Tuesday, December 4, 2012

ఆయుర్వేదం సాధించిన అద్భుతం నడుమునొప్పి మాయం

చిన్న ప్రమాదంలో నడుముకు తగిలిన దెబ్బ నాలుగేళ్లు స్వాతిని వేధించింది. చూడని ఆర్థోపెడిక్ డాక్టర్ లేరు. తీయించని ఎక్స్‌రేలు, ఎంఆర్ఐ స్కానింగ్‌లు లేవు. నడుము నొప్పికి కిడ్నీలో రాళ్లు కూడా కారణం కావచ్చన్న అనుమానంతో మరికొన్ని స్కానింగ్‌లు. ఏ వైద్యానికి లొంగని ఆ నడుము నొప్పి నెల రోజుల్లోనే మటుమాయమైంది. ఇది ఆయుర్వేద వైద్యంలోని వైశిష్ట్యమని అంటున్నారు డాక్టర్ బుక్కా మహేశ్‌బాబు.

ఆమె పేరు స్వాతి. వయసు 28 సంవత్సరాలు. స్వస్థలం అమలాపురం. భర్త ఉద్యోగరీత్యా కర్నూలులో ఉంటున్నారు. వారికి ఒక నాలుగేళ్ల పాప. ఒకరోజు అమలాపురంలో భర్తతో కలసి బైక్ మీద వెళుతూ ప్రమాదవశాత్తు కింద పడింది స్వాతి. ఫ్రాక్చర్ లాంటిదేదీ కానప్పటికీ నడుం దగ్గర కొద్దిగా నొప్పి ఉండేది. మామూలు నొప్పే కదా తగ్గిపోతుందిలా అనుకున్నారామె. అయితే నెలరోజులైనా నొప్పి తగ్గలేదు సరికదా పెరుగుతూ పోతోంది. కర్నూలులో ఒక ఆర్థోపెడిక్ డాక్టర్‌ను ఆమె సంప్రదించారు. ఆయన రాసిన పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు క్యాప్సిళ్లను గుప్పిళ్లు గుప్పిళ్లు మింగినప్పటికీ ఎటువంటి ప్రయోజనం కనిపించలేదు. నొప్పి మాత్రం తగ్గలేదు.

నొప్పికి కారణం ఏమిటో తెలుసుకోవడానికి ఎంఆర్ఐ తీయించారు ఆ డాక్టర్. డిస్క్ కొంచెం తేడాగా ఉంది... అరిగినట్లు కనపడుతోంది...విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుందని చెప్పి బెల్ట్ వేసుకోమన్నారు ఆ డాక్టర్. ఇలా ఒక సంవత్సరం గడిచింది. విశ్రాంతి తీసుకున్నా, బెల్ట్ పెట్టుకున్నా నొప్పిలో మాత్రం మార్పు లేదు. సూదులతో పొడుస్తున్నట్లు వచ్చే నడుంనొప్పిని పంటి బిగువున భరిస్తూ ఇంటి పని, వంట పని చూసుకోవడం ఆమెకు నరకంగా మారింది. ఈ నొప్పి ఇంతేనా? జీవితాంతం భరించాల్సిందేనా? అన్న ఆవేదన ఆమెను చుట్టుముట్టేవి. ఆ సమయంలో మరో ఆర్థోపెడిక్ డాక్టర్‌ను సంప్రదించారు ఆమె. ఆయన సలహామేరకు మళ్లీ నడుముకు ఎక్సరేలు, ఎంఆర్ఐ స్కాన్‌లు అన్నీ తీయించారు.

నడుముకు స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వాలని చెప్పారు ఆ డాక్టర్. అయితే స్టెరాయిడ్ ఇంజెక్షన్ తీసుకోవద్దని ఆమె సన్నిహితులు సలహా ఇవ్వడంతో డాక్టర్ దగ్గర వెన్నులో ఇంజెక్షన్ తీసుకోకుండా కేవలం మందులు మాత్రం తీసుకున్నారు స్వాతి. నెల రోజులు మందులు వాడినా ఏ విధమైన ప్రయోజనం లభించలేదు. నిరాశా నిస్పృహలు ఆమెను ఆవహించాయి. జీవితం దుర్భరంగా మారుతోంది. ఈ క్రమంలో కర్నూలులో ఉన్న ఆర్థో డాక్టర్లు, సర్జన్లనందరినీ సంప్రదించారు స్వాతి. ఆయా డాక్టర్లు తమ అనుభవాన్నంతా రంగరించి తమకు తోచిన విధంగా చికిత్స చేశారు. ఇలా మూడు సంవత్సరాలు గడచిపోయాయి.

కొంతమంది డాక్టర్లు ఈ నొప్పి కిడ్నీలో రాళ్ల వల్ల వస్తున్నదేమో అన్న అనుమానంతో యూరాలజిస్ట్‌ని సంప్రదించవలసిందిగా ఆమెకు సలహా ఇచ్చారు. దాంతో యూరాలజిస్ట్‌ని కలిశారు. ఆయన దాదాపు 30 రకాల స్కానింగ్‌లు తీయించారు. కిడ్నీలో చాలా సూక్ష్మమైన రాళ్లు ఉన్నాయి...వాటి వల్ల ఇంత నొప్పి వచ్చే అవకాశం లేదు కాబట్టి బాగా నీళ్లు తాగమని, ఆ రాళ్లు వాటంతటవే కరిగిపోతాయని ఆమెకు సలహా ఇచ్చారు. బిందెల కొద్దీ నీళ్లు తాగినా ఎటువంటి ఫలితం కనిపించలేదు. నొప్పి యథాప్రకారం అక్కడే తిష్టవేసుకుని కూర్చుంది. కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఆర్థో సమస్య కాదనుకుని యూరాలజిస్ట్ దగ్గరకు వెళితే మళ్లీ ఆర్థో డాక్టర్‌నే కలవమని ఆయన సలహా ఇచ్చారు. సమస్య ఏమిటో తెలియకుండా తిరిగిన డాక్టర్ల దగ్గరకే మళ్లీ వెళ్లవలసి వచ్చినందుకు స్వాతిలో తీవ్రమైన ఆవేదన, నైరాశ్యం అలుముకున్నాయి.

దుష్ప్రభావాలు మొదలయ్యాయి...
డాక్టర్లు రాసిన మందులు ఎక్కువకాలం గుప్పిళ్ల కొద్దీ మింగడం వల్ల కడుపులో మంట, ఎసిడిటీ, గ్యాస్ పెరగటం, విపరీతంగా బరువు పెరగటం లాంటి దుష్ప్రభావాలు స్వాతిలో తలెత్తాయి. ఈ సైడ్ ఎఫెక్ట్స్‌ని తగ్గించుకోవడానికి చాలా డబ్బు ఖర్చుపెట్టి బరువు తగ్గించే మందులు కూడా ఆమె వాడారు. అయినా బరువు తగ్గలేదు... నడుము నొప్పీ పోలేదు. అసలు వ్యాధి ఏమిటో ఎన్ని ఎక్స్‌రేలు, ఎంఆర్ఐ స్కానింగ్‌లు, కిడ్నీ స్కానింగ్‌లు చేసినా నిర్ధారణ కాలేదు. అసలు వ్యాధి నిర్ధారణ జరిగేతేనే కదా ఔషధం పనితీరు ప్రభావం తెలిసేది! ఈ పరిస్థితుల్లో అంతిమ పరిష్కారంగా మొట్టమొదటిసారి ధైర్యం కూడగట్టుకుని ప్రత్యామ్నాయ మార్గాలను వెదకడం ప్రారంభించారు ఆమె.

తమ కుటుంబ మిత్రుడొకరికి గుండుసూది కూడా మోపలేనంతగా శరీరమంతటా సొరియాసిస్ ఆవరించి ఉన్న పరిస్థితుల్లో ఆయుర్వేద మందులతో పూర్తిగా తగ్గిపోయిన విషయం ఆమె దృష్టికి వచ్చింది. వెంటనే ఆ మిత్రుడిని కలుసుకుని ఆయర్వేదం గురించి వాకబు చేశారామె. ఆ మిత్రుడు ఇచ్చిన సలహా మేరకు కర్నూలు నుంచి పయనమై నన్ను సంప్రదించారు ఆమె. నెలరోజుల క్రితం స్వాతి నా దగ్గరకు వచ్చినపుడు ఆమె చెప్పిన వ్యాధి లక్షణాలు ఇలా ఉన్నాయి.

వ్యాధి లక్షణాలు

- నడుములో కుడివైపు భాగంలో తీవ్రమైన నొప్పి.

- మెలిపెట్టినట్లు, గట్టిగా పిండినట్లు నడుములో నొప్పి.

- నొప్పి వచ్చినపుడు కుడికాలు పూర్తిగా స్పర్శను కోల్పోతుంది. అడుగు తీసి అడుగు వేయడం సాధ్యం కాదు.

- పద్మాసనం వేసుకుని కూర్చుంటే రెండు కాళ్లలో తిమ్మిర్లు.

- పాదాలు కింద పెడితే అరికాళ్లలో మంటలు.

- ఓ గంట సేపు కూర్చుని లేవాలంటే కాళ్లు సహకరించవు.

- నొప్పి ఉన్న వైపు పడుకుంటేనే ఉపశమనంగా ఉండేది.

- పడుకున్నపుడు అటు, ఇటు తిరగడానికి వీలయ్యేది కాదు.

- పడుకున్న తరువాత నిద్రలేవాలంటే కాళ్లు సహకరించేవి కావు. కాళ్లు స్వాధీనంలోకి రావడానికి అరగంట పట్టేది.

- తన సొంత పనులను కూడా చేసుకోలేని పరిస్థితి.

- మోకాలి పిక్కలు ఎవరో పిసికేసినట్టుగా నొప్పి వస్తుంది.

ఈ వ్యాధి లక్షణాలతో దాదాపు నాలుగైదు సంవత్సరాలుగా ఆమె బాధపడుతున్నారు.

వ్యాధి నిర్ధారణ ఇలా జరిగింది...
ఆమె శారీరక లక్షణాలను బట్టి ఈ వ్యాధిని కుడివైపు వచ్చే గృద్రసి వాత వ్యాధిగా నిర్ధారణ చేయడం జరిగింది. దీనితోపాటుగా ఇతరత్రా వివరాల కోసం ఎంఆర్ఐ రిపోర్ట్స్‌ను నిశితంగా పరిశీలించి వ్యాధి నిర్ధారణకు అవసరమయ్యే సమాచారాన్ని సేకరించడం జరిగింది. అతి సూక్ష్మమైన ఇసుకరేణువుల రూపంలో ఉన్న రాళ్లు కిడ్నీలో ఉన్నప్పటికీ నిరంతరం అతి తీవ్రమైన నడుమునొప్పి ఆ ప్రాంతంలో ఉండదు. అందుచేత ఆ అంశానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. కిడ్నీలోని రాళ్లు కరగడానికి ఒక ప్రత్యేకమైన ఆకును వండి తినవలసిందిగా సూచించడం జరిగింది. ఎంఆర్ఐలోని అంశాలు ఇలా ఉన్నాయి.

ఎల్3-ఎల్4, ఎల్4-ఎల్5 డిస్క్‌ల మధ్య నుంచి వచ్చే వెన్నుపాము నర్వ్ సిగ్నల్స్ తగ్గినట్లుగా తేలింది. ఇది చిన్న వయసులో ఎముకల అరుగుదల ఏర్పడటం వల్ల వచ్చే సమస్య. డి-12 వర్టిబ్రా నుంచి ఎల్-4 వర్టిబ్రా వరకు స్క్రూమోల్ కణుపులు అంటే వెన్నెముక చివరలో కొవ్వు గడ్డలాంటివి పెరగటం జరిగింది. ఎల్3-ఎల్4, ఎల్4-ఎల్5 మధ్యలో వెనుక భాగంలో డిస్క్ బల్జ్‌లు జరిగాయి. వెన్నుపాము వెళ్లేదారి ఇరుకై వెన్నుపాముపై పొరపై ఒత్తిడి పెరిగింది. ఇది ఎల్4-ఎల్5 మధ్య ఎక్కువగా ఉంది.

దీనికి తోడు రోగి మెడనొప్పితో బాధపడుతున్నప్పటికీ నడుము నొప్పి తీవ్రంగా ఉండటం వల్ల ఆ విషయానికి ఆమె అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. అయితే మెడ ప్రాంతంలోని సి2- సి3, సి4-సి5, సి5-సి6 ప్రాంతంలో వెన్నెముకల్లో అరుగుదల ఏర్పడినట్లు తేలింది. దీనివల్ల ఈ వెన్నెముకల వెనుక భాగంలో డిస్క్ బల్జ్‌లు ఏర్పడి వెన్నుపాము పైపొరపై ఒత్తిడిని కలుగచేస్తున్నాయి. దీనిని డీ జనరేటివ్ సర్వైకల్ డిస్క్ డిసీజ్ అంటారు.

ఇంకో అతి ముఖ్యమైన విషయం నడుము నిటారుగా నిలబెట్టడానికి అవసరమయ్యే లిగమెంటమ్ ఫ్లేవమ్ పట్టుజారి డి10 వర్టిబ్రా ప్రాంతంలో వెన్నుపాముపైన, వెన్నుపాము పైపొరపైన ఒత్తిడి కలుగచేస్తోంది. ఎంఆర్ఐ రిపోర్ట్స్‌ను సమగ్రంగా పరిశీలించిన తర్వాత పేషెంట్ వాహనం మీద నుంచి పడటం వల్లనే వెన్నుకు దెబ్బతగలడం వల్ల సమస్య ఇంత తీవ్రతరం అయ్యిందని కచ్ఛితమైన నిర్ధారణకు రావడం జరిగింది. అనంతరం చికిత్స ప్రణాళికను రూపొందించడం జరిగింది. మొట్టమొదటిగా చెదిరిన డిస్క్‌లు, సాగిన ఫ్లేవమ్ లిగమెంట్లను సరిచేసి వెన్నుపాముపై ఒత్తిడి తగ్గడానికి, నొప్పి తగ్గడానికి కావలసిన ఔషధాలను, వాటి డోసేజ్‌లను నిర్ధారించుకుని చికిత్స మొదలు పెట్టాము.

చికిత్సా విధానం ఇలా ఉంది...
వ్యాధి నిర్ధారణ, ఔషధాల ఎంపిక, వాటి డోసేజ్‌ల పరిమాణం, అవి వాడే విధివిధానం, ఏమేమి సలహాలు, సూచనలు పాటించాలి, చికిత్సలో మెరుగైన ఫలితాలు చికిత్సలో మెరుగైన ఫలితాలు పొందడానికి అతి ముఖ్యమైన అంశాలు. ఈ రోగి విషయానికి వస్తే సాధారణంగా అందరూ చెప్పే పథ్యాలైన వంకాయ, గోంగూర, దుంపకూరలు, సెనగపిండి లాంటివి తినవద్దని సూచించలేదు. కేరళ వైద్యం లాంటి మసాజ్‌లు కూడా ఏమీ చెప్పలేదు. మేము చేపట్టిన చికిత్సలో తైలమర్ధనలు అన్న ప్రయోగమే లేదు.

చెదిరిన డిస్క్‌లు సరిచేయడానికి, సాగిన లిగమెంట్ మామూలు స్థితికి రావడానికి, ఎముకల అరుగుదల సరిచేయడానికి ప్రాచీన కాలంలోనే ఆయుర్వేద సిద్ధ శాస్త్రవేత్తలు కనిపెట్టిన అత్యంత సూక్ష్మ ఔషధాలను(నానో) ఉపయోగించాము. ఇవి అత్యంత ప్రభావశీలమైన ఔషధ గుణాలతో కూడిన ఆకులు, బెరడులు, గింజలు, వేర్లు, జిగుర్లు, శుద్ధి చేసిన ఖనిజ భస్మాలతో తయారుచేసిన ఔషధాలు. నిరపాయకరమైన ఈ ఔషధాలు శరీర జీవ క్రియను మెరుగుపరచి, అత్యంత సూక్ష్మమైన కణాలలోకి కూడా బయో మాలిక్యూల్స్‌ను తీసుకువెళతాయి. రోగికి నెలరోజులకు అవసరమైన ఔషధాలను చికిత్సగా అందచేయడం జరిగింది.

చికిత్సా ఫలితం
నాలుగు వారాలపాటు ఔషధాలను వాడిన స్వాతికి అద్భుతమైన ఫలితాలు కనిపించాయి. నాలుగేళ్లుగా పట్టిపీడిస్తున్న నడుము నొప్పి పూర్తిగా మాయమైపోయింది. నాలుగడుగులు నడవడానికే కష్టపడే ఆమె ఇప్పుడు నాలుగు గంటలసేపు నిలబడి వంటచేయగలుగుతోంది. కాళ్లలో వచ్చే తిమ్మిర్లు తగ్గిపోయాయి. ఏ ఆసరా లేకుండానే చకచకా నడవగలుగుతోంది.

కూర్చున్నా, లేచినా, నిలబడినా వేధించే నొప్పి ఇప్పుడు లేనేలేదు. నిద్రించే సమయంలో అటు, ఇటు తిరగడం ఇప్పుడు సులువైంది. నిద్ర లేచిన వెంటనే సొంత పనులే కాక ఇంటి పనులు కూడా చేయగలుగుతోంది. ప్రశాంతంగా నిద్రించడంతోపాటు బరువు కూడా తగ్గడం మొదలైంది. మరో రెండు నెలల పాటు ఔషధ చికిత్సను కొనసాగించడం వల్ల నడుము నొప్పి ఇతర సమస్యలన్నీ కూడా ఆమెకు శాశ్వతంగా దూరమైపోవడం ఖాయం.

నాలుగేళ్లుగా పట్టిపీడిస్తున్న నడుము నొప్పి పూర్తిగా మాయమైపోయింది. నాలుగడుగులు నడవడానికే కష్టపడే ఆమె ఇప్పుడు నాలుగు గంటలసేపు నిలబడి వంటచేయగలుగుతోంది. కాళ్లలో వచ్చే తిమ్మిర్లు తగ్గిపోయాయి. ఏ ఆసరా లేకుండానే చకచకా నడవగలుగుతోంది.

Saturday, December 1, 2012

హెచ్‌ఐవీ వైరస్... తెలివితేటలు!

హెచ్‌ఐవీ వైరస్ చాలా తెలివైనది. అది శరీరంలోకి ప్రవేశించాక రోగనిరోధకశక్తిని ఇచ్చే సీడీ-4 సెల్స్‌ను నాశనం చేయడం పాటు తన సంతతిని వృద్ధి చేసుకుంటుంది. యాంటీ రెట్రోవైరల్ (ఏఆర్‌డీ) మందులు సీడీ-4 సెల్‌కౌంట్‌ను తగ్గకుండా చూస్తాయన్నమాట. ఈ వైరస్ ఎంత తెలివైనదంటే ఒకరకం మందులకు అలవాటు పడ్డ తర్వాత ఆ మందుకు తన నిరోధకశక్తి (రెసిస్టెన్స్) ని పెంచుకుంటుంది. తద్వారా తనను తాను (కాపీ చేసుకోవడం ద్వారా) వృద్ధి చేసుకోవడం మళ్లీ ప్రారంభిస్తుంది. అందుకే దాన్ని తప్పుదారి పట్టించేందుకు మూడు రకాల ఏఆర్‌వీ మందులు ఇవ్వాల్సి ఉంటుంది. అలా చేయడం ద్వారా అది ఏ మెడిసిన్ పట్లా తన నిరోధకశక్తిని పెంపొందించుకోకుండా చేయవచ్చు.

హెచ్‌ఐవి - జానకి......

జానకిలాంటి వాళ్లందరికీ ఎయిడ్స్ డే సందర్భంగా అభినందనలు

జబ్బు నుంచి విముక్తి పొందడం కన్నా
సమాజం నుంచి విముక్తి పొందడం కష్టం.
భయం, అనుమానం, అవమానం, నిషేధం... వంటి క్రూరమైన ఆయుధాలతో సమాజం కొందరిని బాధ పెడుతుంది.
నువ్వు అక్కర్లేదు పో అని తరిమికొడుతుంది.
ఎదరించి నిలవడం, పోరాడి జీవించడం చాలా కష్టం.
కాని- జానకి సాధించింది. తనను మొదట ఒక మనిషిగా, ఆ తర్వాత హెచ్‌ఐవి బాధితురాలిగా యధాతధంగా గుర్తించే స్థితికి చేరుకుంది. తనకూ గౌరవప్రదంగా జీవించే హక్కు ఉందని నినదించింది. తనలాంటి వాళ్లకు అదే స్థాయిభరోసాను ఇచ్చే స్థాయికి ఎదిగింది.

జానకి వయసు 35 ఏళ్లు. హైదరాబాద్ వనస్థలిపురంలో తమ్ముడి కుటుంబంతో కలిసి ఉంటుంది. ప్రతి రోజూ ఉదయం అక్కడి నుంచే హైదరాబాద్ లోని ఓ ఆర్గనైజేషన్‌కు చేరుకుంటుంది. అక్కడకు వచ్చిన హెచ్‌ఐవి బాధిత గుండెల్లో ధైర్యం నింపుతుంది. అన్నిం టి కంటే మించి వాళ్లకు నవ్వడం నేర్పుతుంది. నవ్వడం మర్చిపోయేంత భయంకరమైన నేరం వారేం చేశారని? అడిగితే- ‘‘ఎనిమిదేళ్ల కిందట నవ్వడం మానేశాను. హెచ్‌ఐవి సోకిందని తెలిసి నేడో రేపో చావు ఖాయం అనుకున్నాను. కాని, ఇవాళ ఎంతోమంది హెచ్‌ఐవి బాధిత కళ్లల్లో వెలుగులు నింపుతూ సంతృప్తిగా జీవిస్తున్నాను’’ అంది జానకి. ఆమె కథనం ఆమె మాటల్లో...

‘‘మా అమ్మనాన్నలకు నలుగురం ఆడపిల్లలం. ఒక మగపిల్లాడు. పద్దెనిమిదేళ్ల వయసులో మేనత్త కొడుకుతో పెళ్లయింది. ఆయన ముంబయ్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. అక్కడ అత్తమామ, ఇద్దరు మరుదులున్న ఉమ్మడి కుటుంబంలో ఏడేళ్లపాటు సంసారం సజావుగా సాగిపోయింది. ఏ ఒడిదొడుకులు లేవనుకున్న ఇంట్లో ఓ రోజు మా ఆయన జబ్బు కలకలం రేపింది. జ్వరం తగ్గుతున్నట్టే ఉండేది. మళ్లీ వచ్చేది. మెడికల్ షాపుల నుంచి మందుబిళ్లలు తెచ్చి వేశాం. తగ్గలేదు. డాక్టర్ల చుట్టూ తిరిగాం. వారు చెప్పిన మందులు వాడాం. వారం రోజుల్లోనే మనిషి బాగా నీరసించిపోయాడు. విపరీతమైన దగ్గు. దీంతో గవర్నమెంట్ ఆసుపత్రిలో చేర్పించాం. అక్కడ పరీక్షించిన డాక్టర్లు మా అత్తమామలకు ఏం చెప్పారో తెలియదు. కాని, మళ్లీ వస్తామని చెప్పి వెళ్లిన వారు ఆసుపత్రి వంక రావడమే మానేశారు. ఏం జబ్బు అని నర్సులను అడిగితే హెచ్‌ఐవి అన్నారు. ఆ జబ్బు ఏమిటో ఎందుకు వస్తుందో నాకు తెలియదు. డాక్టర్లు చూస్తున్నారు, మందులు వాడుతున్నాం, తగ్గిపోతుందిలే అనుకున్నాను. చంటిపిల్లాడికి మల్లే సపర్యలు చేశాను. కాని, మనిషి దక్కలేదు. పదిరోజులైనా కాకముందే... నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్లిపోయాడు.’’

వెంటాడిన తప్పు..

‘‘ఎనిమిది రోజులకే ఎనభై ఏళ్లకు సరిపడా నరకం అనుభవించాననిపించింది ఆ ఆసుపత్రిలో. మా అమ్మనాన్నలకు ఈ విషయం తెలిసి వచ్చారు. వారికీ ఈ జబ్బు గురించి ఏమీ తెలియదు. మా అత్తమామతో గొడవపెట్టుకున్నారు. మా అత్త- కొడుకే పోయాడు, కోడలు మాత్రం ఎందుకు అనడంతో పుట్టెడు దుఃఖాన్ని గుండెలో పెట్టుకొని అమ్మనాన్నలతో కలిసి హైదరాబాద్ వచ్చేశాను. ఏడాది తర్వాత ఉన్నట్టుండి నాకూ దగ్గు, ఆయాసం, జ్వరం మొదలయ్యాయి. సాధారణంగా వచ్చే సమస్యలే కదా అనుకొని కొన్నాళ్లు ఇంటి జాగ్రత్తలే పాటించాను. కాని లాభం లేకపోయింది. ప్రైవైట్ డాక్టర్లను సంప్రదించాను. ఏడాది పాటు ఎవరేం చెప్పినా ఆ మందులన్నీ వేసుకున్నాను. కాని అవేవీ పనిచేయలేదు. బరువు ఇరవై కేజీలకు పైగా తగ్గిపోయాను. నా ఒంటిరంగు, జుట్టు రంగూ మారిపోయాయి.

ఓ డాక్టర్ సలహా మేరకు ఎర్రగడ్డలోని చెస్ట్ ఆసుపత్రిలో చేరాను. అక్కడ టెస్టులు చేసి, హెచ్‌ఐవి పాజిటివ్ అని చెప్పారు. అప్పుడు నా వయసు 27. బరువు 27. సిడి4 కౌంట్ 27. (ఆరోగ్యంగా ఉన్నవారిలో సిడి4 కౌంట్ 500పైగా ఉంటుంది. హెచ్‌ఐవి ఉన్నవారి లో ఈ కౌంట్ 350 కన్నా తగ్గితే ప్రమాదమని వైద్యులు చెబుతారు) సిడి4అంటే ఏంటో, హెచ్‌ఐవి అంటే ఏంటో అది ఎందుకు వస్తుందో తెలియదు. కాని అనారోగ్య కారణంగా పడే బాధలను తట్టుకోలేక చచ్చిపోతానా... అనిపించేది. మా ఆయన వల్లే ఈ జబ్బు నాకు సంక్రమించిందని అప్పుడూ తెలియలేదు. చెస్ట్ ఆసుపత్రి డాక్టర్లు ఉస్మానియా హాస్పిటల్‌లోని ఎఆర్‌టి సెంటర్‌కి రాశారు. అక్కడ వాళ్లు ఈ జబ్బు గురించి కొంత చెప్పారు. కాని అంతా గందరగోళంగా, భయం భయంగా అనిపించింది. ఈ జబ్బు ఎంత భయంకరమైనదో మెల్ల మెల్లగా తెలిసొచ్చింది.’’

సైడ్ ఎఫెక్ట్స్...

‘‘డాక్టర్లు ఇచ్చిన మందులు వేసుకుంటే ఒక బాధ, వేసుకోకపోతే ఒక బాధలా అయ్యింది నా పరిస్థితి. చాలా పవర్ ఉన్న ట్యాబ్లెట్లు అవడం వల్ల కడుపులో అల్సర్లు వచ్చాయి. విపరీతమైన మంట. బాధను తట్టుకోలేక విలవిల్లాడుతూ అరుస్తుంటే మా అమ్మ ఇంటి బయటకు వెళ్లిపోయి ఏడుస్తూ కూర్చునేది. ఇదేమి జబ్బో అని నన్ను తాకడానికి కూడా భయపడేది. రాత్రుళ్లు ఇంట్లో ఎవరికీ నిద్రలే ఉండేవి కావు. నా కంచం, మంచం, గ్లాసు, సబ్బు... అన్నీ వేరయిపోయాయి. మా చెల్లెళ్ల పిల్లలను దగ్గరకే రానిచ్చేవారు కాదు. ఇంట్లో ఈ తేడా నన్ను మరింతగా కుంగదీసింది. ఇవి చాలదన్నట్టు ఆ మందుల ఎఫెక్ట్‌కి చూపులో తేడా వచ్చింది. ఎడమకన్ను పూర్తిగా చూపు కోల్పోయింది. వీపు మీద పెద్ద కణతి ఏర్పడింది. ఇన్ని సమస్యలను తట్టుకుంటూ ఇంకా బతకడం అవసరమా అని ఏడ్వని రోజు లేదు.’’

బతుకుపై బరోసానిచ్చింది ఓ  సంస్త ...

‘‘మందుల ప్రభావానికి శరీరం అలవాటు పడటం మొదలుపెట్టింది. ఎ.ఆర్.టి సెంటర్ వాళ్లు ఇచ్చే సూచనలు పాటించాను. అక్కడే ఓ అనే ఎన్.జి.ఓ సంస్థ గురించి తెలిసింది. అక్కడ నాలాంటి వారికి ఎన్నో సహాయసహకారాలు అందిస్తున్నారిని తెలిపింది. నా సమస్య నేనే పరిష్కరించుకోవాలని బెరుకుబెరుగ్గానే ఆ  సంస్థ సభ్యులను కలిశాను. నాకొచ్చిన సమస్య చెప్పాను. ‘ఇక్కడ ఉన్నవారంతా హెచ్‌ఐవి బాధితులే. భయపడాల్సిన అవసరం లేదు. జాగ్రత్తలతో వ్యాధిని నియంత్రణలో పెట్టుకోవచ్చు. అన్నింటికన్నా కావల్సింది మనోధైర్యం’ అని చెప్పారు వాళ్లు. అక్కడికెళ్లినప్పుడు ఎంత భయపడ్డానో, వారిచ్చిన కౌన్సెలింగ్ వల్ల అంత ధైర్యం వచ్చింది. పర్వాలేదు ఉన్నన్నాళ్లూ ఆరోగ్యంగా బతకగలను అనే నమ్మకం వచ్చింది.

పోషకాలు గల ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా ఎయిడ్స్ మందులు వాడటం, రోజూ ఏదో రకంగా ఆ  సంస్థ సభ్యులను కలుసుకోవడం చేశాను. అలా తొందరగానే కోలుకోగలిగాను. నాలాంటి హెచ్‌ఐవి బాధితులకు కౌన్సెలింగ్ చేయాలనుకున్నాను. అదే విషయం  సంస్థ సభ్యులకు చెప్పి, వారి సహకారంతో కౌన్సెలింగ్ చేయగలిగే స్థాయికి ఎదిగాను. ఇప్పుడు ఆ సాయం నాలో ఎనలేని సంతృప్తిని నింపుతోంది. పిల్లలులేని నేను ఓ పాపను పెంచుకుంటున్నాను. ఇప్పుడా పాపకు ఏడేళ్లు. ఆ పాప భవిష్యత్తులోనే నా ఆనందాన్ని వెతుక్కుంటున్నాను’’ అని ముగించారు జానకి.

చావే పరిష్కారం అనుకునే ఎంతో మంది హెచ్‌ఐవి బాధితులకు మరణం అంచుల దాకా వెళ్లొచ్చిన జానకి కథనం ఓ ఆదర్శం. హెచ్‌ఐవి సమస్యను అధిగమించడానికి ఎంతోమంది అమాయకులకు కావలసిన మనోధైర్యాన్ని ఇవ్వగలిగే స్థాయికి చేరుకున్న జానకిలాంటి వాళ్లందరికీ ఎయిడ్స్ డే సందర్భంగా అభినందనలు తెలుపుదాం.

హెచ్‌ఐవి బాధితులు మళ్లీ పెళ్లి చేసుకోవచ్చు. సంసారజీవితాన్ని సరైన జాగ్రత్తలతో సుఖసంతోషాలతో గడపవచ్చు. నన్నూ పెళ్లి చేసుకోమని కొంతమంది సూచించారు. కాని పెళ్లి చేసుకో వాలనే ఆలోచన నాకు లేదు. ఎందుకంటే జీవితంలో నాకో దిశ కనిపించింది. గమ్యం ఏంటో అర్థమైంది. అందుకే నాలో ధైర్యాన్ని నింపిన  ఆర్గనైజేషన్‌లోనే కౌన్సెలర్‌గా చేరాను.
- జానకి