Friday, October 5, 2012

దంతసమస్యలతో గుండెజబ్బులు...

గుండెజబ్బు ఉన్నప్పుడు పంటికి సంబంధించిన చికిత్స చేయించుకుంటే ప్రమాదమని చాలామంది అనుకుంటారు. ఇది పూర్తిగా అబద్ధం. గుండెజబ్బుతో బాధపడుతున్నవారు నోటి ఆరోగ్యంపై మరింత శ్రద్ధ తీసుకోవాలి.

దంతాలకు సంబంధించిన జబ్బుల వల్ల గుండెజబ్బులు వచ్చే అవకాశం ఉందని పరిశోధనలో తేలింది. ముఖ్యంగా చిగుళ్ళకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు, పిప్పిపళ్ళలోని ఇన్ఫెక్షన్లలోని బ్యాక్టీరియా... రక్తప్రసరణ ద్వారా గుండె భాగానికి చేరి రక్తం గడ్డకడితే గుండెజబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. గుండెలోపలి పొరల్లోని ఇన్ఫెక్షన్‌లో కనిపించే బ్యాక్టీరియా, నోటి ఇన్ఫెక్షన్‌లో కనిపించే బ్యాక్టీరియా ఒకటేనని తేలింది. అందువల్లే నోట్లో ఇన్ఫెక్షన్ లేకుండా చూసుకోవడం ముఖ్యం.


 నొప్పి లేకపోవడం, తెలియకపోవడం, అవగాహన లేకపోవడం కారణంగా దంత సమస్యలను చాలాకాలం నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్ల వల్ల శరీరంలోని మిగిలిన భాగాలకు ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంది. 70 శాతం దంతసమస్యలకు అసలు నొప్పి అనేదే ఉండదు. అంతమాత్రాన జబ్బులు లేవని కాదు. సమస్య ఉన్నా, లేకున్నా ఆరునెలలకొకసారి దంతవైద్యుడిని కలిసి చెకప్ చేయించుకోవడం, డాక్టర్ల సలహా మేరకు తగిన చికిత్స చేయించుకోవడం, నోట్లో ఇన్ఫెక్షన్లు రాకుండా జాగ్రత్త పడడం ఎంతో అవసరం.
పిప్పిపళ్లు, చిగుళ్ళుల్లోంచి రక్తం రావడం, చిగుళ్ళు వాచి బలహీనపడడం, నోటి దుర్వాసన లాంటి సమస్యలను నిర్లక్ష్యం చేయడం సరికాదు. గుండెజబ్బుతో బాధపడుతున్న వారి శాతం సమాజంలో ఎక్కువే. గుండెజబ్బు ఉన్నప్పుడు పంటికి సంబంధించిన చికిత్స చేయించుకుంటే ప్రమాదమని చాలామంది అనుకుంటారు. ఇది పూర్తిగా అబద్ధం. గుండెజబ్బుతో బాధపడుతున్నవారు నోటి ఆరోగ్యంపై మరింత శ్రద్ధ తీసుకోవాలి. కాకపోతే మీకున్న ఆరోగ్య సమస్యల్ని దంతవైద్యునికి ముందుగా చెబితే మీరు రోజూ వాడుతున్న మందులను పరిశీలించి, ఎటువంటి ముందుజాగ్రత్తలు తీసుకోవాలో నిర్ణయిస్తారు.

No comments: