Wednesday, October 17, 2012

ప్రాణహిత-చేవెళ్ల ను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలి

తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతిపథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని కోరుతూ ప్రభుత్వ విప్ టి.జగ్గారెడ్డి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు వినతిపత్రం అందజేశారు. జీవవైవిధ్య సదస్సులో మంగళవారం నాడు పాల్గొన్న ప్రధానమంత్రిని విప్ జగ్గారెడ్డి కలిశారు. తెలంగాణలోని పది జిల్లాల్లో వ్యవసాయమంతా వర్షాధారంపైనే సాగుతున్నదని విప్ జగ్గారెడ్డి ప్రదానికి వివరించారు. అంతేగాక సాగునీటి రంగంలో భారీ, మధ్య తరహాప్రాజెక్టులు కూడా లేవని పేర్కొన్నారు. అందువల్ల తెలంగాణ ప్రాంత రైతాంగం శ్రేయస్సు దృష్ట్యా ప్రాణహిత-చేవెళ్ల పథకం అత్యంత అవసరమన్నారు.


ఈ పథకం నిర్మాణానికి ఇటీవలే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సమక్షంలో ఆంధ్రప్రదేశ్, మహరాష్ట్ర ముఖ్యమంత్రులు అంగీకరించి, సంతకాలు కూడా చేశారని తెలిపారు. ఈపథకం నిర్మాణమైతే తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని 16,40,000 ఎకరాల సాగుకు నీరందుతుందని పేర్కొన్నారు. అయితే ఇందుకోసం 38,500 కోట్ల రూపాయలు కావల్సి వస్తుండడంతో జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి, నిధులు విడుదల చేయాలని విప్ జగ్గారెడ్డి ప్రధానికి ఇచ్చిన వినతిపత్రంలో కోరారు.

No comments: