Thursday, November 1, 2012

ఇంగ్లిష్.. వింగ్లిష్..!

- ఆత్మన్యూనతాభావంలో తెలుగు మీడియం విద్యార్థులు

- నగర వాతావరణంలో ఇమడలేక సతమతం

- చదువు వదిలేసి ఇంటికొచ్చేస్తామంటూ ఆవేదన

- ఇంటర్‌లో ఇంగ్లిష్‌ను నిర్లక్ష్యం చేస్తున్న విద్యాసంస్థలు

- భవిష్యత్తు సవాళ్లపై మార్గదర్శనం శూన్యం

- దీంతో ఇంజనీరింగ్‌లో విద్యార్థుల ఇబ్బందులు


 ఇంటర్మీడియెట్‌లో 94 శాతం మార్కులు తెచ్చుకుంది కావ్య. ఎంసెట్‌లో 40 వేల ర్యాంకు సాధించింది. కరీంనగర్ జిల్లాలోని ఓ చిన్న మున్సిపాలిటీలో చదివిన ఆ అమ్మాయి పెద్ద చదువులపై ఆశతో హైదరాబాద్‌లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో చేరింది. కళాశాల బాగుంది. వాతావరణమూ నచ్చింది. కళాశాల హాస్టల్లోనే ఉంటోంది. కానీ కాలేజీ ప్రారంభమై పట్టుమని పదిరోజులు కాలేదు. అప్పుడే ‘‘ఇంటికొచ్చేస్తానమ్మా.. ఈ ఇంజనీరింగ్ నాకు వద్దే వద్దు..’’ అంటూ కన్నీళ్లు పెడుతోంది! కారణం ఇంగ్లిష్!! ‘ఇక్కడ అందరూ ఇంగ్లిష్‌లో మాట్లాడుతున్నారమ్మా..’ అన్నది ఆ విద్యార్థి మనోవేదన. నగరానికి వచ్చి 10 రోజులు గడవకముందే ఆ అమ్మాయిని ఇంగ్లిష్ న్యూనతాభావానికి లోను చేసింది.

అప్పటిదాకా తెలుగులోనే చదివిన ఆమె.. ఇంజనీరింగ్‌లో ఒక్కసారిగా పాఠాలన్నీ ఇంగ్లిష్‌లో బోధించేసరికి బెంబేలెత్తిపోయింది. ఇది ఒక్క కావ్య సమస్య కాదు. వందలాది మంది విద్యార్థుల మానసిక వేదన. ‘వర్తమానకాలంలో పాఠ్యంశాల్లో ముందుండడమే కాదు. ఇంగ్లిష్ స్కిల్స్ కూడా ముఖ్యం’ అనే వ్యాఖ్యానాలు తెలుగు మీడియం నుంచి వచ్చిన విద్యార్థులపై పరోక్ష ఒత్తిడికి కారణమవుతున్నాయి. ఒకరకంగా ఇది వాస్తవమే అయినా.. ఇంగిష్‌లో నైపుణ్యం సాధించకపోవడంలో విద్యార్థుల తప్పేమీ లేదు. టెన్త్ తర్వాత ఇంటర్ లో కేవలం మార్కుల ధ్యాసే తప్ప.. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను అధిగమించే విషయంలో విద్యార్థులకు విద్యాసంస్థలు మార్గదర్శనం చేయకపోవడమే ఈ సమస్యకు కారణం.



సంఖ్య తక్కువేమీ కాదు: రాష్ట్రంలో ఏటా ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరంలో 4.5 లక్షల మంది విద్యార్థులు సైన్స్ గ్రూపులు చదువుతుండగా.. వీరిలో 3 లక్షల మంది విద్యార్థులు తెలుగు మీడియం విద్యార్థులే. గ్రూప్ సబ్జెక్టుల మార్కులకే ఎంసెట్‌లో వెయిటేజీ ఉండడంతో.. కేవలం ఆయా సబ్జెక్టులపైనే జూనియర్ కాలేజీలు దృష్టిపెడుతున్నాయి. చివరికి కార్పొరేట్ కళాశాలలు కూడా ఇదే సూత్రాన్ని ఒంటబట్టించుకున్నాయి. భాషా సబ్జెక్టులను పూర్తిగా విస్మరిస్తూ వస్తున్నాయి. దీంతో విద్యార్థులకు జూనియర్ కాలేజీ స్థాయిలో ఇంగ్లిష్‌పై పట్టు పెంచుకోవడానికి వీలు చిక్కడం లేదు. అంతో ఇంతో పదో తరగతి వరకు వ్యాకరణం నేర్చుకుని ఉంటే ఇంటర్‌లో అది కూడా మరిచిపోతున్నారు. ‘‘నేను చదివింది కార్పొరేట్ కళాశాలలోనే. కానీ అక్కడ ఇంగ్లిష్ సబ్జెక్టు సిలబస్ పూర్తి చేయడానికి పట్టుమని 20 రోజులు కూడా తీసుకోవడం లేదు..’’ అని వి.అనూష అనే ఇంజనీరింగ్ విద్యార్థిని వెల్లడించింది.

పట్టణ వాతావరణంలో ఉండే విద్యార్థులు ఈ ఇబ్బందిని ఒకింత తేలిగ్గా ఎదుర్కొంటున్నా.. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇంటికి వెళ్లి మరో కోర్సు చేరాలంటే నాలుగేళ్ల ఫీజు చెల్లించి సర్టిఫికెట్లు తీసుకోవాలని కాలేజీలు చెబుతున్నాయి. దీంతో విద్యార్థులు మరింత ఆత్మన్యూనతాభావానికి లోనవుతున్నారు. ఇలాంటి సమయంలో కళాశాలల యాజమాన్యాలు, అధ్యాపకులు విద్యార్థులకు.. ముఖ్యంగా తెలుగు మీడియంలో చదివిన వారికి ఇంగ్లిష్‌పై భయాలు, అపోహలు తొలగించి, వారికి మనోధైర్యాన్ని కల్పించాల్సిన అవసరం ఉంది. వీలైతే మానసిక, మనస్తత్వ శాస్త్ర నిపుణులతో విద్యార్థులకు గెడైన్స్ ఇప్పించాలి.

‘‘మూడో విడత కౌన్సెలింగ్ ఉంటుందా? ఉంటే ఎప్పుడు ఉంటుంది? మా పాపను మా ఊరికి దగ్గర్లో ఉన్న కళాశాలకు మార్చుకోవాలనుకుంటున్నా- ఓ విద్యార్థిని తల్లి.  ఇంజనీరింగ్ మూడోవిడత కౌన్సెలింగ్‌పై ఒకట్రెండు రోజుల్లో ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ మూడో విడత కౌన్సెలింగ్ ఉన్నా, లేకున్నా.. ఆలోపు విద్యార్థుల్లో మాత్రం ఇంగ్లిష్ భయాన్ని తొలిగించాల్సిన బాధ్యత కళాశాలల యాజమాన్యాలపై ఉంది. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల మానసిక స్థితిని అంచనావేసి వారికి ధైర్యం చెప్పాలి.



ఫస్ట్, థర్డ్ ఇయర్‌లో సహజమే..

డాక్టర్ ఎన్.వి.రమణారావు, జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్

‘‘ఇంజనీరింగ్ విద్యార్థులకు తొలుత ప్రథమ సంవత్సరంలో, మూడో సంవత్సరంలో ఇంగ్లిష్ భయం పట్టుకుంటుంది. ఇది సహజం. అయితే విద్యార్థులు పాఠ్యప్రణాళికలో భాగంగా ఉన్న ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ల్యాబ్‌ను ఎక్కువగా ఉపయోగించుకోవాలి. విభిన్న పుస్తకాలు, పత్రికలు చదవాలి. యాజమాన్యాలు వీటిని అందుబాటులో ఉంచాలి. ఇంగ్లిష్‌లో రాయడం, చదవడం అలవరుచు కోవాలి. మెజారిటీ విద్యార్థులు తెలుగు మీడియం నుంచి వచ్చిన వారేనని గమనించాలి. అప్పటికప్పుడే నేర్చేసుకోవాలని భయపెట్టడం కంటే.. నాలుగేళ్లపాటు కొద్దికొద్దిగా ఇంప్రూవ్ చేసుకుంటారన్న ధైర్యాన్ని కళాశాలలు ఇవ్వగలగాలి’’

1 comment:

www.apuroopam.blogspot.com said...

చాలా ముఖ్యమైన విషయాన్నిగురించి వ్రాసేరు.ఇంటరు కాలేజీలు పిల్లల తల్లిదండ్రులు ఈ విషయంలో తగిన శ్రధ్ధ వహిస్తే సమస్యను అధిగమించవచ్చును.