Friday, October 12, 2012

ఆర్థరైట్స్: 100 రకాల్లో ముఖ్యమైనవి

ఒకప్పుడు వృద్ధులకు సంబంధించిన సమస్యగా పరిగణించే ఆర్థరైటిస్ మారిన జీవనశైలి, ఆధునికత తెచ్చిన సుఖజీవితం కారణంగా మధ్యవయస్కులను సైతం తీవ్రంగా బాధిస్తోంది. ఆర్థరైటిస్ కారణంగా మోకాలు కీలు అరిగిపోయి జీవన గమనానికి అవరోధం ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థరైటిస్ ముందుగానే గుర్తించటం వల్ల ఎముకలు, కనెక్టివ్ టిష్యూ, లిగమెంట్స్ మొదలైనవి అధికంగా నష్టపోకుండా చూడవచ్చును.

మానవ శరీర వ్యవస్థలో ముఖ్యమైన జాయింట్స్ మణికట్టు, మోచేయి, మోకాలు, చీలమండ మొదలైనవి. రెండు ఎముకలను కలుపుతూ కదలికలకు ఉపయోగపడే జాయింట్స్. ఎముకల చివరిలో కార్టిలేజ్ అనేది మృదుత్వం కలిగి ఉండి రాపిడిని నియంత్రించడంలో సహకరిస్తుంది. జాయింట్ క్యాప్సుల్ అనేది దృఢమైన పొరతో అన్ని జాయింట్స్‌ని కప్పి ఉంచుతుంది. సైనోవియం అనేది జాయింట్ క్యాప్సుల్‌పై ఉండే పలుచని పొర. ఇది సైనోవియల్ ద్రవాన్ని ఉత్పత్తి చేసి జాయింట్ మధ్య లూబ్రికెంట్‌గా పనిచేస్తూ కార్టిలేజ్‌కు సహకరిస్తుంది.

సంకేతాలు

ఆర్థరైటిస్‌తో జాయింట్స్ గట్టిపడటం, ఉదయం లేవగానే కదిలించలేకపోవడం, జాయింట్ అంతా నొప్పిగా, ఆ ప్రాంతం ఎర్రగా ఉండి వాపు, వేడిని గమనించగలం. కొన్ని రకాల ఆర్థరైటిస్‌లలో మంటతో కూడిన నొప్పి, చర్మంపై దద్దుర్లు, తరచు జ్వరం, ఎండ భరించలేకపోవడం, రక్తహీనత, జుట్టు రాలటం, ఎముకలు గట్టిబడటం, ఆకారంలో మార్పు రావడం వంటివి సంకేతాలుగా చెప్పవచ్చు.ఆర్థరైటిస్‌లో ఉన్న వంద రకాలలో ముఖ్యంగా పేర్కొనతగ్గవి ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, గౌట్, సొరియాటిక్ ఆర్థరైటిస్, ఎస్ఎల్ఇ, రియాక్టివ్ ఆర్థరైటిస్, యాంకిలోసింగ్ స్పాండిలైటిస్.

ప్రేరేపకాలు

ఆర్థరైటిస్‌లో కొన్ని జన్యుపరంగా, వాతావరణ పరిస్థితుల వలన, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, ధూమపానం, సరైన వ్యాయామం కొరవడడం, ఎక్కువ సమయం కూర్చుని పనిచేయడం వల్ల రావచ్చు. అయితే స్థూలకాయమే ఆర్థరైటిస్‌కు ముఖ్య కారణమని చెప్పాల్సి ఉంటుంది. జాయింట్స్ పైన అధిక భారంపడి మోకాళ్లు, వెన్నెముక సమస్యలు అధికంగా వచ్చే అవకాశం ఉంది.

లక్షణాలు

అన్ని రకాల ఆర్థరైటిస్‌లలో జాయింట్ నొప్పి, వాపు, వేడిగా ఉండటం, కదలికలు తగ్గిపోవడం వంటివి కనిపించవచ్చు.

ఆస్టియో ఆర్థరైటిస్: వయసు పైబడిన వారికి ఈ సమస్య ఏర్పడుతుంది. నొప్పితోపాటు వాపు ఉంటుంది. నొప్పి మోకాళ్లకు, పిరుదులకు, తొడలకు వ్యాపిస్తుంది. ఒత్తిడి అధికంగా ఉన్నపుడు నొప్పి ఎక్కువ కావడం, అరగంట కదలకుండా ఒకే చోట కూర్చున్నా, నిద్ర లేచిన తర్వాత నొప్పి అధికంగా ఉంటుంది. ఎముకల మధ్య ఉండే కార్టిలేజ్ క్షీణించడం వల్ల ఎముకల మధ్య రాపిడికి శబ్దం రావడాన్ని గమనించవచ్చు.

రుమటాయిడ్ ఆర్థరైటిస్: ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్. జన్యుపరంగా సంక్రమిస్తుంది. పాదాలు, కాళ్లలో నొప్పితోపాటు వాపు ఉంటుంది. వెన్నుపూస నొప్పి, కళ్లకు ఇన్‌ఫెక్షన్, కీళ్ల నొప్పితోపాటు కొన్ని రోజుల తర్వాత చేతులు, పాదాలు వంకర్లు తిరగటం, దినచర్యలో వారి పనులు వారే చేసుకోలేనంతగా సమస్య అధికమవుతుంది.

గౌట్: నొప్పి వేగంగా పెరుగుతూ ముందుగా సూచనలు లేకుండా వ్యాపించి, బొటనవేలును ఆ తర్వాత పాదం, మణికట్టు, ముంజేతికి వ్యాపిస్తుంది. నొప్పితోపాటు వాపు, చర్మం వేడిగా ఉండటం, ఎరుపు రంగులో చర్మం మెరుస్తూ కనిపిస్తుంది.

ఎస్ఎల్ఇ: కీళ్ల నొప్పి నెలరోజులుగా ఉంటూ బిగుతుగా ఉండి వాపుతో కదలికలు తగ్గిపోతాయి. ఎస్ఎల్ఇ అనేది కనెక్టివ్ టిష్యూ డిజార్డర్. అన్ని కీళ్లకు నొప్పి, వాపును కగలగచేస్తుంది. రక్తహీనత, చర్మ సంబంధ సమస్యలు, ఛాతీనొప్పి, ఎండ భరించలేకపోవడం, జుట్టు రాలడం, ముఖ్యంగా 'సీతాకోక చిలుక' ఆకారంలో ముక్కు, బుగ్గలపై మచ్చను గమనించవచ్చు.

రియాక్టివ్ ఆర్థరైటిస్: మగవారిలో అధికంగా(9రెట్లు) సంభవిస్తుంది. 20-45 మధ్య వయస్కులైన పురుషులలో కీళ్లనొప్పి, వాపు, జ్వరం, యూరినరీ ఇన్‌ఫెక్షన్లు, ప్రొస్టేట్ గ్రంథి సమస్యలు, టెండన్ సమస్యలు, కిడ్నీ సమస్యలతో పాటు కంటికి తరచు ఇన్‌ఫెక్షన్స్, స్త్రీలలో ముఖ్యంగా గర్భాశయ సమస్యలతో కలిసి కీళ్ల నొప్పులు, వాపు, నిద్రలేమిని గమనించవచ్చు.

ఆంకలోజింగ్ స్పాండిలైటిస్: వెన్నెముకలోని వెర్టెబ్రాల మధ్య సరైన దూరం తగ్గి అన్నీ దగ్గరగా చేరి వెదురు కర్రలా మారుతుంది. శరీరంలో కదలికలు కష్టమవుతుంది. జన్యుపరంగా వచ్చే సమస్యల్లో ఇది ఒకటి.

వ్యాధి నిర్ధారణ

అసోటైటిర్, ఆర్ ఫ్యాక్టర్, సిఆర్‌పి వంటి రక్త పరీక్షలు, ఎక్స్‌రే, ఎంఆర్ఐ స్కాన్, సిటి స్కాన్, ఆటో ఇమ్యూన్ ఎనాలిసిస్‌ల ద్వారా వ్యాధిని నిర్ధారించవచ్చు.

No comments: