Sunday, October 14, 2012

తెలుగును కాపాడుకోవాలి

సినీ నిర్మాత డి.రామానాయుడు

- ఢిల్లీ తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో జీవిత సాఫల్య పురస్కారం

 
న్యూఢిల్లీ, న్యూస్‌లైన్: ‘దేశభాషలందు తెలుగు లెస్స...’ అని కృష్ణదేవ రాయలు తెలుగు భాషను కీర్తించారంటూ గొప్పగా చెప్పుకోవడం తప్ప మాతృభాషను కాపాడుకునేందుకు, సంస్కరించుకునేందుకు మనం ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, ప్రముఖ సినీ నిర్మాత డా.డి.రామానాయుడు అభిప్రాయపడ్డారు. ఢిల్లీలోని మావలంకర్ ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన ఢిల్లీ తెలుగు అకాడమీ(డీటీఏ) 25వ వార్షికోత్సవంలో భాగంగా రామానాయుడిని డీటీఏ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రానురాను తెలుగు మాట, పాట దిగజారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుపైన అభిమానంతో ఎన్నో చిత్రాలు తీశానని, తన మనవడు రాణాకు సైతం తెలుగులో నటించాలని సూచిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పౌరవిమానయానశాఖ మంత్రి అజిత్‌సింగ్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ప్రముఖ నాయకులందరితోనూ స్నేహసంబంధాలున్నాయన్నారు.

భారతీయ చిత్రపరిశ్రమలో ఎంతో ఉన్నత శిఖరాలు అధిరోహించిన డా.రామానాయుడుకు డీటీఏ జీవిత సాఫల్య పురస్కారం లభించడం ఆనందంగా ఉందని ప్రముఖ హాస్య నటుడు, మాజీ మంత్రి బాబూమోహన్ అన్నారు. తెలుగువారంతా ఎంతో ప్రతిభావంతులని, కానీ వారిలో అంతర్గతంగా అంతరాలున్నాయని పౌరసరఫరాల శాఖమంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు. నటుడు సుమన్ మాట్లాడుతూ రామానాయుడు అకుంఠిత దీక్షతో పని చేస్తారన్నారు.

 
ఢిల్లీలోని తెలుగువారినంతా ఒక్కచోట చేరుస్తున్న ఢిల్లీ తెలుగు అకాడమీని వక్తలు పొగడ్తలతో ముంచెత్తారు. కార్యక్రమంలో ఎంపీ జేడీ.శీలం, రిటైర్డ్ ఐఏఎస్ డా.మోహన్‌కందా, నటీనటులు కృష్ణుడు, కుంచె రఘు, కవిత, శివపార్వతి, గుండు హనుమంతరావు, పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు పాల్గొన్నారు. వార్షికోత్సవం సందర్భంగా నిర్విహ ంచిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి.

No comments: