Saturday, October 6, 2012

రిటైర్మెంట్ గురించి ఆలోచించడం చాలా కఠినం-సచిన్

ఇంతకాలం రిటైర్మెంట్‌పై ఎలాంటి ఆలోచన లేదంటూ వచ్చిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెండూల్కర్ చివరికి మనసులో మాట బైటపెట్టాడు. 39 ఏళ్లు నిండిన తాను ఎంతోకాలం క్రికెట్ ఆడలేనని స్పష్టం చేశాడు. చురుకుదనం తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశాడు. రిటైర్మెంట్ ఎప్పుడన్నది ఇంకా తేల్చుకోలేదని, అయితే, ఈ విషయంపై చాలాకాలంగా ఆలోచిస్తున్నానని ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సచిన్ పేర్కొన్నాడు. వచ్చేనెల, ఆత్మప్రబోధాన్ని అనుసరించి నిర్ణయం తీసుకుంటానని అన్నాడు. సిరీస్‌ల వారీగా, అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలను ప్రకటించడం మేలని భావిస్తున్నట్టు సచిన్ తెలిపాడు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, రిటైర్మెంట్ గురించి ఆలోచించడం చాలా కఠినమని వ్యాఖ్యానించాడు. క్రికెట్ ఆటే లోకంగా గడిపానని, మరో ప్రపంచం తెలియని తనకు రిటైర్మెంట్ గురించిన ఆలోచనే గందరగోళానికి గురి చేస్తుందని అన్నాడు. అయితే,


ఎల్లకాలం క్రీడాకారుడిగా ఉండిపోవడం ఎవరికీ సాధ్యం కాదని సచిన్ పేర్కొన్నాడు. రిటైర్మెంట్ తాలూకు ఎలాంటి ఆలోచనలు తనకు ఇంతకాలం రాలేదుకాబట్టి, ఇప్పుడు అంతా కొత్తగానూ, బాధాకరంగానూ ఉందని చెప్పాడు. 2015 ప్రపంచకప్ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటారా? అన్న ప్రశ్నకు లేదని సచిన్ సమాధానమిచ్చాడు. ‘అలాంటి అవకాశమే లేదు. నేను నిర్మొహమాటంగా మాట్లాడతాను. ప్రస్తుత పరిస్థితుల్లో నా శరీరం ఆటకు పూర్తిగా సహకరించడం లేదు. వయసు పెరుగుతున్న కొద్దీ చురుకుదనం లోపిస్తుంది. మూడేళ్ల తర్వాత వచ్చే ప్రపంచకప్‌లో ఆడడం అసాధ్యమనే అనుకుంటున్నాను’ అన్నాడు. అభిమానులు, జట్టు మేనేజ్‌మెంట్ అంచనాలకు తగిన స్థాయిలో రాణించడానికి విశేషంగా శ్రమిస్తున్నారా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ అలా ఉండడంలో తప్పేమిటని ఎదురు ప్రశ్న వేశాడు. జాతీయ జట్టుకు ఎంపికైన మరుక్షణం నుంచి దేశానికి శక్తివంచన లేకుండా సేవలు అందించడానికే కృషి చేస్తున్నానని అన్నాడు. ఇందుకోసం నిరంతరం కృషి చేస్తునే ఉన్నానని తెలిపాడు. కష్టపడకపోతే ఉత్తమ సేవలను ఎలా అందిస్తామని అడిగాడు. తాను శ్రమించకపోతే ప్రశ్నించాలేగానీ, ఆటలో రాణించడానికి కష్టపడితే ప్రశ్నించడంలో అర్థం ఉండదని అన్నాడు.

న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో వరుసగా మూడు ఇన్నింగ్స్‌లో క్లీన్ బౌల్డ్ అయిన సచిన్‌కు శరీరం సహకరించడం లేదని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ హితవు పలికాడు. ఈ వ్యాఖ్యలను ప్రస్తావించగా, తనకు అనుకూలంగా గవాస్కర్ ఎన్నో మాటలు చెప్పాడని సచిన్ వ్యాఖ్యానించాడు. తనపై చేసిన ఒకే ఒక విమర్శకు ఇంతగా ప్రాధాన్యం ఇవ్వడం ఎందుకో అర్థం కావడం లేదని అన్నాడు. తాను 25 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఇదే విధంగా మూడు సార్లు బౌల్డ్ అయితే ఎవరూ పట్టించుకునేవారు కారని, ఇప్పుడు తన వయసు 39 సంవత్సరాలుకాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నాడు.

సచిన్‌కు వయసు మీదపడుతున్నదని మరో మాజీ కెప్టెన్ మహమ్మద్ అజరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై మాస్టర్ బ్లాస్టర్ సానుకూలంగానే స్పందించాడు. 30 ఏళ్ల తర్వాత క్రమంగా ఆటతీరు మారుతుందని ఆస్ట్రేలియా ‘క్రికెట్ లెజెండ్’ సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ తనతో స్వయంగా చెప్పాడని సచిన్ అన్నాడు. 30 ఏళ్లు దాటిన తర్వాత తొమ్మిది సంవత్సరాలు తాను ఉత్తమ స్థాయిలో రాణించడం విశేషమేనని వ్యాఖ్యానించాడు. ఇతరులు తన గురించి ఏమి అనుకుంటున్నారన్నది తనకు అనవసరమని సచిన్ స్పష్టం చేశాడు. తనకుతాను తప్ప ఎవరికీ జవాబుదారీ వహించాల్సిన అవసరం లేదన్నాడు. క్రికెట్‌లో కొనసాగలేనని అనిపించిన వెంటనే వైదొలగుతానని చెప్పాడు. రిటైర్మెంట్ గురించి స్పష్టమైన తేదీ లేదా సమయం ఇవ్వలేనని, మనసుకు ఎలా తోస్తే అలా నిర్ణయం తీసుకుంటానని తెలిపాడు. 22 సంవత్సరాల కెరీర్‌లో బాధపడిన సందర్భాలు లేవని, అలాంటి సమయం రాకముందే భవిష్యత్తుపై ప్రకటన చేస్తానని అన్నాడు.

ఇలావుంటే, రిటైర్మెంట్‌పై సచిన్ మల్లగుల్లాలు పడుతున్నట్టు స్పష్టమవుతోంది. ఇటీవల కాలంలో అతని ఫామ్‌పై అభిమానులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. సెలక్టర్లు వేటు వేసే వరకూ వేచిచూడకుండా, గౌరవంగా వైదొలగడం మేలని పలువురు మాజీ క్రికెటర్లు సచిన్‌కు సలహా చెప్పారు. అభిమానుల్లోనూ క్రమంగా అతని పట్ల వ్యతిరేకత పెరుగుతున్నది. యువ ఆటగాళ్లు జట్టులోకి రాకుండా అడ్డుకుంటున్నాడన్న విమర్శ కూడా లేకపోలేదు. ఈ పరిస్థితుల్లో రిటైర్మెంట్‌పై ఎదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అతనికి ఏర్పడింది. అందరూ సూచిస్తున్నట్టు కెరీర్‌లో అత్యున్నతంగా ఉన్నప్పుడు హుందాగా తప్పుకోవడం వల్ల గౌరవం పెరుగుతుందని సచిన్ తన సన్నిహితుల ముందు వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. మొత్తం మీద క్రికెట్‌కు గుడ్‌బై చెప్పక తప్పదని సచిన్ ఒక నిర్ధారణకు వచ్చినట్టు అతని ప్రకటన స్పష్టం చేస్తున్నది.

ప్రపంచకప్ చాంపియన్‌షిప్‌ను సాధించాలన్న సచిన్ చిరకాల కోరిక గత ఏడాది నెరవేరింది. విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టులో అతను సభ్యుడిగా ఉన్నాడు. క్రికెట్‌లో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన సచిన్ సాధించాల్సిన రికార్డులుగానీ, అందుకోవాల్సిన అవార్డులుగానీ లేవు. చివరికి మన దేశంలోనే అత్యున్నత పురస్కారమైన ‘భారతరత్న’ సచిన్‌కు ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తున్నదంటే, అతనికి ప్రజల్లో ఉన్న అభిమానం ఎలాంటిదో ఊహించడం కష్టం కాదు. రికార్డుల రారాజుగా పేరు తెచ్చుకున్న సచిన్‌ను ‘గాడ్ ఆఫ్ క్రికెట్’ అంటూ అభిమానులు ఆరాధిస్తున్నారు. వారి నుంచి వ్యతిరేకత వ్యక్తం కాకముందే రిటైర్‌కావడం సచిన్‌కు గౌరవం. అతను కూడా అదే విషయా న్ని ఆలోచిస్తున్నట్టు ఇంటర్వ్యూలో పరోక్షంగా చెప్పేశాడు. పరిస్థితు లు ఇప్పుడు తనకు అనుకూలంగా లేవన్న వాస్తవాన్ని సచిన్ గ్రహించాడు. పైగా శరీరం మునుపటి మాదిరి సహకరించడం లేదని, మైదానంలో చురుకుదనం తగ్గిందని సచిన్ అంగీకరించా డు. రెండు దశాబ్దాలకుపైగా జాతీయ జట్టులో కొనసాగి, అన్యు న్నత శిఖరాలను చేరుకున్న అతను సాధించాల్సింది ఏమీ లేదు. గౌరవంగా రిటైరైతే అతని లక్ష్యం నెరవేరినట్టే.

No comments: