Tuesday, October 23, 2012

చెప్పటానికేమీ లేదు!

ప్రశ్నలతో విసిగించొద్దని మీడియా ప్రతినిధులపై ఆగ్రహం



న్యూఢిల్లీ, న్యూస్‌లైన్: తెలంగాణ అంశం పరిష్కారం విషయంలో పురోగతి ఏదైనా ఉంటే తప్పక తెలియజేస్తామని.. ఇప్పటికైతే చెప్పటానికేం లేదని కేంద్ర ప్రవాస భారతీయ వ్యవహారాల మంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ప్రత్యేక పరిశీలకుడు వయలార్ రవి పేర్కొన్నారు. ఈ సమస్యపై పదేపదే తన వెంటపడి విసిగించవద్దని మీడియా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఢిల్లీలో మంగళవారం ఓ కార్యక్రమంలో పాల్గొంటున్న వయలార్ వద్దకు తెలుగు టీవీ చానళ్ల ప్రతినిధులు వెళ్లి తెలంగాణపై ప్రశ్నలు గుప్పించారు.




 తొలుత ప్రశాంతంగానే జవాబిచ్చిన ఆయన తర్వాత రుసరుసలాడారు. తెలంగాణ సమస్యను కేంద్ర ప్రభుత్వమే పరిష్కరించాలని, అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తే అందులో తమ నిర్ణయాన్ని స్పష్టంగా చెబుతామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రతినిధులు వయలార్ వద్ద ప్రస్తావించగా.. ‘‘నేను కేంద్ర ప్రభుత్వాన్ని కాదు. అందులో మంత్రిని మాత్రమే.. చంద్రబాబు ఏమన్నా అంటే దానిపై నేనెందుకు మాట్లాడాలి? కేసీఆర్ ఏదైనా మాట్లాడితే దానిపై నేను వ్యాఖ్యానించలేను’’ అని ఆయన స్పందించారు. తెలంగాణకు చెందిన రాష్ట్ర మంత్రులు మీతో సహా కాంగ్రెస్ ముఖ్యుల్ని కలిశాక తెలంగాణ వస్తుందన్న తరహాలో మాట్లాడుతున్నారని పేర్కొనగా.. వారు తనను కలిశారని, అన్ని విషయాలూ వివరించారని, అయితే వారు మాట్లాడినదానిపై మాత్రం తాను స్పందించనని వయలార్ స్పష్టంచేశారు.



ఫలితం అడగటానికి మీరెవరు?



తెలంగాణపై చర్చల్లో ఫలితం ఎప్పటికి వస్తుందని విలేకరులు అడిగినపుడు ‘‘ఫలితం సాధించాలని నన్ను అడగటానికి మీరెవరు?’’ అంటూ వయలార్ మండిపడ్డారు. ప్రెస్ తరఫున అడుగుతున్నామని మీడియా ప్రతినిధులు అనగా.. ‘‘మీరు పాత్రికేయులు... మీరు నన్ను అడగవచ్చు. అంతేకానీ, చిరాకుపెట్టకూడదు’’ అని క్లాస్ తీసుకున్నారు. తెలంగాణ సమస్యపై ఏదైనా కదలిక ఉందా..? కాంగ్రెస్ వైఖరి ఏమిటని అడగగా.. కదలిక ఉందా లేదా అనేదానిపై తానేం చెప్పలేనని, కాంగ్రెస్ వైఖరి అనుకూలమా, ప్రతికూలమా అన్నది తానెలా చెప్పగలనని ఆయన ఎదురు ప్రశ్నించారు. కేసీఆర్‌తో చర్చల్లో మళ్లీ ఏమైనా పురోగతి ఉందా అని అడగగా.. తెలంగాణపై చర్చల్లో తాను లేనని ఆయన బదులిచ్చారు. తెలంగాణపై కదలికకు సంబంధించిన ప్రశ్నను రెట్టించేసరికి, ‘‘నాకు తెలియదు... నాకు తెలీదు... తెలంగాణ వస్తుందన్న సంగతి నేను చెప్పాలని ఈయన (ఓ ప్రతినిధివైపు చూస్తూ) కోరుకుంటున్నారు.. అది చెప్తాను. వెళ్లి ప్రకటించుకోండి.. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి’’ అని ఆయన మండిపడ్డారు. మిమ్మల్ని పట్టించుకునేదెవరంటూ విలేకరులతో వ్యాఖ్యానించిన వయలార్.. ఆ వెంటనే కొంత శాంతించారు. ‘‘దయచేసి ఇబ్బంది పెట్టకండి... నేను మీతో చాలా మృదువుగా వ్యవహరించగలను... కరకుగానూ ఉండగలను... మీరు అదే పట్టుకుని రెట్టించి అడిగితే ఎలా?’’ అని పేర్కొన్నారు.



కాంగ్రెస్ ప్రతినిధిని అడగండి...



తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ తరఫున మీరేం చెప్తారని ప్రశ్నించగా.. తానేం స్పందించనని వయలార్ కరాఖండిగా చెప్పారు. ‘‘చూడండి... నేను కాంగ్రెస్ నాయకుడినే కానీ.. ఏఐసీసీ అధికార ప్రతినిధిని కాదు. ఈ విషయంలో మీకేమన్నా కావాలంటే అధికార ప్రతినిధిని అడగండి...’’ అని సూచించారు. కాంగ్రెస్ కోర్ కమిటీ, వార్ రూం సమావేశాల విషయమై ప్రశ్నలకు ఆయన బదులిస్తూ, కాంగ్రెస్ ముఖ్యనేతలు తరచూ సమావేశమవుతుంటారని, కోర్ కమిటీ, వార్‌రూం సమావేశాల్లో చర్చించిన అంశాలను మీడియాకు చెప్పలేం కదా అంటూ వివరాల వెల్లడికి నిరాకరించారు.

No comments: