Friday, October 26, 2012

స్టూడెంట్స్ అందరికీ అమెరికాలో సోషల్ సెక్యురిటీ వస్తుందా?

అమెరికాలో సోషల్ సెక్యురిటీ నంబర్ (ఎస్.ఎస్.ఎన్.) లేకపోతే అసలు ఏ పనీ జరగదు. అక్కడ బ్యాంక్ అకౌంట్ తెరవాలంటే డబ్బు కంటే ముందు ఎస్.ఎస్.ఎన్. అవసరం. అసిస్టెంట్ షిప్ రావాలన్నా, వర్క్ చెయ్యాలన్నా, డ్రైవింగ్ లెసైన్స్ కావాలన్నా (కొన్ని మినహాయింపులతో) ఈ నంబరు తప్పనిసరి. ఎవరి నంబరు వారికే ప్రత్యేకంగా ఉండే ఈ ఎస్.ఎస్.ఎన్.ని యు.ఎస్. సిటిజన్లు, గ్రీన్ కార్డు హోల్డర్లు, తాత్కాలిక ఉద్యోగాలు చేసే విదేశీయులు, ఇంకా మరికొందరు అర్హులైన వారికి ఇస్తారు.

యు.ఎస్.లో మొట్టమొదటి సోషల్ సెక్యురిటీ నంబర్ 1930లో జారీ అయింది. ఉద్యోగాలు చేసేవారి వేతనాలని, పన్ను చెల్లింపుని గమనించడానికి; ఆదాయం పన్ను రిటర్న్‌లు సమర్పించడానికి, ఒక వ్యక్తి సంపూర్ణ రుణ చరిత్రని (క్రెడిట్ హిస్టరీ) తెలుసుకోవడానికి; వృద్ధాప్యం, వైకల్యం లాంటి వాటికి ఇన్స్యురెన్సుకి సంబంధించిన మినహాయింపులను జీతాల నుంచి రాబట్టడానికి; నిరుద్యోగులకు పరిహారాన్ని చెల్లించడానికి, స్థానికి విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇవ్వడానికి, ఆర్తులకు అత్యవసర సహాయం అందించడానికి, అనేక సోషల్ సెక్యురిటీ ప్రయోజనాల చెల్లింపునకు అర్హతని నిర్ణయించడానికి ఈ నంబరును వాడతారు. అయితే ఇది ఉంటే ఇక వర్క్ చెయ్యొచ్చని మాత్రం అర్థం కాదు. అలాగే ఎస్.ఎస్.ఎన్.అనేది యు.ఎస్. సిటిజన్స్‌తోనో, గ్రీన్ కార్డ్ హోల్డర్స్‌తోనో సమానమైన హక్కులు కల్పించేది కూడా కాదు. ఒకసారి ఎస్.ఎస్.ఎన్. వస్తే ఆ వ్యక్తికి జీవిత పర్యంతం అదే నంబరు ఉంటుంది. విదేశీయులైతే తాము ఎన్నిసార్లు అమెరికా వెళ్లినా తమకి మొట్టమొదట్లో ఇచ్చిన ఎస్.ఎస్.ఎన్.నే వినియోగించాలి.
విదేశీ విద్యార్థుల విషయానికొస్తే ఒక విద్యాసంస్థలో చేరి, క్లాసులకు రిజిస్టర్ చేసుకున్న వారు మాత్రమే ఎస్.ఎస్.ఎన్. కోసం దరఖాస్తు చేసుకోవాలి. కొత్తగా చేరిన స్టూడెంట్స్ వారి క్లాసులకు అటెండ్ అయ్యే వరకు దీనికి అప్లయ్ చేయ్యకూడదు. అదేవిధంగా ఆన్ క్యాంపస్ జాబ్ విద్యార్థులు మాత్రమే సోషల్ సెక్యురిటీ నంబర్ కోసం ఎస్.ఎస్.ఎన్. అడ్మినిస్ట్రేషన్‌కి దరఖాస్తు చేసుకోవాలి. ఎస్.ఎస్.ఎన్.ని ఇచ్చే ముందు మీరు ఫుల్ టైం విద్యార్థులా, కాదా? మీకు అమెరికాలో పని చెయ్యడానికి చట్టపరంగా అన్ని అర్హతలు ఉన్నాయా? సి.పి.టి., ఓ.పి.టి., అకాడమిక్ ట్రైనింగ్ లాంటి ఆఫ్-క్యాంపస్ ఎంప్లాయ్‌మెంట్‌కి మీకు ఆథరైజేషన్ వచ్చిందా?... లాంటి అంశాలను పరిశీలించిన తర్వాతనే ఎస్.ఎస్.ఎన్. అడ్మినిస్ట్రేషన్ మీకు ఎస్.ఎస్.ఎన్. ఇస్తుంది. మీ పాస్ పోర్టు వాలిడిటీని, వీసా స్టేటస్‌ని కూడా పట్టి పట్టి చూస్తారు. అమెరికాలో దిగిన పది రోజులలోగా ఎస్.ఎస్.ఎన్.కి అప్లయ్ చేయకూడదు.

మొదట మీ యూనివర్శిటీ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అడ్వయిజర్ నుంచి సోషల్ పెక్యురిటీ వెరిఫికేషన్ ఫారంని పొంది దానితోపాటు పాస్‌పోర్టు / వీసా, 1-94 ఫారం, క్యాంపస్ బాజ్‌కి సంబంధించిన ఆథరైజేషన్ తీసుకుని మీకు దగ్గరలోని సోషల్ సెక్యురిటీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసుకు వ్యక్తిగతంగా వెళ్లాలి. మీ క్యాంపస్ జాబ్ మొదలవ్వడానికి 30 రోజుల కంటె ఎక్కువ ముందుగా ఎస్.ఎస్.ఎన్. కోసం అప్లయ్ చెయ్యకూడదు. అలాగే మీరు ఎస్.ఎస్.ఎన్.కి దరఖాస్తు చేస్తున్నట్టు మీ డి.ఎస్.ఓ. ద్వారా సెవిస్ నెట్ వర్క్‌లో నమోదు చేయించుకోవాలి. మీకు నంబరు జారీ చెయ్యడానికి రెండు నుంచి నాలుగు వారాల సమయం పడుతుంది. దీనికి ఏమీ రుసుము ఉండదు.
ఇలా ఉండగా అమెరికాలో కొన్ని గవర్నమెంటు, ప్రైవేటు సర్వీసులు పొందడానికి కూడా ఎస్.ఎస్.ఎన్. అవసరం అవుతుంది. ఉదాహరణ... డిపార్ట్‌బెంట్ ఆఫ్ మోటార్ వెహికిల్స్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ వాటర్ అండ్ పవర్, మొబైల్ ఫోన్ కంపెనీలు, బ్యాంకులు, అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌ల యాజమాన్యాలు. ప్రస్తుతం ఎస్.ఎస్.ఎన్.కి అర్హత లేని స్టూడెంట్స్, వారి ఎఫ్-2 డిపెండెంట్‌లు ఆయా విభాగాలు, కంపెనీల సేవలు పొందడానికి ఒక ప్రత్యామ్నాయంగా ‘‘సోషల్ సెక్యురిటీ డినయల్’’ (ఎస్.ఎస్.ఏ.-ఎల్ 676)కి అప్లయ్ చేసి దానిని పొందాలి. ఎస్.ఎస్.ఎన్. లేనివారు ఈ ‘‘డినయల్’’ చూపించినా ఆయా సర్వీసులు లభిస్తాయి.

No comments: