Friday, October 26, 2012

అందం పదిలం వ్యాధి మాయం

రొమ్ము క్యాన్సర్ చికిత్స - ఆధునిక ప్రక్రియలు

ఇప్పుడు దాదాపు అన్ని క్యాన్సర్లకూ చికిత్స అందుబాటులో ఉన్నట్లే రొమ్ము క్యాన్సర్‌కూ ఉంది. పైగా మునుపటిలా రొమ్మును తొలగించాల్సిన పనిలేదు. అప్పట్లో రొమ్ము తొలగించాక - క్యాన్సర్ తగ్గినా - స్త్రీలలో తమ పరిపూర్ణతకు ఏదో లోపం వచ్చిన భావన ఉండేది. ఇప్పుడా అవసరమే లేదు. పైగా పురోగతి అక్కడికి మాత్రమే పరిమితం కాలేదు. రొమ్ముక్యాన్సర్ చికిత్ప ప్రక్రియలన్నింటిలో సాధించిన ప్రగతిని తెలుపుతూ మహిళల్లో ఆందోళన తొలగించి, అవగాహన కలిగించడానికే ఈ కథనం...

రొమ్ము క్యాన్సర్ చికిత్సలో ఒకప్పటి వైద్య విధానాలకూ, ఆధునిక వైద్య విధానాలకూ భూమికీ, ఆకాశానికీ మధ్య ఉన్నంత తేడా ఉంది. చికిత్సలోనే కాదు, వ్యాధి నిర్ధారణకూ ఎన్నో అధునాతన యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఎన్నో ఏళ్ల క్రితం ఉన్న సాధారణ ఎనలాగ్ మమ్మోగ్రఫీ స్థానంలోకి ఇప్పుడు డిజిటల్ మమ్మోగ్రఫి వచ్చి చేరింది. ఒకప్పుడు కణితి 7 నుంచి 8 మిల్లీ మీటర్ల పరిమాణంలో ఉంటే తప్ప పరీక్షల్లో కనిపించేది కాదు. గుర్తించే నాటికే కొన్ని సార్లు కేన్సర్ విషమ పరిస్థితికి చేరుకునేది. ఇప్పుడొచ్చిన డిజిటల్ మమ్మోగ్రఫీ ద్వారా దీని వల్ల అతి చిన్నదిగా... అంటే 3 మిల్లీ లీటర్ల పరిమాణంలో ఉన్న కణితిని కూడా గుర్తించడం సాధ్యమవుతోంది. ఇప్పుడు కాంట్రాస్ట్ ఎన్‌హాన్స్‌డ్ మమ్మోగ్రఫీ, డైనమిక్ కాంట్రాస్ట్‌తో ఎంఆర్ మమ్మోగ్రామ్ ఇవన్నీ అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా కణితిని ఎంతో కచ్చితంగా గుర్తించవచ్చు. ఆల్ట్రాసౌండ్ పరీక్షలోనూ, ఎలాస్టోగ్రఫీ చేయడం ద్వారా కణితి తత్వాన్ని కూడా అంచనా వేసే అవకాశం ఉంది.


శస్త్ర చికిత్సతో కొత్త పుంతలు

గతంలో అయితే రొమ్ము క్యాన్సర్ వస్తే రొమ్ము మొత్తం తీసివేస్తారనే భయం, బాధ ఉండేది. అప్పట్లో చాలావరకు పరిస్థితి అలాగే ఉండేది కూడా. అయితే ఇప్పుడొచ్చిన ఈ ఆధునిక విధానాల వల్ల అలా మొత్తం రొమ్మును తీసి వేసే అవసరం తప్పింది. ఈ క్రమంలో రొమ్ములోని ఆ కణితి వరకే తీసివేయడం మొదలయ్యింది. కాకపోతే ఆ రోగిలో ్జక్యాన్సర్ పాకే అవకాశం ఉన్న లింఫ్‌గ్లాండ్స్‌ను కూడా తొలగించి వేయడం జరుగుతుంది. ఇలా సర్జరీల్లో ఎన్నో ఆధునిక రీతులు అందుబాటులోకి వచ్చాయి. ప్రాథమిక దశలో చేసే సర్జరీ అంటే లంపెక్టమీ కూడా రొమ్ము ఆకృతిలో ఏ విధమైన లోపమూ ఏర్పడకుండా మళ్లీ మునుపటి సహజాకృతిలో ఉంచే కొన్ని విధానాలు కూడా అందుబాటులోకి వచ్చాయి.

ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ

ప్లాస్టిక్ సర్జరీ సూత్రాలను, రొమ్మును తిరిగి నిర్మించే రీకన్‌స్ట్రక్టివ్ సర్జరీ సూత్రాలను పాటిస్తూనే, ఆంకాలజీ విధానాల్లో రాజీపడకుండా చేయడం ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ ప్రత్యేకత. ఈ సర్జరీల్లో రొమ్ము చుట్టూ గాటు పడకుండా చేసే వీలుంది. అంటే, నిపుల్ చుట్టూ నల్లటి చార ఉండేచోట, గుండ్రంగా కోత పెట్టి క్యాన్సర్ కణితిని అందులోంచి తీసివేస్తారు. ఆ తరువాత గుండ్రంగా కుట్టివేస్తారు. అందువల్ల అక్కడ గాటు కనపడదు. సర్జరీ తరువాత లోకల్ బ్రెస్ట్ టిష్యూను అంటే కొవ్వును ఆ ఖాళీలోకి చేర్చడం ద్వారా అక్కడ గుంట కూడా పడదు. రొమ్ములో ఎక్కువ కణజాలాన్ని తీసివేసే సందర్భాల్లోనూ భుజం కింది భాగంలో కొన్ని కండరాల్ని రక్తనాళంతో సహా అక్కడికి చేరుస్తారు. అది అంతకు ముందు కొవ్వు తీసివేసిన ఖాళీలోకి పూర్తిగా ఒదిగిపోతుంది. అలాగే ఇటీవల స్టెమ్‌సెల్స్‌ను తీసుకుని ఈ ఖాళీని పూర్తించే విధానాలు కూడా వచ్చాయి. కాకపోతే ఈ విధానం ఇంకా కొన్ని కేంద్రాల్లోనే అందుబాటులో ఉంది.

ఇలాంటి అనేక విధానాల ద్వారా రొమ్ము పరిమాణంలోగానీ, ఆకృతిలో గానీ, ఏ మాత్రం మార్పు రాకుండా సర్జరీ సాధ్యమవుతుంది. ఇదే సమయంలో రొమ్మును బిగుతుగా మార్చే ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయంచుకోవచ్చు. అంకాలజిస్టులు, ప్లాస్టిక్ సర్జన్‌లు, సంయుక్తంగా చేసే ఈ శస్త్ర చికిత్స ద్వారా క్యాన్సర్ చికిత్సతోపాటు సహజమైన సౌందర్యాన్ని కాపాడుకునే వీలుంది.

హార్మోన్ థెరపీ

రొమ్ము క్యాన్సర్ కణాలు, హార్మోన్ రిసెప్టార్స్‌ను ఎక్స్‌ప్రెస్ చేస్తాయి. ఈస్ట్రోజన్ రిసెప్టార్, ప్రోజెస్టిరాన్ రిసెప్టార్ ఈ హార్మోన్ రిసెప్టార్స్ ఎక్స్‌ప్రెస్ చేసినపుడు ఇవ్వడానికి కొన్ని కొత్త రకం మందులు కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా కూడా జీవిత కాలాన్ని బాగా పెంచవచ్చు. అలాగే యాంటీ ఈస్ట్రోజన్‌గా పనిచేసే ఫల్‌వెస్ట్రెంట్ అనే మందు కూడా అందుబాటులోకి వచ్చింది. ఒక కీమోథెరపీ విఫలమైతే మరో కీమోథెరపీ అందుబాటులోకి వచ్చినట్లు ఒక హార్మోన్ థెరపీ విఫలమైతే, మరో హార్మోన్ థెరపీ, అదీ విఫలమైతే ఈ ఫల్‌వెస్ట్రెంట్ ఇలా కేన్సర్ చికిత్సలో ఎన్నో కొత్త విధానాలు వచ్చాయి. మోనోక్లోనల్ యాంటీ బాడీస్ ఎవరిలోనైనా హర్ 2 న్యూ రిసెప్టార్ పాజిటివ్‌గా ఉంటే కణితి చిన్నదే అయినా, హర్‌సెప్టిన్ మందు ఇవ్వవలసి ఉంటుంది. ఈ మందు ఖరీదు చాలా ఎక్కువే కానీ క్యాన్సర్ తిరిగి రాకుండా నివారించడానికి, జీవిత కాలాన్ని బాగా పెంచడానికి ఈ మందు సమర్థంగా పనిచేస్తుంది. ఈ మందును మూడు వారాలకు ఒకసారి చొప్పున 18 కోర్సులు అంటే దాదాపు ఒక ఏడాది పాటు ఇవ్వవలసి ఉంటుంది. ఒకవేళ హర్‌సెప్టీన్‌తో కూడా ఫలితం లేనప్పుడు ఇవ్వడానికి టైకర్బ్ అనే మందు అందుబాటులోకి వచ్చింది. దీనిద్వారా వారి జీవితకాలాన్ని గణనీయంగా పెంచవచ్చు.

ఏవైనా, అప్పటికి అందుబాటులో ఉన్న వైద్య చికిత్సలన్నీ అయిపోయాక కూడా మరోసారి క్యాన్సర్ వస్తే అనే అందోళన చెందవలసిన అవసరం ఇప్పుడేమీ లేదు. కణితి ఎంత చిన్నదయినా వివిధ కోణాల్లోంచి, అవసరమైన అన్ని వైద్య చికిత్సలు అందించడం ద్వారా వ్యాధిని సమర్థంగా ఎదుర్కొనే అవకాశాలు ఏర్పడ్డాయి.

నిజానికి ఒక రొమ్ము క్యాన్సర్‌కు తప్ప మరే క్యాన్సర్‌కూ ఇన్ని రకాల వైద్య చికిత్సలు అవసరం లేదు. రొమ్ము క్యాన్సర్ అంత సంక్లిష్టమైనది కావడం వల్లే ఇవన్నీ అవసరమవుతున్నాయి. రొమ్ము క్యాన్సర్ ఎంత సంక్లిష్టమైనదైనా దాన్ని ఎదుర్కొనే విశిష్టమైన వైద్య విధానాలెన్నో ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. క్యాన్సర్ చికిత్సలో ఇది చాలా శుభపరిణామం.



రేడియేషన్‌లో ముందడుగు

రొమ్ము క్యాన్సర్ సోకిన వారికి ఇచ్చే రేడియేషన్‌లోనూ ఎన్నో కొత్త విధానాలు వచ్చాయి. మామూలుగా అయితే, సర్జరీ తరువాత మొత్తం రొమ్ముకు రేడియేషన్ ఇస్తుంటారు. ఒకప్పుడైతే ఎడమ రొమ్ముకు కేన్సర్ వచ్చి ఆ భాగానికి రేడియేషన్ ఇస్తే శ్వాసకోశాలతో పాటు గుండె కూడా దుష్ర్పభావానికి గురయ్యే ప్రమాదం ఉండేది. ఈ పరిస్థితి లేకుండా ఇటీవల కొత్త రకం రేడియేషన్ విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ఐమ్‌ఆర్‌టి (ఇంటెన్సిటీ మాడ్యులేటెడ్ రేడియో థెరపీ). ఐజిఆర్‌టి (ఇమేజ్ గెడైడ్ రేడియో థెరపీ)లతో వి-మ్యాట్ టెక్నాలజీ ఉపయోగించి రేడియేషన్ ఇస్తే సులువుగానూ, చాలా వేగంగానూ ఆ భాగానికి రేడియేషన్ అందించగలగడం సాధ్యమే. పైగా ఆ పక్కనున్న నార్మల్ కణజాలానికి, ఏ మాత్రం హాని కలగదు. దీనికి తోడు ఈ మధ్య పార్షియల్ బ్రెస్ట్ రేడియేషన్ అనే ఒక విధానం వచ్చింది. రొమ్ము మొత్తానికి రేడియేషన్ ఇవ్వకుండా, క్యాన్సర్ కణితి ఉన్న భాగానికి రేడియేషన్ ఇవ్వడం ఈ విధానం. ఇందులో భాగంగా, పలురకాల ఇంట్రా ఆపరేటివ్ రేడియోథెరపీ టెక్నిక్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి.

 
సర్జరీ చేస్తున్నపుడే ఈ థెరపీ ఇవ్వడం అయిపోతుంది. ఒకే ఒక్క ఫ్రాక్షన్‌లో రేడియేషన్ అయిపోతుంది. ఆ తరువాత రేడియేషన్ అవసరమే ఉండదు. అలాగే సైబర్‌నైఫ్ ద్వారా చేసే పార్షియల్ రేడియేషన్ కూడా ఒకే ఒక్క రోజుతో అయిపోతుంది.


కీమో థెరపీలో ఆధునికతలు

కీమో థెరపీలోనూ ఎన్నో కొత్త రకం మందులు అందుబాటులోకి వస్తున్నాయి. వీటివల్ల శరీరం మీద పడే దుష్ర్పభావాల తీవ్రత బాగా తగ్గిపోయింది. గుండె మీద ఏ మాత్రం దుష్ర్పభావం పడకుండానే కీమోథెరపీ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి కీమోథెరపీ ఇచ్చాక కూడా కాన్సర్ మళ్లీ వస్తే ఒకప్పుడైతే ఇంక ఆశలు వదులుకునేవారు. ఇప్పుడు ఆ భయమే లేదు. ఆ స్థితిలో ఇవ్వడానికి కొన్ని కొత్తరకం మందులు వచ్చాయి. ఎన్నో కొత్త మోనోక్లోనల్స్ యాంటీబాడీస్ అందుబాటులోకి వస్తున్నాయి. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నోటి ద్వారా వేసుకోవడానికి వీలుగా ఓరల్ కీమో థెరపీ మందులు కూడా వచ్చాయి. వీటి ద్వారా జీవితకాలాన్ని గణనీయంగా పెంచే అవకాశం ఉంది.

No comments: