Thursday, October 11, 2012

తప్పంతా అమెరికాదే !

భూతాపోన్నతికి బాధ్యత వహించాలి 
- ఇంధన వనరులను విచ్చలవిడిగా వాడేస్తోంది

- చెట్లు ఎక్కువగా నాటితే కొంత ఉపశమనం
- జియో ఇంజనీరింగ్ వల్ల దుష్ర్పభావాలూ ఉన్నాయి
- జియో ఇంజనీరింగ్ నిపుణుడు ప్రొఫెసర్ విలియమ్‌సన్స్
Prof.williamsons
భూమి భగ్గుమంటోంది. శిలాజ ఇంధనాల విచ్చలవిడి వాడకంతో మనిషి తన మనుగడకే ముప్పు తెచ్చుకుంటున్నాడు. ఆలస్యంగానైనా ప్రకృతితో కలసి జీవిస్తేనే భవిష్యత్తు పచ్చగా ఉంటుందన్న ఆలోచన వస్తోంది. అయితే ఈ లక్ష్యాన్ని సహజపద్ధతుల్లో సాధించాలని కొందరు భావిస్తూంటే మరికొందరు జియో ఇంజనీరింగ్ వంటి కృత్రిమ పద్ధతులతో సాధించే ఆలోచన చేస్తున్నారు. ఇంతకీ భూ తాపోన్నతి తగ్గించేందుకు, జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు మేలైన పద్ధతి ఏమిటి? ఇప్పటి పరిస్థితికి కారకులెవరు? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు జియో ఇంజనీరింగ్ నిపుణుడు ఫిల్ విలియమ్‌సన్



ప్ర: వాతావరణ కాలుష్యాలు ఇప్పటి స్థాయిలోనే పెరిగితే ఈ శతాబ్దం చివరికల్లా భూ సగటు ఉష్ణోగ్రతలు నాలుగు డిగ్రీ సెంటీగ్రేడ్ వరకూ పెరుగుతాయని, ఫలితంగా సముద్రమట్టాలు పెరిగి తీరప్రాంత నగరాలు కొట్టుకుపోతాయని ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఇప్పటికే స్పష్టం చేసింది. నష్ట నివారణ చర్యలు తీసుకోకపోతే ఈ వినాశనం మరింత ముందుగానే రావచ్చునన్న అంచనాలు ఉన్నాయి. ఈ పరిస్థితికి ఎవరు బాధ్యులు?

జ: అగ్రరాజ్యం అమెరికాను తప్పు పట్టక తప్పదు. ఎందుకంటే భూమ్మీద ఉన్న వనరులను అత్యంతవేగంగా ఖాళీ చేస్తున్నది వారే. అటువంటి వారు తమ పద్ధతులు మార్చుకోకపోతే, మిగిలిన అభివృద్ధి చెందుతున్న దేశాల పరిస్థితి ఏమిటి? యూరోపియన్ యూనియన్, యునెటైడ్ కింగ్‌డమ్‌లు వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. 2015 నాటికల్లా కాలుష్య ఉద్గారాలను 80 శాతం మేరకు తగ్గించాలన్న లక్ష్యం విధించుకున్నాయి. ప్రపంచదేశాలన్నీ ఇదేస్థాయిలో కృషి చేస్తేనే మనిషికి మనుగడ.

ప్ర: మరి... భూ తాపోన్నతిని తగ్గించేందుకు, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు మేలైన మార్గమేదంటారు?

జ: వీలైనంత వరకూ సహజసిద్ధమైన పద్ధతుల్లో ఉద్గారాలను తగ్గించడమే. ఎక్కువ చెట్లు పెంచితే, లేదా మహాసముద్రాల్లోని ఫైటోప్లాంక్టన్‌ను సహజసిద్ధంగా పెరిగేలా చేయగలిగితే బాగానే ఉంటుంది. దీనివల్ల వాతావరణ మార్పులను, జీవ వైవిధ్య నష్టాన్ని పూడ్చలేకపోయినా... పరిస్థితి మరింత దిగజారకుండా నివారించవచ్చు.

ప్ర: కొన్నేళ్ల క్రితం దక్షిణ అమెరికా దేశం పెరూ ఓ ఆసక్తికరమైన ప్రయోగం చేసింది. ఒక ప్రాంతంలోని కొండను తెల్లరంగుతో నింపేసింది. తద్వారా సూర్యరశ్మి ఎక్కువ శాతం వెనక్కు వెళుతుందని అంచనా. ఇదే తరహా ప్రయోగాలు ప్రపంచస్థాయిలో చేపడితే ఎంత మేరకు ప్రయోజనముంటుంది?

జ: ఇళ్లపైకప్పులపై తెల్లటి రంగు వేయడం ద్వారా ఆ ఇంటిలోపల మేరకు చల్లగా ఉండే అవకాశముంది. కానీ ప్రపంచంలోని అన్ని భవనాలపై ఇలాగే చేసినప్పటికీ భూ వాతావరణానికి జరిగిన నష్టాన్ని పూడ్చలేము. పైగా ప్రస్తుతం ధ్రువ ప్రాంతాల్లోని మంచు విస్తీర్ణం తగ్గుతోంది. ఒకవేళ అక్కడి మంచన్నది పూర్తిగా లేకుండా పోతే అప్పుడు అంతస్థాయిలో తెల్లటి రంగున్న భవనాలు కావాల్సి వస్తాయేమో!

ప్ర: వృక్షో రక్షతి రక్షితః అని భారతీయ వేదాలు చెబుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్ని మొక్కలు నాటితే అంత మేలు జరుగుతుందని నిపుణులు అంటున్నారు. అయితే జీవ వైవిధ్యం విషయానికి వస్తే ఈ అదనపు మొక్కలు, చెట్లు ఏ విధంగా లాభదాయకం?

: చెట్లు ఎక్కువైతే వాతావరణంలోని బొగ్గుపులుసు వాయువు మోతాదు తగ్గిపోతుందన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ పని జీవ వైవిధ్యంపై ఎంత మేరకు ప్రభావం చూపుతుందన్నది ఇంకా నిర్ణయించాల్సి ఉంది. ఎందుకంటే ఇది ఏ రకమైన మొక్కలు, ఎన్ని, ఎక్కడ నాటామన్న దానిపై ఆధారపడి ఉంటుంది. ఇంకో విషయం... ప్రపంచం మొత్తమ్మీద మొక్కల సంతతిని పెంచినప్పటికీ శిలాజ ఇంధనాల వాడకం ద్వారా వాతావరణంలో పెరిగిపోయిన విష వాయువులు చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గుతాయా? వాతావరణ మార్పులను నిలుపుదల చేయవచ్చా? అన్న అంశాలపై ఇప్పటికీ స్పష్టత లేదు. ప్రాంతీయ స్థాయిలో మాత్రం పచ్చదనం మేలు చేస్తుందనేది నిర్వివాద అంశం.

ప్ర: మనిషి ప్రకృతిని నియంత్రించాలని యుగాలుగా ప్రయత్నిస్తున్నాడు. వాతావరణ మార్పులను కూడా జియో ఇంజనీరింగ్ పద్ధతుల ద్వారా కట్టడి చేయాలన్న ఆలోచనలు ఉన్నాయి. మీ అంచనా ప్రకారం ఇలాంటి కృత్రిమ పద్ధతులను ఎప్పుడు చేపట్టవచ్చు?

జ: జియో ఇంజనీరింగ్ పద్ధతులపై జీవ వైవిధ్య సమాఖ్య ఇప్పటికే కొన్ని అధ్యయనాలు చేపట్టింది. మహా సముద్రాల్లో ఇనుము రజను చల్లడం ద్వారా కొన్ని ప్రైవేట్ కంపెనీలు వాతావరణంలోని బొగ్గుపు లుసు వాయువును తగ్గించవచ్చునని ప్రయోగాత్మకంగా నిరూపించాయి కూడా. అయితే ఇలాంటి పద్ధతులను పెద్దస్థాయిలో చేపడితే అనుకోని దుష్ర్పభావాలూ ఉంటాయని జీవ వైవిధ్య సమాఖ్య అధ్యయనం ద్వారా తెలిసింది. అందుకే జియో ఇంజనీరింగ్ ప్రయోగాలకు ఇది సమయం కాదని నిర్ణయించాం. భవిష్యత్తులో ఎప్పుడు వీటిని చేపట్టాలో చెప్పడం కూడా కష్టమే.

No comments: