Tuesday, October 23, 2012

first blow of FDIs

దేశంలోని సామాన్యులపై గ్యాస్ రూపంలో ఎఫ్ డిఐ తొలిదెబ్బ పడనుంది. యూపీఏ ప్రభుత్వంలోని భాగస్వామ్య పక్షాలతోపాటు ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ లెక్కచేయకుండా కేంద్రం చిల్లర వ్యాపార రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)ను అనుమతించింది. ఇది రైతులు, వినియోగదారుల ప్రయోజనాలను కాపాడుతుందని కేంద్రం పేర్కొంది.



కాని ఇది చాపకింద నీరులా వ్యాపించి దేశీ వ్యాపార సంస్థలను దెబ్బతీస్తాయి. ఎఫ్ డిఐల ప్రవేశం ప్రభావం ప్రారంభంలో తెలియదు. కాలక్రమంలో ప్రజలపై తీవ్ర ఆర్థిక భారాన్ని మొపుతాయనడంలో ఎటువంటి సందేహం అవసరంలేదు. మన్మోహన్ ప్రభుత్వం ఆర్థిక సంస్కరణల పేరుతో ప్రవేశపెట్టిన ఈ విధానం వల్ల మనం ముందుముందు తీవ్రంగా నష్టపోతాం. విదేశీపెట్టుబడిదారులు భారీగా లాభపడతారు. వారి దృష్టిలో అధిక జనాభా గల మన దేశం ఒక పెద్ద మార్కెట్. ఎంత వ్యాపారమైనా చేసుకోవచ్చన్నది వారి భావన. పెట్టుబడి పెట్టేవాడు ఎప్పుడూ అత్యధికంగా లాభాలను ఘడించాలనే చూస్తాడు. ఇది అందరికీ తెలిసిన సాధారణ సూత్రం. విదేశీ పెట్టుబడిదారులు కాబట్టి మనల్ని పీల్చిపిప్పిచేయడానికి కూడా వెనుకాడరు.

ఎఫ్ డిఐలపై కేంద్రం వాదన: రిటైల్ ఎఫ్‌డీఐల వల్ల రైతులకే లాభం. వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధరలు పొందుతారు. దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల వృధాని అరికట్టవచ్చు. లక్షలాది ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. రైతులు, వినియోగదారుల ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం. పెద్దపెద్ద విదేశీ రిటైలర్లు దేశంలో దుకాణాలు ప్రారంభిస్తే చిన్నచిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతారన్న వాదనలో నిజంలేదు. ఇందులో భాగస్వాములైన రైతులు, వినియోగదారులు, పరిశ్రమల అధిపతులు తదితరులతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాం. రిటైల్‌ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వల్ల దేశం మరింత అభివద్ధి సాధిస్తుంది. ఎఫ్‌డీఐలను గుడ్డిగా వ్యతిరేకించడం సరికాదు. పెట్టుబడులు భారీ ఎత్తున రావడంతో పాటు మౌలికసదుపాయాలు మరింతగా మెరుగుపడతాయి. ఈ సంస్కరణలను ఇపుడు చేపట్టకపోతే రాబోయే తరాలకు తీవ్ర అన్యాయం చేసినవారమవుతాం. 1991 నాటి ముందటి పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉంది. చైనా, జపాన్‌లతో పాటు అభివద్ధి చెందిన దేశాలు ఎఫ్‌డీఐలను ప్రోత్సహించడం ద్వారానే అభివద్ధి చెందాయి. ప్రధాని మన్మోహన్‌ సింగ్ ప్రస్తుతం తీసుకున్న చర్యల వల్ల దేశానికి రెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయి. ప్రస్తుతం కార్పొరేట్‌ రంగంలో రిటైల్‌ వ్యాపారాలు నడుస్తున్నా చిన్న వ్యాపారులు ఎక్కడా దెబ్బతినలేదు. విదేశీపెట్టుబడులు వచ్చినా దేశీయ ఉత్పత్తులే కొనుగోలు చేసి విక్రయించాలి తప్ప విదేశీ వస్తువులు అమ్మడానికి అవకాశంలేదు.



సబ్సిడీల ఎత్తివేతకు వ్యూహం: గ్యాస్ బండను మనకు గుది'బండ'గా మార్చడానికి కేంద్రం వ్యూహం సిద్ధం చేసింది. మధ్యతరగతి మహిళలు వంటింట్లో కంటతడి పెట్టే పరిస్థితులు ఎదురుకానున్నాయి. ప్రస్తుతం సబ్సిడీపై ఇచ్చే గ్యాస్ సిలిండర్లను ఆరుకు తగ్గించారు. ముందుముందు గ్యాస్ పై సబ్సిడీని పూర్తిగా ఎత్తివేయాలన్న ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. ఆరు సబ్సిడీ సిలెండర్లను కొద్ది కాలం గడిచిన తరువాత మూడుకు తగ్గిస్తారు. ఆ తరువాత సబ్సిడీని పూర్తిగా ఎత్తివేస్తారు. అసలు సబ్సిడీలేకుండా ఒక్కో సిలెండర్ ను వెయ్యి రూపాయలకు కొనుక్కోవలసిన పరిస్థితి వస్తుంది. ఇది ఒక్క వంట గ్యాస్ తో ఆగదు. మరిన్ని రాయితీలకూ గండి కొట్టడానికి ఇది ఒక మార్గం. ప్రజాసంక్షేమానికి పూర్తిగా తూట్లు పొడిచే ఆర్థిక సంస్కరణలకు మన్మోహన్ తలుపులు బార్లా తెరిచారు. ప్రపంచ బ్యాంకును మెప్పించడానికి, అమెరికాకు నచ్చేలా ఉండడానికి మాత్రమే మన్మోహన్ ప్రభుత్వం గ్యాస్ సబ్సిడీ ఎత్తివేతకు నిర్ణయం తీసుకుందని కొందరు ఆర్థిక నిపుణుల అభిప్రాయం.

 
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వంట గ్యాస్ డీలర్లు నాలుగు రకాల సిలెండర్లను అమ్ముతున్నారు. సబ్సిడీ సిలెండర్ ను 413 రూపాయలకు, సబ్సిడీయేతర సిలెండర్ 967 రూపాయలకు, విద్యా సంస్థలకు 1216 రూపాయలకు, వ్యాపార సంస్థలకు 1753 రూపాయలకు అమ్ముతున్నారు. అయితే ఇన్ని రకాలుగా సిలెండర్లును సరఫరా చేయటం ఇబ్బందిగా ఉందని జాతీయ వంట గ్యాస్ డీలర్లు కేంద్రానికి మొరపెట్టుకున్నారు. ఈ నేపధ్యంలో ఇక ప్రతి గ్యాస్ సిలెండర్ ను రాయితీ లేకుండా అందరికి 967 రూపాయలకు అమ్మేలా కేంద్రం త్వరలోనే ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. అర్హులైన వినియోగదారుల బ్యాంకు ఖాతాలో సబ్సిడీని జమచేస్తామని కేంద్రం చెబుతోంది. అయితే సబ్సిడీని బ్యాంక్ లో జమచేయడం ఆచరణలో పలు ఇబ్బందులకు దారితీస్తుందని డీలర్లు అంటున్నారు.

గ్యాస్ పై సబ్సిడీని క్రమంగా ఎత్తివేయడానికి వ్యూహాలను రచించారు. మొదట సబ్సిడీని వినియోగదారుని బ్యాంకు ఖాతాలో జమ చేసే విధానానికి కేంద్రం శ్రీకారం చుట్టబోతోంది. అంటే ముందు వినియోగదారుడు సబ్సిడీ లేకుండా గ్యాస్ సిలెండర్ కొనాలి. ఆ తర్వాత సబ్సిడీ సొమ్ము వారి బ్యాంకు ఖాతాలో జమచేస్తారు. ఈ విధానం వల్ల ఆచరణలో పలు సమస్యలు ఎదురవుతాయి. ఆ విషయం పక్కనబెడితే ఈ విధంగా వినియోగదారులను సబ్సిడీలేకుండా గ్యాస్ కొనడానికి అలవాటు చేస్తారు. నిదానంగా సబ్సిడీని కుదిస్తారు. ఆ తరువాత పూర్తిగా ఎత్తివేస్తారు. మరో వైపు అన్ని రకాల రాయితీలను వినియోగదారులకు అందించేందుకు ఆధార్ ను ఉపయోగించుకోవాలన్న ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇప్పటికే కొన్నింటికి అమలు చేయడం కూడా ప్రారంభమైంది. సబ్సిడీలు ఇక చాలంటూ ప్రణాళిక సంఘం పదే పదే కేంద్రంని పోరుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏప్రిల్ నుంచి గ్యాస్ సిలెండర్లపై సబ్సిడీని ఎత్తివేసే అవకాశం ఉంది. ఇక ప్రతి ఒక్కరూ గ్యాస్ సిలెండర్ కు 967 రూపాయలు గానీ, అంతకంటే ఎక్కువ చెల్లించవలసి ఉంటుంది.


వంటిళ్లలోకి చొరబడనున్న విదేశీ హస్తం: మన వంటిళ్లలోకి విదేశీ హస్తం ప్రవేశించడం ఏమిటని అనుకుంటున్నారా? ఇది ముందుముందు జరుగబోయే వాస్తవం. ఎఫ్ డిఐల రూపంలో మన వంట ఇళ్లలోకి విదేశీ కంపెనీల సిలెండర్లు రానున్నాయి. అందుకోసమే ఈ సబ్సిడీలను ఎత్తివేయాలని మన కేంద్రం పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మన దేశంలో గ్యాస్ వ్యాపారం చేయడానికి అమెరికాతో పాటు యూరప్ లోని పలు కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఇందుకోసం దాదాపు 40 గ్యాస్ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. అమెరికాకు చెందిన టోటల్, మోబిల్, గాజ్, మిడిల్ ఈస్ట్ కు చెందిన ఎస్ఆర్, యూరప్ కు చెందిన షెల్ తదితర చమురు కంపెనీలు భారత్ లో వంట గ్యాస్ వ్యాపారానికి తహతహ లాడుతున్నాయి. నెదర్లాండ్ కు చెందిన సూపర్ గ్యాస్ ఇప్పటికే మన దేశంలో గ్యాస్ వ్యాపారం చేస్తోంది. అంతర్జాతీయ క్రూడ్ రిఫైనరీలో 60 శాతం భాగస్వామ్యం వున్న ఈ గ్యాస్ కంపెనీలు మన దేశంలో అడుగు పెడితే దేశీయ కంపెనీలు క్షీణదశకు చేరుకుంటాయన్నది నిపుణుల అభిప్రాయం. టెలికాం రంగంలో పటిష్టంగా ఉన్న బిఎస్ఎన్ఎల్ ను ప్రైవేటు కంపెనీలు ఎలా దెబ్బతీశాయో మనకు అనుభవమే. గ్యాస్ వ్యాపారం అందుకు భిన్నం ఏమీకాదు. క్రమక్రమంగా ఎఫ్ డిఐలు అన్నిరంగాలలోకి ప్రవేశించి ఏ పరిస్థితులకు దారితీస్తాయో ఊహించడం పెద్ద కష్టమేమీకాదు. ఆర్థిక సంస్కరణల ముసుగులో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రూపంలో ప్రమాదాలు పొంచిఉన్నాయి తస్మాత్ జాగ్రత్త!

No comments: