Saturday, October 20, 2012

మీ పాలసీ కరెక్టేనా..?

ముందుచూపు ఉన్న ముకుందరావుకి పాప పుట్టింది. ఇరవై ఏళ్ల తర్వాత అమ్మాయి పెళ్లి ఘనంగా చేయాలన్న ఉద్దేశంతో ఇప్పటి నుంచే అమ్మాయి పేరుపై ఇన్వెస్ట్ చేయాలనుకున్నాడు. అదే విషయాన్ని తన మిత్రుడు సుబ్బారావు చెవిన వేశాడు. ఆ మాట విన్న వెంటనే ఎల్‌ఐసీలో ‘కోమల్ జీవన్’ పాలసీ తీసుకోమని సలహా ఇచ్చాడు సుబ్బారావు. అప్పటికే ఆ పథకం గురించి కొంత అవగాహన ఉన్న ముకుందరావు వెంటనే పాలసీ తీసుకున్నాడు. కాని... ఈ మధ్యనే ముకుందరావుకి తాను చేస్తున్న పెట్టుబడులు, లక్ష్యాలకు అనుగుణంగా లేవన్న అనుమానం వచ్చి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్(సీఎఫ్‌వో)ను కలిశాడు. పిల్లల ఉన్నత చదువుల ప్రణాళికల గురించి చెప్పిన తర్వాత, అమ్మాయి పెళ్లి కోసం కోమల్ జీవన్‌లో ఇన్వెస్ట్‌మెంట్ సంగతి చెప్పాడు. ఆ మాట విన్నవెంటనే, పెళ్లి కోసమైతే ఈ పథకంలో ఇన్వెస్ట్‌మెంట్‌ను ఆపేయమని సలహా ఇచ్చాడు సీఎఫ్‌వో. ఇంత మంచి పథకంలో ఇన్వెస్ట్‌మెంట్ ఆపేయమంటారేంటి? అన్నట్టుగా సందేహంగా చూశాడు ముకుందరావు.



అతని అనుమానాన్ని పసిగట్టిన సీఎఫ్‌వో ‘కోమల్ జీవన్’ పాలసీ మంచిదే కాని అది మీ లక్ష్యానికి సరిపోదన్నాడు. ‘కోమల్ జీవన్’ ఒకేసారి భారీ మొత్తాన్ని అందించదని, మనీబ్యాక్ రూపంలో 18 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాలకు వరకు ప్రతీ రెండేళ్లకు ఇస్తుంది కాబట్టి ఈ పథకంలో ఇన్వెస్ట్‌మెంట్‌ను ఆపేయమన్నాడు. మీ లక్ష్యానికి ఇదే సంస్థకు చెందిన ‘‘చైల్డ్ డిఫర్డ్ ఎండోమెంట్ వెస్టింగ్ ఎట్ 21 బాగుంటుంది... ఇన్వెస్ట్‌మెంట్‌ను అందులోకి మార్చుకోండి’’ అని సూచించాడు. ముకుందరావుకు దూరదృష్టి ఉంది కాబట్టి సీఎఫ్‌వో దగ్గరికెళ్లి తన పెట్టుబడులను ఒకసారి చెక్ చేసుకున్నాడు. కాని మనలో చాలామంది పిల్లల కోసం రకరకాల పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తారే కాని అవి చివరికి వారి లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నాయో లేవో పరిశీలించుకోరు.

ఇప్పుడు పిల్లలు పుట్టగానే వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్‌మెంట్ ప్రారంభించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కాని ఇందులో అనేక మంది ఆ పథకం తమ ఆర్థిక లక్ష్యానికి సరిపోతుందా లేదా అన్న విషయాన్ని పరిశీలించుకోకుండా పక్కింటి వాళ్లు చెప్పారనో, లేదా బీమా ఏజెంట్ సిఫార్సు చేశారనో ప్రారంభిస్తుంటారు. ఫలితం ఏమంటే.... తీరా అవసరం వచ్చినప్పుడు అవి అక్కరకురాక ఇబ్బందులు పడుతుంటారు. అందుకనే ఏదైనా పథకం ఎంచుకునేటప్పుడు అది తమ లక్ష్యానికి అనువుగా ఉందో లేదో అన్న విషయాన్ని ముందే పరిశీలించాలి. పిల్లల కోసం పాలసీలు తీసుకునేటప్పుడు గమనించాల్సిన అంశాలను పరిశీలిద్దాం.



లక్ష్యంపై స్పష్టత అవసరం...

చాలా మంది తమ పిల్లల భవిష్యత్తు అవసరాలకు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ప్రధానంగా రెండు లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. ఒకటి వారి చదువుల కోసమైతే మరొకటి పిల్లల పెళ్లి ఖర్చుల కోసం. ఈ రెండూ భిన్నమైన లక్ష్యాలు కాబట్టి వీటికి ఒకే రకమైన పాలసీలు తీసుకోలేం. ఉదాహరణకు ఉన్నత చదువుల కోసమైతే పిల్లల వయస్సు 18 సంవత్సరాలు దాటిన తర్వాత ఒకేసారిగా లేక విడతలు విడతలుగా కొంత మొత్తం వచ్చే పాలసీని ఎంచుకోవచ్చు. అదే పిల్లల వివాహ ఖర్చుల కోసమైతే ఒకేసారి మొత్తం చేతికి వచ్చే పాలసీని మాత్రమే ఎంచుకోండి. ఎల్‌ఐసీ ‘జీవన్ అంకుర్’, చైల్డ్ డిఫర్డ్ ఎండోమెంట్ వెస్టింగ్ ఎట్ 21, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ స్మార్ట్ కిడ్ రెగ్యులర్ వంటి పాలసీలు అనువుగా ఉంటాయి.



బీమా పథకంపై అవగాహన

పిల్లల విద్యా వ్యయం ఏటా 10% చొప్పున పెరుగుతున్నట్లు గణాంకాలు చెపుతున్నాయి. మరి ఇలాంటి సమయంలో తక్కువ రాబడినిచ్చే బీమా పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం సరైన నిర్ణయమేనా అన్నది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. సాధారణంగా పిల్లల కోసం నిర్దేశించిన బీమా పథకాలు 5-6% మించి రాబడిని ఇవ్వడం లేదు. కాబట్టి పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో పెట్టుకుంటే బీమాలో ఇన్వెస్ట్‌మెంట్ అనేది వివేకవంతమైన నిర్ణయంగా కనిపించదు. అందుకే చాలామంది సీఎఫ్‌వోలు ఇన్వెస్ట్‌మెంట్‌పరంగా బీమా పథకాలను సిఫార్సు చేయరు. పెట్టుబడుల గురించి ఎప్పటికప్పుడు సలహాలు ఇచ్చే ఆర్థికవేత్తలు అందుబాటులో లేనివారు రాబడి తక్కువగా ఉన్నా అనేక ఇతర ప్రయోజనాలున్న బీమా పథకాల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. తల్లిదండ్రులకు లభించే బీమా రక్షణ, పన్ను ప్రయోజనాలు, రిస్క్ లేకపోవడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే వీటిల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు.

రిస్క్ చేయగలిగితే...

స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్‌పై అంతగా అవగాహన లేకపోయినా కొద్దిగా రిస్క్ తీసుకునే సామర్థ్యం ఉంటే ఎండోమెంట్ పాలసీల కంటే అధిక రాబడి పొందడానికి వీలుంటే యులిప్స్ వైపు దృష్టి పెట్టొచ్చు. పిల్లల ఆర్థిక అవసరాలు సాధారణంగా దీర్ఘకాలిక లక్ష్యాలు కాబట్టి వాటి కోసం ప్రత్యేకంగా రూపొందించిన యులిప్స్ పథకాలను పరిశీలించొచ్చు. ఇవి ఒక లక్ష్యం కోసం ఇన్వెస్ట్ చేసేవి కాబట్టి పూర్తి రిస్క్ కాకుండా తక్కువ రిస్క్ ఉండే బ్యాలెన్స్‌డ్ పథకాలను ఎంచుకోండి. దీనివల్ల అటు బీమా రక్షణ, ఇటు పన్ను ప్రయోజనాలతో పాటు ఎండోమెంట్ పాలసీల కంటే అధిక రాబడిని పొందే అవకాశం ఉంటుంది. మాక్స్‌లైఫ్ సురక్ష-2, హెచ్‌డీఎఫ్‌సీలైఫ్ యంగ్‌స్టార్-2, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ స్మార్ట్‌కిడ్, ఎస్‌బీఐ స్మార్ట్ స్కాలర్ వంటివి ఈ కోవలోకి వస్తాయి.

వైవర్ రైడర్ మరవద్దు

పిల్లల బీమా పాలసీలతో పాటు అనేక రైడర్లు అందుబాటులో ఉన్నా వైవర్ ఆఫ్ ప్రీమియం రైడర్ లేదా పేయర్ బెనిఫిట్ రైడర్ తీసుకోవడం మర్చిపోవద్దు. దీనివల్ల ప్రీమియం చెల్లించే తండ్రి/తల్లి/సంరక్షకులకు అనుకోని సంఘటన ఏదైనా జరిగితే పాలసీ రద్దు కాకుండా భవిష్యత్తు ప్రీమియంలు చెల్లించకుండానే పాలసీ కొనసాగుతుంది. రెగ్యులర్ పాలసీకి చెల్లించే ప్రీమియానికి అదనంగా కొంతమొత్తం చెల్లించడం ద్వారా దీన్ని పొందవచ్చు. తద్వారా పిల్లల ఆర్థిక లక్ష్యానికి ఎలాంటి విఘాతం ఏర్పడదు.

No comments: