Saturday, October 6, 2012

మీ లివర్ గురించి కొంత తెలుసుకోండి


ఫ్యాటీ లివర్

చాలామందిలో ఎలాంటి రోగ లక్షణాలు కనిపించకపోవచ్చు. సాధారణ అబ్డామిన్ అల్ట్రాసౌండ్ పరీక్షలు చేయించినప్పుడు ఇది బయట పడుతుంది. మద్యం, స్థూలకాయం, బరువు పెరగడం, డయాబెటిస్, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ వంటి జీవరసాయన పదార్థాలు పెరగడం దీనికి ప్రధానమైన కారణాలు. కొన్నిసార్లు హెపటైటిస్ సి వంటి ఇన్ఫెక్షన్స్ కూడా ఫ్యాటీలివర్‌కు కారణం కావచ్చు. లివర్ ఫంక్షన్ టెస్ట్ పరీక్షలో ఎస్‌జీపీటీ, ఎస్‌జీఓటీ వంటి లివర్ ఎంజైములు పెరిగితే దాన్ని స్టియటోహెపటైటిస్ అంటారు. ఫ్యాటీలివర్ కేసుల్లో చికిత్సతో పాటు ఆహారనియమాలు పాటించడం అవసరం. ఇప్పుడు సిర్రోసిస్‌కు ఇది ఒక కారణం. ఫ్యాటీలివర్ కేసుల్లో ప్రధానంగా అవసరమైంది వ్యాయామం, మంచి ఆహార నియమాలు.

కాలేయ క్యాన్సర్

ఇది ప్రమాదకరమైన కండిషన్. లివర్‌కు రీజనరేషన్ సామర్థ్యం ఎక్కువ కావడం వల్ల, దాదాపు 90 శాతం క్యాన్సర్ వ్యాపించే వరకు లక్షణాలు కనిపించవు. హెపటైటిస్ బీ, హెపటైటిస్ సీ వైరస్‌లు అటాక్ అయినవాళ్లలో క్యాన్సర్ రిస్క్ ఎక్కువ కాబట్టి దీర్ఘకాలిక లివర్ రోగులు ప్రతి ఆర్నెల్లకు ఒకమారు అబ్డామిన్ అల్ట్రాసౌండ్ పరీక్ష, ఏఎఫ్‌పీ బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం అవసరం. దాని వల్ల ముందే క్యాన్సర్‌ను పసిగడితే కొన్ని చికిత్స ప్రక్రియలతో సమర్థంగా చికిత్స చేయవచ్చు. కొందరిలో లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ (కాలేయ మార్పిడి) అవసరం కావచ్చు. అయితే అది ట్యూమర్ సైజ్‌ను బట్టి ఉంటుంది.

లివర్ సమస్యలను ఎలా పసిగట్టవచ్చు...

కామెర్లు వచ్చిన ప్రతిరోగి విధిగా ఎల్‌ఎఫ్‌టీ, హెచ్‌బీఎస్‌ఏజీ, యాంటీ హెచ్‌సీవీ యాంటీబాడీస్ పరీక్ష, అల్ట్రాసౌండ్ అబ్డామిన్ పరీక్షలు చేయించుకోవాలి. హైఫీవర్‌తో బాధపడేవారు అది ఫ్యాల్సిఫేరమ్ మలేరియానా అని నిర్ధారణ చేయించుకోవాలి. కొన్ని సందర్భాల్లో లివర్ బయాప్సీ అవసరం కావచ్చు. దీర్ఘకాలిక లివర్ సమస్యలు ఉన్న రోగుల బంధువులు కూడా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం అవసరం.

లివర్ వ్యాధుల నివారణ ఇలా...

లివర్ వ్యాధులను చాలా మట్టుకు రాకుండానే నివారించవచ్చు. మంచి ఆరోగ్యకరమైన జీవనశైలి, పీచుపదార్థాలు ఎక్కువగా, కొవ్వులు తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం, నిత్యం వ్యాయామం చేయడం, ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోవడం (బరువు పెరగకుండా చూసుకోవడం), మద్యం మానివేయడం, డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవడం వంటి చర్యలతో కాలేయ సమస్యలను నివారించవచ్చు. సెక్స్ విషయంలో జీవితభాగస్వామికే పరిమితమై ఉండటం, సురక్షితమైన పద్ధతులు పాటించడం, రక్తం స్వీకరించే విషయంలో జాగ్రత్తగా ఉండటం, ఒక సూదిని ఒకసారి మాత్రమే ఉపయోగించడం, చెవులు కుట్టేటప్పుడు, పచ్చబొట్లు పొడిపించుకునే సమయంలో సురక్షితమైన పద్ధతులు పాటించడం ద్వారా హెపటైటిస్ బీ, సీ వైరల్ ఇన్ఫెక్షన్లను నివారించుకోవచ్చు.

చాలామట్టుకు హెపటైటిస్ ఏ, ఈ వంటివి మలంతో కలుషితమైన నీళ్ల వల్ల వస్తాయి. కాబట్టి పరిశుభ్రమైన నీళ్లు, ఆహారంలో పరిశుభ్రత పాటించడం అవసరం. టాయిలెట్‌కు వెళ్లి వచ్చిన తర్వాత చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవడం వంటి సాధారణ చర్యలతో వీటిని సమర్థంగా నివారించవచ్చు. హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బీ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నందువల్ల హైరిస్క్ గ్రూపులకు చెందిన వ్యక్తులు వాటిని తీసుకోవడం, సరైన ఆరోగ్య రక్షణ, పారిశుధ్ద్యం వంటి జాగ్రత్తలు పాటిస్తే కాలేయ సమస్యలనుంచి దూరంగా ఉండవచ్చు. కామెర్లు కనిపించగానే దీనికి అనేక కారణాలు ఉంటాయి. కాబట్టి కారణాన్ని నిర్ధారణ చేసే పరీక్షలేవీ చేయించుకోకుండా నాటు మందులు, అశాస్ర్తీయమైన వైద్య ప్రక్రియలకు సంబంధించిన పసర్లు వంటివి తీసుకోవడం మంచిది కాదు.

సాధారణ సమస్యలు...

* ‘హెపటైటిస్ ఏ’ వైరల్ ఇన్ఫెక్షన్ : కలుషితమైన ఆహారం లేదా నీళ్లు తీసుకోవడం వల్ల ఈ రకం హెపటైటిస్ వస్తుంది. దీనిలో కామెర్లు, వాంతులు, జ్వరం, ఆకలి లేకపోవడం, నాలుకకు రుచి తెలియకపోవడం, అన్నహితవు పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో దురదలు కూడా ఉండవచ్చు. కామెర్లు కనిపించడానికి ముందర జ్వరం, ఒళ్లునొప్పులు, తలనొప్పి, ఫ్లూ జ్వరంలోని లక్షణాలు కనిపిస్తాయి. రెండు మూడు వారాల్లో కామెర్లు బాగా పెరుగుతాయి. ఆ తర్వాత కామెర్లు రెండువారాల పాటు అలా కొనసాగి... క్రమంగా తగ్గుముఖం పట్టి మరో రెండు మూడు వారాల్లో పూర్తిగా తగ్గుతాయి. ఈ మొత్తం వ్యవధి ఆరు నుంచి పది వారాలు పట్టవచ్చు. అయితే చాలా అరుదుగా రెండు వందల కేసుల్లో ఒకరికి పరిస్థితి వేగంగా విషమించి అది ప్రాణాపాయంగా పరిణమించవచ్చు.

హెపటైటిస్ ఏ వైరల్ ఇన్ఫెక్షన్‌కు ప్రత్యేకమైన చికిత్స అవసరం లేదు. ఆరోగ్యకరమైన వాతావరణ పరిస్థితుల్లో రోగిని ఉంచడం, త్వరగా జీర్ణమయ్యే ఆహారం ఇవ్వడం, పుష్కలంగా నీళ్లు, ద్రవాహారం రోగికి ఇవ్వడం అవసరం. మద్యం పూర్తిగా మానేయాలి. ముందుగానే చెప్పినట్లు మనం తీసుకునే ప్రతి మందులోని వ్యర్థాలను కాలేయమే విరిచేస్తుంది కాబట్టి మనం మందులు తీసుకున్నా అది కాలేయాన్ని మరింత శ్రమకు గురిచేస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరీ అవసరమైతే తప్ప మందులు తీసుకోకపోవడం మంచిది.

* ‘హెపటైటిస్ ఈ’ వైరల్ ఇన్ఫెక్షన్: ఇది కూడా హెపటైటిస్ ఏ తరహాలోనే వ్యాప్తి చెందుతుంది. లక్షణాలు కూడా అలాగే ఉంటాయి. అయితే ఈ వైరల్ ఇన్ఫెక్షన్‌లో కోలుకునేందుకు వ్యవధి దాదాపు మూడు నెలలు పట్టవచ్చు. దురదలు మరింత తీవ్రంగా ఉండవచ్చు. దీనికీ ప్రత్యేకమైన మందులు అవసరం లేదు. మంచి సమతుల ఆహారం తీసుకుంటే రోగి తనంతట తనే కోలుకుంటాడు.

* ఆల్కహాలిక్ హెపటైటిస్: ఆల్కహాల్‌ను మితిమీరి తీసుకునేవారిలో పలురకాల లివర్ సమస్యలు కనిపిస్తాయి. ఫ్యాటీ లివర్, కామెర్లు లేకుండానే హెపటైటిస్, ఇంతకుముందు చెప్పిన వైరల్ హెపటైటిస్ లక్షణాలతో యాక్యూట్ హెపటైటిస్ లేదా దీర్ఘకాలిక హెపటైటిస్ రావచ్చు. కొన్నిసార్లు లివర్ పూర్తిగా చెడిపోయి సిర్రోసిస్‌కు దారితీయవచ్చు. దీని చికిత్సలో భాగంగా ఆల్కహాల్‌కు పూర్తిగా దూరంగా ఉండటం అవసరం. దాంతోపాటు తేలిగ్గా జీర్ణమయ్యే సమతుల ఆహారం, విటమిన్లు తీసుకోవడం అవసరం.

* హెపటైటిస్ బీ వైరల్ ఇన్ఫెక్షన్ : ఇది రోగికి వాడిన సూది మళ్లీ ఆరోగ్యకరమైన వ్యక్తికి వాడటం వల్ల, రేజర్లు, టూత్‌బ్రష్‌లు షేర్ చేసుకోవడం వల్ల, రోగికి ఉపయోగించిన సూదులతో ఇంకొకరికి చెవులు కుట్టడం, పచ్చబొట్టు (టాటూ) వేయడం లేదా కలుషితమైన రక్తాన్ని ఎక్కించడం వంటి మార్గాల వల్ల రోగి నుంచి ఆరోగ్యకరమైన వ్యక్తికి వస్తుంది. వ్యాధి ఉన్న వ్యక్తితో సెక్స్ వల్ల కూడా వస్తుంది. అంటే రక్తం, లాలాజలం, సెక్స్ అన్నవి వ్యాధివ్యాప్తికి ప్రధాన మార్గాలన్నమాట. ఇది వచ్చిన వారిలో కామెర్లతో మిగతా ‘హెపటైటిస్ ఏ’కు సంబంధించిన లక్షణాలన్నీ అంటే... జ్వరం, వాంతులు, ఆకలి లేకపోవడం, నాలుకకు రుచి తెలియకపోవడం, అన్నహితవు పోవడం వంటివి కనిపించవచ్చు. చాలామట్టుకు కేసుల్లో దీనికి యాంటీవైరల్ మందులు వాడాల్సిన అవసరం లేదు. 90% రోగుల్లో ఇది ఆర్నెల్లలో దానంతట అదే తగ్గిపోయి పరీక్షలు చేస్తే నెగెటివ్ అని రిజల్ట్ వస్తుంది. చాలామట్టుకు కేసుల్లో మాస్టర్ హెల్త్ చెకప్స్‌లో లేదా రక్తదానం సమయాల్లో వీసా లేదా ఉద్యోగం కోసం రక్తపరీక్షలు చేస్తున్న సమయంలో బయటపడుతుంది. కొందరిలో మాత్రం పరిస్థితి విషమించి రక్తపు వాంతులు అవుతున్న సందర్భాల్లో, కడుపులో నీరు చేరడం (అసైటిస్) వంటి తీవ్ర సమస్యల ద్వారా కూడా బయటపడవచ్చు.

వైద్యపరంగా నిర్వహించే హెచ్‌బీఎస్ ఏజీ అనే పరీక్ష వల్ల హెపటైటిస్-బి బయటపడుతుంది. ఒకసారి వైద్యపరీక్షల్లో హెచ్‌బీఎస్ ఏజీ అనే రిపోర్టు పాజిటివ్ వస్తే వాళ్లు పూర్తిస్థాయి లివర్ పరీక్షలు చేయించాలి. దీర్ఘకాలిక లివర్ సమస్యలు ఏవైనా ఉన్నాయేమో పరీక్షించాలి. లివర్ ఫంక్షన్ టెస్ట్ (ఎల్‌ఎఫ్‌టీ) పరీక్షలు ప్రతి ఆర్నెల్లకోమారు చేయించాలి. ఆ పరీక్షల్లో మళ్లీ ఏదైనా అబ్‌నార్మాలిటీ ఉంటే అంటే ఎస్‌జీపీటీ (ఏఎల్‌టీ) ఎక్కువగా ఉంటే వాళ్లు మరికొన్ని రక్తపరీక్షలు చేయించుకోవాలి. అంటే అలాంటివాళ్లలో వైరల్ లోడ్ తీవ్రత ఎంత ఉందనేది తెలుసుకునేందుకు మరికొన్ని పరీక్షలు అవసరమవుతాయి.

వైరస్ చురుగ్గా ఉండి దాని తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం ‘యాంటీ వైరల్’ డ్రగ్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. సాధారణంగా హెచ్‌బీఎస్‌ఏజీ పాజిటివ్ రిపోర్టులు ఉండి ఎల్‌ఎఫ్‌టీ, అల్ట్రాసౌండ్ రిపోర్టులు నార్మల్‌గా వచ్చిన సందర్భాల్లో ప్రతి ఆర్నెల్లకోమారు లివర్ ఫంక్షన్ టెస్ట్‌లు చేస్తుంటారు. అవి నార్మల్‌గా ఉన్నవాళ్లకు ఎలాంటి మందులు వాడరు కాని, దీర్ఘకాలిక హెపటైటిస్ సిర్రోసిస్ ప్రారంభదశ ఉన్నవాళ్లలో యాంటీ వైరల్ మందులు వాడతారు. ఇందులో భాగంగా ఇంటర్‌ఫెరాన్ ఇంజెక్షన్‌లు, లామివుడిన్, అడిఫోవిర్, టెల్బ్యూవిడైన్, ఎంటేకావిర్ వంటివి ఇలాంటి రోగుల్లో ఉపయోగిస్తారు. అయితే ఏ రోగికి ఏ మందులు వాడాలన్నది వాళ్లవాళ్ల లక్షణాలను, బ్లడ్‌కౌంట్‌ను, లివర్ వ్యాధి దశను బట్టి ఉంటుంది. హెపటైటిస్ బీ వస్తే దాదాపు 40%-50% కేసుల్లో మందులకు స్పందించకపోవడాన్ని డాక్టర్లు చూస్తుంటారు. కాబట్టి హెపటైటిస్ బీ వచ్చిన తర్వాత చికిత్స తీసుకోవడం కంటే... దాన్ని నివారించుకోవడమే ముఖ్యం. కాబట్టి హెపటైటిస్-బీ వ్యాక్సిన్ తీసుకోవడం ముఖ్యం. హెపటైటిస్-బీ వచ్చిన వారి భార్య/భర్తకు, కుటుంబసభ్యులకు కూడా పరీక్షలు జరిపి వాళ్లకు ఆ వ్యాధి లేని సందర్భాల్లో వ్యాక్సిన్ తీసుకోవడం సత్ఫలితాలిస్తుంది.



* హెపటైటిస్ సి వైరల్ ఇన్ఫెక్షన్ : ఇటీవల ఈ వైరస్ దీర్ఘకాలిక లివర్ సమస్యలు దారితీసేందుకు కారణమవుతోంది. చాలామందిలో ఇటీవల హెపటైటిస్-బీ వ్యాధి పట్ల పెరిగిన అవగాహనతో వ్యాక్సిన్ తీసుకోవడంతో ఆ వైరస్‌కు ఇమ్యూనిటీ సాధిస్తారు. అయితే దురదృష్టవశాత్తు హెపటైటిస్-సి వైరస్‌కు ఇంకా వ్యాక్సిన్ రూపొందకపోవడంతో హెపటైటిస్-బీ తర్వాత దీర్ఘకాలిక లివర్ రుగ్మతలకు ఈ వైరస్ కారణమవుతోంది. హెపటైటిస్-బీ లా కాకుండా ఇది చాలా నెమ్మదిగా దీర్ఘకాలిక (క్రానిక్) సమస్యగా లేదా సిర్రోసిస్‌గా లేదా లివర్ క్యాన్సర్‌గా మారుతుంది. కేవలం లివర్ ఫంక్షన్ టెస్ట్ (ఎల్‌ఎఫ్‌టీ) మాత్రమే హెపటైటిస్-సీ ని నిర్ధారణ చేయలేకపోవచ్చు. అందుకే హెపటైటిస్-సి యాంటీబాడీస్ పరీక్షలో పాజిటివ్ ఉన్నవాళ్లు అల్ట్రాసౌండ్ అబ్డామిన్, హెచ్‌సీవీ-ఆర్‌ఎన్‌ఏ క్వాంటిటేటివ్ ఎస్సే, జీనోటైపింగ్ పరీక్షలు చేయించాలి. దురదృష్టవశాత్తు దీనికి చికిత్స విధానాలు హెపటైటిస్-బీతో పోల్చినప్పుడు చాలా పరిమితం, కొంత తక్కువ ప్రభావితమైనవని చెప్పవచ్చు. వైరల్ జీనోటైప్‌ను బట్టి దీనికి రిబావెరిన్‌తో పాటు పెగిలేటెడ్ ఇంటర్‌ఫెరాన్ వంటి మందులను 24 నుంచి 48 వారాలపాటు వాడాల్సి ఉంటుంది. ఇది కూడా హెపటైటిస్-బీ లాగానే వ్యాప్తిచెందుతుంది కాబట్టి ఇంజెక్షన్లు వాడటంలో సురక్షిత మార్గాలను అనుసరించడంతో, సెక్స్ సమయంలో కండోమ్ వాడటం వంటి సురక్షిత చర్యలు అవసరం.

సిర్రోసిస్....

లివర్ తన స్వరూపం కోల్పోయి తన సామర్థ్యాన్ని కోల్పేయే చివరి దశగా సిర్రోసిస్‌ను పరిగణించవచ్చు. బాగా మద్యం సేవించేవారు, హెపటైటిస్ బి, సీ వైరస్‌లకు గురయ్యేవారు, ఆటోఇమ్యూన్ హెపటైటిస్‌కి గురైనవారు, , శరీరజీవచర్యల్లో అబ్‌నార్మాలిటీస్ (మెటబాలిక్ డిసీజెస్) వంటి లివర్ వ్యాధికి గురియైన వారిలో లివర్ సిర్రోసిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. కారణం ఏదైనప్పటికీ. పరిణామం తీవ్రత ఎలా సంభవించినప్పటికీ సిర్రోసిస్‌ను తుదిదశగా భావిస్తారు. సిర్రోసిస్ రోగుల్లో కనిపించే తీవ్రలక్షణాల్లో - కడుపులో నీరు లేదా ద్రవాలు చేరడం, రక్తపువాంతులు కావడం, మలం నల్లగా రావడం, పొంతనలేకుండా మాట్లాడటం (ఇన్‌కొహరెంట్ టాక్) ఎన్‌కెఫలోపతి వల్ల నిద్రవస్తున్నట్లు అనిపించడం వంటివి ప్రధాన లక్షణాలు. ఈ సమస్య వచ్చినప్పుడు చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు ఎదుర్కోడానికీ రోగనిరోధక శక్తి తగ్గడంతో చిన్న ఆరోగ్య సమస్య కూడా ప్రమాదకరణంగా పరిణమిస్తుంది. ఫలితంగా సిర్రోసిస్‌ను కనుగొన్న ఐదేళ్ల వ్యవధిలోపే రోగులు ప్రమాదకరమైన పరిస్థితికి చేరుకుంటుంటారు. ఈ సమస్యకు ఉన్న ఒకే ఒక చికిత్స కాలేయ మార్పిడి. దీంతోపాటు కొన్ని మందులు, ఉప్పుపై నియంత్రణ, సమతుల ఆహారం అవసరం.

No comments: