Tuesday, October 16, 2012

గుండె కిటికీలు

క్తంలో ఏదైనా లోపం ఉందా చూడాలంటే నరం నుంచి కాస్తంత తీయవచ్చు. మరి గుండెలో ఏదైనా లోపం ఉందేమో చూడాలంటే? రొమ్ము దగ్గర కిటికీ ఏర్పాటు చేసినా దాన్ని చూడటం కష్టమే. ఎందుకంటే గుండె అత్యంత
కీలకమైన కార్డియాక్ పరీక్షలు
కీలకం కావడంతో ఎంతో రక్షణాత్మకమైన ఏర్పాట్లతో అనేక సంరక్షణల మధ్య ఉండేలా చూసింది ప్రకృతి. అయినప్పటికీ దాన్ని కిటికీలోంచి చూడటం ఇప్పుడు సాధ్యమే. కాకపోతే ఆ కిటికీ కాస్తా ఓ కంప్యూటర్ స్క్రీన్ రూపాన్ని సంతరించుకొని ఉంటుంది. ఆ కిటికీ స్క్రీన్‌పై చూడదగ్గ కొన్ని పరీక్షలు, వాటి సందర్భాలపై అవగాహన కోసం ఈ కథనం.


కార్డియాక్ ఇమేజింగ్ అన్నది ఇప్పుడు గుండెను పరిశీలించడం కోసం, గుండెకు సంబంధించిన, రక్తప్రసరణ వ్యవస్థకు సంబంధించిన ఏదైనా లోపాలను తెలుసుకోవడం కొత్తగా ఆవిర్భవించిన విభాగం. కార్డియాలజీ అంటే అందరికీ తెలుసు. కానీ... కార్డియాక్ ఇమేజింగ్ అన్నది అందులోని ఒక ఉపవిభాగంగా ఆవిర్భవిస్తున్న సంగతి ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి వెళ్తోంది. గుండెకు, హృద్రోగాలకు సంబంధించిన అనేక సమస్యలను తెలుసుకోవడం కోసం చేసే రకరకాల పరీక్షలను నిపుణులైన కార్డియాలజిస్టులే నిర్వహిస్తారు.



అందులోని కొన్ని కీలకమైన పరీక్షలే... కార్డియాక్ కంప్యూటర్ టోమోగ్రఫీ, కార్డియాక్ మాగ్నెటిక్ రిజోనెన్స్ ఇమేజింగ్, ఎకో కార్డియోగ్రఫీ, న్యూక్లియర్ కార్డియాలజీ... మొదలైనవి. ఇటీవల గుండెను స్పష్టంగా పరిశీలించేందుకు వీలైన అనేక రకాల పరీక్షలు అందుబాటులోకి వస్తున్నాయి. పైగా గుండెను పరిశీలించే క్రమంలో రోగికి ఉండే నొప్పిని అవి గణనీయంగా తగ్గిస్తున్నాయి. కూడా అందుకే వాటి ప్రాధాన్యం, వాటిపై ఆసక్తి మామూలు వ్యక్తుల్లోనూ పెరుగుతోంది. వాటిపై పరిజ్ఞానం పెంచుకోవాలన్న కుతూహలం కూడా కలుగుతోంది.



                                                               న్యూక్లియర్ కార్డియాలజీ...


ఎందుకు చేస్తారు: ప్రస్తుతం కార్డియాలజీ విభాగంలో గుండె కండరాలకు రక్తప్రసరణ ఎలా ఉందో తెలుసుకోవడం (మయోకార్డియల్ బ్లడ్‌ఫ్లో), గుండె కండరాల జీవక్రియల పనితీరు ఎలా ఉందో తెలుసుకోవడం కోసం, గుండె కిందిగదుల పనితీరు తెలుసుకోవడం కోసం ఉపయోగపడుతుంది. దీన్ని గుండెకు రక్తసరఫరా చేసే ధమని అయిన కరొనరీ ఆర్టరీలో అడ్డంకులు ఏవైనా ఉంటే తెలుసుకోవడం కోసం నర్వహిస్తారు. ఇక ఒకసారి గుండెపోటు వచ్చిన వారిలో... వారికి కరొనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్ట్ (సీఏబీజీ) అనేప్రక్రియ నిర్వహించాలా లేక యాంజియోప్లాస్టీ అనే ప్రక్రియ నిర్వహించాలా లేదా కేవలం మందులు వాడటం వల్లనే సమస్యను చక్కదిద్దవచ్చా అనే విషయాలను నిర్ధారణ చేయడానికి ఈ పరీక్ష ఉపయోగపడుతుంది. ఈ విషయాలను తెలుసుకోవడం కోసం ఉపయోగపడుతుంది కాబట్టే ఈ పరీక్షను హృద్రోగ విభాగపు ద్వారపాలిక (‘‘గేట్‌కీపర్’’ ఆఫ్ కార్డియాలజీ)గా వ్యవహరిస్తారు.



ఎలా చేస్తారు: ఇది రెండు రోజుల్లో చేసే ప్రక్రియ. మొదటిరోజు రోగిని వాళ్ల వయసుకు అనుగుణంగా ఎంతసేపు నడిపించాలో అంతసేపు ట్రెడ్‌మిల్‌పై నడిపిస్తారు. అప్పుడు అతడి రక్తప్రసరణ వ్యవస్థలోకి ఒక రేడియోధార్మిక పదార్థాన్ని (ఐసోటోప్)ను ఇంజెక్షన్ ద్వారా పంపుతారు. ఆ తర్వాత అతడిపై కృత్రిమంగా ఒత్తిడి కలిగేలా చేసి బాగా ఒత్తిడిలో ఉన్నప్పుడు రేడియో ఐసోటోప్ ఎలా ప్రసరిస్తుందో చూస్తారు. అలాగే రోగి విశ్రాంతి స్థితిలో ఉన్నప్పుడు సైతం అతడిలోని రేడియో ఐసోటోప్ ఎలా ప్రవహిస్తుందో చూస్తారు. ఆ తర్వాత ఈ రెండు చిత్రాలను తులనాత్మకంగా ఒకదానితో మరొకటి పోల్చి చూస్తారు. ఇలా పోల్చి చూడటం వల్ల ఒత్తిడిలోనూ, మామూలు సమయంలోనూ అతడి గుండె, రక్తప్రసరణ వ్యవస్థ పనితీరులో మార్పులు తెలుస్తాయి. అయితే ఈ పరీక్షలో ఉన్న ఒకే ఒక లోపం ఏమిటంటే... రోగి కొద్దిపాటి రేడియేషన్ ప్రభావానికి రెండు రోజులపాటు గురికావాల్సి ఉంటుంది.

కార్డియాక్ ఎమ్మారై: రోగి గుండె గురించి పూర్తిగానూ, ప్రమాదరహితంగానూ తెలుసుకోవాలన్న కార్డియాలజిస్టుల కలను నెరవేర్చే పరీక్ష కార్డియాక్ ఎమ్మారై. దీన్నే కార్డియోవాస్కులార్ మాగ్నెటిక్ రిసోనెన్స్ ఇమేజింగ్ పరీక్ష అంటారు. ఇది గుండె దాని చుట్టూ ఉండే రక్తప్రసరణ వ్యవస్థ, గుండె రక్తనాళాల గురించి ఎంతో విలువైన సమాచారాన్ని ఇస్తుంది. ఇది గుండె తాలూకు గదుల సమాచారంతో పాటు గుండె కండరాలు ఎక్కడైనా సన్నబడ్డాయా (మయోకార్డియల్ నెక్రోసిస్), పీచులా (ఫైబ్రోసిస్) మారిపోయాయా అన్న విషయాలను సైతం తెలియజేస్తుంది.



పైన కింద ఉండే గదుల పనితీరు, గుండె రక్తనాళాల లోపలి గోడల పనితీరు, గుండె కండరాల పనితీరు సామర్థ్యం (మయోకార్డియల్ వయబిలిటీ) వంటి అనేక అంశాలను తెలుసుకోవచ్చు.



పరిమితులు: ఈ పరీక్షకు ఉపయోగించే యంత్రం చాలా ఖరీదైనది. ఇఇ కేవలం కొన్ని పెద్ద నగరాల్లోని చాలా పెద్ద ఆసుపత్రుల్లో మాత్రమే లభ్యమవుతుంది. పైగా దీన్ని ఉపయోగించగల నైపుణ్యం ఉన్న గుండె నిపుణులు సైతం చాలా తక్కువే.

గుండెకు కిటికీలుగా పరిగణించే ఈ పరీక్షల వల్ల ఇప్పుడు గుండెకు ఎలాంటి కోత లేకుండా, శరీరానికి దాదాపుగా నొప్పి లేకుండా గుండె పనిని, సామర్థ్యాన్ని, తీరుతెన్నులను, లోపాలను తెలుసుకోవం సాధ్యమే. తద్వారా గతంలో ప్రమాదకరంగా ఉన్న ఎన్నో సమస్యలను ఇప్పుడు పరిష్కరించడం సులువయ్యింది.

కార్డియాక్ కంప్యూటెడ్ టోమోగ్రఫీ

కార్డియోవ్యాస్క్యులార్ సీటీ అన్నది ఇటీవలే గత ఐదేళ్లలో అందుబాటులోకి వచ్చిన సరికొత్త ప్రక్రియ. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే కరనరీ ఆర్టరీ డిసీజ్ ఉన్నదా లేదా అని నిర్ధారణ చేసేందుకు నిర్వహించే పరీక్ష ఇది. దీనిలో ఎలాంటి కోతగాని, గాటుగాని లేకుండానే గుండెకు, దానిపైన ఒక కిరీటంలా ఉండే గుండె రక్తనాళాలు (కరొనరీ ఆర్టరీ)తాలూకు చిత్రాలను చాలా స్పష్టంగా చూపించే ప్రక్రియ ఇది. ఈ పరీక్ష ద్వారానే కరోనరీ క్యాల్షియమ్, గుండె కిందిగదుల పనితీరు, గుండె కండరాలు పెళుసుగా (క్యాల్సిఫికేషన్) మారితే... అది ఏ మేరకు జరిగింది అన్న అంశాలను ఈ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. ఇది కేవలం ఐదు నిమిషాల్లోనే పూర్తి చేయగల పరీక్ష.


పరిమితులు: ఈ పరీక్షలో రోగిని ఐయోనైజ్‌డ్ రేడియేషన్‌కు గురిచేయాల్సి ఉంటుంది. అందుకే దీన్ని గర్భిణులకూ, 45 ఏళ్ల కంటే తక్కువ వయసున్న మహిళలకు సాధారణంగా నిర్వహించరు.


ఎకో కార్డియోగ్రఫీ...

మనకు ఒక పరిమితిలో కంపించే ప్రకంపనాల శబ్దాలే వినిపిస్తాయి. ఆ పరిమితికి మించి కంపనాలు ఉన్నా అవి మనకు వినిపించవు. అల్ట్రా సౌండ్ అంటే పరిమితికి మించి ఉన్న కంపనాలే. అయితే అలా కంపించే తరంగాలను గుండె ఉన్న ప్రాంతంలోకి పంపి... వాటి ఆధారంగా గుండె చిత్రాలను కంప్యూటర్ స్క్రీన్‌పై ప్రతిక్షేపించి చూడగలగడమే ఎకో కార్డియోగ్రఫీ. ఇటీవల గుండె స్పందనల్లో ఏదైనా తేడా ఉందేమో కనుగొనడానికి చేసే పరీక్షల్లో సాధారణమైన ఈసీజీ (ఎకో కార్డియోగ్రఫీ) తర్వాత చేసే ప్రధానమైన పరీక్షే ‘ఎకో కార్డియోగ్రఫీ’. దీనిలో గుండె దగ్గర ఎలాంటి కోత పెట్టాల్సిన అవసరం లేదు (అంటే ఇది నాన్‌ఇన్వేజివ్ ప్రక్రియ అన్నమాట). దీనిలో ఎలాంటి రేడియేషన్ ఉపయోగించరు. కాబట్టి ఇది సురక్షితం.


ఎప్పుడు, ఎందుకు చేస్తారు...

- గుండె పనితీరులో ఏదైనా మార్పు వచ్చిందేమో తెలుసుకునేందుకు

- గుండె కవాటాల (వాల్వ్స్) ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు...


పై ఉపయోగాలు ఉన్నందున ఇది ఇప్పుడు గుండెకు సంబంధించిన కీలకమైన మౌలిక (బేసిక్) పరీక్షగా పరిగణిస్తున్నారు.



- డాక్టర్ జాన్‌క్రిస్టోఫర్, కార్డియాలజిస్ట్, హెడ్ ఆఫ్ కార్డియాక్ ఇమేజింగ్ డిపార్ట్‌మెంట్, కేర్ హాస్పిటల్, హైదరాబాద్

No comments: