Sunday, October 21, 2012

దిగివస్తున్న బంగారం ధరలు


అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర నెల రోజుల కనిష్ఠ స్థాయికి దిగి వచ్చింది. అమెరికా, యూరోప్‌ మార్కెట్ల నుంచి వస్తున్న సానుకూల వార్తల కారణంగా డాలర్‌ బలపడింది. ఈ కారణంగా బంగారం ధర తగ్గింది. ఈనెల మొదటి వారంలో 1800 డాలర్ల సమీపంలోకి వెళ్లిన ఔన్స్ బంగారం ధర ప్రస్తుతం 1725 డాలర్లకు సమీపంలో ట్రేడవుతోంది. షార్ట్‌ టర్మ్‌ కోసం బంగారంలో పెట్టుబడులు పెట్టిన స్పెక్యులేటర్లు లాభాలు స్వీకరిస్తుండటం కూడా బంగారం ధర తగ్గడానికి ఒక కారణమని అనలిస్టులు విశ్లేషిస్తున్నారు.




1600 డాలర్ల స్థాయి నుంచి వేగంగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర నెల కిందట 11 నెలల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. అంటే 1800 డాలర్ల సమీపానికి వచ్చింది. ఇప్పుడు మళ్లీ 1600 డాలర్ల స్థాయికి వెళ్లేలా ఉందని అనలిస్టులు చెబుతున్నారు. సాధారణంగా దసరా, దీపావళి సమయంలో బంగారం ధర పెరుగుతుంటుంది. ఈసారి మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. మన రూపాయల్లో చూస్తే 10 గ్రాముల ధర దాదాపు 33 వేల రూపాయల దాకా వెళ్లింది. ప్రస్తుతం ఎంసీక్స్ లో 10 గ్రాముల ధర 100 రూపాయల దాకా నష్టపోతూ 31,200లకు సమీపంలో ట్రేడవుతోంది. అదే సమయంలో కేజీ వెండి ధర 100 రూపాయల దాకా పెరుగుతూ 59,900లకు సమీపంలో ట్రేడవుతోంది.

No comments: