Wednesday, October 17, 2012

జేఈఈ-2013 పై పిటిషన్‌

హైదరాబాద్, అక్టోబర్ 16: ఐఐటీల్లో ప్రవేశానికి సంబంధించిన పరీక్ష జేఈఈ-2013 నిబంధనల్లో మార్పులు చేయడాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్‌కు సంబంధించి హైకోర్టు మంగళవారం ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. కేంద్ర మానవ వనురుల శాఖ కార్యదర్శి, సీబీఎస్ఈ బోర్డు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ అపెక్స్ బోర్డుకు ఈ నోటీసులిచ్చింది.

 

జేఈఈ-2013 నిబంధనల్లో మార్పులు చేయడాన్ని ప్రశ్నిస్తూ హైదరాబాద్‌కు చెందిన కె.కీర్తి మరో 8 మంది హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది ఎస్.శ్రీరాం వాదనలు వినిపించారు. ఇప్పటి వరకు జేఈఈ ఎంట్రెన్స్ టెస్ట్ రాయడానికి ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 10+2లో 55 శాతం మార్కులు, ఇతరులు 60శాతం మార్కులు పొందితే అర్హులుగా పరిగణిస్తూ వస్తున్నారని తెలిపారు. జేఈఈ-2013కు మాత్రం 10+2లో అర్హత సాధించిన అందరినీ జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్ ఎంట్రెన్స్ పరీక్షలు రాయడానికి అనుమతిస్తూ మార్పులు చేశారని తెలిపారు.

 
దీని వల్ల జేఈఈ మెయిన్‌లో గరిష్ఠంగా లక్షా 50వేల ర్యాంక్ పొందే సీబీఎస్ఈ విద్యార్థి కూడా జేఈఈ అడ్వాన్స్ టెస్ట్ రాసి ఐఐటీల్లో సీటు పొందే అవకాశం ఉందని తెలిపారు. ఈ విధానం వల్ల జేఈఈలో వెయ్యో ర్యాంక్ పొందిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థికి ఐఐటీలో సీటు లభించే అవకాశం రాకుండా పోతుందని పేర్కొన్నారు. నూతన విధానం ప్రతి రాష్ట్రం నుంచి 10+2లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను 20శాతానికి పరిమితం చేయడమే దీనికి కారణమని వివరించారు. ఈ వాదనలు విన్న హైకోర్టు కేంద్రానికి నోటీసులు జారీచేస్తూ కేసు తదుపరి విచారణను 29కి వాయిదా వేసింది

No comments: