Saturday, October 6, 2012

వేలానికి అంగారక శిల..లక్షల్లో పలకనున్న ధర!

లక్షల సంవత్సరాల క్రితం ఉల్కాపాతంలో అంగారక గ్రహం పైనుంచి భూమిపై పడిన ఓ చిన్న శిల ఇప్పుడు అమెరికాలో జరగనున్న ఓ వేలం పాటలో లక్షా 60 వేల పౌండ్లకు పైగా ధర పలకవచ్చని భావిస్తున్నారు. కేవలం 3.5 అంగుళాల పొడవు, 326 గ్రాముల బరువుండే ఈ చిన్న శిల అంగారక గ్రహం ఉపరితలం అడుగున ఏర్పడి కొన్ని లక్షల ఏళ్ల క్రితం గ్రహ శకలం పేలుడు కారణంగా రోదసిలోకి వెదజల్లబడింది. రోదసిలో ప్రయాణిస్తూ వచ్చిన తర్వాత అది ఓ చిన్నపాటి ఉల్కాపాతంగా మారి గత ఏడాది మొరాకోలోని ఎడారి ప్రాంతంలో భూమిపై పడింది. ఈ శిల పడిన గ్రామం టిస్సింట్ పేరునే ఈ శిలకు పెట్టినట్లు డైలీ మెయిల్ పత్రిక తెలిపింది. ఉల్కలను సేకరించే ఓ అమెరికా కంపెనీ దీన్ని సంపాదించి, ఈ ఏడాది ప్రారంభంలో సుమారు 1.1 కిలోల బరువుండే ఈ శిలలో కొంత భాగాన్ని లండన్‌లోని న్యాచురల్ హిస్టరీ మ్యూజియంకు విక్రయించింది. ఈ చిన్న భాగాన్ని మాత్రం ఆ కంపెనీ తనవద్దే అట్టి పెట్టుకుంది. దాన్ని ఇప్పుడు వేలంలో అమ్మకానికి పెట్టింది. ముద్ద రూపంలో ఉండే ఈ శిల వాస్తవానికి ఘనీభవించిన లావా నుంచి ఏర్పడింది. ఈ చిన్న ముక్క వాస్తవానికి ఉల్కాపాతంలో భూమిపై పడిన పెద్ద శిలలోని భాగమేనని అమెరికాలోని హెరిటేజ్ ఆక్షన్స్ సంస్థకు చెందిన జిమ్ వాకర్ చెప్పారు. 14న న్యూయార్క్‌లో దీన్ని వేలం వేస్తారు.

No comments: