Thursday, October 11, 2012

షిండేకు ఏం తెలుసు?

తెలంగాణ అంశంపై కేసీఆర్‌తో ఎలాంటి చర్చలూ జరపడం లేదంటూ కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే చేసిన వ్యాఖ్యలు ఆయన అవగాహనారాహిత్యానికి నిదర్శనమని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధ్దన్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలే కేసీఆర్‌తో చర్చలు జరపారని, ఈ విషయాన్ని ఏఐసీసీ మీడియా కమిటీ చైర్మన్ జనార్దన్ ద్వివేది, కేంద్రమంత్రి వయలార్ రవి ధ్రువీకరించారన్నారు. గురువారమిక్కడ ఎమ్మెల్సీలు కె.ఆర్.ఆమోస్, కె.యాదవరెడ్డితో కలిసి పాల్వాయి మీడియాతో మాట్లాడారు. ‘‘కేసీఆర్‌తో చర్చలు జరపడం లేదని షిండే చెప్పి మరింత గందరగోళం సృష్టించారు.

అసలు షిండేకు ఏం తెలుసు? కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పరిధిలోనే తెలంగాణపై చర్చలు జరుగుతున్నాయని వయలార్ రవి కూడా చెప్పారు. బహుశా కేసీఆర్ తనను కలవలేదని షిండే అవమానకరంగా భావించి ఆ మాటలన్నారేమో. అయినా ప్రతిఒక్కరితో చర్చలు జరపడం సాధ్యంకాదు. హైకమాండ్ మాత్రం తెలంగాణపై కేసీఆర్‌తో చర్చలు జరిపింది.. జరుపుతోంది.. భవిష్యత్తులోనూ అవి కొనసాగుతాయి’’ అని పేర్కొన్నారు. తెలంగాణపై తొలుత కాంగ్రెస్ పరిధిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, అది జరిగాకే ప్రభుత్వంతో మాట్లాడతారని చెప్పారు. దసరాలోపు తెలంగాణపై హైకమాండ్ నిర్ణయం వెలువరిస్తుందని తాను భావించట్లేదన్నారు. కేసీఆర్‌తో చర్చలు మాత్రం సంతృప్తికరంగా సాగుతున్నాయన్నారు.

No comments: