Saturday, October 27, 2012

అక్కడ పుట్టబోతున్న మనవడు, ఇక్కడ వీసా కష్టాలు!

అసలు కంటె వడ్డీ ముద్దు. ఏళ్ల తరబడి పిల్లలు అమెరికాలో, తాము ఇక్కడ ఉండగలిగిన తల్లిదండ్రులు తమకు మనవడో, మనవరాలో పుట్టబోతున్నట్టు తెలసినప్పుడు మాత్రం రెక్కలు కట్టుకుని అమెరికాలో వాలిపోవాలని తహతహలాడతారు. తన కూతురికి, లేదా కోడలికి నెలలు నిండేటప్పుడు దగ్గర ఉండి ఆమె బాగోగులు చూసుకోవాలని ఏ తల్లి అయినా, అత్తగారయినా ఆశపడతారు.

పుత్రోదయాన్ని పొందబోతున్న పడతికి అమ్మ, అత్త దగ్గరుండి సేవలు చెయ్యడం మన సంప్రదాయంలో ఒక విడదీయరాని ముఖ్యభాగం. మనవడు, లేదా మనవరాలి రాక కోసం కళ్లు కాయలు చేసుకుని ఎదురు చూస్తూ కూతురికి లేదా కోడలికి సపర్యలు చేసే అమ్మ, అత్తల సేవలు ప్రపంచంలోని ఏ కరెన్సీతోను అన్నిటికంటె విలువైన, డాలర్లతోను కొనలేనివి, వెల కట్టలేనివి. అంతేకాదు. తమ వృద్ధాప్యాన్ని కూడా ఖాతరు చెయ్యకుండా కాన్పుకి ముందు, కాన్పు తర్వాత తమ కుమార్తెకి తమ కోడలకి అమ్మ, లేదా అత్త అందించే ప్రేమ పూరితమైన సేవలు ప్రతి దానినీ పౌండ్లు, డాలర్లతో వెలకట్టే సమాజాలలో దొరకనివి కూడా.

ఇక్కడ మిగిలినపోయిన అమ్మ, అత్తలకి అక్కడ అమెరికాలో కూతురు, కోడలు కడుపులో కదిలిన పేగుకి మధ్య రుణానుబంధం ఇంతగా విడదీయరానిదీ, ఇంతగా అనూచానమైనదీ అయివుండగా కూతురి లేదా కోడలి కాన్పు కోసం, మనవడు లేదా మనవరాలిని ఎత్తుకోవడానికి వెళ్లేందుకు యు.ఎస్.కాన్సులేట్‌లో తమకి వీసా రాకపోవడం ఏ గ్రాండ్ పేరెంట్స్‌కైనా సరే అశనిపాతమే అవుతుంది.

ఇలా అమెరికాలో తమ ప్రాణానికి ప్రాణం లాంటి కూతురు లేదా కోడలు డెలివరీకి వీసా రెఫ్యూజ్ అయి వెళ్లలేకపోయిన అనేకమంది తల్లిదండ్రుల, అత్తమామల ఆక్రోశాన్ని యు.ఎస్.కాన్సులేట్‌లో పనిచేసిన పాతికేళ్లలో నేను అనేక పర్యాయాలు విన్నాను. అయితే ఇది నాణానికి ఒక పక్క మాత్రమే. నాణానికి రెండవవైపున మనకి భిన్నమైన అమెరికన్ సంస్కృతి, దాని ప్రాతిపదికపైన రూపొందిన వీసా నిబంధనలు ఉన్నాయి.

ఇక్కడ ముందుగా మీకు నేను చెప్పదలుచుకున్న అంశం అమెరికాలో తమ కూతురు డెలివరీకి వెళ్లానుకునే పేరెంట్స్ వీసాకి అనర్హులు అని తేల్చి చెప్పే నిబంధన ఎక్కడా లేదు.


అలాగే డెలివరీకి వెళుతున్నామని చెప్పిన వారికి కూడా కాన్సులేట్ ఆఫీసర్లు వీసాలు ఇచ్చిన సందర్భాలు లేకపోలేదు. కనుక వీసా ఇంటర్వ్యూలో మీరు మీ అమ్మాయి డెలివరీకి వెళుతున్నామని చెబితే ‘మీకు రూఢిగా వీసా రాదు’ అని ఎవరైనా చెబితే అది నిజం కాదని అర్థం చేసుకోండి. అయితే కూతురు/ కోడలు డెలివరీకి వెళ్లాలనుకునే పేరెంట్స్‌కి వీసా వచ్చే అవకాశాలు కూడా తక్కువగానే ఉంటాయన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. ఈ నిజాన్ని జీర్ణించుకోవాలంటే అమెరికన్ సంస్కృతి, సమాజాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.

అమెరికాలో ‘కుటుంబం’ చాలా చిన్నది. తను, తన జీవిత భాగస్వామి, మైనారిటీ తీరని తన పిల్లలు అంతే. తల్లిదండ్రులు, అత్తమామలు, ఆ మాటకొస్తే మైనారిటీ తీరిన పిల్లలు లెక్కప్రకారం అమెరికన్ కుటుంబాలలో సభ్యులు కాదు. అందువల్ల మన సమిష్టి కుటుంబ సంప్రదాయాలు, కాన్పు సమయంలో దగ్గర ఉండడం అనే మన ప్రేమ పూరితమైన బాధ్యతలు, సెంటిమెంట్లు లాంటివి అమెరికన్ చట్టాల రూపకల్పనని, నిబంధనల నిర్మాణాన్ని ప్రభావితం చేయలేకపోయాయి.

No comments: