Sunday, October 21, 2012

నత్తి ఉన్నా.. అనర్గళంగా...


నత్తి సమస్య ఉన్నవారు కూడా అనర్గళంగా మాట్లాడేందుకు ఉపయోగపడే ఓ వినూత్న పరికరాన్ని యూనివర్సిటీ ఆఫ్ మిసిసిపీ పరిశోధకులు కనుగొన్నారు. వర్సిటీకి చెందిన కమ్యూనికేషన్ సెన్సైస్, డిజార్డర్స్ విభాగం ప్రొఫెసర్ గ్రెగ్ స్నైడర్ తనకు నత్తి ఉన్నా, గొంతు నుంచి మాటలు వెలువడడాన్ని అనుభూతి చెందుతూ తడబడకుండా మాట్లాడటం నేర్చుకున్నారు. 

తాను అనుసరించిన విధానం ఆధారంగానే సెల్‌ఫోన్ అంత సైజులో ఉండే ఈ పరికరాన్ని తయారుచేసినట్లు ఆయన వెల్లడించారు. బ్యాటరీతో పనిచేసే ఈ పరికరాన్ని ఎక్కడైనా, ఎప్పుడైనా వాడేందుకు వీలుందన్నారు. నత్తిని పోగొట్టేందుకు చేసే ఇతర చికిత్సల కన్నా దీనిని వాడటం సులభమన్నారు. మాట్లాడేటప్పుడు గొంతులో కలిగే ప్రకంపనలను అనుభూతి చెందుతూ, స్పర్శసంబంధమైన ఫీడ్‌బ్యాక్‌ను పొందానని, తద్వారా నత్తిని చాలావరకూ జయించానని తెలిపారు. ఈ పరికరం సహాయంతో నత్తి ఉండేవారు కూడా తాము మాట్లాడేటప్పుడు గొంతులో కలిగే ప్రకంపనలను అనుభూతి చెందుతారని, తద్వారా వారి మాటల్లో తడబాటు తగ్గుతుందన్నారు. ఈ పరికరం నత్తిని నివారించకపోయినా, దాని తీవ్రతను మాత్రం తగ్గిస్తుందన్నారు.

No comments: