Wednesday, October 17, 2012

స్మైల్ @ 60

వయసు పైబడింది అనడానికి కొన్ని గుర్తులు చెప్పుకుంటాం. వాటిలో జుట్టు నెరవడం, చర్మం ముడతలు పడటం, పళ్లు ఊడిపోవడం... వంటివి ప్రధానంగా చూస్తుంటాం. మొదటి రెండు పరిస్థితులు సాధారణమే అయినా, దంతాలు మాత్రం మన అజాగ్రత్తల వల్లే ఊడిపోతుంటాయి అంటున్నారు వైద్యులు. వృద్యాప్యంలోనే కాదు ఇటీవల రకరకాల కారణాల వల్ల నలభై ఏళ్ల వయసులోపు వారిలోనూ దంతాలు ఊడిపోతున్నాయి. ఇప్పటి వరకు ఊడిపోయిన దంతాల స్థానంలో కట్టుడు పళ్ల సెట్ పెట్టుకొని ఇబ్బందులు పడేవారు. ఇంప్లాంట్స్ ఈ ఇబ్బందుల నుంచి శాశ్వతంగా విముక్తి లభించేలా చేస్తున్నాయి. ఆ వివరాలు తెలిపేదే ఈ కథనం...

దంతాలు ఊడిపోవడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. 50 శాతం మందిలో చిగుళ్ల వ్యాధి వల్ల ఊడిపోతుంటాయి. అయితే ఇవి నొప్పి లేకుండానే దంతాలు కదిలి ఊడిపోతాయి. ముందు చిగుళ్ల వాపు వస్తుంది. తర్వాత చిగుళ్ల నుంచి రక్తస్రావం అవుతుంది. ఏదైనా తిన్నప్పుడు దంతాల మధ్య పదార్థాలు ఇరుక్కోవడం మొదలవుతాయి. ఇలాంటప్పుడు పుల్లలు పెట్టి తీయడం అలవాటు అవుతుంది. ఈ అలవాటు 60-70 ఏళ్ల వారిలోనే కాదు 20-30 ఏళ్ల మధ్య వయసు వారూ పళ్ల సందుల్లో పుల్లలు పెట్టి కెలకడం గమనించవచ్చు. ఇవి దంతాలు కదలడానికి, ఊడిపోవడానికి సూచనలు అని గుర్తించాలి.


రెండో కారణం... 50 శాతం మందిలో పళ్లు పుచ్చి, ఊడిపోతుంటాయి. పంటి నొప్పి వస్తుందని, పన్ను పీకించుకోవడానికి సిద్ధపడతారు. పన్ను తీయించుకున్న చోట నమలలేక రెండో దవడ వైపు మాత్రమే నమలడం మొదలుపెడతారు. అప్పుడు ఆ దంతాలపై ఓవర్‌లోడ్ పడి, ఆ పళ్లూ పాడవుతాయి. అప్పుడు రెండో వైపు పళ్లు తీయించుకొని, ఆహారాన్ని నమలడానికి మళ్లీ మొదటి దవడ దంతాలపై ఆధారపడతారు. దీని వల్ల పళ్లు లేని చోట ఒత్తిడి పడి, ఆ పక్కనే ఉన్న పళ్లు కదులుతూ ఉంటాయి. దీని వల్ల నమిలే విధానం మారిపోతుంది. పళ్లు తగలాల్సిన చోట తగలక త్వరగా అరిగి 10-15 ఏళ్ల వ్యవధిలో నమిలే దంతాలన్నీ ఖాళీ అయిపోతాయి.



దంతాలు కదలకుండా ఉండాలంటే...

ఒ.పి.జి అనే ఎక్సరే తీయించుకుంటే చిగుళ్ల ఇన్ఫెక్షన్ ఎంతవరకు ఉందో డాక్టర్లు తెలుసుకుంటారు. 25 శాతంలోపు ఇన్ఫెక్షన్ ఉంటే ఎముక దెబ్బ తినకుండా డీప్ క్లీనింగ్ పద్దతి ద్వారా చిగుళ్ల ఇన్ఫెక్షన్‌ను తొలగిస్తారు. 50 శాతం ఇన్ఫెక్షన్ ఉంటే గమ్ సర్జరీ చేస్తారు. గతంలో గమ్‌సర్జరీకి 4-6 గంటల సమయం పట్టేది. ఈ పద్ధతిలో రక్తస్రావం, వాపు, నొప్పి ఎక్కువగా ఉండేవి. మధుమేహులు, గుండెజబ్బులు గల వారు, అధిక రక్తపోటు ఉన్నవారికి ఈ వైద్యం చేయాలంటే వైద్యులు సంకోచించేవారు. ఇప్పుడు ఎండియార్ లేజర్, ఎర్బియమ్ లేజర్, డయోలేజర్.. వంటి లేజర్స్ అందుబాటులోకి వచ్చాయి. వీటిలో రక్తస్రావం, నొప్పి లేకుండా చిగుర్ల కింద ఉండే ఇన్ఫెక్షన్‌ని పూర్తిగా తొలగిస్తున్నారు. ఈ పద్ధతిలో నొప్పి ఉండదు. భయపడాల్సిన అవసరమూ ఉండదు. ఈ సర్జరీ అయిన తర్వాత రోజూ ఉదయం, రాత్రి బ్రష్ చేసుకోవడం ప్లాస్‌ను ఉపయోగించడం, ఆరు నెలలకోసారి దంతాలను వైద్య నిపుణులచే శుభ్రం చేయించుకోవడం వల్ల పళ్లు ఊడిపోవడాన్ని పూర్తిగా నివారించుకోవచ్చు.


మొదట్లోనే నివారణ:

ఒక పన్ను నొప్పి వచ్చినప్పుడే రూట్ కెనాల్ చేయించుకొని, క్యాప్ వేయించుకుంటే పూర్తిగా దంతాలన్నీ ఊడిపోకుండా ఉంటాయి. లేజర్స్ వచ్చిన తర్వాత రూట్ కెనాల్‌లో ఎక్కువ శాతం సింగిల్ సిటింగ్‌లోనే క్లియర్ చేస్తున్నారు. కొన్ని దంతాలు దెబ్బతిన్నాకైనా అవగాహన చేసుకొని ఇంప్లాంట్ చేయించుకుంటే మొత్తం దంతాలు పోయే పరిస్థితీ రాదు. ఆహారం నములుతున్నప్పుడు దంతాలు తగలాల్సిన చోట తగలకపోయినా, యాక్సిడెంట్స్ అయి దంతాలకు దెబ్బ తగిలినా క్యాప్స్ వేసుకుంటే దంతాలు దెబ్బతినవు. పళ్లు అరిగిపోవడం, ప్రమాదాల వల్ల విరిగిపోవడం వంటివి సంభవించినప్పుడు నాణ్యమైన క్యాప్స్ వేయించుకుంటే 20 ఏళ్లు అయినా ఆ పళ్లు దెబ్బతినకుండా ఉంటాయి.



దంతాలు లేకపోతే...

పళ్ల సెట్ పెట్టుకునే ఎంతోమందిని చూస్తుంటాం. వీరి ముఖంలో మార్పులను స్పష్టంగా చూడొచ్చు. సెట్ తరచూ లూజ్ అవుతుంటుంది. ఎంత బాగా పళ్ల సెట్ చేసినా తీసి, పెట్టుకోవడం వల్ల, నమలడంలో ఒరిపిడికి లోనై కింద ఎముక అరుగుదల ఎక్కువగా ఉంటుంది. 2-3 సంవత్సరాలలోనే దవడ ఎముక సగానికిపైగా అరిగిపోతుంది. అందుకే సెట్ ఎంత బాగా చేసుకున్నా కొంతకాలం తర్వాత లూజ్ అయిపోతుంది. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే ఇంప్లాంట్స్ సరైన పరిష్కారం.

 
ఇంప్లాంట్స్ అంటే...?

ఎముకలో ఒక టైటానియమ్ స్క్రూని అమర్చి, దాని ఆధారంగా పన్నును అమర్చడాన్ని ఇంప్లాంట్ అంటారు. ఇల్లు కట్టేటప్పుడు పునాది ఎంత ముఖ్యమో, ఎముక లోపల టైటానియమ్‌ను అమర్చడం అంత ముఖ్యం. టైటానియమ్ ఎముక లోపల 10-15 మి.మీ ఉంటుంది. చిగురుపైన 5-7 మి.మీ ఉంటుంది. చిగురుభాగం ఉన్న ఇంప్లాంట్‌కి పన్నును అమర్చుతాం.


ఇంప్లాంట్స్ ఫెయిల్ అవుతాయా?

ఇంప్లాంట్స్ వేయించుకునే విధానంలో ఒక పన్నును తీయించుకోవడం కన్నా చాలా తక్కువ నొప్పి ఉంటుంది. వందలో 96 శాతం సక్సెస్ రేటే ఎక్కువ. ఒకవేళ ఫెయిల్ అయినా కలిగే నష్టం కూడా పెద్దగా ఉండదు. ఎముక తక్కువగా ఉన్నప్పుడు అమర్చిన ప్లేట్ జారిపడిపోతుంది. దీని వల్ల ఎలాంటి నొప్పి ఉండదు. అప్పుడు ఇన్ఫెక్షన్ ఉన్నంతవరకు క్లీన్ చేసి, మళ్లీ పెద్ద సైజు ఇంప్లాంట్స్ అమర్చుతాం. ఎక్కువ శాతం డెంటల్ ఇంప్లాంట్స్‌కు జీవిత కాలం గ్యారెంటీ ఇస్తాం. ఇప్పుడు ఇంప్లాంట్స్‌లో వచ్చిన మార్పులను గమనిస్తే రాబోయే రెండు దశాబ్దాల్లో ఇంప్లాంట్స్ ద్వారా పళ్లను అమర్చే పద్ధతులే మిగులుతాయి. మిగతా అన్ని పద్ధతులకు కాలం చెల్లినట్టే.

 
అన్ని పదార్థాలూ తినవచ్చా?

ఇమిడియెట్ లోడింగ్ ఇంప్లాంట్స్ అమర్చాక 3-4 నెలల పాటు మెత్తటి ఆహారం తీసుకోవాలి. తర్వాత అన్నిరకాల గట్టి ఆహారం తీసుకోవచ్చు. ఇంప్లాంట్స్ మామూలు దంతాల కన్నా 8 రెట్లు బలంగా ఉంటాయి. కాబట్టి అన్ని రకాల గట్టి పదార్థాలు తినవచ్చు. 60-70 వయసు దాటిన వారు కూడా జంతికలు, మాంసాహారం, పీచుపదార్థాలను తినడంలో వారి మనుమలతో పోటీపడవచ్చు. ఇంప్లాంట్స్ అమర్చాక ప్రత్యేక జాగ్రత్తలంటూ అవసరం లేదు. మామూలు పళ్లను శుభ్రపరుచుకున్నట్టే ఉదయం రాత్రి బ్రష్ చేసుకోవాలి. డెంటల్ ప్లాస్‌తో క్లీన్ చేసుకోవాలి. ఆరు నెలలకు ఒకసారి దంత వైద్యులను సంప్రదించి డీప్ క్లీనింగ్ చేయించుకోవాలి.


ఇంప్లాంట్స్ వేరు.. పళ్లు వేరు

సాధారణంగా మన నోట్లో 32 దంతాలు ఉండాలి. 28 పళ్లు మినహా మిగతా నాలుగు దంతాలు నమలడానికి పనికిరావు. దంతాలన్నీ కావాలనుంటే పై వరసలో 8-10 ఇంప్లాంట్స్ వేసి 14 పళ్లు, కిందివరసలో 8-10 ఇంప్లాంట్స్ వేసి 14 పళ్లు అమర్చుతారు. వీటిలో ఎలాంటి ప్లేట్ ఉండదు.

 
ఇంప్లాంట్స్‌లో రకాలు

ప్రాచీనకాలం నుంచి ఇంప్లాంట్స్ వాడకం ఉంది. మొదట్లో ఏనుగుదంతం, బంగారంతో ఇంప్లాంట్స్ వేసేవారు. అయితే ఇవి అంతగా కుదిరేవి కావు. ఫెయిల్ అయ్యే కేసులే ఎక్కువ. 40 ఏళ్ల క్రితం టైటానియమ్ అనే లోహంతో ఈ ఇంప్లాంట్స్‌ని వేయడం మొదలుపెట్టిన తర్వాత సక్సెస్ రేటు గణనీయంగా పెరిగింది. ఈ దశబ్దకాలంగా ఇంప్లాంట్స్ వాడకం ఇంకా పెరిగింది. వీటిలో...

సెకండ్ స్టేజ్ ఇంప్లాంట్స్, సింగిల్ స్టేజ్ ఇంప్లాంట్స్ ఉంటాయి. టు స్టేజ్ ఇంప్లాంట్స్‌లో 6 నెలల సమయం తర్వాత పళ్లను అమర్చేవారు. తర్వాత ఇమిడియెట్ లోడింగ్ వన్ స్టేజ్ ఇంప్లాంట్స్ అందుబాటులోకి వచ్చాయి.

ఈ పద్ధతిలో పన్ను తీసిన వెంట నే 48 గంటల్లోనే ఇంప్లాంట్స్ వేసి పళ్లు అమర్చుతారు.

 
ఎముక తక్కువగా ఉండేవారికి... గతంలో ఇంప్లాంట్స్ అమర్చేవారు కాదు. అలా 80 శాతం కేసులను రిజెక్ట్ చేసేవారు. ఎముక లేని వారికి సైతం ప్లేట్ టైప్ బేసిల్ ఇంప్లాంట్స్ అమర్చుతున్నారు.

ఇప్పుడు జైగోమాటిక్ ఇంప్లాంట్స్ వంటివెన్నో అత్యాధునికమైన పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. గతంలో 6-9 నెలలు తీసుకునే ఈ చికిత్స ఇప్పుడు 4-7 రోజుల్లోనే పూర్తవుతుంది. అందుకే ఇప్పుడు విదేశాల నుంచి వచ్చే పేషంట్స్‌కు ఈ చికిత్సా విధానం సౌకర్యంగా మారింది.

No comments: