Tuesday, October 16, 2012

మీతో మాట్లాడాలి..టైమ్ ఇవ్వండి ప్లీ..

ప్రధానిని కోరిన తెలంగాణ మంత్రులు

తెలంగాణ ఆవశ్యకతను వివరిస్తూ వినతిపత్రం అందజేసిన మంత్రులు






హైదరాబాద్,ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై చర్చించడానికి తమకు సమయమివ్వాలని తెలంగాణ మంత్రులు ప్రధాని మన్మోహన్‌ను కోరారు. తెలంగాణపై వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని వారు ప్రధానికి వివరించారు. ప్రధాని మంగళవారం రాష్ట్ర పర్యటన ముగించుకుని ఢిల్లీ వెళ్లే సమయంలో బేగంపేట ఎయిర్‌పోర్టులో వీడ్కోలు కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో గవర్నర్ నరసింహన్, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జానారెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, గీతారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, బసవరాజు సారయ్య, డీకే అరుణ తదితరులు ప్రధానినిని కలిశారు. ఆయనకు వినతిపత్రాన్ని అందజేసి, 2 నిమిషాలు మాట్లాడారు.




18, 19, 20వ తేదీల్లో తాము ఢిల్లీకి వస్తున్నామని, ఆ రోజుల్లో సమయమివ్వాలని ప్రధాని కోరారు. తెలంగాణపై తక్షణం నిర్ణయం తీసుకోకపోతే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిపారు. ప్రధాని అపాయింట్‌మెంట్‌పై బుధవారం సాయంత్రంలోపు సమాచారమిస్తామని ప్రధాని కార్యాలయం అధికారులు తెలిపినట్లు మంత్రి సారయ్య చెప్పారు. తెలంగాణ ఆవశ్యకతను వివరిస్తూ తెలంగాణ మంత్రుల సంతకాలతో కూడిన లేఖను ప్రధాని, సోనియాగాంధీసహా హైకమాండ్ పెద్దలకు గత నెలలో ఫ్యాక్స్ చేశామని, ఇప్పుడు ప్రధాని రాష్ట్రానికి రావడంతో అదే లేఖను అందజేశామన్నారు.



తెలంగాణ మంత్రులు ప్రధానికి అందజేసిన లేఖలోని వివరాలిలా ఉన్నాయి..



‘‘తెలంగాణలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు మీకు బాగా తెలుసు. మేం ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదని భావిస్తున్నాం. క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తలుగా మేం చాలాసార్లు కేంద్రానికి ఇక్కడి పరిస్థితులను వివరించి, సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశాం.



తెలంగాణ ఉద్యోగులు, జేఏసీ విద్యార్థులు, ఇతర రాజకీయ పార్టీలు తెలంగాణ ఉద్యమాన్ని పునరుద్ధరించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుతూ ఈ శక్తులన్నీ అగ్రభాగాన ఉండి ఉద్యమిస్తున్న విషయం కూడా మీకు తెలుసు. తెలంగాణ ఏర్పాటు కోసం ఉద్యమిస్తున్న అనేక సంస్థలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చి ఉద్యమాన్ని ఉధృతం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాజకీయ సర్దుబాట్లు, ఆర్థిక ప్యాకేజీలు ఇవ్వడం వంటి చర్యలు చేపట్టాలని కేంద్రం భావిస్తున్నట్లు మీడియాలో వార్తలు రావడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ తరహా చర్యలేవీ ఏమాత్రం సత్ఫలితాలను ఇవ్వబోవని మేం ఆందోళన చెందుతున్నాం. తెలంగాణ రాష్ట్రం కావాలనే ఆకాంక్ష ప్రజల్లో దృఢంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక రాష్ర్టం ఇవ్వడం తప్ప మరో ప్రత్యామ్నాయమేదీ లేదని మేము మీకు విన్నవించుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రం ఇస్తే 2014 ఎన్నికల్లో ఎంఐఎం స్థానాల్లో మినహా అన్ని ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంటుందనే నమ్మకం ఉంది. తెలంగాణ ప్రజలు జాప్యాన్ని ఏమాత్రం సహించజాలరనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మా విజ్ఞప్తిని విశ్వాసంలోకి తీసుకోవాలని కోరుతున్నాం’’ అని పేర్కొన్నారు.


ప్రధానికి వినతుల వెల్లువ: వీడ్కోలు కార్యక్రమానికి హాజరైన పలువురు నేతలు ప్రధానికి పలు వినతిపత్రాలను అందజేశారు. రాష్ట్రానికి అదనపు విద్యుత్‌ను కేటాయించాలని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి కోరారు. ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా కల్పించాలని సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రులు పల్లంరాజు, పనబాక లక్ష్మి, రాష్ర్ట మంత్రులు రఘువీరారెడ్డి, కాసు వెంకటకృష్ణారెడ్డి, టీజీ వెంకటేశ్, రామచంద్రయ్య, పితాని సత్యనారాయణ, రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, పార్థసారథి, తోట నర్సింహం, ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, అంజన్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ తదితరులు ప్రధానిని కలిసిన వారిలో ఉన్నారు. అంతకుముందు మధ్యాహ్నం ప్రధాని ప్రత్యేక విమానంలో ఇక్కడికి వచ్చి, హెలిక్యాప్టర్‌లో సదస్సుకు వెళ్లారు. కాగా, ఈ సదస్సుకు కొన్ని మీడియా సంస్థల వారిని అనుమతించ కపోవడంపై మంత్రి జానారెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ విషయాన్ని ప్రధాని, సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.

No comments: