Wednesday, October 17, 2012

పోషకాల బయోగ్రఫీ



పిజ్జాలు, బర్గర్ల వెనక పరిగెత్తి పరిగెత్తి అనారోగ్యాలతో అలసిపోయిన జనాలు ఈ మధ్య తిండి విషయంలో మళ్లీ తాతల కాలం నాటి పద్ధతులను అనుసరించడం మొదలుపెట్టారు. అందులో భాగంగా చిరుధాన్యాలకు పెద్ద పీటవేసి, ముతక బియ్యాన్ని మురిపెంగా చూసుకుంటున్నారు. అందరూ వాడుతున్నారు కాబట్టి మేమూ వాడతాం అన్నట్టు కాకుండా. వాటిలో ఉన్న పోషకాల గురించి కాస్త తెలుసుకుంటే మంచిది. ఆ వివరాలే ఇవి...

ముతకబియ్యం (బ్రౌన్‌రైస్)డైట్ చేస్తున్న వాళ్లు ముతకబియ్యం వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ బియ్యంలో కొవ్వు తక్కువగా ఉండడమే కాకుండా ఎన్నో లాభాలున్నాయి. వడ్ల గింజల పై పొరను మాత్రమే తీయడం వల్ల సహజసిద్ధమైన పోషకాలు బయటికి పోవు. అందుకని ఈ బియ్యాన్ని తినడం వల్ల కలిగే గుండెజబ్బులకు దూరంగా ఉండొచ్చు. దీంతోపాటు ఒబెసిటీ, డయాబెటిస్, కొలెస్ట్రాల్ వంటివి కూడా దరిచేరవు.



రక్తంలోని ఇన్సులిన్ మోతాదును కూడా సరిచేస్తుంది. ఇందులో ఉండే 'క్యు10' అనే సహ ఎంజైమ్ కొవ్వు, చక్కెరల్ని శక్తిగా మారుస్తుంది. ఇదేకాకుండా ఈ బియ్యంలో 70 యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, శక్తిస్థాయిని క్రమపరిచే బి-విటమిన్స్ ఉన్నాయి. పాలిష్ పట్టిన బియ్యంలో ఇవేవీ ఉండవు. ముతకబియ్యంలో విటమిన్-ఇ మెండుగా ఉంటుంది. దీనిపై ఉండే తవుడు పొర జింక్, మెగ్నీషియంలను కలిగి ఉంటుంది. అందుకని ఈ బియ్యాన్ని తిన్న వాళ్ల చర్మం మెరిసిపోతుంది.



చిరుధాన్యాలు

జొన్న, రాగి, సజ్జలపై ప్రేమ బాగా పెరిగిపోవడానికి కారణం ఇవన్నీ గుండెకు మేలుచేయడమే కాకుండా రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతాయి. వందగ్రాముల రాగిలో 350 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. అదే గోధుమ, బియ్యంలలో అయితే 50 మిల్లీగ్రాముల కాల్షియమే ఉంటుంది. బార్లీలో ఎనిమిది ఎసెన్షియల్ అమినో ఆమ్లాలతో పాటు మెగ్నీషియం, పొటాషియం, సెలీనియం, ఫాస్ఫరస్‌లు కూడా ఉన్నాయి. జొన్నలో టాన్నిన్, యాంథోసైనిన్ వంటి ఫైటోకెమికల్స్ మెండుగా ఉన్నాయి. ఇవి మనుషుల్లో కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా అరికడతాయని శాస్త్రీయంగా రుజువైంది. అలాగే తోటకూర గింజల్లో కాల్షియం, ఐరన్, మెగ్నీషియంలు 20శాతం అదనంగా ఉంటాయి.

No comments: