Friday, October 26, 2012

వణికిస్తున్న స్వైన్ ఫ్లూ!

నాలుగు నెలల్లో స్వైన్‌ఫ్లూతో 29 మంది మృతి

17 జిల్లాలకు పాకిన వైరస్

హైదరాబాద్, విశాఖ, రంగారెడ్డి జిల్లాల్లో ఎక్కువ తీవ్రత

మృతుల్లో 21 మంది హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలవారే

బెంబేలెత్తుతున్న జనం.. చోద్యం చూస్తున్న ప్రభుత్వం

రోజురోజుకూ వైరస్ విస్తరిస్తున్నా చర్యలు శూన్యం

సర్కారీ ఆసుపత్రుల్లో ఎక్కడా కనిపించని ప్రత్యేక వార్డులు

గత్యంతరం లేక ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న బాధితులు


 
రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి! జలుబుతో మొదలై ఆయాసంతో ఉధృతమయ్యే ఈ వ్యాధి అంటేనే జనం వణికిపోతున్నారు. ప్రతిరోజూ ఏదో ఓ చోట స్వైన్‌ఫ్లూ కేసులు నిర్ధారణ అవుతుండటం, మరణాలు చోటుచేసుకుంటుండటంతో సాధారణ జలుబు, జ్వరం వచ్చినా ప్రజలు బెంబేలెత్తే పరిస్థితి నెలకొంది. ఇప్పటిదాకా రాష్ట్రంలో ఆరు జిల్లాలు మినహా 17 జిల్లాల్లో స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, విశాఖపట్నంలలో తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. గత నాలుగు నెలల నుంచి బుధవారం (ఈనెల 24) వరకు స్వైన్ ఫ్లూ (హెచ్1ఎన్1 వైరస్) కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 29కి చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ధ్రువీకరించారు. మంగళవారం ఒక్కరోజే రంగారెడ్డి జిల్లాలో ఏడుగురు, హైదరాబాద్‌లో ఆరుగురు, విశాఖపట్నంలో ఆరుగురు స్వైన్‌ఫ్లూతో ఆస్పత్రుల్లో చేరారు. మొత్తం 29 మంది మృతుల్లో 21 మంది హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన వారే కావడం గమనార్హం. మిగిలిన వారిలో ఒకరు విజయవాడ వాసి కాగా, మిగతా వారు విశాఖకు చెందిన వారు. హైదరాబాద్‌లో స్వైన్‌ఫ్లూతో బాధితులు ముషీరాబాద్‌లోని కేర్ హాస్పిటల్, ఉస్మానియా, ఫెర్నాండెజ్, సికింద్రాబాద్ యశోద ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకూ అనుమానం వచ్చిన 1,210 మందికి పైగా రక్త నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించగా, అందులో 250 మందికి స్వైన్‌ఫ్లూ ఉన్నట్టు గుర్తించారు.



ప్రత్యేక వార్డులు ఎక్కడ..?
స్వైన్‌ఫ్లూ అంటువ్యాధి. ఈ వ్యాధి బాధితులకు ప్రత్యేక వార్డుల్లో వైద్యం అందించాలి. కానీ ఆస్పత్రుల్లో ఎక్కడా ప్రత్యేక వార్డులు కనిపించడం లేదు. సాధారణ వార్డులు, ఐసీయూలే కిక్కిరిసిపోతున్న నేపథ్యంలో ప్రత్యేక వార్డులు ఎక్కడ ఉంటాయని వైద్యులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 120 కేంద్రాల్లో స్వైన్‌ఫ్లూ నివారణకు వైద్యం అందిస్తున్నామని, ఇందులో 73 ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయని ప్రభుత్వం చెబుతున్నా అది ఆచరణలో కనిపించడం లేదు. ఫలితంగా బాధితులు గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు.



9 మంది గర్భిణులు మృతి
రాష్ట్రంలో ఇప్పటివరకు 29 మంది స్వైన్‌ఫ్లూతో మరణిస్తే అందులో 9 మంది గర్భిణులే ఉన్నట్టు తేలింది. వీరిలో అందరూ 30 ఏళ్ల లోపు వారే. మిగతా మృతుల్లో ఎక్కువగా క్షయ వ్యాధిగ్రస్తులు, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నవారు, ఆస్తమా పేషెంట్లు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. రోగులకు వైద్యం అందించే 20 మంది వైద్య సిబ్బంది కూడా స్వైన్‌ఫ్లూ బారిన పడ్డారు. ఇందులో 9 మంది డాక్టర్లు, 11 మంది నర్సులు ఉన్నారు. నెల్లూరు, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, చిత్తూరు మినహా అన్ని జిల్లాల్లోనూ స్వైన్‌ఫ్లూ విస్తరించింది.

స్వైన్‌ఫ్లూ లక్షణాలు

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మార్గదర్శకాల ప్రకారం స్వైన్‌ఫ్లూ (హెచ్1ఎన్1) వ్యాధిని ఏ, బీ, సీ అని మూడు కేటగిరీలుగా గుర్తించారు. ఒక్కో దశలో ఒక్కో రకంగా వ్యాధి వ్యాప్తి చెందుతుంది.



ఏ కేటగిరీలో ఇలా..

జలుబు తీవ్రస్థాయిలో ఉండటం,

విపరీతంగా తుమ్ములు రావడం

ముక్కు వెంట విపరీతంగా నీళ్లు కారడం

తలనొప్పి, ఒళ్లునొప్పులతోపాటు స్వల్పంగా జ్వరం



బీ కేటగిరీలో..

కొద్దికొద్దిగా జ్వరం పెరుగుతుండటం

ఒళ్లు నొప్పులు, దగ్గు పెరగడం

స్వల్పంగా ఆయాసం



సీ కేటగిరీలో..

జలుబు తీవ్రంగా మారుతుంది

ఆయాసంతో గుక్కతిప్పుకోలేక పోవడం

ఛాతీలో స్వల్పంగా నొప్పి, ముఖమంతా పీక్కుపోయినట్టు ఉండటం

ఊపిరి తిప్పుకోలేనంతగా ఆయాసం

ఆయాసం పెరిగేకొద్దీ వ్యాధి నిరోధకత తగ్గిపోవడం


నివారణా మార్గాలివీ..

తుమ్ములతో కూడిన జలుబు వచ్చిందంటే వారంరోజుల పాటు బయటకు వెళ్లకూడదు

సాధారణ పారాసిటమాల్ బిళ్లలు వేసుకుంటూ ఇంట్లోనే ఉండాలి

ఇంట్లో ఉన్న వారు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ బాధితుడికి సేవలు అందించాలి

బీ కేటగిరీ బాధితులు వైద్యుడి సలహాతో ఒసాల్టమివిర్ మందును వేసుకోవాలి

సీ కేటగిరీ బాధితులను తక్షణమే ఆస్పత్రిలో చేర్చాలి. వారికి ప్రత్యేక వార్డుల్లో వైద్యం అందించాలి

వెంటనే థ్రోట్ స్వాబ్ (గొంతులో గల్ల/తెమడ )ను వైద్య పరీక్షలకు పంపించాలి

పేషెంటుకు ఈ దశలో కృత్రిమ శ్వాస అందించడం అత్యవసరం

ప్రాథమిక దశలో స్వైన్‌ఫ్లూ ఉన్న వారు ప్రయాణాలు చేయకూడదు.. జన సమ్మర్దమైన ప్రాంతాల్లో తిరగకూడదు

వైద్య సిబ్బంది, రోగి బంధువులు మాస్క్‌లు, గ్లౌజ్‌లు ధరించాలి

రోగులు దగ్గు వచ్చినప్పుడు టిష్యూ పేపర్ నోటికి అడ్డుగా పెట్టుకుని దగ్గాలి

విద్యార్థులకు సోకితే కాలేజీ లేదా స్కూళ్లకు వెళ్లరాదు



ఎవరికి ఎక్కువ ముప్పు..

గర్భిణులకు ఈ వైరస్ ముప్పు ఎక్కువ. బిడ్డ కడుపులో ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ పరిమాణం ఎక్కువగా తీసుకోవాల్సి రావడంతో ఊపిరితిత్తులపై భారం ఎక్కువగా ఉంటుంది. దీంతో వ్యాధి సోకే అవకాశం ఎక్కువ. అలాగే వారిలో వ్యాధి నిరోధక శక్తి కూడా తక్కువగా ఉండటంతో వైరస్ బారిన పడే ప్రమాదం ఉంటుంది. వీరితోపాటు క్షయ, ఆస్తమా, మధుమేహ వ్యాధిగ్రస్తులు, ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న వారికి వైరస్ సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది.



దేశంలో మొదటి కేసు ఇక్కడే..

అమెరికా నుంచి మన దేశానికి దిగుమతి అయిన స్వైన్‌ఫ్లూ వైరస్ తొలి కేసు హైదరాబాద్‌లోనే నమోదైంది. 2009 మే 13న అమెరికా నుంచి వచ్చిన ఓ వ్యక్తికి హెచ్1ఎన్1 సోకింది. దేశంలో ఇదే మొదటి కేసు. ఆ ఏడాది 800 మందికిపైగా స్వైన్‌ఫ్లూ సోకగా 52 మంది మృతి చెందారు. 2010లో 56 మంది చనిపోయారు. 2011లో తగ్గుముఖం పట్టినా 2012లో మళ్లీ విజృంభిస్తోంది.

No comments: