Saturday, October 6, 2012

మాటమార్చిన మన్మోహన్ సింగ్!

ఎప్పటికెయ్యది ప్రస్తుత మప్పటికా మాటలా’డడం రాజకీయాల్లో మామూలే! అయితే, ఆ మాటల మధ్య పూడ్చలేనంత అగాధం ఉన్నప్పుడు లోకం వేలెత్తి చూపిస్తుంది. చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించే విషయంలో మన్మోహన్ సింగ్ అలా మాటమార్చి దొరికిపోయారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉండగా ఒకసారి, యూపీయే-1 ప్రభుత్వానికి ప్రధానమంత్రిగా ఎన్నికయిన తర్వాత మరోసారి మన్మోహన్ సింగ్ ఒకమాట చెప్పారు. ఇప్పుడా మాటకు పూర్తి విరుద్ధమయిన ‘విధాన నిర్ణయం’ చేశారు. చిల్లర వర్తకం రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవేశానికి తాను వ్యతిరేకినని మన్మోహన్ సింగ్ అప్పట్లో చెప్పినట్లు సాక్ష్యాధారాలతో సహా బయటపడింది. ఈ ఆధారాలను బయటపెట్టిందెవరో కాదు- నిన్నటి దాకా కేంద్రంలోని యూపీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్సే! మమతా బనర్జీ తన ఫేస్ బుక్ అకౌంట్‌లో ఇందుకు సంబంధించిన ఆధారాలను అందుబాటులో ఉంచారు. ఆసక్తి ఉన్నవారు చూసుకోవచ్చు.

 

2002 డిసెంబర్ ఆరోతేదీన మహారాష్ట్ర వర్తక సంఘాల సమాఖ్య (ఎఫ్‌ఏఎం) ప్రతినిధి బృందం -ఆనాటి రాజ్యసభ ప్రతిపక్ష నేతగా ఉన్న- మన్మోహన్ సింగ్‌ను కలిసిందట. అప్పట్లో కేంద్రంలో రాజ్యమేలుతున్న ఎన్డీయే ప్రభుత్వం చిల్లర వర్తకం రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించే ప్రతిపాదన తెచ్చే అవకాశముందేమో కనుక్కోవడం ఎఫ్‌ఏఎం లక్ష్యం. ఈ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించే ప్రసక్తే లేదని అప్పట్లో మన్మోహన్ సింగ్ కుండబద్దలు కొట్టినట్లు స్పష్టంగా చెప్పారట. ‘ఈ విషయంపై రెండు రోజుల కిందట రాజ్యసభలో చర్చకు వచ్చింది. చిల్లర వర్తకం రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించే ప్రతిపాదన ఏమీలేదని ఆర్థిక మంత్రి సభలో ప్రకటించార’ని 2002 డిసెంబర్ 22న మన్మోహన్ సింగ్ ఎఫ్‌ఏఎంకు రాసిన ఓ లేఖలో పేర్కొన్నారట. రెండేళ్ల తర్వాత, 2004 డిసెంబర్ 20న ఎఫ్‌ఏఎం విదేశ వాణిజ్య మండలి అధ్యక్షుడు చంద్రకాంత్ షాంఘ్వీ -అప్పటికి ప్రధానిగా ఉన్న- మన్మోహన్ సంగ్‌కు మరో లేఖ రాస్తూ, కొన్ని విషయాలు గుర్తు చేశారు. చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించాల్సిన అవసరంలేదని తమతో ప్రధాని అన్న విషయాన్ని షాంఘ్వీ గుర్తు చేశారు. ‘ఉద్యోగ కల్పనను ప్రోత్సహించడానికి బదులు ఉన్న ఉద్యోగాలను ఊడబీకే ఆర్థిక సంస్కరణలు మనకు అవసరం లే’దని మన్మోహన్ అన్నట్లు షాంఘ్వీ స్పష్టం చేశారు.

అంటే, అటు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడూ, ఆ తర్వాత ప్రధానిగా ఉన్నకాలంలో సైతం మన్మోహన్ సింగ్ చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించడాన్ని వ్యతిరేకించినట్లు దీనివల్ల తేలుతోంది. అలాంటి వ్యక్తి ఇప్పుడు ప్రాణాలకు తెగించయినా సరే చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించేలా చేస్తానని పట్టుబట్టడం ఏ రకంగా సమర్థనీయం? ఇదీ మమతాదీ సూటిప్రశ్న. కార్యశూరులు ఇలాంటి సూటిప్రశ్నలను పట్టించుకోరు! తమ బుద్ధికి తోచింది చేసుకుపోతారంతే! మన్మోహన్ సింగ్ అక్షరాలా కార్యశూరులే అనిపిస్తోంది. అందుకే, ఇంతవరకూ ఆయన తన వాదన వినిపించే శ్రమ తీసుకోలేదు.

No comments: