Monday, October 29, 2012

సైనసైటిస్‌కు పరిష్కారం

 విపరీతమైన తలనొప్పితో పాటు ముక్కు వెంట ద్రవాలు కారడం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు సైనసైటిస్‌లో కనిపిస్తాయి. యాంటీబయోటిక్స్ ఎన్ని వేసినా ఫలితం శూన్యం.

తలనొప్పి తీవ్రంగా వేధిస్తోందా? కళ్ల దగ్గర దురదగా ఉందా? ముక్కు ఇరువైపులా ముట్టుకుంటే నొప్పిగా ఉందా? అయితే మీరు సైనసైటిస్‌తో బాధపడుతున్నట్టే. సింపుల్‌గా చెప్పాలంటే సైనస్ గదుల్లో ఏర్పడే నొప్పినే సైనసైటిస్ అంటారు. ముక్కుకు ఇరువైపులా సైనస్ గదులుంటాయి. మనం పీల్చేగాలి వీటి ద్వారా ప్రయాణిస్తుంది. జలుబు, వాతావారణ కాలుష్యం, అలర్జీ వల్ల ఈ సైనస్ గదులు మూసుకుపోతాయి. దీనివల్ల మ్యూకస్ పేరుకుపోతుంది.

ఫలితంగా బాక్టీరియా, ఇతర క్రిములు పెరిగి సైనసైటిస్ సమస్య మొదలవుతుంది. సైనసైటిస్ నాలుగు వారాల కన్నా తక్కువ ఉన్నట్లయితే ఎక్యూట్ సైనసైటిస్ అని, 4 నుంచి 12 వారాల పాటు ఉన్నట్లయితే సబ్ఎక్యూట్ అని, 12 వారాల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే క్రానిక్ సైనసైటిస్‌గా భావించాలి. సైనసైటిస్‌తో బాధితుల్లో 90 శాతం మందిలో జలుబు లేదా అలర్జీ కారణమవుతుంది. పాలిప్స్ పెరగడం, ట్యూమర్స్, అడినాయిడ్స్ కూడా కారణమవుతాయి.

సైనసైటిస్‌లో రకాలు
ఫ్రంటల్ సైనసైటిస్ : ఉదయం పూట తలనొప్పి పెరుగుతుంటుంది. నుదురు భాగంలో నొప్పి ఎక్కువగా ఉంటుంది. సైనస్‌ల దగ్గర ముట్టుకుంటే నొప్పి ఉంటుంది.

మాక్సిలరీ సైనసైటిస్ : దవడ పైభాగంలో నొప్పి ఉంటుంది. పళ్లు, బుగ్గలు ముట్టుకున్నా నొప్పి ఉంటుంది.

స్ఫెనాయిడ్ సైనసైటిస్ : గొంతులో నొప్పి ఉంటుంది. మ్యూకస్ ఎక్కువగా వస్తుంటుంది. వాయిస్‌లో తేడా వస్తుంది.

ఎథ్‌మాయిడ్ సైనసైటిస్ : వాసన గుర్తించలేరు. ముక్కు వెంట నీరు కారుతుంటుంది. ముక్కు ఇరువైపులా ముట్టుకుంటే నొప్పి ఉంటుంది. తల పైభాగంలో, మెడ భాగంలో నొప్పి ఉంటుంది.

లక్షణాలు

తరచు జలుబు చేయడం, జలుబుతో ఎక్కువ రోజులు బాధపడటం అనేది సైనస్ వ్యాధి ప్రాథమిక లక్షణం. ఈ దశలో సరియైన చికిత్స తీసుకోకపోతే వ్యాధి తరువాత మందులకు లొంగకుండా పోతుంది. ముక్కులు బిగదీసుకుపోతాయి. తల అంతా బరువుగా ఉంటుంది. ఆ పైన ముక్కు నుంచి పసుపు పచ్చని, ఆకుపచ్చని ద్రవాలు రావడం మొదలవుతుంది. తీవ్రమైన తలనొప్పి, దగ్గు, శ్వాస దుర్గంధంతో కూడి ఉండటం కూడా జరుగుతుంది. ముఖంలో వాపు కనిపిస్తుంది. పళ్లు, కళ్ల వెనుక భాగంలో కూడా నొప్పి కనిపిస్తుంది. కొద్దిరోజులకు వాసన తెలియకుండా పోతుంది.

ఎక్యూట్ సైనసైటిస్

జలుబు తరువాత సైనస్ ఇన్‌ఫెక్షన్ మొదలవుతుంది. వైరస్ సైనస్ గదులపై దాడి చేయడంతో వాపు, నొప్పి ఏర్పడుతుంది. వైరస్‌ను బయటకు పంపించడానికి శరీరం మరింత ఎక్కువ మ్యూకస్‌ను తయారుచేస్తుంది. దీనివల్ల సైనస్ గదులు బ్లాక్ అయిపోతాయి. ఎక్యూట్ సైనసైటిస్‌తో బాధపడే వారిలో ముక్కునుంచి పసుపచ్చని లేదా ఆకుపచ్చని ద్రవం కారుతుంది.

దుర్వాసనతో కూడి ఉంటుంది. ఉదయం లేవగానే తలనొప్పి ఉంటుంది. ముందుకు వంగినపుడు తలనొప్పి మరింత ఎక్కువవుతుంటుంది. కొంతమందిలో జ్వరం ఉంటుంది. పిల్లల్లో జలుబు సాధారణంగా కనిపించే లక్షణం. ముక్కు కారడంతో పాటు పది రోజుల పాటు విడవకుండా జ్వరం ఉంటుంది.

క్రానిక్ సైనసైటిస్

సైనస్ గదుల్లో వాపు, నొప్పి ఉంటుంది. అలర్జీస్, పంగీ, నాసల్ పాలిప్స్, శ్వాసకోశనాళాల్లో ఇన్‌ఫెక్షన్లు క్రానిక్ సైనసైటిస్‌కు కారణమవుతాయి. సైనస్ ఇన్‌ఫెక్షన్ విడవకుండా ఉండటం, ముక్కులో నుంచి ఆకుపచ్చ లేదా పసుపు పచ్చని దుర్వాసనతో కూడిన ద్రవం, ముక్కులు బిగుసుకుపోయి ఉండటం, శ్వాసలో ఇబ్బంది, గొంతులో ఇన్‌ఫెక్షన్, రాత్రివేళ దగ్గు ఎక్కువగా ఉండటం వంటి లక్షణాలు ఉంటాయి. పిల్లల్లో ముక్కు లోపల ఎర్రగా కావడం, రాత్రివేళ దగ్గు, నిద్రలేమి వంటి లక్షణాలుంటాయి.

1 comment:

ఎందుకో ? ఏమో ! said...

very useful info andi, thanks a lot for sharing