Tuesday, October 23, 2012

ఐ-20 పొడిగించడం ఆటోమాటిక్ ఏమీ కాదు

శాన్ డీగో. కాలిఫోర్నియాలో రెండవ పెద్ద నగరం. ఇటీవలే ఒక తెల్లవారు జామున ఇమ్మిగ్రేషన్ అధికారులు ఒక అపార్ట్‌మెంట్‌పై దాడిచేశారు. ఎఫ్-1 మీద ఒక పక్క కాలేజీకి వెళుతూనే ఇంకోపక్క వర్క్ ఆథరైజేషన్ లేకుండా క్యాబ్ డ్రైవర్లుగా పనిచేస్తున్న దాదాపు 40 మంది స్టూడెంట్స్ ఉంటున్నట్టు ఎవరో ఉప్పందించడంతో దాడి చేసి వాళ్లని పట్టుకున్నారు. వాళ్ల వీసాలని రద్దు చేసి 30 రోజులలోగా యు.ఎస్. నుంచి వెళ్లిపోవలసిందిగా ఆదేశించారు.



హ్యూస్టన్. టెక్సస్. గడచిన జూన్ నెలలో ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు టెక్సస్, ఒక్లహామాలలో 12 రోజులపాటు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో వీసా స్టేటస్‌ని ఉల్లంఘించిన విదేశీ విద్యార్థులు, ఇతరులు మొత్తం 40 మందిని అరెస్టు చేశారు. ఇందులో 21 మంది పురుషులు, 19 మంది స్త్రీలు. హ్యూస్టన్. టెక్సస్. ఒక వెస్ట్ మానేజ్‌మెంట్ ఫెసిలిటీ మీద ఐ.సి.ఇ. ఏజెంట్లు దాడి చేసి అక్కడ వీసా స్టేటస్ లేకుండా పని చేస్తున్న 16 మంది ఇల్లీగల్స్‌ని అరెస్టు చేశారు.



యు.ఎస్.లో నివసించే విదేశీయులలో ఎవరు ఏం చేస్తున్నారు? వారి వీసా స్టేటస్ ఏమిటి అనేది ఒకప్పుడు ఎవరూ అంతగా పట్టించుకునేవారు కాదు. కాని సెప్టెంబరు 11 ఘటనల తర్వాత అందరి లెక్కలూ తీస్తున్నారు. ప్రత్యేకించి స్టూడెంట్స్‌గా వెళ్లేవారి పైన బాగా దృష్టి పెట్టి చూస్తున్నారు. ఎవరైనా అనుమానితుల సమాచారాన్ని అందిస్తే దాడులు చేసి పట్టుకుని స్వదేశాలకి తిప్పి పంపించి వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరి వీసా స్టేటస్‌ని వారు జాగ్రత్తగా కాపాడుకోవడమే మన విద్యార్థులకు అక్కడ అనుసరించి దగిన ఉత్తమ మార్గం. యు.ఎస్. యూనివర్శిటీలో ఉండగా మీ ఐ-20ని పొడిగించుకోవలసిన పరిస్థితి వస్తే ఎటువంటి నిబంధనలను పాటించాలనేది ఇప్పుడు చూద్దాం.



డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్ లాండ్ సెక్యురిటీ నిబంధనల ప్రకారం మీ ఐ-20 మీద ఉన్న కంప్లీషన్ డేట్‌లోగా మీరు మీ కోర్సుని పూర్తి చెయ్యాలి. అదనపు సమయం కావలసి వచ్చినప్పుడు కేవలం అర్హులైన వారికి మాత్రమే యూనివర్శిటీ ఇంటర్నేషనల్ సెంటర్ ఐ-20 పొడిగిస్తుంది. రీసెర్చ్‌లో అనూహ్యమైన సమస్యలు రావడం, లేదా అప్పటికే నమోదు చేసిన వైద్యపరమైన కారణాలు మాత్రమే దీనికి అర్హతనిస్తాయి. ఎక్స్‌టెన్షన్ పీరియడ్‌లోలో కూడా మీకు తగిన ఫండ్స్ ఉండి ఉండాలి.



ప్రోగ్రాం ఎండ్ డేట్‌ని దాటిపోయిన ఐ-20ని పొడిగించరు. మీరు యు.ఎస్.లో ఉండగానే మీ ఐ-20 ఎక్‌్లపైర్ అయిపోయి, మీరు తదుపరి చర్యలు తీసుకోకుండానే ఇంకా అక్కడే ఉంటే అది వీసా స్టేటస్ ఉల్లంఘన అవుతుంది. అదనంగా ఏదైనా కోర్సులో చేరడానికి, మార్కులు పెంచుకునేందుకు ఇదే కోర్సుని మళ్లీ చెయ్యడానికి ఐ-20ని పొడిగించారు. అలాగే కోర్సుఅయిన తర్వాత ఆన్/ఆఫ్ క్యాంపస్ రీసెర్చ్ చెయ్యడానికి ఐ-20ని ఎక్స్‌టెండ్ చెయ్యరు. ఆవశ్యకత లేని సి.పి.టి. చెయ్యాలన్నా ఐ-20 గుడువు పెంచరు. సరైన కారణం లేకుండా, ముందస్తు అనుమతి లేకుండా సకాలంలో కోర్సు పూర్తి చెయ్యలేని సందర్భాలలో పెండింగ్ కోర్స్ వర్క్ ముగించడానికి కూడా ఐ-20 పొడిగింపు లభించదు.



మీ స్కూలులోని ఇంటర్నేషనల్ స్టూడెంట్ అడ్వైజర్‌తో మీ ఐ-20 ఎక్స్‌పైరీ డేట్‌కి 30 నుంచి 60 రోజుల ముందుగానే దాని పొడిగింపు గురించి చర్చించాలి. ఐ-20 పొడిగించిన తర్వాత మీ స్టూడెంట్ అడ్వైజర్ దానికి సంబంధించిన తాజా సమాచారాన్ని సెవిస్‌కి పంపి కొత్త (పొడిగింపు) డేట్‌తో మరొక ఐ-20 ఇస్తారు. కొత్త ఐ-20ని, మిగతా అన్ని పాత ఐ-20లని ఎప్పుడూ దగ్గర ఉంచుకోవాలి. యు.ఎస్. బయటకు ట్రావెల్ మీద వెళ్లి వచ్చేటప్పుడు ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్ అడిగితే వాటిని చూపించాలి.

No comments: