Friday, October 19, 2012

సాగరళం..


 హుస్సేన్ సాగర్ జలాశయంలో కాలుష్య స్థాయి ఆందోళన కలిగించే రీతిలో పెరిగింది. జలాశయంలో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ బాగా పెరగడంతో జలచరాల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. వృక్ష, జంతు ప్లవకాలు, ఇతర జలచరాల మనుగడకు అత్యావశ్యకమైన ‘కరిగిన ఆక్సీజన్ (డీఓ)’స్థాయిపడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) మార్గదర్శకాల ప్రకారం ఈ జలాశయం అత్యంత కాలుష్యకాసారమైన ‘ఇ’ కేటగిరీ జలాశయంగా నమోదైంది. గతేడాదితో పోలిస్తే కాలుష్య స్థాయి గణనీయంగా పెరిగి నట్లు పీసీబీ తాజా నివేదిక బట్టబయలుచేసింది. సెప్టెంబరులో గణేష్ నిమజ్జనానికి ముందు, ఆ తరవాత జలాశయంలో వివిధ కాలుష్య ప్రమాణాల స్థాయిలను తాజా నివేదికలో పొందుపరిచారు. జాతీయ నీటి నాణ్యతా పర్యవేక్షణ కింద ఈ నివేదిక సిద్ధంచేసినట్లు పీసీబీ వర్గాలు తెలిపాయి. సెప్టెంబరు 17కు ముందు, 26 నుంచి 29 తేదీల మధ్యన కాలుష్య ప్రమాణాల స్థాయిలను లెక్కించి ఈ నివేదికలో పేర్కొన్నారు. ఐదు ప్రాంతాల్లో నీటి నమూనాలను సేకరించి పరిశోధించామన్నారు.



నీటి నమూనాలు స్వీకరించిన ప్రాంతాలివే..

ఎన్‌టీఆర్ పార్క్ ఎదురుగా(ప్లాట్‌ఫాం నెం.1, ప్లాట్‌ఫాం నెం.2), నక్లెస్‌రోడ్, లేపాక్షి హ్యాండిక్రాఫ్ట్స్, బుద్ధవిగ్రహం (సాగరం నడిబొడ్డున ఉన్నది) ప్రాంతాల్లో నమూనాలు సేకరించారు

.

పీసీబీ నివేదిక వెల్లడించిన అంశాలివే..



నిమజ్జనానికి ముందు, ఆ తర్వాత జలాల గాఢత (పీహెచ్) విలువ 7.38 - 8.1 మధ్య ఉంది.



టీడీఎస్ (నీటిలో కరిగిన ఘన పదార్థాలు) విలువ లీటరు నీటికి 550 నుంచి 853 మి.గ్రా. ఉంది. లుంబినీ పార్క్ వద్ద అత్యధికంగా, బుద్ధవిగ్రహం వద్ద తక్కువగా నమోదైంది.



డీఓ పరిమాణం తగ్గడంతో జలచరాల మనుగడ ప్రశ్నార్థకమైంది.



కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (సీఓడి) ఎన్‌టీఆర్ పార్క్-ప్లాట్‌ఫాం నెం.2 వద్ద లీటరు నీటికి 85 నుంచి 210 మి.గ్రా. పెరిగింది.



బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీఓడీ) స్థాయి.. లీటరు నీటికి లుంబినీ పార్క్ వద్ద అత్యధికంగా 20-90 మి.గ్రా. మధ్యనుంది.



సాగర్‌లో లీటరు నీటికి సీఓడీ స్థాయి 90-100 మి.గ్రా. ఉంది.



భారలోహాల స్థాయి లీటరు నీటికి 0.01 మి.గ్రా. నమోదైంది.



నిరుడు నిమజ్జనం కంటే ఈసారి కాలుష్య స్థాయి బాగా పెరిగింది.



సీపీసీబీ హుస్సేన్‌సాగర్‌ను ‘ఇ’ స్థాయి జలాశయంగా ప్రకటించింది.



సాగరం నడిబొడ్డున కాలుష్య స్థాయి తక్కువే.



జలాశయంలో నిమజ్జనమైన విగ్రహాలను జీహెచ్‌ఎంసీ సిబ్బంది 48 గంటల్లోగా తొలగించినట్లు ప్రకటించారు.

No comments: