Wednesday, October 17, 2012

భారత చరిత్రలో అత్యంత ధనవంతుడు చివరి నిజాం!




 
కబేరుల జాబితాలో ఆయనది ఆరో స్థానం

మొదటి స్థానంలో 14వ శతాబ్దపు ఆఫ్రికా రాజు

లండన్, అక్టోబర్ 16: 'భారత చరిత్రలో అత్యంత ధనవంతుడు ఎవరు?' ఈ ప్రశ్న వినగానే సహజంగానే టాటా, బిర్లా, అంబానీలు గుర్తుకు వస్తారు! కానీ... ఆ ఘనత దక్కించుకున్నది వీరెవరూ కాదు! భారత్‌లో అత్యంత కుబేరుడు... హైదరాబాద్ చివరి నిజాం ఉస్మాన్ అలీఖాన్. ప్రస్తుత ద్రవ్యోల్బణానికి అనుగుణంగా సవరిస్తే ఆయన సంపద రూ.12.48 లక్షల కోట్లు. హైదరాబాద్ సంస్థానాన్ని సుదీర్ఘకాలం పరిపాలించిన ఉస్మాన్ అలీఖాన్ 1967లో మరణించారు.


ప్రపంచ చరిత్రలోనే అత్యంత ధనవంతుల జాబితాలో ఆయన ఆరో స్థానంలో నిలిచారు. 'సెలెబ్రిటీ నెట్‌వర్త్' అనే వెబ్‌సైట్ ఈ జాబితాను రూపొందించింది. 14వ శతాబ్దానికి చెందిన ఆఫ్రికా రాజు మన్సా ముసా-1 చరిత్రలోనే అత్యంత ధనవంతుడిగా అగ్రస్థానం ఆక్రమించారు. ప్రస్తుత విలువ ప్రకారం ఆయన ఆస్తుల విలువ 40,000 కోట్ల డాలర్లు. సెలెబ్రిటీ నెట్‌వర్త్ సంస్థ 'చరిత్రలోనే కుబేరులు' పేరిట మొత్తం 25 మందితో కూడిన జాబితాను రూపొందించింది. వెయ్యేళ్ల చరిత్రను... పాలకుల ఆస్తులను పరిగణనలోకి తీసుకుంది.

 
ఈ జాబితాలో మహిళలెవరూ లేకపోవడం ఒక విశేషం. 25 మందిలో 14 మంది అమెరికన్లే కావడం మరో విశేషం. మొత్తం 25 మందిలో ముగ్గురు మాత్రమే ఇప్పుడు జీవించి ఉన్నారు. సంపదను నేటి ద్రవ్యోల్బణానికి అనుగుణంగా లెక్కించేలా సెలెబ్రిటీ నెట్‌వర్త్ సంస్థ అనేక జాగ్రత్తలు తీసుకుంది. ఒక్కో సంవత్సరం ద్రవ్యోల్బణం 2199.6 శాతంగాగుర్తించింది.

దీని ప్రకారం... 1913లో పది కోట్ల డాలర్ల విలువ ఇప్పుడు 229 కోట్ల డాలర్లు అవుతుంది. జాబితాలో అగ్రస్థానంలో ఉన్న మన్సా ముసా-1 తమ దేశంలోని ఉప్పు, బంగారం ద్వారా భారీగా సంపదను సమకూర్చుకున్నారు. రెండో స్థానంలో ఉన్న రోథ్‌షిల్డ్ కుటుంబం వారసులు ఇప్పటికీ భూమిపై అత్యంత ధనవంతులుగా కొనసాగుతున్నారు. అన్నట్లు... నేటి అపర కుబేరుడు వారెన్ బఫెట్ ఈ జాబితాలో అట్టడుగున ఉండటం గమనార్హం.

No comments: