్లు కూడా తీసుకోవచ్చు. వాటి మోతాదును డాక్టర్ నిర్ణయించాలి కాబట్టి వారి సలహా మేరకే వాడాలి.

నిద్రకు ముందు...

నిద్రకు ఉపక్రమించే ముందు పొట్టుతీయని ధాన్యంతో చేసిన పదార్థాలు, కొవ్వులు లేని ప్రొటీన్‌లతో పాటు ఒక గ్లాసు పాలు తీసుకోవాలి.

ఇవి ట్రై చేయండి: పొట్టుతీయని ధాన్యంతో చేసిన పదార్థాలు అంటే పొట్టుతీయని గోధుమల పిండితో చేసిన చపాతీలు లేదా ముడిబియ్యంతో వండిన అన్నం వల్ల మెదడులో సెరిటోనిన్ అనే రసాయనం ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల ప్రశాంతత చేకూరుతుంది కాబట్టి దీన్ని కామింగ్ కెమికల్ అంటారు. దీనివల్ల ప్రశాంతమైన నిద్రతో పాటు ఉల్లాసభరితమైన కలలు కూడా సాధ్యమవుతాయి. ఇక గ్లాసెడు పాలలో ట్రిప్టొఫాన్ అనే అమైనో యాసిడ్ ఉంటుంది. ఇది నిద్రలేమిని దూరం చేసి త్వరగా నిద్రపట్టేలా చేస్తుంది.

జలుబు చేసినప్పుడు...

జలుబు చేసినప్పుడు వేడిగా ఉండే ద్రవాహారంతో పాటు వెల్లుల్లి ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. వాటివల్ల గొంతులోని మ్యూకస్ పలచబారి ఉపశమనంగా ఉంటుంది. వెల్లుల్లి పొడిదగ్గును తగ్గిస్తుంది. ఇక మనకు జలుబు వల్ల జరుగుతున్న డీ-హైడ్రేషన్‌ను ద్రవాహారం విరుగుడుగా పనిచేస్తుంది.

ఇవి ట్రై చేయండి: జలుబు చేసినప్పుడు హాట్ స్పైసీ గార్లిక్ చికెన్ సూప్, సూప్ మీద కొద్దిగా మిరియాల పౌడర్ చల్లి వేడివేడిగా తాగండి. జింజర్ టీ వంటివి ఉపశమనం ఇస్తాయి.

No comments: