Wednesday, October 17, 2012

నింగిలోకి నల్ల బెలూన్లు





ప్రధానికి తెలంగాణ వాదుల నిరసన..
నాగం ఆధ్వర్యంలో దీక్ష
హైదరాబాద్, అక్టోబర్ 16 : 'మీది విశ్వాస ఘాతుకం... అందుకే నిరసనల స్వాగతం' అంటూ ప్రధాని మన్మోహన్ సింగ్ రాకకు నిరసనగా తెలంగాణ నేతలు ఆకాశంలోకి నల్లబెలూన్లు ఎగురేశారు. తెలంగాణ నగారా సమితి నేత, ఎమ్మెల్యే నాగం జనార్దన రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద మంగళవారం జరిగిన దీక్షలో జేఏసీ భాగస్వామ్య పక్షాలు, ఇతర ఉద్యమ సంస్థల నేతలు పాల్గొన్నారు. నల్ల చొక్కాలు, బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.

మధ్యాహ్నం 12 గంటలకు దీక్ష ప్రారంభం కాగా... సరిగ్గా 3.35 గంటలకు నల్ల బెలూన్లను గాలిలోకి వదిలారు. దీక్ష సాయంత్రం 4.50 గంటలకు ముగిసింది. అయితే... ప్రధాని హాజరైన జీవ వైవిధ్య సదస్సుకు తెలంగాణ మీడియా ప్రతినిధులను అనుమతించకపోవటాన్ని నిరసిస్తూ బేగంపేట విమానాశ్రయానికి వెళ్తామని నాగం ప్రకటించారు. కోదండరాం, హరీశ్‌రావు, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర నాయకులంతా ఇందిరాపార్క్-లోయర్ ట్యాంక్‌బండ్ వైపు కదిలారు. నేతలు బారికేడ్లను దాటుకొని ముందుకు వెళ్లటంతో తోపులాట జరిగింది. పోలీసులు పెద్దఎత్తున వారిని చుట్టుముట్టి, అరెస్ట్ చేశారు.


ఈ సమయంలో ఒక కానిస్టేబుల్‌పై ఉద్యమకారులు చేయి చేసుకున్నారు. అరెస్ట్ చేసిన ఎమ్మెల్యేలు, ఇతర నాయకులను వ్యాన్‌లో గాంధీనగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించి తదుపరి విడిచిపెట్టారు. కాగా, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ప్ర'దానిని కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు బయలుదేరిన టీడీపీ ఎమ్మెల్యేలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.



కాగా, "తెలంగాణ వాదులకు పాలకులు భయపడుతున్నారంటే.. మనం సగం గెలిచినట్టే లెక్క'' అని జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. "ప్రధాని హైదరాబాద్‌కొస్తే ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది? నిరసన తెలుపుతామన్న తెలంగాణవాదులను అడ్డుకున్నారు. చివరికి నల్ల బుగ్గలను, వాటిలో గాలి నింపటానికి ఉపయోగించిన సిలిండర్లనూ 'అరెస్ట్' చేశారు'' అని మండి పడ్డారు.



దసరా తర్వాత సీఎం, మంత్రులు, కాంగ్రెస్ నేతలు ఎవరైనా సరే.. వారిని ఊళ్లలోకి అడుగుపెట్టనివ్వొద్దని దీక్షకు అధ్యక్షత వహించిన నాగం జనార్దన రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ విషయంలో మోసం, దగా చేసిం ది కాంగ్రెస్సేనని విమర్శించారు. ప్రభుత్వం పోతుంది అంటేనే ఒత్తిడి వస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత కేశవరావు అన్నారు. "ఎంపీలుగా మేం ఏం చేసినా ఎందుకో ఒత్తిడి రాలేదు. తెలంగాణపై తీర్మానం చేసే వరకు అసెంబ్లీకి రాబోమని 28 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధిష్ఠానానికి ఒక్క లేఖ రాస్తే, ప్రత్యేక రాష్ట్రం ఎలా రాదో చూస్తాం!' అని కేకే అన్నారు.



"మర్యాదగా తెలంగాణ ఇస్తే సై.. లేకపోతే కాంగ్రెస్ అంతం చూస్తాం'' అని టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ అన్నారు. ఇం కా కాంగ్రెస్‌లో ఉండి తెలంగాణ ముసుగులో ఐక్యంగా కొట్లాడుతామంటే నమ్మే పరిస్థితిలేదని టీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉపనేత హరీశ్ రావు అన్నారు. ప్రధాని మాటకు విలువలేదని, కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వదని బీజేపీ నేత దత్తాత్రేయ అన్నారు. తెలంగాణపై అంతా టీడీపీని తప్పుపడుతున్నారని తొలుత అధికారంలో ఉన్న కాంగ్రెస్ సంగతి తేల్చితే, టీడీపీ సంగతి ప్రజలు చూసుకుంటారని సీపీఐ నేత వెంకటరెడ్డి పేర్కొన్నారు.

1 comment:

Unknown said...

రాజకీయ రంగుల నాటకం తెలంగాణా ఉద్యమం.

ప్రేక్షకులు అమాయక తెలంగాణా ప్రజలు.......