Saturday, October 6, 2012

తాజా సర్వేలో వెల్లడి


లండన్: రోజూ పుచ్చకాయను తినే వారు గుండె సంబంధ వ్యాధుల బారి నుంచి తప్పించుకోవచ్చని తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. ఒంట్లో హానికరమైన కొవ్వు పేరుకుపోకుండా పుచ్చకాయ నిరోధిస్తుందని, దాంతో లావు తగ్గొచ్చని సర్వే చెబుతోంది. అమెరికాలోని పర్ద్యూ విశ్వవిద్యాలయం పరిశోధకులు కొన్ని నెలలపాటు ఎలుకలపై జరిపిన పరిశోధన అనంతరం వారు ఈ నిర్ధారణకు వచ్చారని ‘డైలీ మెయిల్’ సంస్థ శుక్రవారం తన కథనంలో వెల్లడించింది. ఎక్కువ కొవ్వు ఉండే ఆహారాన్ని తినే ఎలుకలకు రోజూ పుచ్చకాయ రసాన్ని ఇవ్వడంతో ఎలుకల్లోని తక్కువసాంద్రత ఉండే లైపోప్రోటీన్(ఎల్‌డీఎల్)ల శాతం సగానికి తగ్గిపోయిందని పరిశోధకులు తెలిపారు. మన శరీరంతో ఎల్‌డీఎల్ శాతం ఎక్కువగా ఉన్నపుడే ధమనుల్లో రక్తప్రసరణ ఇబ్బందిగా మారి, అది గుండె పోటుకు దారి తీస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా ఉండడంలో పుచ్చకాయ అద్భుత ఫలితాలను ఇచ్చిందని తెలిపారు. పుచ్చకాయలో ఉండే సిట్రూలిన్ అనే రసాయనం కారణంగానే శరీరానికి ఇంతటి మేలు జరుగుతోందని పరిశోధకులు కనిపెట్టారు. అయితే పుచ్చకాయ తింటే రక్తపోటు అదుపులో ఉంటుందనేది నిర్ధారణ కాలేదని పరిశోధకులు తేల్చేశారు. శరీరానికి దోహదపడే పుచ్చకాయలోని పరమాణువు స్థాయిని తెలుసుకునేందుకు తమ తదుపరి పరిశోధనను మొదలుపెడతామని వారు ప్రకటించారు.

No comments: