Wednesday, October 17, 2012

సర్వేంద్రియానాం... నయనం ప్రదానం

సాధారణంగా కంటికి సంబంధించి మూడు రకాల సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అవి... మయోపియా (దగ్గరి దృష్టి... దగ్గరి వస్తువులు కనిపిస్తూ దూరంగా ఉన్నవి కనిపించకపోవడం), హైపరోపియా (దూరదృష్టి... దూరంగా ఉన్నవే కనిపిస్తూ దగ్గరగా ఉన్నవి కనిపించకపోవడం), ఆస్టిగ్మాటిజమ్ (ఉదాహరణకు గ్రాఫ్‌లోని రెండు రకాల గీతల్లో ఒకటి మాత్రమే స్పష్టంగా కనిపించే సమస్య). ఈ మూడింటినీ రిఫ్రాక్టివ్ సమస్యలు లేదా దృష్టిలోపాలుగా చెబుతారు. మన సమాజంలో ఈ మూడు సమస్యల వల్లనే 20 శాతం మందిలో దృష్టిలోపాలు వస్తుంటాయి. ఇవి చిన్న వయసులోనే వస్తుంటాయి కాబట్టి పిల్లలు స్కూలుకు వెళ్లే ముందర (ప్రీ-స్కూల్), స్కూల్‌కు వెళ్తున్నప్పుడు (స్కూలింగ్ సమయంలో), కాలేజ్‌కు వెళ్తున్నప్పుడు తగిన పరీక్షలు చేయించి అవసరమైన కంటి అద్దాలు వాడటం వల్ల వాళ్లలో రిఫ్రాక్టివ్ సమస్యలు, లేజీ ఐ, మెల్లకన్ను లేకుండా చూడవచ్చు.



ఈ శుక్లం (క్యాటరాక్ట్) :

కొంత వయసు వచ్చాక చాలామందిలో కనిపించే ఈ సమస్యతో క్రమంగా కంటిచూపు మందగిస్తుంది. చికిత్స చేయడంలో ఆలస్యం జరిగితే అది గ్లకోమాకు దారితీయవచ్చు. ఇదే జరిగితే చూపు శాశ్వతంగా పోయే ప్రమాదమూ ఉంది. కాబట్టి క్యాటరాక్ట్ ఉన్నప్పటికీ దాన్ని నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా డాక్టర్‌కు చూపించుకుంటూ అవసరమైనప్పుడు తప్పనిసరిగా శస్త్రచికిత్స చేయించుకోవాలి. క్యాటరాక్ట్ సమస్య మందులతో తగ్గదు. దళసరిగా మారిన కంటిలోని లెన్స్‌ను తొలగించి ఆ స్థానంలో కృత్రిమంగా కొత్త లెన్స్‌ను అమర్చడమే దీనికి చికిత్స. ఇది చాలా సాధారణమైన అతి చిన్న శస్త్రచికిత్స. దీన్ని పూర్తి చేయడానికి కేవలం 10-20 నిమిషాలు చాలు. ఇప్పుడు మరింత ఆధునికమైన చికిత్స ప్రక్రియలు అందుబాటులోకి వచ్చినందువల్ల క్యాటరాక్ట్ ముదిరేవరకు ఆగాల్సిన అవసరం లేదు.





ఈ నీటికాసులు (గ్లకోమా) :

సాధారణంగా 40 ఏళ్ల వయసు దాటిన వారిలో కనిపించే కంటి సమస్యల్లో క్యాటరాక్ట్ తర్వాత ఇది రెండో ముఖ్యమైన వ్యాధి. ఇందులో రెండు రకాలు ఉన్నాయి. మొదటిది క్లోజ్‌డ్ యాంగిల్ గ్లకోమా; రెండోది ఓపెన్ యాంగిల్ గ్లకోమా. ఓపెన్ యాంగిల్ గ్లకోమాలో నొప్పి లేకుండా క్రమంగా చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. క్లోజ్‌డ్ యాంగిల్ గ్లకోమాలో కన్ను కొంతమేర ఎర్రబారడం, కాస్తంత నొప్పి రావడం జరుగుతుంది. అకస్మాత్తుగా చూపు పోయే అవకాశం ఉంది. ఇందులో కంటి చూపు పరిధి (ఫీల్డ్ ఆఫ్ విజన్)ని క్రమంగా కోల్పోతుంది. (ఫీల్డ్ అంటే... మనం కేవలం ముందుకు మాత్రమే గాకుండా పక్కవైపులకు కూడా చూడగలుగుతాం). అలా పక్కలకు చూసే శక్తి క్రమంగా క్షీణిస్తూ చూపు పూర్తిగా పోతుంది. ఒకసారి గ్లకోమా వల్ల కోల్పోయిన చూపును పునరుద్ధరించడం సాధ్యం కాదు. కాబట్టి దీన్ని సాధ్యమైనంత త్వరగా గుర్తించి తగిన చికిత్స చేయించుకోవాలి. అయితే ఒకసారి గుర్తించి, చికిత్స చేస్తే అప్పటికి కోల్పోయిన చూపు మినహా మిగతాది పదిలంగా ఉంటుంది. దీన్ని ఐఓపీ రికార్డింగ్, ఫండస్, ఫీల్డ్, గోనియోస్కోపీ పరీక్షల ద్వారా గుర్తించవచ్చు. గ్లకోమా విషయంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి పరీక్ష చేశాక గ్లకోమా లేదని తెలిస్తే... గ్లకోమా అప్పటికి లేదని అర్థం. అంతేగాని... ఎప్పటికీ రాదని కాదు. అందుకే... గ్లకోమా తాలూకు తీవ్రతను మనసులో ఉంచుకుని ఒక వయసు దాటాక తరచూ క్రమం తప్పకుండా కళ్లు పరీక్ష చేయించుకుంటూ ఉండటం మంచిది. గ్లకోమా ఎవరిలో వస్తుందంటే... కుటుంబ చరిత్రలో గ్లకోమా ఉన్నవారికి, డయాబెటిస్ రోగులకు, రక్తపోటు ఉన్నవారికి, స్టెరాయిడ్స్ తీసుకునేవారికి, వయసు మళ్లిన వారికి. గ్లకోమాకు ఆయా దశలను బట్టి మందులతో, లేజర్ ద్వారా, శస్త్రచికిత్స ద్వారా చికిత్స చేస్తారు.



ఈ రెటీనా సంబంధమైన సమస్యలు :

ఈ కేటగిరీ కిందకు ప్రధానంగా డయాబెటిక్ రెటినోపతి, హైపర్‌టెన్సివ్ రెటినోపతి, మాక్యులార్ డీజనరేషన్ వంటి వ్యాధులు వస్తాయి. డయాబెటిక్ రెటినోపతి వచ్చిన రోగులు తమ చక్కెర పాళ్లను, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవడం అవసరం. సరైన సమయంలో వ్యాధిని గుర్తించి లేజర్‌ఫోటోకోయాగులేషన్ వంటి చికిత్సలతో రాబోయే అంధత్వాన్ని 90 శాతం వరకు నివారించుకోవచ్చు. వయసుతో పాటు వచ్చే సమస్యలైన మాక్యులార్ డీజనరేషన్ వంటివి 60 ఏళ్లు దాటాక చాలా సాధారణంగా కనిపిస్తాయి. వీఈజీఎఫ్ అనే ఇంజెక్షన్ ద్వారానూ, లేజర్ వంటి చికిత్స ప్రక్రియల ద్వారానూ ఇలాంటి కంటి సమస్యలను చాలావరకు పరిష్కరించవచ్చు. తద్వారా అంధత్వాన్ని నివారించవచ్చు.



ఈ కార్నియల్ బ్లైండ్‌నెస్ :

ఈ తరహా అంధత్వం సాధారణంగా చిన్నపిల్లల్లో, యువతలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. విటమిన్-ఏ లోపం, పోషకాహార లోపాల వల్ల ఇది వస్తుంటుంది. అందుకే సాధారణంగా మనం తీసుకునే ఆహారంలో విటమిన్-ఏ ఎక్కువగా ఉండే తాజాపండ్లు, ఆకుపచ్చని కూరగాయలు తీసుకుంటే ఈ తరహా అంధత్వాన్ని నివారించవచ్చు.



ప్రమాదాల వల్ల వచ్చే కార్నియల్ బ్లైండ్‌నెస్ : కొన్ని సందర్భాల్లో వ్యవసాయ క్షేత్రాల్లో, వడ్రంగంలో చెక్కతో పనులు చేసే సమయంలో, రాళ్లు కొట్టే సమయంలో, రసాయన పరిశ్రమల్లో, డ్రైవింగ్ చేసే సమయంలో, సరైన అద్దాలు ఉపయోగించకుండా పనిచేస్తున్నప్పుడు కంటికి లేదా కంటిలోని నల్లగుడ్డుకు గాయాలు కావచ్చు. అందుకే వీటిని నివారించేందుకు కంటి అద్దాలు ఉపయోగించడం, హెల్మెట్ వాడటం వంటి జాగ్రత్తలు పాటించాలి.

No comments: