Sunday, October 21, 2012

మీ ఫోన్.. వారి రక్తం!

కాంగోలో తీవ్రవాద ముఠాల దారుణ కాండ..

కుటుంబ సభ్యుల ఎదుటే అత్యాచారాలు, హత్యలు

బాలబాలికలతో వెట్టి చాకిరీ.

గనుల కోసమే ఆకృత్యాలు

ఆ లోహాలతో సెల్‌ఫోన్ సహా ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ..

ఏడాదికి 900 కోట్లు..

అన్ని తీవ్రవాద కార్యకలాపాలకే!..

                                                             


                                                          
కాంగో నుంచి ఖనిజాలు కొనొద్దు: 'సేవ్ ది కాంగో'!


'బ్లడ్ ఇన్ మొబైల్' పేరిట లఘు చిత్రం.. 
  
ఇంటర్‌నెట్‌లో విడుదల

మీరు కొన్న టాబ్లెట్ కంప్యూటర్ విలువెంతో తెలుసా..? కాంగో దేశంలో ఒక మహిళ మానం!? అదే మీ ల్యాప్‌టాప్ కోసం ఖర్చయ్యిందెంతో తెలుసా..? ఆ దేశంలో ఒక మనిషి ప్రాణం!? మనం కొంటున్న సెల్‌ఫోన్ విలువ.. ఆవిరవుతున్న ఒక బాల్యం..!? ఇంతేకాదు.. మనం కొనే ప్రతీ ఎలక్ట్రానిక్ వస్తువు వెనుకా.. కాంగో దేశ ప్రజల కన్నీరు ఉంటుంది. ఆ దేశంలో ఓ నేరంతో అది సంబంధాన్ని కలిగి ఉంటుంది.

కాంగో.. ఆఫ్రికా ఖండం మధ్యలో ఉండే ఓ పేద దేశం. కానీ.. బంగారం, వజ్రాలు, రబ్బరు, కాస్సిటరైట్ వంటి ఖరీదైన ఖనిజ వనరులకు నిలయం. ఇలాంటి వనరులు ఉండడం ఏ దేశానికైనా ఒక వరం. కానీ.. కాంగోకు మాత్రం అదే పెద్ద శాపం. అక్కడి తీవ్రవాద ముఠాలు తమ అకృత్యాలు, దారుణాలతో ఒక వ్యవస్థీకృత రూపా న్ని సంతరించుకోవడానికి అవే కార ణం.

ఇదెంత తీవ్రమంటే.. గత పదిహేనేళ్లలో 50 లక్షల మంది ప్రాణాలు తీసేటంత..! మూడు లక్షల మంది మ హిళలు, బాలికలు అత్యాచారానికి గు రయ్యేటంత..! రెండో ప్రపంచ యుద్ధానంతరం ప్రారంభమైన ఈ దారుణ మారణ సంస్కృతి.. ఇప్పుడు తారస్థాయికి చేరింది. కాస్సిటరైట్.. తగరం (టిన్) ఉత్పత్తికి వినియోగించే ము ఖ్య ముడి ఖనిజం. మొబైల్ ఫోన్లు సహా ఎలక్ట్రానిక్ పరికరాలన్నింటి తయారీలోనూ తగరాన్ని ఉపయోగిస్తారు.

ప్రపంచవ్యాప్తంగా మొబైల్‌ఫోన్లు సహా ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం పెరిగిపోవడంతో.. ఈ లో హాల ధర కూడా విపరీతంగా పెరిగింది. దీంతో అక్కడి తీవ్రవాద ముఠా లు.. ఈ ఖనిజాల గనుల కోసం అకృత్యాలకు పాల్పడటం మొదలుపెట్టాయి. ఆ ఖనిజాలను ఎగుమతి చేయగా వచ్చిన డబ్బును తీవ్రవాద కార్యకలాపాల కోసం వెచ్చిస్తున్నాయి.

ఇలా ఏటా ఆ తీవ్రవాద సంస్థలు సేకరిస్తున్న డబ్బు ఎంతో తెలుసా.. రూ.900 కోట్లు! తూర్పు కాంగోలో మొత్తంగా 200 వరకు గనులు ఉండవచ్చని అంచనా. అందులోని 13 పెద్ద గనుల్లో 12 తీవ్రవాద ముఠాల చేతుల్లోనే ఉన్నా యి. కొన్నేమో రువాండా డెమొక్రటిక్ దళాల ఆధీనంలో ఉన్నాయి. ఇక మిగతావి కాంగో అధికారిక సైన్యం చేతిలో ఉన్నాయి.
చిత్రమైన విషయం ఏమిటంటే.. ఈ ప్రభుత్వ సైన్యంలో ఉన్న సైనికుల్లో చాలా భాగం అంతకు ముందు తీవ్రవాద గ్రూపుల్లో పనిచేసి వచ్చినవారే. మొత్తంగా ఎవరైనా.. దోచుకోవడం, హింసించడమే ప్రధానంగా మారిపోయింది. 200 గనుల్లో సగానికి పైగా తీవ్రవాద, ప్రభుత్వ దళాలే చేజిక్కించుకున్నాయి. ఇందుకోసం గనులు, భూముల యజమానులను బెదిరించడం.. వినకపోతే వారి కుటుంబాల్లోని మహిళలు, బాలికలపై వారి ముందే అత్యాచారాలకు పాల్పడడం వంటి అకృత్యాలకు పాల్పడుతున్నాయి.



ఈ గనుల్లోంచి వెలికితీసిన ఖనిజాలను బుకావు, గోమా నగరాల ద్వారా ఎగుమతి చేసే సంస్థలకు చేరుస్తారు. అదీ అక్రమ మార్గంలోనే. ప్రభుత్వానికి పన్ను చెల్లింపూ ఉండదు. ఎగుమతి సంస్థలు ఆ ఖనిజాలను శుద్ధి చేసి, విదేశాలకు ఎగుమతి చేస్తాయి. అంతేకాదు.. ప్రభుత్వ పన్నుల నుంచి తప్పించుకోవడానికి చుట్టూ ఉన్న ఉగాండా, రువాండా, బురుండి వంటి దేశాలకు అక్రమంగా తరలించి, అక్కడి నుంచి అమెరికా, యురోపియన్ దేశాలకు ఎగుమతి చేస్తాయి. ప్రభుత్వానికి పన్నుల చెల్లింపు ఉండకపోవడంతో పాటు, ఉత్పత్తి ఖర్చు అంతగా లేకపోవడంతో.. తక్కువధరకే ఖనిజాన్ని అందిస్తాయి.

దాంతో ఆయా దేశాలు ముందుగానే ఒప్పందాలు కుదుర్చుకోవడంతో పాటు.. డబ్బూ ముందుగానే చెల్లిస్తాయి. ఈ ఖనిజాలను శుద్ధిచేసి రూపొందించిన లోహాలను నోకియా, డెల్, హ్యూలెట్ ప్యాకార్డ్ వంటి కంప్యూటర్ చిప్‌లు, సెల్‌ఫోన్లు తదితర ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థలు కొనుగోలు చేసి.. ఆయా పరికరాలను తయారు చేస్తాయి. ఖనిజాలున్న ప్రాంతాల్లో భూములను స్వాధీనం చేసుకోవడం కోసం.. బెదిరింపులకు దిగడం.. వినకపోతే హత్యలు, మానభంగాలకు పాల్పడడం, బాల, బాలికలతో బలవంతంగా పనిచేయించడం సాధారణమైపోయింది.

ఇచ్చే వేతనాలూ.. రోజుకు మన కరెన్సీలో రూ.45 నుంచి 150 మధ్యే. మైనింగ్ చేస్తుండగా.. మట్టి కూలి, ఎందరో బాలలు దాని కింద సజీవ సమాధి అయిపోయారు. అయినా పట్టించుకునే నాథుడే లేడు. కాంగోలో జరుగుతున్న ఈ దారుణాలను ప్రపంచానికి తెలిపేందుకు, అక్కడి ప్రజలను రక్షించేందుకు 'సేవ్ ది కాంగో' అనే సంస్థ నడుం బిగించింది. ఇలాంటి తీవ్రవాద ముఠాల చే తిలో బలైన మసికా అనే ఓ మహిళ యదార్థగాథ ఆధారంగా.. 'బ్లడ్ ఇన్ మొబైల్' పేరిట ఒక ఐదు నిమిషాల నిడివిగల గ్రాఫిక్ చిత్రాన్ని రూపొందించి, ఇంటర్‌నెట్‌లో పెట్టింది. ఆ మహిళ, ఆమె కూతుళ్లపై.. భర్త ఎదుటే తీవ్రవాద ముఠా సభ్యులు మూకుమ్మడిగా అత్యాచారం చేశారు.

ఆ తర్వాత మసికా భర్తను దారుణంగా హత్య చేశారు. ఇలాంటి దారుణాలను ఆపాలంటే.. కాంగో నుంచి విదేశాలు ఖనిజాలను కొనడాన్ని నిలిపేయాలని 'సేవ్‌ది కాంగో' డిమాండ్ చేస్తోంది. ముందుగా ఆ ఖనిజాలను ఎక్కడి నుంచి, ఎలా సేకరిస్తున్నాయో ఎగుమతి సంస్థల నుంచి వివరణ తీసుకోవాలని.. ఆ తర్వాతే కొనుగోలు చేయాలని సూచిస్తోంది. "కాంగోలో వాస్తవ పరిస్థితులను 'బ్లడ్ ఇన్ మొబైల్' చిత్రం ప్రతిబింబిస్తుంది. ఆ దారుణాలను ఎలాగైనా ఆపాలనే.. లక్ష్యంతోనే మేం పనిచేస్తున్నాం'' అని ఆ సినిమాను రూపొందించిన ఫ్రాంక్ పౌల్సెన్ పేర్కొన్నారు.

No comments: