Thursday, October 11, 2012

చైనాకు తొలిసారి సాహిత్య నోబెల్

ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన సాహిత్య నోబెల్ తొలిసారి చైనాకు దక్కింది. ‘మో యాన్’ పేరుతో రచనలు సాగించి చైనా సాహిత్యంలో మేటి కథకుడిగా నీరాజనాలందుకుంటున్న గ్వాన్ మొయె(57)కు సాహిత్య విభాగంలో నోబెల్ బహుమతి దక్కింది. దీంతో వందేళ్లుగా ఊరిస్తున్న ఈ పురస్కారం తొలిసారి ఆ దేశాన్ని వరించినట్లయింది. ఈ అవార్డుకు సహజంగా యూర ప్ రచయితలవైపు మొగ్గుచూపే స్వీడిష్ అకాడమీ- నోబెల్ సాహిత్య జ్యూరీ ఈసారి మో యాన్‌ను ఎంపిక చేయడం చైనాను ఆశ్చర్యపరిచింది. చైనా రచయితకు నోబెల్ రావడం తొలిసారే అయినా చైనా జాతీయుడికి నోబెల్ రావడం రెండోసారి. చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రచనలు చేసి ఫ్రాన్స్‌లో స్థిరపడ్డ గావో జింజియాన్‌కు 2000 సంవత్సరంలో ఈ అవార్డు వరించింది. గ్వాన్ మొయె కలం పేరు ‘మో యాన్’ దీని అర్థం ‘మాట్లాడకు’. మో రచనల్లో ‘కాల్పనిక వాస్తవికత’ శైలి అద్భుతమని నోబెల్ కమిటీ వ్యాఖ్యానించింది. జానపద గాథలను, చరిత్ర, ప్రస్తుత సంఘటనలను మిళితం చేస్తూ రచనలు సాగించిన మోకు నోబెల్‌ను ప్రకటిస్తూ, కమిటీ అభినందనలు తెలిపింది.
 
పేదరికం, కష్టాలే కథాంశాలు!

ఒక వ్యవసాయాధార కుటుంబంలో నాలుగో వాడిగా గ్వాన్ 1955లో జన్మించారు. పేదరికం, ఆకలిని అనుభవాలుగా చేసుకుని తర్వాత కాలంలో తన రచనల్లో వాటిని కళ్లకు కట్టారు ఈ రచయిత. గ్వాన్‌కు పన్నెండేళ్ల వయసప్పుడు కుటుంబ కారణాల రీత్యా స్కూలు మానేయాల్సి వచ్చింది. వ్యవసాయపు పనులు చేసుకుంటేనే మో పుస్తక పఠనాన్ని అలవరచుకున్నారు, పుస్తకాల పురుగుగా మారారు, ఆఖరికి డిక్షనరీని కూడా వదల్లేదట! గ్వాన్ 20 ఏళ్ల వయసులో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్‌ఏ)లో చేరారు. అక్కడి నుంచి ‘మో యాన్’ పేరుతో రచనావ్యాసంగం మొదలైంది. 1981లో చైనా లిటరరీ జనరల్‌లో మో తొలి కథ ప్రచురితం అయ్యింది.



1987లో ‘రెడ్ సొర్గమ్’ అనే నవల తో మో పేరు మార్మోగింది. తన అనుభవాలతో మో రాసిన ‘హోంగ్ గౌలియంగ్ గిజూ’, చైనా సామాజిక పరిస్థితులపై సునిశిత వ్యంగ్యాస్త్రం‘గిజూ’ నవలలు అక్కడి యువతరాన్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. మో రచనా శైలిలో చైనీ రాజకీయ విమర్శకుడు లూ జున్, గ్యాబ్రియల్ గార్సియా మార్క్వేజ్‌ల ప్రభావం అమితంగా ఉంటుంది. మో రాసిన అనేక నవలలు ఇంగ్లీషులోకి అనువాదమయ్యాయి. ది రిపబ్లిక్ ఆఫ్ వైన్, లైఫ్ అండ్ డెత్ ఆర్ వియరింగ్ మీ ఔట్, శాండిల్‌వుడ్ డెత్, బిగ్ బ్రీస్ట్స్, వైడ్ హిప్స్... పేర్లతో అచ్చయ్యాయి.

మో బహుమతిపై భారీ బెట్టింగులు!

ఈ ఏడాది మో యాన్‌కు నోబెల్ దక్కుతుందా లేదా అనే అంశంపై విపరీతంగా బెట్టింగ్ నడిచింది! ఈ అంశంపై బ్రిటన్, స్వీడిష్ బెట్టింగ్ ఏజెన్సీలు భారీ బెట్టింగ్ నడిపినట్టు సమాచారం. చాలా ఏళ్లుగా చైనీయులు ఎవ్వరూ ‘సాహిత్య నోబెల్’ ఛాయల్లోకి కూడా వెళ్లలేకపోవడమే దీనికి కారణమని విశ్లేషకులు అంటారు. జపాన్ రచయిత హరుకి మురకమి, మో యాన్‌ల మధ్య ప్రధాన పోటీ ఉంటుందనే అంచనాలతో బెట్టింగులు నడిచాయి. అవార్డు ప్రకటనతో మో పై బెట్టింగ్ కట్టిన వారి పంట పండింది!

No comments: