Thursday, October 31, 2013

థైరాయిడ్ కేన్సర్‌కు హైదరాబాద్ లోనూ అమెరికా తరహా చికిత్స -



భారతదేశంలో థైరాయిడ్ క్యాన్సర్ బాధితుల సంఖ్య మిగిలిన క్యాన్సర్ బాధితుల సంఖ్యతో పోలిస్తే 0.1 శాతం నుంచి 0.2 శాతం మాత్రమే ఉంటుంది. లక్ష మందిలో ఒక పురుషుడికి, 1.8 మహిళలకు ఇది రావడం జరుగుతోంది. అదే అమెరికాలో అయితే, 2013 నాటికి ఇటువంటి క్యాన్సర్ బాధితుల సంఖ్యలో కొత్తగా 60,220 మంది చేరే అవకాశం ఉందని అంటున్నారు. థైరాయిడ్ క్యాన్సర్ సాధారణంగా థైరాయిడ్ గ్రంథిలో ప్రారంభమవుతుంది. ఈ రకం క్యాన్సర్‌లో నాలుగు రకాలున్నాయి. వీటిని పాపిలరీ, ఫోలిక్యులర్, మెడ్యులరీ, అనాప్లాస్టిక్ అనే నాలుగు రకాలుగా పిలుస్తున్నారు. మైక్రోస్కోప్‌లో ఈ క్యాన్సర్ ఎలా కనిపిస్తుందన్నది ఆధారంగా ఈ వర్గీకరణ చేశారు.

నిజానికి ఇతర క్యాన్సర్‌ల మాదిరిగానే ఈ క్యాన్సర్ కూడా భారతదేశంలో కొద్ది కొద్దిగా పెరుగుతోంది. ఇది అన్ని రకాల వయసు వాళ్లలోనూ కనిపిస్తున్నప్పటికీ, మహిళల్లో మాత్రం ఎక్కువగా వచ్చే అయిదవ క్యాన్సర్‌గా నమోదైంది. థైరాయిడ్ గ్రంథి ఆహార నాళికకు కొద్దిగా పైన ఉంటుంది. ఇది శరీరంలోని మెటబాలిజంను క్రమబద్ధీకరించడానికి ఉపయోగపడుతోంది. ఇక గుండె సమస్యల మీదా, రక్తపోటు, శరీర ఉష్ణోగ్రత, బరువు వంటి వాటి మీద దీని ప్రభావం ఉంటుంది.

కాగా, మొత్తం థైరాయిడ్ క్యాన్సర్లలో పాపిలరీ, ఫోలిక్యులర్ థైరాయిడ్ క్యాన్సర్‌ల శాతమే ఎక్కువ. ఇది 80 నుంచి 90 శాతం వరకూ ఉండొచ్చని అంచనా. అయితే, వాటికి చికిత్సను అందించడం, వాటిని అదుపు చేయడం మాత్రం ఒకే విధంగా ఉంటుంది. ప్రాథమిక దశలోనే గుర్తించగలిగిన పక్షంలో, పాపిలరీ, ఫోలిక్యులర్ థైరాయిడ్ క్యాన్సర్‌లను నయం చేయడo  సాధ్యమవుతుంది.
 
చికిత్సలో భాగంగా, వ్యాధి పరిస్థితిని బట్టి రేడియోయాక్టివ్ చికిత్స అవసరమవుతుంది. ఇక మెడ్యులరీ థైరాయిడ్ క్యాన్సర్ థైరాయిడ్ క్యాన్సర్లలో 5 నుంచి 10 శాతం వరకూ ఉంటుంది. అనాప్లాస్టిక్ థైరాయిడ్ క్యాన్సర్ రావడమనేది చాలా తక్కువే కానీ, దీన్ని అదుపు చేయడం, దీనికి చికిత్స చేయడం కాస్తంత కష్టమనే చెప్పాలి.థైరాయిడ్ క్యాన్సర్లకు ఇదమిత్థంగా ఇదీ కారణమని చెప్పలేకపోతున్నారు. కుటుంబ చరిత్ర, ఇదివరకు వచ్చిన థైరాయిడ్ సమస్యలు, ముఖ్యంగా గాయిటర్, థైరాయిడిటీస్ వంటివి ఈ క్యాన్సర్ రావడానికి కొంతవరకూ అవకాశమిస్తున్నాయి. మెడను ఎక్కువగా రేడియేషన్‌కు ఎక్స్‌పోజ్ చేయడం కూడా ఈ క్యాన్సర్ రావడానికి దారి తీయవచ్చు. చాలామంది రోగులు మొదట్లో ఈ క్యాన్సర్‌కు సంబంధించిన లక్షణాలను గుర్తించలేకపోతున్నారు. ఈ క్యాన్సర్ పెరుగుతున్నప్పుడు లేదా వ్యాపిస్తున్నప్పుడు, మెడ ముందు భాగంలో ఓ ఉండలాగా కనిపించడం, గొంతు బొంగురుపోతుండడం, మాట్లాడడానికి ఇబ్బందిగా ఉండడం, మెడలోని నాళాలు వాయడం, మింగడానికి, గాలి పీల్చడానికి కూడా ఇబ్బందికరంగా ఉండడం, , మెడ లేదా గొంతు నొప్పిపెడుతుండడం వంటివి దీని ప్రధాన లక్షణాలుగా కనిపిస్తున్నాయి.
 
 గొంతు లేదా మెడ భాగంలో థైరాయిడ్ నాడ్యూల్స్ వాయడం వంటివి సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. అయితే, ఇందులో అయిదు శాతం మాత్రమే క్యాన్సర్‌గా మారే ప్రమాదం ఉంది. ఈ థైరాయిడ్ నాడ్యూల్‌ను పరిశీలించడానికి కొన్ని పరీక్షలు అవసరమవుతాయి. అందులో ముఖ్యమైనవి

-- శరీర పరీక్ష, లారింజియల్ పరీక్ష ఇందులో ప్రధానమైనది. అంటే అన్నవాహికను, స్వరపేటికలను ఆరంభం నుంచి పరీక్షించడం జరుగుతుంది.

- మెడకు అల్ట్రాసౌండ్ పరీక్ష.-ఫైన్ నీడిల్ యాస్పిరేషన్ (ఎఫ్.ఎన్.ఎ) బయాప్సీ...అల్ట్రాసౌండ్ గైడెన్స్ విధానంలో.

- థైరాయిడ్ పనితీరుపై లాబ్ టెస్టులు, రక్తపరీక్షలు.- ఛాతీకి ఎక్స్‌రే.- సీటీ - అయోడిన్ కాంట్రాస్ట్ లేకుండా. లేక ఇతర ఇమేజింగ్ పరీక్షలు.

- అతి తక్కువ మోతాదులో రేడియోయాక్టివ్ అయోడిన్ లేదా టెక్నీషియమ్ పరీక్షలతో థైరాయిడ్ స్కానింగ్ అవసరం.

- మాలిక్యులర్ మార్కర్లతో ఇతర రక్త పరీక్షలు... మధ్య మధ్య థైరాయిడ్ నాడ్యూల్స్ పరీక్షలు.

ఇందులో ఫైన్ నీడిల్ యాస్పిరేషన్ పరీక్ష చాలా ఆధారపడదగింది. ఈ రకంక్యాన్సర్ ఉందా లేదా అన్నది దీని ద్వారానే నిర్ధారించుకోవచ్చు. శరీరంలో థైరాయిడ్ క్యాన్సర్ ఏ స్థాయిలో ఉందీ నిర్ణయించేది, ఏ విధమైన చికిత్స అవసరమన్నది నిర్ణయించేది డాక్టర్లే. థైరాయిడ్ గ్రంథిలో క్యాన్సర్ ప్రారంభమైందని తేలిన తరువాత, డాక్టర్లు వైద్యం ప్రారంభిస్తారు. అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ అండ్ సిటిజెన్స్ హాస్పిటల్‌లో ఈ క్యాన్సర్‌కు చికిత్స చేయడానికి ప్రతిభావంతులైన డాక్టర్లతో పాటు, పరీక్షలకు, రోగ నిర్ధారణకు అద్భుతమయిన ఆధునిక పరికరాలెన్నో ఉన్నాయి. అమెరికన్ థైరాయిడ్ అసోసియేషన్ (ఎ.టి.ఎ), నేషనల్ కాంప్రహెన్సివ్ క్యాన్సర్ నెట్‌వర్క్ సంస్థల మార్గదర్శక సూత్రాల ప్రకారమే ఇక్కడ చికిత్సలు జరుగుతాయి.
 
మీ శరీర పరిస్థితికి తగ్గట్టే ఇక్కడ చికిత్సలు చేపట్టడం జరుగుతుంది. ఎటువంటి థైరాయిడ్ క్యాన్సర్‌కైనా, సాధారణంగా సర్జరీ మొదటి అడుగు అవుతుంది. ఎక్కువగా థైరాయిడెక్టమీ, అంటే థైరాయిడ్‌ను తొలగించడం, ప్రామాణికమైన సర్జరీ. అయితే, కంతులు గనుక బాగా చిన్నవిగా ఉంటే, హెమిథైరాయిడెక్టమీ అంటే సగం గ్రంథిని మాత్రమే తొలగించడం ద్వారా దీన్ని తగ్గించడం జరుగుతోంది. ఒకవేళ థైరాయిడ్ గ్రంథిని తొలగించాల్సి వస్తే, థైరాయిడ్ హార్మోన్ మార్పిడి చికిత్సను అందించడం జరుగుతుంది. ఇది థైరాయిడ్ గ్రంథికి ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది.మొత్తం మీద థైరాయిడ్ గ్రంథిలో క్యాన్సర్ కారకాలన్నిటినీ తొలగించడమే ఈ ప్రతిష్ఠాత్మక సంస్థ ప్రధాన ధ్యేయం. ఇక్కడ ఉన్న కొన్నిరకాల చికిత్సా పద్ధతుల్లో ఒకదానికి రోగి పరిస్థితిని బట్టి ప్రారంభించడం జరుగుతుంది. చికిత్స పూర్తయిన తరువాత కూడా ఎటువంటి సమస్యలూ తలెత్తకుండా, రోగి ఆరోగ్యంగా ప్రశాంతంగా జీవితాన్ని కొనసాగించేవిధంగా చికిత్స జరుగుతుంది.


 
 

Wednesday, February 20, 2013

Phobias


భయం చాలా స్వాభావికమైన లక్షణం. అది అందరికీ సహజంగా ఉండేదే. ఉదాహరణకు నేల మీద ఎలుకలు తిరుగుతుంటే చాలామంది భయపడతారు.అలాగే ఎలాంటి హానీ చెయ్యకుండా గోడ మీద బల్లులు తిరుగుతున్నా చాలా మందికి అవంటే భయమే! ఏదయినా భయం అర్థం లేనిదై, అది యాంగ్జైటీని కలిగిస్తూ... మీ దైనందిన వ్యవహారాలను సాగనియ్యనంత తీవ్రంగా ఉంటే దాన్ని‘ఫోబియా’ అంటారు. గతంలో ఫోబియాల మాట ఎలా ఉన్నా ఇప్పుడు వీటిని పూర్తిగా తగ్గించవచ్చు. ఫోబియాల కథా కమామిషులతో పాటు వాటి చికిత్స ప్రక్రియల వంటి అనేక అంశాలపై అవగాహన కోసమే ఈ కథనం. 

భయం విస్తృతి ఎంతంటే!?
మనలోని 29శాతం మందిలో ఏదో ఒక అంశంపై ఫోబియా ఉంటుంది. పురుషులతో పోలిస్తే ఫోబియాలు మహిళల్లో రెట్టింపు మందిని బాధిస్తుంటాయి. 

ఫోబియాతో బాధపడే వ్యక్తుల భవిష్యత్తు... 
కాగ్నిటివ్ థెరపీ లేదా అవసరాన్ని బట్టి ఇతర ప్రక్రియలను కలుపుతూ చేసే చికిత్సలు, రిలాక్సేషన్ టెక్నిక్స్... వీటన్నింటి సహాయంతో ఇప్పుడు ఫోబియాలను పూర్తిగా తగ్గించడం సాధ్యమే. 


ఫోబియా అంటే భయపడకూడని అంశాల పట్ల తీవ్రమైన భయం. చాలా మందికి చాలా విషయాల పట్ల భయాలు ఉంటాయి. ఉదాహరణకు తలుపులు వేసి ఉండే గదుల్లో ఉండటం కొందరికి భయం, అలాగే కొందరికి చాలా ఎత్తుకు ఎక్కడం భయం. కొందరికి హైవే పై డ్రైవింగ్, కీటకాలు, పాములు... ఆఖరికి సూదులన్నా కూడా భయమే. వాస్తవంగా చెప్పాలంటే ఏ అంశం గురించైనా అర్థం లేని భయాలు అభివృద్ధి చెందవచ్చు. ఇవి కొందరిలో చిన్నప్పట్నుంచే ఉంటే... మరికొందరిలో పెద్దయ్యాక అభివృద్ధి చెందవచ్చు. 

అందరిలోనూ సాధారణంగా భయం కలిగించని పరిస్థితికి, అర్థం లేకుండా, నిర్హేతుకంగా భయపడుతూ ఉండే కొందరు తమ భయాలకు తామే ధైర్యం చెప్పుకుంటూ, వాటిని అధిగమిస్తూ ఉంటారు. అయితే కొందరికి తాము భయపడుతున్న అంశాన్ని గుర్తుతెచ్చుకుంటేనే... అంటే సంకల్పమాత్రానే భయం వేస్తుంది. అలాంటిది ఆ పరిస్థితికి ఎక్స్‌పోజ్ అయితే అది మరింత తీవ్రతరమవుతుంది. 

పైన పేర్కొన్న నరాలను మెలిపెట్టే అలాంటి పరిస్థితిని తప్పుకోడానికి మనం నిత్యం చేయాల్సిన కొన్ని పనులను సైతం పక్కన పెట్టి వాటినుంచి పారిపోతూ ఉంటాం. ఇది జీవితంలో ఎన్నింటినో కోల్పోయేలా చేస్తుంది. ఉదాహరణకు ఏదైనా ఎత్తు ప్రదేశంలో ఉండటం అంటే భయం. ఫలితంగా తమ ఉద్యోగరీత్యా బహుళ అంతస్తుల్లో పైన ఉండాల్సి వస్తే ఉండే భయం వల్ల బాగా జీతం వచ్చే మంచి ఉద్యోగాన్ని వదిలేసుకోవాల్సి వస్తే?! ఇలాంటి భయం వల్లనే కొందరు కేవలం ఒక కిలోమీటరు దూరంలో ఉన్న ఆఫీసును ఫ్లై ఓవర్ ఎక్కి దాటడానికి మనస్కరించక కనీసం 20 కి.మీ. అదనంగా డ్రైవ్ చేసుకుంటూ ఆఫీసుకు పోయేవారున్నారు. నిజానికి ఈ భయాలు అర్థం లేనివి. పైగా వాటివల్ల కోల్పోయేది కూడా ఎంతో ఉంది. అలాంటప్పుడు ఆ భయా (ఫోబియా)లకు చికిత్స తీసుకోవడం అవసరమవుతుంది. 

భయం, ఫోబియాల మధ్య తేడా... 
ఏదైనా భయం గొలిపే పరిస్థితుల్లో భయం కలగడం అనేది సహజం. ఆ పరిస్థితుల నుంచి బయటపడటానికి లేదా వాటిని అధిగమించడానికి అది అవసరం కూడా. అంటే భయం అన్నది ఒక రక్షణ కల్పించే చర్య అన్నమాట. ఇక్కడ భయం వల్ల ఒక ప్రయోజనం నెరవేరుతుంది.

భయపడ్డప్పుడు మన శరీరం, మనసు అప్రమత్తంగా మారి ఏ రకమైన చర్యకైనా వెనకాడకుండా తయారవుతాయి. మన స్పందనలు, ప్రతిచర్యలు చాలా వేగవంతంగా మారి మనకు రక్షణ కల్పిస్తాయి. కానీ ఫోబియాలో అలా జరగదు. అక్కడ లేని ప్రమాదాన్ని రోగి ఊహిస్తుంటాడు. ఉదాహరణకు చాలా భయంకరమైన కుక్క ఎదురైనప్పుడు అది కరుస్తుందేమో అని భయపడటం సహజం. కానీ అది పెంపుడు కుక్క అయినా భయపడటం అర్థరహితం. డాగ్ ఫోబియా ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది.

సాధారణంగా మనలో ఉండే భయాలు, ఫోబియాలు
మనందరిలో సాధారణంగా ఉండే భయాలు, ఫోబియాలను నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి... 
జంతువుల ఫోబియా... చాలామందికి పాములు, తేళ్ల వంటి విషజీవులు, సాలెపురుగులు, ఎలుకలు, కుక్కలంటే భయంగా ఉంటుంది. 

స్వాభావిక పరిసరాల్లో కొన్నింటి పట్ల ఉండే ఫోబియా... ఉదాహరణకు ఎత్తుకు ఎక్కాక కిందికి చూడటం వల్ల, తుఫానులు, చాలా విశాలమైన నీటిని, చిమ్మచీకటిని చూసినప్పుడు భయం కలుగుతుంది. 

పరిస్థితుల వల్ల కలిగే ఫోబియాలు: కొన్ని పరిస్థితుల్లో మనకు భయంగా ఉంటుంది. ఉదాహరణకు... తలుపులు మూసి ఉంటే (క్లాస్ట్రోఫోబియా), డ్రైవింగ్ సమయాల్లో, గుహల్లోకి ప్రవేశించినప్పుడు, బ్రిడ్జ్‌పైకి వెళ్లినప్పుడు. 

గాయం, రక్తం, ఇంజక్షన్ వంటి భయాలు: వైద్యచికిత్సలో చేసే ప్రక్రియలు అంటే ఇంజక్షన్ వంటి వాటికి భయపడుతుంటారు. చాలామందిలో నలుగురిలో మాట్లాడటం అన్నా, కీటకాలన్నా లేదా ఎవరికైనా జబ్బుగా ఉండటం లేదా చనిపోతారన్న భయాల వంటివి ఉంటాయి. 

ఫోబియా లక్షణాలు... 
ఏదైనా భయం కాస్తా ఫోబియాగా మారినప్పుడు మొదట యాంగ్జైటీ కలిగి అది తీవ్రమై (ప్యానిక్) చాలా తీవ్రంగా వ్యవహరిస్తారు. దీన్ని ఫుల్‌బ్లోన్ ప్యానిక్ ఎటాక్ అనుకోవచ్చు. మనం భయపడుతున్న విషయానికి ఎంత దగ్గరగా ఉంటే భయం తాలూకు తీవ్రత అంత ఎక్కువగా ఉంటుంది. భయం ఎంత ఎక్కువగా ఉంటే దాని నుంచి బయటపడటం అంత కష్టమవుతుంది. ఈ లక్షణాలు సైతం రెండు రకాలుగా కనిపిస్తాయి. అవి... 

భౌతికంగా కనిపించే లక్షణాలు: ఊపిరి పీల్చుకోవడం కష్టం కావడం గుండె వేగం అధికం కావడం ఛాతీలో నొప్పి లేదా ఛాతీ బిగదీసుకుపోవడం వణుకు నిద్రవస్తున్నట్లు లేదా కళ్లు తిరుగుతున్నట్లు అనిపించడం కడుపులో తిప్పినట్లుగా / దేవినట్లుగా అనిపించడం ఒంట్లోంచి వేడి ఆవిరులు బయటకు వస్తున్నట్లుగా అనిపించడం చెమటలు పట్టడం... వంటివి
ఉద్వేగపూరితమైన లక్షణాలు: యాంగ్జైటీ ఎక్కువ కావడం ఆ తర్వాత ప్యానిక్‌గా మారడం అక్కడి నుంచి పారిపోవాలన్న బలమైన కాంక్ష మనలోంచి మనమే వేరైన అనుభూతి మనపై మనం అదుపు కోల్పోవడం కాసేపట్లో చచ్చిపోతామా అన్న ఫీలింగ్ ఒక విషయం పట్ల మనం మితిమీరి స్పందిస్తున్నామని తెలిసినా దాన్ని నియంత్రించుకోలేని శక్తి. 

ఫోబియాల వల్ల కలిగే దుష్ర్పభావాలు: ఫోబియాలకు చికిత్స చేయించకుండా అలాగే వదిలేస్తే అవి వ్యక్తిగత జీవితాన్ని చాలా దుర్భరం చేస్తాయి. వాటిని దాచిపెట్టినా సరే... దాని ఫలితాలు మీ జీవితాన్ని చాలా తీవ్రంగా ప్రభావితం చేయవచ్చు. ఉదాహరణకు విమాన ప్రయాణం అంటే భయం ఉంటే దాన్ని దాచితే జీవితంలో చాలా కోల్పోవచ్చు. అలాగే కొన్ని ఫోబియాల వల్ల వ్యక్తిగత జీవితంలో స్నేహితులకు, బంధువులకు దూరం కావడం, ఉద్యోగం కోల్పోవలసి రావడం వంటి తీవ్రపరిణామాలు సంభవించవచ్చు.

ఫోబియా ఉన్నవారు వాటిని అధిగమించదలచినప్పుడు క్రమంగా మెరుగుదల కనిపిస్తుంది. అంతేతప్ప... అకస్మాత్తుగా అంతా చక్కబడిపోదు. ఆల్కహాల్ తాగే అలవాటు ఉన్నవారికి మిగతా వారిలో పోలిస్తే ఫోబియాలకు గురయ్యే అవకాశాలు పదింతలు ఎక్కువ. అలాగే ఫోబియాలు ఉన్నవారు సైతం ఆల్కహాల్‌కు అలవాటు పడే అవకాశాలు సైతం రెండింతలు ఎక్కువ. ఒక్కోసారి ఫోబియా వల్ల కలిగే యాంగ్జైటీ (ఉద్విగ్నత) ప్రమాదకరమైన పరిస్థితికి, ఒక్కోసారి మరణానికి సైతం దారితీసే అవకాశం ఉంది. అది గుండెజబ్బులకూ దారితీయవచ్చు. 

ఫోబియా వర్గీకరణ ఇలా... సైకియాట్రిస్టులు ఫోబియాలను సాధారణంగా మూడు రకాలుగా వర్గీకరిస్తుంటారు. 
సామాజిక ఫోబియా (సోషల్ ఫోబియా): సాధారణంగా ఇవి అందరిలోనూ ఉండే సహజ భయాలే అయినా కొందరిలో మితిమీరి ఉంటాయి. ఉదాహరణకు కొందరు బయట తినడం అనే విషయం పట్ల తీవ్రంగా ప్రతిస్పందిస్తూ దానివల్ల కలిగే పరిణామాలను అతిగా ఊహించుకుంటారు. సాధారణంగా సోషల్ ఫోబియాలు చికిత్సకు సైతం ఒకపట్టాన తేలిగ్గా లొంగవు. సామాజిక ఫోబియాలు తమకు చిన్నప్పుడు ఎదురైన సామాజిక అవమానాల కారణంగా కలుగుతాయి. 

సాధారణంగా పదవ ఏటి కంటే ముందు ఎదురైన సామాజిక అవమానాల కారణంగా ఏర్పడ్డ భయాలు కొందరిలో కాలక్రమేణా తొలగిపోవచ్చు. కానీ యుక్తవయసులో తమ స్నేహితుల నిరాదరణకు గురైన కారణంగా ఏర్పడ్డ భయాలు మాత్రం అంత తేలిగ్గా తొలగిపోవు. అవి వయసుతో పాటు పెరుగుతూ పోవచ్చు. నిర్దిష్ట ఫోబియాలు (స్పెసిఫిక్ ఫోబియాస్): ఈ ఫోబియాలు నిర్దిష్టంగా ఫలానా అంశం వల్ల కలుగుతుండే భయాలు అని చెప్పవచ్చు. ఉదా. పాములు, నీళ్లు, ఎత్తులు, విమానప్రయాణం, రోగభయం... ఇలాంటివన్నమాట. 

అగారోఫోబియా: ఇది ఇంటికి దూరంగా ఉన్నప్పుడు లేదా మనకు సురక్షితంగా ఉన్న స్థలానికి దూరంగా ఉన్నప్పుడు కలిగే తీవ్రమైన భయాలు అని చెప్పవచ్చు. 
ప్యానిక్ అటాక్ అంటే...: ఏదైనా ఫోబియాకు గురై భయపడటంలోని తీవ్రత తారస్థాయికి చేరినప్పుడు కలిగే మానసిక స్థితిని ప్యానిక్ అటాక్‌గా చెప్పవచ్చు. ఇది కలిగినప్పడు కనిపించే లక్షణాలు... తీవ్రమైన భయం గుండెవేగంలోని తీవ్రత చాలా ఎక్కువగా పెరగడం శ్వాస అందకపోవడం వణుకు ఒక్కోసారి స్పృహతప్పడం చనిపోయినట్లుగా అనుభూతి చెందడం అక్కడి నుంచి పారిపోవాలన్న తీవ్రమైన కాంక్ష. 

ప్రతికూల ఆలోచనలను అధిగమించడం... 
వాస్తవానికి ఒక ఫోబియా స్థితిలో అసలు భయం కంటే... దానివల్ల కలిగే ప్రతికూల (నెగెటివ్) ఆలోచనల వల్లనే ఎక్కువగా భయం కలుగుతుంది. ఉదాహరణకు ఒక బ్రిడ్జి మీద వెళ్తుంటే... అది బాగానే ఉన్నా... ఒకవేళ కుప్పకూలితే అన్న ఆలోచన కలగగానే ఆ అనంతర పరిణామాలను ఊహించడం వల్ల కలిగే భయమే ఎక్కువ. 

కాబట్టి ఇలాంటి అనవసరమైన ప్రతికూల ఆలోచనలను దూరం చేసుకుంటే భయాలు కలగనే కలగవు. అలాగే కొన్ని సాధారణ ఆలోచనలనూ వదులుకోవాలి. అంటే... కుక్కలన్నీ కరుస్తాయి. ఎద్దులన్నీ పొడుస్తాయి వంటి జనరలైజ్‌డ్ ఆలోచనలు వద్దు. ఒక ఉత్పాతం తప్పనిసరిగా జరుగుతుందని అనుకోవద్దు. ఉదాహరణకు మీరు విమానంలో ఉంటే అది తప్పక కూలిపోతుందేమోనని లేదా ఒకరికి దగ్గు వస్తే అది తప్పక స్వైన్‌ఫ్లూ కావచ్చేమోనని... ఇలాంటి ఆలోచనలు వద్దు. 

ఏ వయసు పిల్లల్లో 
ఎలాంటి భయాలు...?
పిల్లల్లో సాధారణంగా కొన్ని కొన్ని వయసుల్లో కొన్ని విషయాలంటే భయం అధికంగా ఉంటుంది. అవి... 

0 - 2 ఏళ్ల పిల్లల్లో... పెద్ద శబ్దాలు, అపరిచితులు, తల్లిదండ్రుల నుంచి విడిగా ఉండాల్సి రావడం, పెద్ద పెద్ద వస్తువులంటే భయం. 

3-6 ఏళ్ల పిల్లల్లో... దెయ్యాలు, భూతాల వంటి అభూత కల్పనాత్మక పాత్రలంటే భయంతో పాటు ఒంటరిగా పడుకోవాల్సి రావడం, వింత శబ్దాలంటే భయంగా ఉంటుంది.

7- 16 ఏళ్ల పిల్లల్లో... ఇలాంటి పిల్లల్లో వాస్తవ విషయాలపట్ల అంటే ఆడుతున్నప్పుడు గాయాల భయాలు, జబ్బు భయాలు, తల్లిదండ్రుల మధ్య ఘర్షణ, స్కూల్లో పెర్‌ఫార్మెన్స్ తగ్గుతున్నప్పుడు కలిగే భయాలు, ప్రకృతి విలయాలు, స్వాభావిక ఉత్పాతాలంటే భయాలు ఉంటాయి. 

అధిగమించండిలా...
మీరు ఎలాంటి పరిస్థితుల్లో భయపడుతున్నారో ఆ జాబితాను తయారుచేసుకోండి. ఉదాహరణకు మీకు విమాన ప్రయాణం అంటే భయమనుకోండి. మీరు ఆ క్రమంలో జరిగే అనేక పనులను ఒక జాబితాగా రాయండి.

ఉదా: మీరు టికెట్ బుక్ చేస్తారు. ఆ తర్వాత ప్యాకింగ్, ఆ తర్వాత ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లడం, అనంతరం సెక్యూరిటీ చెక్‌కు వెళ్లడం, విమానం దిగడం - ఎగరడం చూడటం, విమానంలోకి ఎక్కడం (బోర్డింగ్), భద్రత కోసం ఫ్లైట్ అటెండెంట్స్ చెప్పే భద్రత చర్యలను పాటించడం... ఇక ఒక్కోదశలో జరిగే ప్రమాదాలను విశ్లేషించుకోండి. మీకు విమానం ఎగిరే దశలో చాలా కొద్దిపాటి రిస్క్ తప్ప మరేదశలోనూ సమస్య ఎదురవ్వదని అర్థమవుతుంది. అలా విశ్లేషణాత్మకంగా ఆలోచిస్తున్న కొద్దీ భయం తొలగిపోతుంది. 

హైపోకాండ్రియాసిస్...
కొందరిలో ఈ భయాలు పెచ్చుమీరి తమకు ఏదైనా ఆరోగ్యసమస్య ఉందేమో అని అనుమానిస్తుంటారు. ఈ అనుమానం కాస్తా పెనుభూతమై తమకు ఎలాంటి జబ్బు లేకపోయినా ఉన్నట్లుగా ఊహించుకుని భయపడుతుంటారు. అన్నిరకాల వైద్య పరీక్షలు చేయించుకుంటూ, అందులో ఎలాంటి ప్రతికూల ఫలితాలు రాకపోయినా లేని లక్షణాలను ఉన్నట్లుగా ఊహించుకుంటూ బాధపడుతుంటారు.

మాటిమాటికీ పరీక్షలు చేయించుకోడానికి సూదులతో గుచ్చడం వల్ల పడే దుష్ర్పభావాలు, నొప్పి నివారణ మందులు వాడటం, యాంగ్జైటీని తగ్గించే మందులు వాడటం, సమస్య లేకపోయినా మాటిమాటికీ డాక్టర్ల చుట్టూ తిరుగుతూ విలువైన తమ సమయాన్ని వృథా చేసుకోవడం వంటివి చేస్తుంటారు. ఇలాంటి భయాలను కూడా మంచి కౌన్సెలింగ్‌తో తొలగించడం సాధ్యమే.

ఫోబియాలకు చికిత్స...
ఫోబియాకు సమర్థమైన చికిత్స సైకోథెరపీ (కౌన్సెలింగ్). దీనితో పాటు మందులు కూడా ఉపయోగించాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ రెండూ అవసరమవుతాయి. మీ భయాన్ని మీరే ఎదుర్కోండి. మనకు ఏదంటే భయమో ఆ విషయాన్ని మనకు మనమే మెల్లగా ధైర్యం చెప్పుకుంటూ ఎదుర్కొంటూ ఉండాలి. ఈ ప్రయత్నంలో ఫోబియా అన్నది మనం భయపడుతున్నంత భయంకరమైనది కాదని అనిపిస్తున్నకొద్దీ ఫలితం మరింత మెరుగవుతూ పరిస్థితులు మీ అదుపులోకి వచ్చేస్తాయి. 

కొన్నిసార్లు కేవలం 1 నుంచి 4 సెషన్స్‌లోనే ఫలితం వచ్చేస్త్తుంది భయాలను క్రమంగానూ, మాటిమాటికీ ఎదుర్కోవడం... మీకు ఏ విషయం గురించి భయమో దాన్ని నేరుగా ఒకేసారి కాకుండా... క్రమంగా, మాటిమాటికీ ఎదుర్కొంటూ పోతే అది మీరు ఊహించినంత భయంకరమైనది కాదని అర్థమవుతున్న కొద్దీ మీరు మీ భయాన్ని అధిగమిస్తూ, మీ ఫీలింగ్స్‌పై ఆధిక్యత సాధిస్తారు. 

రిలాక్సేషన్ టెక్నిక్స్ నేర్చుకోవడం... 
మనకు ఏదైనా విషయంలో భయం వేయగానే ఉద్విగ్నత (యాంగ్జైటీ) కలుగుతుంది. దానివల్ల గుండెవేగం పెరగడం, ఊపిరి ఆడనట్లుగా ఉండటం (సఫొకేటింగ్) వంటి భౌతిక లక్షణాలు కనిపిస్తాయి. వీటివల్ల మన భయం మరింతగా పెరిగినట్లయి, నిరాశలోకి కూరుకుపోతారు. అందుకే యాంగ్జైటీని అధిగమించే ప్రయత్నంలో భాగంగా రిలాక్సేషన్ టెక్నిక్స్‌ను నేర్చుకుని అవలంబించడం వల్ల క్రమంగా ఉద్విగ్నతను, ప్యానిక్ ఫీలింగ్స్‌ను, భయాన్ని ఎదుర్కొనవచ్చు. రిలాక్సేషన్ టెక్నిక్స్‌లో బలంగా ఊపిరిపీల్చడం (డీప్ బ్రీతింగ్), ధ్యానం, యోగా వంటి వాటితో ఉద్విగ్న పరిస్థితుల్లోనూ స్థిమితంగా ఉండటం ప్రాక్టీస్ చేయవచ్చు. 

కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (సీబీటీ): ఫోబియాలను గణనీయంగా తగ్గించేందుకు ఉపయోగపడే చికిత్స ప్రక్రియ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ. సీబీటీ అంటే ఒకరకమైన కౌన్సెలింగ్. దీనితో పాటు మందులు కూడా వాడాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకు యాంటీ డిప్రెసెంట్స్, బీటా బ్లాకర్ మెడిసిన్స్, బెంజోడయాజిపైన్స్ వంటి మందులతో పాటూ సీబీటీ చేయాల్సి ఉంటుంది.

Sunday, February 17, 2013

Mr & Mrs. Puvvada Nageshwara rao


రాష్ట్ర కమ్యూనిస్టు ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన వ్యక్తిగా, సి.పి.ఐ ఫ్లోర్ లీడర్‌గా, ఎమ్.ఎల్.ఎగా, ఎమ్.ఎల్.సిగా రాష్ట్ర ప్రజలకు ఆయన చిరపరిచితులు. పేరు పువ్వాడ నాగేశ్వరరావు. ఆయన రాజకీయ జీవితానికి అరవై ఏళ్లు,వైవాహిక జీవితానికి యాభై ఏళ్లు నిండాయి. ఆయన సతీమణి విజయలక్ష్మి. భర్త ప్రతి అడుగులోనూ ఒద్దికగా నిలిచిన ఇల్లాలు. ఖమ్మం జిల్లాలో ఉంటున్న ఈ దంపతులను కలిసిసినప్పుడు- ‘కుటుంబం సుఖసంతోషాలతో వర్ధిల్లితేనే సమాజం సుసంపన్నంగా ఉంటుంది’ అన్నారు. వివాహం తమ జీవితానికి ఎంతటి నిండుదనాన్ని తీసుకువచ్చిందో వివరించారు. వారి దాంపత్య విశేషాలే ఇవాళ్టి బెటర్ హాఫ్...

ఇద్దరివీ కమ్యూనిస్టు కుటుంబాలే! నిరుపేదల పక్షాన నిలిచి ఉండే వ్యక్తుల నడుమ పెరిగినవారే! అప్పటికి అమ్మాయి ఇంటర్మీడియట్, అబ్బాయి డిగ్రీ పూర్తి చేశారు. పెద్దలు కుదిర్చిన సంబంధమే! కలిగిన కుటుంబాలే అయినా పెద్దలు వీరిని 1963 ఫిబ్రవరి 14న నిరాడంబరంగా దండల పెళ్లితో ఒక్కటి చేశారు. ‘ఈ రోజుల్లో పెళ్లిని ఆడంబరంగా చేసుకోవడానికి ఇచ్చినంత ప్రాధాన్యత జీవితాన్ని అందంగా మలుచుకోవడంలో చూపించడంలేదు’ అన్నారు నాగేశ్వరరావు. ‘భార్యా భర్త ఎక్కువ తక్కువలనే భావాలకు తావివ్వకుండా ఎవరి పనులు వారు సవ్యంగా చూసుకుంటూనే ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా ఉంటే ఏ దాంపత్యమైనా కలకాలం నిలుస్తుంది’ అన్నారు విజయలక్ష్మి. 

ఇప్పటికీ మరవని ప్రేమ

పువ్వాడ: ఈ ఏడాది నుంచే నేను కాస్త లీజర్‌గా ఉంటున్నాను. అంతకుముందు ఏ టైమ్‌కు ఎక్కడ ఉండేవాణ్ణో నాకే తెలియనంత బిజీగా గడిపాను. ఇంటి బాధ్యతలన్నీ ఈవిడే చూసుకునేది. మేం ముగ్గురం అన్నదమ్ములం, ఇద్దరు చెల్లెళ్లు. ఉమ్మడి కుటుంబం. అయినా ఏనాడూ ఫలానా సమస్య అని నేను ఇంటికి రాగానే చెప్పినట్టు, నేను చిరాకు పడిన ట్టు ఒక్కటీ గుర్తులేదు. పైగా అర్ధరాత్రి అపరాత్రి అనకుండా ఇంటికి వచ్చినా ఓపిగ్గా వండి పెట్టేది. ఇప్పుడు ఈమెకు డెభ్బై ఏళ్లు. నేను వారించినా ఇంట్లో పనివాళ్లు, కోడళ్లు ఉన్నా నాకు అవసరమైన వాటిని ఈవిడే దగ్గరుండి చూస్తుంది. నేనింతవరకు షాపింగ్ చేసిందే లేదు. కర్చీఫ్ దగ్గర నుంచి కాలికి ధరించే సాక్స్‌ల వరకు అన్నీ ఓర్పుగా కొని తెస్తుంది. నాకు బి.పి, షుగర్.. ట్యాబ్లెట్లు అన్నీ విడివిడిగా ప్యాకెట్లలో పోసి, వాటి మీద టైమ్, వివరాలన్నీ రాసి ఉంచుతుంది. భర్త అవసరాలు చూడటమేనా భార్య అంటే కాదు, బాధ్యతతో కూడిన ప్రేమ ఇల్లాలిది. డెభ్బై ఐదేళ్లకు కూడా నేనింత బాగున్నానంటే ఆ ప్రేమ మా లక్ష్మిలో ఉండబట్టే! 

విజయలక్ష్మి: ముగ్గురు తోబుట్టువుల మధ్య పెరిగాను. కుటుంబాన్ని ఎలా చూసుకోవాలో మా అమ్మ ద్వారా గ్రహించాను. ఈయన మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఎవరైనా చెప్పిన టైమ్‌కి రాకపోతే ఏమీ అనరు. మరో పనికి వెళ్లిపోతారు. అవతలి వారే ఈయన నిబద్ధతను అర్ధం చేసుకుని నడుచుకుంటారు. అలా నేనూ ఈయనకు అనుగుణంగా నా పద్ధతులను మార్చుకున్నాను. ఈయన బయట ఎంతోమంది మధ్య తిరిగే వ్యక్తి. ఇంటికి ఎంత ఒత్తిడితో వస్తారో నాకు తెలుసు. అందుకే ఇంటి చికాకులేవీ ఈయన ముందుకు తెచ్చేదాన్ని కాదు. అలాగే ఈయన బయట చికాకులు, గొడవలు, పదవులు... ఎన్నడూ ఇంటికి తెచ్చేవారు కాదు. కసుర్లు, విసుర్లు, మాట విరుపులు ఎప్పుడైనా నీటి మీద బుడగల్లా వచ్చిపోయేవే తప్ప మనసు కష్టపెట్టిన మాట ఒక్కటీ గుర్తుకులేదు. ఈయన చేతుల మీదుగా వేదికలపై వందల పెళ్లిళ్లు చేశారు. ఆ సందర్భంలో ఎప్పుడూ ఒక మాట చెబుతారు. ‘కుటుంబం ఆనందంగా ఉంటేనే సమాజం బాగుంటుంది’ అని. అదే నా భావన కూడా! 

ఆటపాటల హరివిల్లు

పువ్వాడ: దాంపత్యబంధానికి బలం చేకూర్చేది పిల్లలే! మాకు ఇద్దరు అబ్బాయిలు. ఉదయ్‌కుమార్, అజయ్‌కుమార్. వారి పెంపకం బాధ్యతలో నా పాత్ర చాలా తక్కువ! పొద్దున లేచింది మొదలు పార్టీ పనులంటూ వెళ్లిపోయేవాడిని. వారి చదువులన్నీ లక్ష్మీయే చూసుకుంది. అబ్బాయిలే అయినా ఎవరిసాయం లేకుండా వారి పనులు వారే సొంతంగా చేసుకునేలా అలవాటు చేసినట్టు చాలాసార్లు గ్రహించాను. అందుకే కాలేజీ స్థాయికి వచ్చాక పెద్దవాడు రష్యాలో ఆరేళ్లు, చిన్నవాడు బెంగుళూరులో రెండేళ్లు ఉండి తమ పనులు తాము చేసుకుంటూ చదువుకోగలిగారు. 

విజయలక్ష్మి: ఈయన బయట ఎన్ని పనులు ఉన్నా, ఇంటికి వస్తే చిన్నపిల్లాడైపోయేవారు. పిల్లలిద్దరినీ చెరో వైపు భుజం మీద కూర్చోబెట్టుకొని తిప్పిన రోజులు ఇప్పటికీ కళ్లకు కట్టినట్టున్నాయి. ఇద్దరినీ ఒళ్లో కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్పేవారు. ఈయనకు పిల్లల్ని డాక్టర్లను చేయాలని ఉండేది. కాని ఆ ఇష్టాన్ని ఎప్పుడూ వారిమీద చూపించలేదు. పిల్లలు స్వేచ్ఛగా తమకు నచ్చినవే ఎంచుకునే అవకాశాన్ని కల్పించారు. పిల్లలు కూడా ఏం చేయాలనుకున్నా ముందుగా ఈయనతోనే చర్చించేవారు. పెద్దవాడు ఉదయ్ పార్టీలోనే చురుగ్గా పాల్గొనేవాడు. చిన్నవాడు హైదరాబాద్‌లో ప్రెస్ పెట్టుకున్నా డు. ఇప్పుడు రాష్ట్రంలోనే పెద్ద పేరున్న (మమతా మెడికల్ కాలేజీ) మెడికల్ కాలేజీని నిర్వహిస్తున్నాడు. ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఈ విషయంలోనూ వాడి ఇష్టానికే స్వేచ్ఛను ఇచ్చారీయన. 

కలసి ఉంటే కలదు సుఖం

పువ్వాడ: ఎవరి పెళ్లికైనా వెళ్లడం మినహా నేనెలాగూ ఎవరికీ అందుబాటులో ఉండేవాడిని కాదు. నా బంధువులు, తన బంధువులు అనే భేదం లేకుండా ఎవరొచ్చినా ఈవిడే చూసుకునేది. మా చెళ్లెళ్లు, వారి పురుళ్లు, పెట్టుపోతల విషయాలు.. ఈవిడే చూసుకుంది. ఇప్పటికీ కోడళ్లను కూతుళ్లలా చూసుకుంటుంది. వెయ్యి రూపాయలిచ్చినా దాంతోనే ఆ నెలంతా ఇల్లు నడిపేది. ఇంత తక్కువా అన్నది కూడా ఎన్నడూ లేదు. ఇల్లాలిని బట్టి ఇల్లు ఉంటుంది. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతుణ్ణి. 

విజయలక్ష్మి: ఈయన ఏనాడూ దేనికీ ఆంక్షలు పెట్టింది లేదు. డబ్బు విషయంలోనూ అంతే! పదివేలు ఇచ్చినప్పుడు దాచి, వెయ్యి రూపాయలే ఇచ్చినప్పుడు సర్దిపుచ్చేదాన్ని. సంపాదించేది ఒక్కరు, తినేవి పది నోళ్లు. ఆ మాత్రం సర్దుబాటు ఇల్లాలిగా నాకు లేకపోతే అవస్థలు పడతామని తెలుసు. అందుకే పొదుపు పాటించేదాన్ని. ఈయనలో అమితంగా నచ్చే అంశం ఎవరైనా సరే స్వేచ్ఛగా ఉండాలంటారు. మా పిల్లల పెళ్లిళ్ల విషయంలోనూ వారికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. మా పెద్దబ్బాయి ఓ అమ్మాయిని ప్రేమించానని చెప్పాడు. ఈయన వెంటనే సరే అన్నారు. ఈయన మాటే నా మాట. వాడిష్టప్రకారమే దండల పెళ్లి చేశాం. కొడుకులే కాదు కోడళ్లూ చదుకోవాలని, వారి చేత డిగ్రీలు చేయించారు. ఇల్లాలు చదువుకుంటే ఇల్లు బాగుపడుతుంది అనేవారు. 

కష్టాలలో తోడూనీడ

పువ్వాడ: పెద్దవాడు ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత వారిద్దరూ అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోదామనుకున్నారు. అప్పుడు ఈవిడా, నేను చాలా బాధపడ్డాం. వారిద్దరినీ కలిపి ఉంచడానికి చాలా ప్రయత్నించాం. వారింటికి వెళ్లి నచ్చజెప్పాం కూడా. కాని అప్పటికే వారిద్దరూ నిర్ణయం తీసేసుకున్నారు. విడిపోయారు. ఆ సమయంలో ఈవిడ నాకు ఎంతో మనోధైర్యాన్ని కలిగించింది. 

విజయలక్ష్మి: పెద్దబ్బాయి రెండో పెళ్లి విషయంలోనూ ఈయన వాడి స్వేచ్ఛకే ప్రాధాన్యం ఇచ్చారు. ఈయన తీసుకునే నిర్ణయాలు ఎంత మేలు చేస్తాయో నాకు చాలా సార్లు రుజువు అయ్యింది. జీవితంలో స్థిరపడడానికి ఉదయ్, అజయ్ చాలా కష్టాలు పడ్డారు. వారి అవస్థలు చూసి నాకు బాధ కలిగేది. ‘ఎదుగుదలలో శ్రమ ఎప్పుడూ మంచి ఫలితాన్నే ఇస్తుంది’ అని ఈయన నాకు తరచూ చెబుతూండేవారు. ఆ మాటలు నాకు ఎంతో ఊరట కలిగించేవి. ఆ తర్వాత వాళ్లూ వృద్ధిలోకి వచ్చి మమ్మల్ని సంతోషపెట్టారు. ఆరేళ్ల క్రితం మా పెద్దబాబు ఉదయ్ ప్రమాదవశాత్తు మరణించాడు. వాడి జ్ఞాపకాలే ఇంకా మమ్మల్ని వీడటం లేదు. ‘ఎంతటివారైనా విధికి తలవంచాలి, తప్పదు’ అని పుట్టెడు దుఃఖంతో ఉండీ ఈయన నాకు ధైర్యం చెప్పారు. ఏ ఇల్లాలైనా భర్త నుంచి ధైర్యం, నమ్మకం, గౌరవం కోరుకుంటుంది. అవన్నీ ఈయన నుంచి అందుకున్న నేను అదృష్టవంతురాలిని. 

వివాహం ఇద్దరు వ్యక్తులనే కాదు, రెండు కుటుంబాలను కలిపే బంధం. కుటుంబం చుట్టూ, బాధ్యతల చుట్టూ అల్లుకుపోయే అనుబంధం. ఏళ్లు గడుస్తున్నకొద్దీ ఆ బంధం శాఖోపశాఖలుగా విస్తరించి మహావృక్షమై ఎందరికో నీడనిస్తుంది. ఆ చల్లదనం అందించే హాయిని ఇప్పుడు ఎన్నో జంటలు ఆస్వాదిస్తున్నాయి. కష్టసుఖాలను సమంగా పంచుకోమని ఈ దంపతులు చెప్పే నాలుగు మంచి మాటలు ఎన్నో జంటలకు సరైన దారిని చూపుతున్నాయి. 

బాధ్యతతో కూడిన ప్రేమ ఇల్లాలిది. ఆ ప్రేమ మా లక్ష్మిలో చూశాను.
- పువ్వాడ నాగేశ్వరరావు

ఏ ఇల్లాలైనా భర్త నుంచి ధైర్యం, నమ్మకం, గౌరవం కోరుకుంటుంది. అవన్నీ ఈయన నుంచి అందుకున్న నేను అదృష్టవంతురాలిని.
- విజయలక్ష్మి

Saturday, February 16, 2013

మూడు తరాల 'చిత్రం'!


తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు, తన కుమారుడు నాగ చైతన్యలతో కలిసి నటించనున్నట్టు ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున అధికారికంగా ప్రకటించారు. ఈ ముగ్గురు కలిసి వెండి తెర పంచుకోనున్నారని వస్తున్న ఊహాగానాలకు నాగ్ తెర దించారు. తాము కలిసి నటించే సినిమా ఈ ఏడాది జూన్ నెలలో ప్రారంభం కానుందని తెలిపారు. తాను ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న కళ్యాణ్ జ్యుయెలర్స్ దుకాణాన్ని విశాఖపట్టణంలో శనివారంనాడు-ఫిబ్రవరి 16న- నాగార్జున ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ- అభిమానుల అభిలాష మేరకు తన తండ్రి, కొడుకు కలిసి నటించాలన్న నిర్ణయానికి వచ్చినట్టు వెల్లడించారు. 

అక్కినేని త్రయం కలిసి నటించే సినిమా మూడు తరాల 'చిత్రం' అవుతుంది. మొదటి తరానికి చెందిన నాగేశ్వరరావు, రెండో తరానికి ప్రాతినిథ్యం వహిస్తున్న నాగార్జున, మూడో తరానికి చెందిన చైతన్య సిల్వర్ స్క్రీన్ పై మెరిస్తే ఇక అక్కినేని అభిమానులకు పండుగే. మూడు తరాలు హీరోలు కలిసి ఒకే సినిమాలో నటించిన ఘనత కూడా అక్కినేని కుటుంబానికే చెందుతుంది. ప్రస్తుతం తెలుగులో నడుస్తున్న మల్టీ స్టారర్ ట్రెండ్ తర్వాత మూడు తరాల దిశగా సాగేందుకు అడుగులు పడుతున్నాయనడానికి అక్కినేని త్రయం సినిమానే ఉదాహరణ. అయితే మూడు తరాలు హీరోలున్న ఫ్యామిలీలు చాలా తక్కువగా ఉండడంతో ఇటువంటి సినిమాలు అరుదుగా మాత్రమే వస్తాయనడంలో సందేహం లేదు. 

తెలుగు చిత్రసీమలో 'కుటుంబ' సినిమాలు కొత్తేంకాదు. గతంలో చాలా మంది హీరోలు తమ కొడుకులు, అన్నలు, తమ్ముళ్లు, మనవలు, మనవరాళ్లతో కలిసి సినిమాల్లో కనిపించిన సందర్భాలున్నాయి. పెద్ద ఎన్టీఆర్ తన కుమారుడు హరికృష్ణ, బాలకృష్ణతో నటించారు. సూపర్ కృష్ణ తన కుమారులు రమేష్ బాబు, మహేష్ బాబులతో కలిసి పలు చిత్రాల్లో ఫ్యాన్స్ కు వినోదం పంచారు. అక్కినేని నాగేశ్వరరావు కూడా తన కుమారుడు నాగార్జున తో నటించారు. చిరంజీవి తన సోదరుడు నాగబాబుతో చాలా సినిమాల్లో సందడి చేశారు. అయితే పూర్తిస్థాయి మూడు తరాల సినిమా ఇప్పటివరకు రాలేదని చెప్పొచ్చు. ఆ లోటును అక్కినేని వంశం తీర్చనుంది. 

కథ దొరికితే కలిసి నటించేందుకు మూడు తరాలు నటులు సిద్ధపడుతుండడంతో ఈ ట్రెండ్ భవిష్యత్ లో మరింత విస్తరించనుంది. తన తండ్రి బాబాయ్ తో కలిసి నటించేందుకు చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ఇప్పటికే ప్రకటించారు. అయితే కొణిదెల వంశంలో నటన చిరంజీవి నుంచి ప్రారంభమయింది కాబట్టి పవన్ కళ్యాణ్ ను రెండో తరంగా పరిగణించాల్సివుంటుంది. అటు ప్రముఖ నిర్మాత రామానాయుడు మనవడు రానా కూడా తాత, బాబాయ్ తో సినిమా చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. 

ఇక టాలీవుడ్ లో కుటుంబ చిత్రాలకైతే కొదవే లేదు. ఇప్పుడున్న యువ హీరోలు తమ వంశంలో స్టార్ డమ్ వున్న తమ ముందువారితో నటించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. చాలా మంది ఇప్పటికే నటించారు. కృష్ణంరాజు-ప్రభాస్, నాగార్జున-సుమంత్, మోహన్ బాబు- విష్ణు-మనోజ్ కాంబినేషన్లు ఈ కోవకు చెందినవే. అయితే మూడు తరాల 'చిత్రం' అభిమానులకు ఇచ్చే ఆనందం అంతాఇంతా కాదనడంలో అతిశయోక్తి లేదెమో!

మూడు తరాల 'చిత్రం'!


తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు, తన కుమారుడు నాగ చైతన్యలతో కలిసి నటించనున్నట్టు ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున అధికారికంగా ప్రకటించారు. ఈ ముగ్గురు కలిసి వెండి తెర పంచుకోనున్నారని వస్తున్న ఊహాగానాలకు నాగ్ తెర దించారు. తాము కలిసి నటించే సినిమా ఈ ఏడాది జూన్ నెలలో ప్రారంభం కానుందని తెలిపారు. తాను ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న కళ్యాణ్ జ్యుయెలర్స్ దుకాణాన్ని విశాఖపట్టణంలో శనివారంనాడు-ఫిబ్రవరి 16న- నాగార్జున ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ- అభిమానుల అభిలాష మేరకు తన తండ్రి, కొడుకు కలిసి నటించాలన్న నిర్ణయానికి వచ్చినట్టు వెల్లడించారు. 

అక్కినేని త్రయం కలిసి నటించే సినిమా మూడు తరాల 'చిత్రం' అవుతుంది. మొదటి తరానికి చెందిన నాగేశ్వరరావు, రెండో తరానికి ప్రాతినిథ్యం వహిస్తున్న నాగార్జున, మూడో తరానికి చెందిన చైతన్య సిల్వర్ స్క్రీన్ పై మెరిస్తే ఇక అక్కినేని అభిమానులకు పండుగే. మూడు తరాలు హీరోలు కలిసి ఒకే సినిమాలో నటించిన ఘనత కూడా అక్కినేని కుటుంబానికే చెందుతుంది. ప్రస్తుతం తెలుగులో నడుస్తున్న మల్టీ స్టారర్ ట్రెండ్ తర్వాత మూడు తరాల దిశగా సాగేందుకు అడుగులు పడుతున్నాయనడానికి అక్కినేని త్రయం సినిమానే ఉదాహరణ. అయితే మూడు తరాలు హీరోలున్న ఫ్యామిలీలు చాలా తక్కువగా ఉండడంతో ఇటువంటి సినిమాలు అరుదుగా మాత్రమే వస్తాయనడంలో సందేహం లేదు. 

తెలుగు చిత్రసీమలో 'కుటుంబ' సినిమాలు కొత్తేంకాదు. గతంలో చాలా మంది హీరోలు తమ కొడుకులు, అన్నలు, తమ్ముళ్లు, మనవలు, మనవరాళ్లతో కలిసి సినిమాల్లో కనిపించిన సందర్భాలున్నాయి. పెద్ద ఎన్టీఆర్ తన కుమారుడు హరికృష్ణ, బాలకృష్ణతో నటించారు. సూపర్ కృష్ణ తన కుమారులు రమేష్ బాబు, మహేష్ బాబులతో కలిసి పలు చిత్రాల్లో ఫ్యాన్స్ కు వినోదం పంచారు. అక్కినేని నాగేశ్వరరావు కూడా తన కుమారుడు నాగార్జున తో నటించారు. చిరంజీవి తన సోదరుడు నాగబాబుతో చాలా సినిమాల్లో సందడి చేశారు. అయితే పూర్తిస్థాయి మూడు తరాల సినిమా ఇప్పటివరకు రాలేదని చెప్పొచ్చు. ఆ లోటును అక్కినేని వంశం తీర్చనుంది. 

కథ దొరికితే కలిసి నటించేందుకు మూడు తరాలు నటులు సిద్ధపడుతుండడంతో ఈ ట్రెండ్ భవిష్యత్ లో మరింత విస్తరించనుంది. తన తండ్రి బాబాయ్ తో కలిసి నటించేందుకు చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ఇప్పటికే ప్రకటించారు. అయితే కొణిదెల వంశంలో నటన చిరంజీవి నుంచి ప్రారంభమయింది కాబట్టి పవన్ కళ్యాణ్ ను రెండో తరంగా పరిగణించాల్సివుంటుంది. అటు ప్రముఖ నిర్మాత రామానాయుడు మనవడు రానా కూడా తాత, బాబాయ్ తో సినిమా చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. 

ఇక టాలీవుడ్ లో కుటుంబ చిత్రాలకైతే కొదవే లేదు. ఇప్పుడున్న యువ హీరోలు తమ వంశంలో స్టార్ డమ్ వున్న తమ ముందువారితో నటించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. చాలా మంది ఇప్పటికే నటించారు. కృష్ణంరాజు-ప్రభాస్, నాగార్జున-సుమంత్, మోహన్ బాబు- విష్ణు-మనోజ్ కాంబినేషన్లు ఈ కోవకు చెందినవే. అయితే మూడు తరాల 'చిత్రం' అభిమానులకు ఇచ్చే ఆనందం అంతాఇంతా కాదనడంలో అతిశయోక్తి లేదెమో!

Friday, February 15, 2013

I Love Telanganaa.... Sabitha Indra REddy


నేనూ తెలంగాణ వాదినే!
త్వరగా తేల్చాలని కేంద్రానికి చెప్పా.. సెల్యూట్ చేస్తే జంకాను
రాజకీయం ఒక ఊబి.. మునిగిపోవద్దంటే ఎత్తుకు పై ఎత్తులు వేయాల్సిందే!
సీఎం కావాలన్న ఆలోచన లేదు.. పోలీసు శాఖను 'సెట్' చేయాల్సి ఉంది

ఓ సాధారణ గృహిణి నుంచి.. రాష్ట్ర తొలి మహిళా హోంమంత్రిగా ఎదిగిన మహిళ.. సబితా ఇంద్రారెడ్డి. ఆమె.. తొలిసారిగా 'సెల్యూట్' ఎదుర్కొన్నప్పుడు కలిగిన భయం నుంచి... అసలు పోలీసుశాఖను 'సెట్' చేయాల్సి ఉందనే దాకా తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించారు.

గృహిణి నుంచి హోంమంత్రిగా మారారు? ఎలా ఉంది?
జీవితంలో ఇది ఇంకో భాగం అనుకుంటున్నా. ఇంద్రారెడ్డి భార్యగా ఎప్పుడూ నాలుగ్గోడల మధ్యే ఉన్నా. అలాంటిదిప్పు డు హోంశాఖను నిర్వహిస్తున్నా. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుందో చెప్పలేని శాఖ ఇది. విమర్శలకు ఎక్కువగా తావు ఉంటుంది. మొదట్లో టెన్షన్ పడ్డాను. ఇప్పుడు పర్వాలేదు. 

రాజకీయపు ఎత్తులు అలవడ్డాయా?
తప్పదు.. నేర్చుకోవాల్సిందే. రాజకీయం ఒక ఊబిలాంటిది బయటికి రాలేం. మునిగిపోవద్దంటే.. ఎత్తుకు పైఎత్తు వేయకతప్పదు. సహజంగా ఆడవాళ్లకు ఇబ్బందికరమైన పరిస్థితే. హోంమంత్రి అయిన మొదట్లో.. అన్ని విభాగాల ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేశాను. వాళ్లందరూ సీనియర్లు.. వచ్చి సెల్యూట్ చేస్తుంటే.. కొంత జంకినట్లు అనిపించింది. తర్వాత అలవాటైపోయింది. 

మీది ప్రేమ వివాహం కదా?
ఇష్టపడి చేసుకున్నాం. ఇంద్రారెడ్డి కుటుంబానికి మా నాన్నగారికి పరిచయం ఉండేది. ఆయన మా ఇంటికి వచ్చినప్పుడు మా నాన్న సంబంధం చూడమని చెప్పారు. తర్వాత ఆయన తానే చేసుకోవాలనుకున్నారు. రెండేళ్లకు పెళ్లి జరిగింది. ఆ రెండేళ్లు మా మధ్య ఉత్తరాలు నడిచాయి. 

మరి మీరు టీడీపీ వైపెందుకు వెళ్లలేదు?
ఇంద్రారెడ్డి ఎన్టీఆర్ నాయకత్వాన్ని అభిమానించేవారు. ముందునుంచీ చంద్రబాబుతో విభేదాలు ఉండేవి. ఎన్టీఆర్ మ రణించాక కాంగ్రెస్ వైపు మళ్లారు. నాకైతే రాజకీయాల్లోకి రా వాలని ఉండేదికాదు. ఇంద్రారెడ్డి మరణించాక కొద్ది రోజులకే అటు టీడీపీ.. ఇటు కాంగ్రెస్.. వాళ్ల తరఫున రంగంలోకి దిగమని ఒత్తిడి చేశాయి. ఆ సమయంలో వైఎస్ మా ఊరికి వచ్చా రు. ఇంద్రారెడ్డి ఆశయం నిలబెట్టడానికి ఏదో ఒక దారి వెతుక్కోవాలనిపించింది. కాంగ్రెస్ వైపే మొగ్గాను. 

హోంశాఖ ఇచ్చినప్పుడు ఎలా ఫీలయ్యారు?
హోంశాఖ ఇచ్చిన సంగతి తెలిసిన వెంటనే వైఎస్ దగ్గరికి వెళ్లాను.'ఏమైందమ్మా' అన్నారు. ఈ శాఖ ఇచ్చారేంటన్నా అంటే.. 'చేస్తావులే' అన్నారు. ఎలా సాధ్యం అనేసరికి.. 'నేనున్నాను కదా' అనేశారు. 

పోలీసుశాఖలో ఇతరుల జోక్యం?
అలాంటిదేమీ లేదు. ఇతరుల జో క్యం ఉన్నా.. వారి పని వారిని చేయనిస్తున్నాం. డీఎస్పీల బదిలీల వంటివన్నీ డీజీపీ చేతిలోనే ఉంటాయి. కేసుల నమోదు విషయంగా ఎమ్మెల్యేల జోక్యాన్ని పట్టించుకోవద్దనే చె బుతున్నాం. ఎక్కడైనా కొన్ని స్టేష న్లలో అలా జరుగుతుండొచ్చు. 

హోంశాఖలో వివాదాలు?
కొంత బాధగానే ఉంటుంది. పోలీసుశాఖ అనేది క్రమశిక్షణ ఉండాల్సిన విభాగం. అలాంటివి జరగకుండా కఠినంగా 'సెట్' చేయాల్సి ఉంది. ఏఎస్పీ నవీన్‌కుమార్ విషయంలో నూ.. చర్యలు చేపట్టినా.. ఆయన ఆరోపణల్లో వాస్తవాలపై విచారణ జరుగుతోం ది. నవీన్ అడ్వొకేట్లు వచ్చి కలిసి నప్పుడు.. ఆధారాలుంటే ఇవ్వాలని చెప్పాను. 

ఎస్పీని కానిస్టేబుల్ బందీ చేసిన ఘటనపై?
కానిస్టేబుల్‌కు ఏదైనా ఇబ్బంది ఉన్నా.. ఆ వింగ్‌లో ఏదైనా ఉన్నా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయొచ్చు. పట్టించుకోకపోతే... మాకు చెప్పొచ్చు. దానిపై చర్యలు తీసుకుంటాం. 

రాజశేఖరరెడ్డితో అనుబంధం?
ఇంద్రారెడ్డి మరణించినప్పుడు.. నేను ఆస్పత్రికి చేరుకున్నప్పుడే వైఎస్ కూడా వచ్చారు. కొద్ది రోజులకు మా ఊరు వచ్చి కలిశారు. వైఎస్ పాదయాత్ర తొలుత తాండూరు నుంచి ప్రా రంభిద్దామనుకున్నారు. కానీ, చేవెళ్లలో సభ నిర్వహించి.. తాం డూరు నుంచి పాదయాత్ర ప్రారంభించాలని కోరాను. మరునాడే వైఎస్ ఫోన్ చేసి.. చేవెళ్ల నుంచే పాదయాత్ర ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. దాంతో కొంత భయపడ్డా. మా దగ్గర వద్దు, అపశకునం అనుకుంటారన్నాను. 'అలా అంటే.. మీ దగ్గరే మొ దలు పెడతా. ఇక ప్రతీ కార్యక్రమం అక్కడే ప్రారంభిస్తా'నన్నా రు. నన్ను 'చేవెళ్ల చెల్లెమ్మ' అని నోరారా పిలిచేవారు. నాకు వారి కుటుంబంతో పెద్దగా పరిచయం లేదు. ఆస్తుల అటా చ్‌మెంట్ ఫైల్‌పై సంతకం చేసిన తర్వాత చాలా సేపు బాధపడ్డాను. జగన్‌తో పెద్దగా పరిచయం లేకపోయినా.. వైఎస్‌తో ఉన్న అభిమానంతో బాధేసింది. 

'కళంకిత' ఆరోపణలపై?
అలాంటి ఆరోపణలతో బాగా బాధేస్తుంది. మంత్రులం ఏ విధంగా కళంకితులం అయ్యామనేది మాకు తెలియదు. సీబీఐ వాళ్లు ఓఎంసీ విషయంలో స్టేట్‌మెంట్లు తీసుకున్నారు. ఆ విషయంలో ఫైల్‌లో మేం ఏం పెట్టాం. అధికారి శ్రీలక్ష్మి ఏం మా ర్చారు అనేది చెప్పాం. ఆ ఫైల్‌పై నా ఆఫీసులోనే సంతకం పెట్టాను. కేవీపీగానీ, వైఎస్‌గానీ ఫలానా ఫైల్‌పై, ఫలానా చోటుకు వచ్చి సంతకం పెట్టాలని ఎప్పుడూ చెప్పలేదు. 

హోంశాఖపై మీ ముద్ర?
ఇంకా చేయాల్సి ఉంది. ఉన్న మూడేళ్లలో ఉద్యమాలతోనే సరిపోయింది. తెలంగాణవారిపైనే కాదు..ఆంధ్రా వారిపైనా కేసులు పెట్టాం. అది విధి నిర్వహణలో భాగం. తెలంగాణలోని పరిస్థితులు, ఆకాంక్షలు నాకు తెలుసు. 

కార్తీక్‌పై ఆరోపణలు?
అవన్నీ అవాస్తవం. కార్తీక్ మొదట్లో నాకు సపోర్ట్‌గా ఉం డడం కోసం వచ్చేవారితో మాట్లాడడం వంటివి చేసేవాడు. కా నీ, ఆరోపణలు రావడంతో ఎవరితోనూ మాట్లాడడం లేదు. కార్తీక్‌కు రాజకీయంగా ఎదగాలనే ఆలోచన ఉంది. అలాంటివాడు చెడ్డపేరు తెచ్చుకొనే పనిచేయడు. సినీ నటుడు కృష్ణుడు రెండుమూడు సార్లు కాలనీవాళ్లతో కలిసి.. నాదగ్గరికి వచ్చారు. ఉపసర్పంచ్ ఇబ్బంది పెడుతున్నారని, ఎమ్మార్వో, ఇన్స్‌పెక్టర్‌తో మాట్లాడాలని కోరారు. వారితో మాట్లాడి సాయం చే యాలని చెప్పాను. కానీ, కృష్ణుడు ఆరోపణలు చేశారు. 

ఆరోపణలు ఎందుకొస్తున్నాయి?
నన్ను విమర్శించలేక.. కార్తీక్‌ను టార్గెట్ చేసి ఉండొచ్చు. భవిష్యత్తులో రాజకీయంగా ఎదగాలని యత్నిస్తున్నాడు కాబట్టి, అడ్డుకునేందుకు ఎవరైనా యత్నిస్తుండొచ్చు. జగన్ పార్టీలో కి కార్తీక్ వెళతాడనేది అవాస్తవం. కార్తీక్ వచ్చే ఎన్నికల్లో చేవెళ్ల నుంచి కాంగ్రెస్ టికెట్‌పై ఎంపీగా పోటీచేస్తాడు. ఇక నేను ఇప్పటికే ఊహించనంత ఎత్తుకు ఎదిగాను. సీఎం కావాల న్న ఆలోచనేం లేదు. 

తప్పు చేయలేదు..
ఓఎంసీ ఫైల్‌పై నేను సంతకం చేసి పంపి న తర్వాత.. అందులోంచి 'క్యాప్టివ్' పదా న్ని తొలగించారు. ఫైనల్ జీవోను కూడా నాకు పంపలేదు. తర్వాత ఏపీఎండీసీకి ఇ చ్చిన భూమిని కూడా ఓఎంసీకి ఇచ్చేందు కు ప్రయత్నించారు. శ్రీలక్ష్మి రెండు సార్లు వ చ్చి ఆఫైల్‌పై సంతకం చేయాలని కోరారు. కానీ, అక్కడ పరిశ్రమ వస్తే.. ఏపీఎండీసీకి లాభమని గుర్తించి సంతకం పెట్టలేదు. అ ది ఆగిపోయింది. నా పరిధిలో నేను వ్యవహరించాను. తప్పు చేయలేదు కాబట్టే.. నాకు భయం లేదు. అప్పుడు ఏం చేసినా.. రాష్ట్రానికి మంచి చేస్తున్నాం అనే ఆలోచనతో చేశాం. పెట్టుబడులు వస్తున్నాయి. రాష్ట్ర రెవెన్యూ పెరుగుతుంది, ఉపాధి పెరుగుతుందని ఆలోచించాం. 

హైదరాబాద్‌కు మచ్చ రావొద్దు
నేను తెలంగాణవాదినని ఉద్యమం చేస్తున్నవారందరికీ తెలుసు. కానీ, హోంమంత్రిగా నా పరిధిలో నేను వ్యవహరించాల్సి ఉంటుంది. తెలంగాణ త్వరగా రావాలని కోరుకుంటున్నా. బయోడైవర్సిటీ సదస్సును దృష్టిలో పెట్టుకోవాలని తెలంగాణవాదులకు విజ్ఞప్తి చేస్తాను. తెలంగాణ వచ్చినా హైదరాబా ద్ ఉండేది అందులోనే. అందుకే మచ్చపడకుండా చూసుకోవాలని కోరుతున్నా. వ్యక్తిగతంగా అందరినీ పిలిచి మాట్లాడుతాను. తెలంగాణమార్చ్‌లోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కేంద్ర హోంమంత్రికి విజ్ఞప్తి చేశాను.


Thursday, February 14, 2013

My Mustaches will warn me.... Kanumuri Bapiraju


మీసాలు నన్ను హెచ్చరిస్తాయి
తప్పు చేయొద్దని జగన్‌కు చెప్పా
సోనియా వల్లే రెండు సార్లు టీటీడీ చైర్మన్ పదవి

పదవిని నా అవసరాలకు వాడుకోను
ఉద్యోగులను రోజూ హెచ్చరిస్తుంటా
ఇక నుంచి కఠిన చర్యలు చేపడతాం

పెద్ద మీసాలతో గంభీరంగా కనిపించే రాజకీయవేత్త కనుమూరి బాపిరాజు. తన మీసాల వెనుక కథ దగ్గరి నుంచి, టీటీడీని ప్రక్షాళన చేయాల్సి ఉందనేదాకా తన మనసులోని విషయాలను బాపిరాజు, అన్నపూర్ణమ్మ దంపతులు నిర్మొహమాటంగా వెల్లడించారు. వారితో 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' కార్యక్రమం విశేషాలు... 

మీ మీసాల వెనుక కథేంటి?
నాకు కాలేజీలో చదువుతున్నప్పటి నుంచీ మీసాలు పెద్దగా ఉండేవి. ఈ మీసాలను తల్లిదండ్రులుగా భావి స్తా. అవెప్పుడూ.. నువ్వు ఫలనా వ్యక్తివి, పార్టీవాడివి, ఫలానా ఊరివాడివి, ఫలానా వ్యక్తుల స్నేహితుడివి అంటూ హెచ్చరిస్తుంటాయి. అందువల్ల తప్పు చేయడానికి అవకాశం ఉండదు. 

ఇప్పటివరకు మీసాలు ఎన్ని సార్లు తీశారు?
హెచ్చెస్సీ పరీక్షలు రాశాక.. తిరుపతిలో గుండు తీయించుకున్నాను. మీసాలు తీయడం అదే మొదటి సా రి. మా నాన్న ఆరోగ్యం బాగోలేనప్పుడు ఒకసారి తీశా ను. చిక్‌మంగళూరులో ఇందిరాగాంధీ పోటీ చేసినప్పుడు.. ఆమె ప్రధాని అయినప్పుడు... వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం కావడం కోసం మొక్కుకుని, తీర్చుకున్నా. 

ఎక్సైజ్ మంత్రిగా వివాదం?
డిస్టిలరీలకు అనుమతి వివాదంలో నా తప్పేంలేదు. రామారావుగానీ, సీపీఐ, బీజేపీ వాళ్లుగానీ నేను అవినీతి కి పాల్పడ్డానని అనలేదు. బాధ్యత వహించాలనే డిమాం డ్ చేశారు. దాంతో నేనే రాజీనామా చేశా. చెన్నారెడ్డి హ యాంలో ఎక్సైజ్‌శాఖ ఇచ్చినా తీసుకోలేదు. కానీ విజయభాస్కర్‌రెడ్డి సీఎం అయ్యాక తప్పలేదు. 

రాజకీయాల్లో మీ ఆవిడ సహకారం?
స్థానికులకు ఏ సమస్య వచ్చినా అన్నపూర్ణమ్మ ముం దుంటుంది. నేను రాజకీయాల్లో బిజీగా ఉంటుండే వాడి ని. దాంతో ఎవరైనా రోగులకు సమస్య వస్తే.. ఆమే వారి ని స్వయంగా తీసుకెళ్లి వైద్యం చేయించేది. దీంతో ఆమెకు నియోజకర్గంలో పట్టు పెరిగింది. అన్నపూర్ణమ్మ: మేం చేసిన సహాయం వల్ల ప్రచారం కోసం వెళ్లినప్పుడు ఆత్మీయత కనిపిస్తుంది. టీటీడీ చైర్మన్ పదవి వచ్చాక స్వయంగా వెళ్లడం తగ్గిపోయింది. ఏదైనా ఉంటే ఫోన్ ద్వారా వీలైనంత సహాయం చేస్తున్నాం. 

రాజకీయాల్లోకి ఎలా వచ్చారు?
తొలుత 1978లో నేను స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశాను. అప్పుడు మా నాన్న వచ్చి 'రాజకీయాలు పాడైపోయాయి. ప్రజలు అసహ్యించుకునే రోజులివి. నీ కు పదవి పిచ్చి పట్టిందేంట్రా' అని తిట్టారు. వినకపోవడంతో.. నా కాళ్లు పట్టుకున్నారు. కొందరు నాకు ఓటే స్తాం.. పోటీ చేయాల్సిందేనని పట్టుబట్టారని ఆయనకు వివరించాను. 'ఇరుక్కుపోయాను, ఎలాగూ గెలవను.. తిరిగి ఇంటికి వచ్చేస్తా. ఈ సారికి వదిలేయండి' అని బతిమాలడంతో.. వెళ్లిపోయారు. కానీ 46 ఓట్లతో గెలిచాను. అలా అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చాను. ప్రస్తుతం.. రాజకీయ వ్యవస్థే అవినీతిలో కూరుకుపోయింది. 

రెండు సార్లు టీటీడీ చైర్మన్ అవకాశమెలా వచ్చింది?
పదవి కోసం ఎవర్నీ ఇబ్బంది పెట్టలేదు. అడగకుండానే సోనియా నాకు టీటీడీ చైర్మన్ అవకాశం ఇచ్చారు. నన్ను ఎంపిక చేయాలని సీఎం కిరణ్‌ను ఆదేశించారు. కిరణ్ దగ్గరికి వెళ్లినప్పుడు కూడా.. ఆ పదవికి ఏ బల మూ లేని నన్నెలా ఎంపిక చేశారని అడిగాను. టీటీడీ చైర్మన్ కావడానికి ప్రణబ్ సహకరించారనేది అవాస్తవం. 

రాష్ట్రపతి ఎన్నికల్లో తొలి ఓటు విషయం?
అప్పుడు కేంద్ర మంత్రులు చిదంబరం, బన్సల్ తదితరులు కలిసి.. 'దేవుడి ప్రతినిధిగా బాపిరాజుతో యూపీఏ తరఫున మొదటి ఓటు వేయిద్దాం' అని నిర్ణయించారు. వీహెచ్ సహా వచ్చినోళ్లందరినీ ఆగాలని కోరి మరీ.. నాతో వేయించారు. అలాగే.. ఉపరాష్ట్రపతి ఎన్నికలప్పుడూ తొలి ఓటు వేయించడానికి నన్ను పిలిచారు. అయితే.. ఈ సారి బెంగాల్ ఎంపీ ఒకరు నా కన్నా ముందే వచ్చారు. 'తిరుపతి బాలాజీ' తరఫున నాతో తొలిఓటు వేయిస్తామని వా రు చెప్పడంతో.. ఆ ఎంపీ కాస్త ఘాటెక్కారు. 'బెంగాల్ కాళీమాత తరఫున నేనే ముందు ఓటేస్తా' అని పట్టుబట్టా రు. వీహెచ్, మరికొందరు చెప్పినా ఆ ఎంపీ వినలేదు. 'ప్రపంచంలో అందమైన దేవత కాళీమాత. ఆమె ప్రతినిధిగా నేనే మొదటి ఓటేస్తా' అన్నారు. అంతలో బన్సల్ కల్పించుకుని.. 'సరే ఎవర్నీ బాధపెట్టడం మాకిష్టం లేదు. మీరే ఓటేయండి' అన్నాక ఆ ఎంపీ వెనక్కుతగ్గారు. 

టీటీడీ విషయంలో అన్నీ నాన్చుతారనే విమర్శలు?
ఇప్పటివరకు ఎప్పుడూ లేనన్ని నిర్ణయాలు నా ఆధ్వర్యంలో తీసుకున్నాం. ఉద్యోగుల సమస్యలను కూడా ప ట్టించుకోవాలి కదా. అందుకే ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వచ్చాను. టీటీడీ చైర్మన్‌గా నన్ను ఎంపిక చేయగానే.. నేనేదో చేస్తానని అందరూ ఆశపెట్టుకున్నారు. దానికి తగ్గట్లుగా నేను వ్యవహరించక తప్పదు. నేనీ పదవిని వేరే పనుల కోసం ఉపయోగించుకోవడం లేదు. 

లడ్డూ నాణ్యత దారుణంగా ఉండడంపై?
అలాంటి వాటిని నియంత్రించడం కోసం లడ్డూలు తయారు చేసే ప్రదేశానికి స్వయంగా వెళ్లి పరిశీలించాను. నేను వచ్చిన మొదట్లో లడ్డూలు దొరకడం లేదన్నారు. ఆ కొరత తీర్చడంపై దృష్టి పెట్టాను. ఇటీవల నాణ్యతపైనా దృష్టిపెట్టాం. లడ్డూ తయారీ ప్రదేశం అత్యంత పరిశుభ్రంగా ఉండేలా శ్రద్ధ తీసుకున్నాం. వెంట్రుకలు పడకుండా పనిచేసేవారికి తలకు ఆర్పాన్లు పెట్టాం. 

టీటీడీ సిబ్బందిలో అంకిత భావం తగ్గిపోతోందేం?
సిబ్బందిలో చాలా వరకు మర్యాదగా మాట్లాడటం అలవర్చుకున్నారు. "మనకు జీతం ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఎక్కడినుంచో వస్తున్న భక్తుల సొమ్మే తింటున్నాం. పైగా వాళ్లను బాధపెడుతుంటాం'' అని రోజూ హెచ్చరిస్తుంటా. తిరుమల నుంచి తిరిగి వెళ్లేవారు నవ్వు మొహంతో కనిపిస్తే.. మేం బాగా పనిచేసినట్లే. 

చర్యలు తీసుకోకుండా బతిమాలడం ఎందుకు?
అన్యమత ప్రచారంపై ప్రమాణం చేయించడం, బతిమాలి పనిచేయించుకోవడం వంటివి కొంతవరకు తప్పే. కానీ, ఇప్పటి నుంచి పద్ధతి మార్చాల్సిన అవసరం ఉం ది. కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రధాన పూజారులు ప్రై వేటు వ్యక్తుల దగ్గరికి వెళ్లడం, వీఐపీలకు ఆశీర్వచనం ఇ వ్వడం వంటివి మార్చుకోవాల్సి ఉంది. టీటీడీలోని వ్యవహారాలన్నింటినీ పూర్తి నియంత్రణలోకి తీసుకువస్తాం. 

జగన్ పార్టీలోకి పిలుపు రాలేదా?
వైఎస్ మరణించాక జగన్ సీఎం కావాలని నేను కూడా కోరుకున్నా. ఆ తర్వాత కూడా పార్టీ వదలొద్దని చాలా సార్లు చెప్పాను. కొత్త పార్టీ ప్రస్తావన వచ్చినప్పు డు.. 'మీ నాన్న చివరి వరకు కాంగ్రెస్‌లోనే ఉన్నారు. ను వ్వు తప్పు చేయొద్దు. తొందరపడొద్దు'' అని గట్టిగా చెప్పాను. కానీ... 'నా వల్ల కాదు. పార్టీ పెడుతున్నా. 2014లో మీరు నా పార్టీ తరఫున పార్లమెంటుకు పోటీ చేయాలి' అన్నాడు. కానీ, నేను తిరస్కరించా. 'ప్రాణం పోయినా పార్టీని వదిలిపెట్టేవాడిని కాను. ఒకవేళ నా నియోజకవర్గంలో నేను ఓడిపోయే పరిస్థితి వచ్చినా సరే.. నీ పార్టీ తరఫున నిలబడను'' అని చెప్పేశాను. 

మీ లక్ష్యం ఏమిటి?
శ్రీవారి సేవకన్నా కోరుకునేదేమీ లేదు. మనసు విప్పి మాట్లాడుకోలేని రోజులివి. ఈ కార్యక్రమం ద్వారా మనసులోని మాటలు చెప్పి హృదయంలోని భారాన్ని తగ్గించుకునే అవకాశం కల్పించారు, కృతజ్ఞతలు.

Tuesday, February 12, 2013

My ambition is Delhi.... R.Krishnaiah


ఢిల్లీ వెళ్లాలనుంది!
లోక్‌సభకైనా, రాజ్యసభకైనా ఓకే
బీసీల్లో ఇంకా కులతత్వం వీడలేదు
తెలంగాణ కంటే బీసీల సమస్యలే ముఖ్యం
వైఎస్‌పై అభిమానంతోనే జగన్‌కు గౌరవం
-- బీసీ సంఘాల నేత ఆర్. కృష్ణయ్య

 విద్యార్థి సంఘం నాయకుడి నుంచి.. రాష్ట్రంలో బీసీలకు పెద్ద దిక్కుగా ఎదిగిన నేత ఆర్. కృష్ణయ్య. అమ్మే తనకు తొలిగురువు అనే దగ్గరి నుంచి.. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించక తప్పదనే అం శం దాకా ఆయన తన అభిప్రాయాల విశేషాలు... 

మీ కుటుంబ నేపథ్యం?
మా తండ్రికి 140 ఎకరాల మాగాణి ఉండేది. మా గ్రామానికి పెద్ద కూడా. మా అమ్మే నాకు తొలి గురువు. చదువుకొమ్మని ప్రోత్సహించిందీ, నాలో పట్టుదలను పెంచింది కూడా ఆమెనే. వివేకానందుడు, బుద్ధుడు నాకు ప్రేరణ. ఇంటర్, డిగ్రీలో ఆర్ఎస్ఎస్‌లో ఉన్నాను. 

బీసీ నేతగా ఎలా ఎదిగారు?
ఉస్మానియా వర్సిటీలో చదువుతున్నప్పుడు విద్యార్థి నాయకుడిగా పనిచేశాను. ప్రతీ కాలేజీకి తిరిగి విద్యార్థులను సమీకరించేవాడిని. బీసీలను ఆర్గనైజ్ చేయడం అం త సులువు కాదు. మద్దతిచ్చేవారు పది మంది ఉంటే.. వెనకాల వ్యతిరేకించేవారు 50 మంది ఉంటారు. 

తెలంగాణ ఉద్యమానికి ఎందుకు దూరంగా ఉన్నారు?
ఈ ఉద్యమం ఇటీవల వచ్చింది. కానీ, దానికంటే ము ఖ్యమైనది బీసీల సమస్య. ఇప్పటికీ గ్రామాల్లో 40 శాతం బీసీ కులాల వారు.. ఎస్సీ ఎస్టీల కన్నా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. ఈ సమస్యకు రాజకీయ ఆలోచనలు ఉండవు. దీన్ని మధ్యలో వదిలేయలేను. తెలంగాణ ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయనేది కచ్చితంగా చెప్పలేం. కేసీఆర్‌ను ఉద్యమ నాయకుడిగా మాత్రం గౌరవిస్తా. 

బీసీల్లో కొన్ని కులాలను పట్టించుకోరని ఆరోపణలు?
అవి ఉద్యమానికి దూరంగా ఉన్నవాళ్లు చేసే ఆరోపణ లు మాత్రమే. బీసీల్లో అన్ని కులాల కోసం నేను పోరాడుతున్నా. నా వెంట గౌడ్‌లు, యాదవులు, ముదిరాజ్, మున్నూరు కాపులు ఎక్కువగా ఉంటుంటారు. మిగతా కులాలను నేను ఎప్పుడూ దూరం పెట్టను. కానీ, వారే రావడం లేదు. చైతన్యం తక్కువగా ఉండడమో, కులతత్వం ఇంకా వీడకపోవడమో దానికి కారణం కావొచ్చు. 

బీసీలను వర్గీకరించాలని అంటున్నారెందుకు?
బ్యాక్ వర్డ్, మోస్ట్ బ్యాక్‌వర్డ్‌లుగా చేయాలని కొందరు అంటున్నారు. కానీ, దానివల్ల నష్టమే జరుగుతుంది. అం దువల్ల బీసీలను.. 8 గ్రూపులుగా చేయాలని చెబుతు న్నాం. మరింతగా వికేంద్రీకరణ చేయగలిగితేనే.. అత్యం త వెనుకబడిన కులాలకు ప్రయోజనం కలుగుతుంది. 

రీయింబర్స్‌మెంట్‌తో ప్రమాణాలు తగ్గిపోతున్నాయి?
ఇంజనీరింగ్ విద్య ప్రమాణాలను పెంచాలని, గ్రామీ ణ విద్యార్థులు ఇంగ్లీష్‌లో ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ప్రభుత్వానికి సూచించాం. మరిన్ని మార్పులు, సంస్కరణలు తీసుకురావాల్సి ఉంది. మొదట్లో నాకు ఈ లోతు తెలియదు. దీనిపై సీఎంకు, ఉన్నతాధికారులకు ప లు సూచనలు చేశాను. అయితే.. ఈ పథకానికి సరిగా నిధులు విడుదల చేయకపోవడం.. అనర్హుల పేరిట పథకానికి కోత పెట్టడాన్ని నిరసిస్తూ ఉద్యమం చేస్తున్నాం. 

బీసీ రిజర్వేషన్లపై చైతన్యం వచ్చిందా?
బీసీల్లో ఇటీవల రాజకీయ చైతన్యం పెరిగింది. పంచాయతీ రాజ్ రిజర్వేషన్ల వల్ల రెండో స్థాయి నాయకత్వం బలపడింది. జనాభా ప్రాతిపదికన ప్రాతినిధ్యం కల్పించాలనే డిమాండ్ వచ్చింది. చెన్నారెడ్డి, ఎన్టీఆర్‌లకు బీసీల విషయంగా మంచి ఆలోచనలుండేవి. కోట్ల విజయభాస్కర రెడ్డి పంచాయతీరాజ్ రిజర్వేషన్లను పెంచారు. 

వైఎస్‌తో సన్నిహితత్వం ఎలా?
నేను ఆయనతో సన్నిహితంగా ఉండడం అనేకంటే.. ఆయనే నన్ను సన్నిహితం చేసుకున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై తొలుత మూడేళ్లపాటు వైఎస్‌తో పోరాడాను. కానీ, నిరాహార దీక్ష చేస్తానన్నప్పుడు.. నన్ను పిలిపించి మాట్లాడారు. నేను చేసిన డిమాండ్లన్నింటినీ ఒప్పుకొన్నా రు. వైఎస్ రాజశేఖరరెడ్డి మీద ఉన్న అభిమానంతోనే ఆయన కుమారుడు జగన్‌ను గౌరవిస్తా అంతే. 

రక్షణ స్టీల్స్ వివాదం సంగతి?
దానికి సంబంధించి తొలుత నాకు పూర్తి వివరాలు తెలియవు. అనంతపురానికి చెందిన సంఘాలు నన్ను అప్పటికప్పుడు పిలిపించడంతో.. వెళ్లి మాట్లాడాను. అ లాంటి వాటిని వెంటనే సర్దుకున్నాను. వైఎస్ చేసిన మే లు వల్లే అలా చేశాననడం సరికాదు. బీసీ డిక్లరేషన్ ప్రకటించాక చంద్రబాబు దగ్గరికి అన్ని సంఘాలతో వెళ్లాం. సన్మానం చేశాం. అంతమాత్రాన ఆయనతో కలిపేస్తారా? 

చట్టసభల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా?
రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఒత్తిడి తీసుకొస్తే.. రిజర్వేషన్లు వస్తాయని ఆశ. అందుకే వైఎస్‌తో ప్రయత్నించాం. ఇవాళ కాకపోతే రేపు.. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వక తప్పదు. 

ఎమ్మెల్యే అవాలనే ఆలోచన ఎందుకు లేదు?
నాకు మొదటి నుంచీ ఆ ఆలోచన లేదు. 1983లోనే ఎన్టీఆర్ టికెట్ ఇస్తానన్నారు. కానీ, నాది పేద ప్రజల కోసం చేసే పోరాటం. రాజకీయాల్లో చేరితే పోరాటాల్లో కమిట్‌మెంట్ పోతుంది. ఇప్పుడు ఏదైనా అవకాశం వ స్తే.. లోక్‌సభకో, రాజ్యసభకో వెళ్లాలని ఉంది. అది కూడా అన్ని పార్టీలూ కలిసి పంపితేనే! ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా వైఎస్ కూడా ఆఫర్ ఇచ్చారు. 

కాలేజీలు నెలనెలా 'సొమ్ము' ఇస్తాయని ఆరోపణలు?
అలాంటిదేం లేదు. వాళ్లంతట వాళ్లే ఇస్తామన్నా నేను తీసుకోలేదు. ఎవరైనా స్నేహితుల నుంచి మాత్రమే విరాళాలు తీసుకుంటాను. కాలేజీల నుంచి విరాళాలు తీసుకుంటే.. వాటికి వ్యతిరేకంగా ఎలా మాట్లాడతాను? 

మీరు సాధించదలచుకున్నది?
దోపిడీ, పీడన, వివక్ష లేని సమాజం కావాలి. రాజకీయ ప్రక్షాళన జరుగకుండా సమాజంలో మార్పు రాదు. చట్ట సభల్లో రిజర్వేషన్లు సాధించాలి. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖను సాధించాలనేది నా తపన.

Monday, February 11, 2013

Gummadi Narsaiah Open Heart


రాజకీయాల్లోకి ఎలా వచ్చారు?
పేదలకోసం పాటుపడాలనే లక్ష్యంతో న్యూడెమోక్రసీలో చేరా ను. 1981లో సర్పంచ్‌గా పోటీ చేసి గెలిచాను. 83లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచాను. తర్వాత 1994లో మినహా ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. మా ప్రాంతంలాగే.. మాది బాగా వెనుకబడ్డ కుటుంబం. నా నివాసం ఖమ్మం జిల్లా టేకులగూడెం. నాకు వారసత్వంగా వచ్చింది రెండెకరాల పొలం మాత్రమే. 

మరి అప్పట్లో చురుగ్గా ఉన్న పీపుల్స్‌వార్‌లో ఎందుకు చేరలేదు?
అప్పటికి పీపుల్స్‌వార్ ఇంకా యుద్ధపంథాలోనే ఉంది. న్యూడెమోక్రసీ మాత్రం అడవుల్లోంచి బయటకు వచ్చి, చట్టబద్ధం గా పోరాటం ప్రారంభించింది. రాజ్య వ్యవస్థతో పోరాడడం అయ్యేపనేనా? అనే ఆలోచనతో పాటు.. పోరాట సంస్థలకు మద్దతు ఉంటుందని న్యూడెమోక్రసీలో చేరాను. 

ఏ కార్యక్రమానికి వెళ్లాలన్నా పార్టీ అనుమతి కావాల్సిందేనా?
పార్టీలో క్రమశిక్షణతో పాటు స్వీయ కట్టుబాట్లు కూడా ఉంటా యి. ఏదైనా సమావేశానికి వెళ్లినా.. పార్టీ అనుమతి తీసుకోవాలి. ఆ కార్యక్రమంలో ఎలా ఉండాలనేదానిపైనా పార్టీ నియంత్రణలు ఉంటాయి. పార్టీతో పాటు వ్యక్తిగతంగా కూడా నష్టం జరుగకూడదనే ఈ విధానం. అలా ఉండడం వల్లే.. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో నెగ్గుకు రాగలుగుతున్నాం. ఇతరులకు మాకు మధ్య తేడాను జనం గుర్తించగలుతున్నారు. 

ఎంత పట్టున్నా.. మధ్యలో ఓటమి పాలయ్యారు కారణం?
రాజకీయంగా పరిస్థితులు మారిపోయాయి. ప్రజల్లో మాకు ఇమేజ్ ఉన్నప్పటికీ ఓడిపోయాం. కారణం డబ్బు, రాజకీయాలు. మమ్మల్ని ఓడించడానికి ఇతర పార్టీలు ఒక్కటయ్యాయి. కాంగ్రెస్ కూడా టీడీపీకి మద్దతిచ్చింది. ఒక సారి నియోజకవర్గాల పునర్విభజన కొంత దెబ్బతీసింది. 

మీకు ఎమ్మెల్యేగా వచ్చిన వేతనం, అలవెన్సులు పార్టీకే ఇచ్చారా?
నాకు ఎమ్మెల్యేగా వచ్చేదంతా.. ఇప్పుడు పెన్షన్‌తో సహా పార్టీకే ఇచ్చేస్తాం. నేను తిరగడానికి, మా ఇంటి ఖర్చులకు పార్టీ ఇస్తుంది. ఎక్కడికైనా వెళితే.. వాహనాల డీజిల్, తిండి ఖర్చులు సహా పార్టీకి లెక్కచెబుతాం. ఇంట్లో వ్యక్తిగత ఖర్చులకు వ్యవసాయమే దిక్కు. 

నిజాయితీకే మా మద్దతు!
ఇప్పటికీ వ్యవసాయమే జీవనాధారం
బలవంతపు వసూళ్లు అవాస్తవం
పార్టీలన్నీ కలిసి ఓడించాయి
ఓ కబ్జాకు సంబంధించి పీజేఆర్ ఆఫర్ ఇచ్చాడు

మీకు ఎవరూ డబ్బు ఆఫర్ చేయలేదా?
ఒకసారి తన సస్పెన్షన్ గొడవకు సంబంధించి.. హౌజింగ్ బోర్డు ఏఈ డబ్బు తీసుకొచ్చాడు. ఇంట్లోకి వచ్చి కొద్దిసేపు మాట్లాడాడు. నాకు విషయం చెప్పకుండా అక్కడో కవరు పెట్టి, నా భార్యకు చెప్పి వెళ్లిపోయాడు. తర్వాత అవి తీసుకెళ్లి ఇచ్చేసి.. మళ్లీ అలా చేయొద్దని హెచ్చరించి వచ్చాను. మరోసారి ఆయనే ప్రజల డబ్బు కాజేశాడు. దానిపై నేను ఫిర్యాదు చేస్తే.. సస్పెండయ్యా డు. కొద్ది రోజులకు యూనియన్ నేతలతో కలిసి వచ్చి.. రెండు లక్షలు ఇస్తా, ఫిర్యాదు వెనక్కితీసుకోవాలని కోరాడు. వాళ్లందరినీ తిట్టి పంపించాను. నిజాయితీగా ఉండడానికి నా భార్య మద్దతు ఎక్కువ. అక్రమంగా సంపాదించే డబ్బు మనకు వద్దని చెబుతుం ది. మా పిల్లలూ అక్రమాలను సహించరు. 

మీపై ఎప్పుడైనా ఒత్తిళ్లు వచ్చాయా?
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఓ కబ్జాకు సంబంధించి.. నేను అసెంబ్లీలో ప్రశ్న లేవనెత్తాను. అప్పుడు మంత్రిగా ఉన్న పి. జనార్దన రెడ్డి.. దానిని వెనక్కి తీసుకోవాలని కోరారు. అది తన పరిధిలోకి వస్తుందని, తాను చూసుకుంటానన్నారు. ఏదైనా ఉంటే మాట్లాడుకుందామని ఆఫర్ చేశారు. నేను పట్టించుకోలేదు. చిత్రమేమిటంటే.. మరుసటిరోజు ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిన మంత్రిని సభకు రాకుండా చేశారు. 

ఖమ్మంలో మీ పార్టీపై 'వసూళ్ల' ఆరోపణలేమిటి?
అలాంటి ఆరోపణలేవీ మా దృష్టికి రాలేదు. ఏడాదికోసారి కూలీలు, రైతుల నుంచి చందాలు మాత్రం తీసుకుంటాం. మా పార్టీకి విరాళం ఇవ్వాల్సిందిగా.. ఆ ప్రాంతంలో పనులు చేసే కాం ట్రాక్టర్లను అడుగుతుంటాం. అంతేగానీ బలవంతమేమీ ఉండదు. కానీ, వసూళ్ల ముద్రవేసి కాంట్రాక్టర్లు మా దగ్గర పనులను ఆపేశా రు. దానికి కారణం కొందరు మంత్రుల బెదిరింపులు.. వాళ్లకు సం బంధించిన వాళ్లకు పనులు దక్కాలని ఇలాంటి పని చేస్తున్నారు. 

మొదట్లో తెలంగాణను వ్యతిరేకించి ఇప్పుడు మద్దతిస్తున్నారేం?
మాకంటే ముందు మావోయిస్టు పార్టీ తెలంగాణ ఇవ్వాలని కోరింది. ఇప్పుడు జనశక్తికి జనం లేరు. మావోయిస్టులు బయటికి రాలేరు. అందువల్ల వారికి మద్దతుగా మా పాత్ర పోషించాలని నిర్ణయించుకున్నాం. మొదట్లో కూడా మేం తెలంగాణను వద్దనలేదు.

నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తా---Shashider Reddy


ప్రజా సమస్యల పరిష్కారానికి, నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిర్మాణాత్మక కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నట్లు ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి పేర్కొన్నారు. బన్సీలాల్‌పేట శ్మశానవాటికలో ఆదివారం ఆయన మొక్కలను నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను ఢిల్లీలో ఉన్నా, సనత్‌నగర్‌లో ఉన్నా ప్రజా సమస్యలను విస్మరించ డం లేదన్నారు. రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గం పురోభివృద్ధికి చిత్తశుద్ధితో ముందుకు సాగుతున్నట్లు వివరించారు. ప్రజలు సమస్యలను తమ దృష్టి కి తీసుకువస్తే వాటి పరి ష్కారానికి కృషి చేస్తానన్నా రు. తాను మాటల మనిషిని కాదని, చేతలు చేసి చూ పుతానన్నారు. ఈ కార్యక్రమంలో శశిధర్‌రెడ్డి తనయు డు పురూరవరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పూర్ణానందం, గుంటి సత్యనారాయణ, నరేందర్, స్వామి, శ్రీనివాస్, రామ్మో హన్‌రావు, జయప్రకాశ్, కిరణ్మయి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. 


అభివృద్ధి పనులు
బేగంపేట: బేగంపేట డివిజన్‌లోని పలు అభివృద్ధి కార్యక్రమాలలో శశిధర్‌రెడ్డి పాల్గొన్నారు. బ్రాహ్మణవాడలో 17 లక్షల వ్యయంతో, ఓల్డ్ కస్టమ్స్ బస్తీలో 21.50 లక్షలతో నిర్మిస్తున్న సీవరేజ్ పైప్‌లైన్ పనులకు ఆయన శంకుస్థాపన చేసారు. కార్యక్రమంలో బేగం పేట,సనత్‌నగర్, రాంగోపాల్‌పేట కార్పొరేటర్లు మహేశ్వరి శ్రీహరి, అయూబ్‌ఖాన్, కిరణ్మయి కిశోర్ యూత్‌కాంగ్రెస్ నేతలు పురూరవ రెడ్డి, నరేష్, లలితాచౌహాన్, శ్వేత, నాయకులు సి.సత్యనారాయణ, గిరి, ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు.



శ్మశానవాటికకు స్థలం కేటాయించాలని డిమాం డ్ చేస్తూ సాధన కమిటీ సభ్యులు టీడీపి నేత హనీఫ్ నాయకత్యంలో ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు.



సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి



సనత్‌నగర్: సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని వృద్ధిలోకి రావాలని శశిధర్‌రెడ్డి అన్నారు. సనత్‌నగర్ డివిజన్ అల్లావుద్దీన్ కోఠి, అశోక్‌కాలనీకి చెందిన 101 మంది లబ్ధిదారులకు ఆయన ఆదివారం దీపం పథకం కింద సిలిండర్లను అందజేశారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ అభివృద్ధిని వేగవంతం చేసి ప్రజ లకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌లు ఆయూబ్‌ఖాన్, కిరణ్మ యి, కాంగ్రెస్ నాయకులు లలితాచౌహాన్, ఆయా బస్తీ ల నేతలు అక్బర్, ఇబ్రహీం, అడ్డూ, ప్రమోద్, షాబాద్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. బల్కం పేట్ డివిజన్ బాలయ్యనగర్‌లో 4.4 లక్షల వ్యయంతో నిర్మించతలపెట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఆసిఫ్ అలీ, కుంటా శ్రీహరి, నరేందర్ తదితరులు పాల్గొన్నారు