Saturday, October 6, 2012

శ్రీదేవి రీఎంట్రీ అదిరింది

15 ఏళ్ల విరామం తర్వాత 'ఇంగ్లిష్ వింగ్లిష్' చిత్రంతో బహు భాషానటి శ్రీదేవి రీఎంట్రీ అదిరింది. సాధారణ గృహిణి పాత్రలో శ్రీదేవి అద్భుతంగా ఒదిగిపోయింది. ఎన్నాళ్లుగానో తెర మీద మళ్లీ శ్రీదేవిని చూడాలనుకుంటున్న అభిమానులకు ఆ ముచ్చట తీరింది. ఈ చిత్రంలో శశి (శ్రీదేవి) పాత్ర ఇంగ్లిష్ వింగ్లీష్ పాత్రకే పరిమితం కాకుండా.. భారత దేశంలో ప్రతి రోజు ఏదో ఒక క్షణంలో ఎవరో ఒకరు ఆంగ్ల భూతానికి బలవుతూ ఉన్నవారికి ప్రతిరూపంగా నిలిచింది. ఊరుకాని ఊరు.. దేశం కాని దేశంలో ఇంగ్లీష్ రాని వారి పరిస్థితి ఎలా ఉంటుందో శశి పాత్ర కళ్లకు కట్టినట్టు చూపించింది. ఫలితంగా ప్రతి ఒక్కరికీ ఆ పాత్ర అందరినీ అలరించడమే కాకుండా, శ్రీదేవికి ఘనంగా రీ ఎంట్రీ ఇచ్చేందుకు అవకాశం కలిగించింది.

ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రం ద్వారా లక్షాలాది భారతీయ మధ్య తరగతి గృహిణులను ఆకట్టుకునే విధంగా శశి పాత్ర మలచబడింది. అంతేకాకుండా ప్రతి ఇంటిలో అత్త.. తన కోడలు ఇలానే ఉండాలనే విధంగా షిఫాన్ చీరలో మధ్య తరగతి గృహణిగా శ్రీదేవి మెప్పించింది. శ్రీదేవి నటనలోని పరిపక్వత, సహజత్వం శశి పాత్రకు ప్రాణం పోశాయి. ఇంగ్లీష్ రాదనే ఒకే ఒక కారణంతో తన ఇద్దరు పిల్లలు, భర్త ద్వారా అవహేళనకు గురవుతూనే.. కుటుంబాన్ని అమితంగా ప్రేమించే పాత్రను మలచడంలో దర్శకురాలు గౌరీ షిండే సఫలీకృతమయ్యారు. ఇంగ్లీష్ రాని వారు అమెరికాలో పడే ఇబ్బందులను చక్కగా చూపించడానికి శశి పాత్రలో శ్రీదేవి నటనను వందకు వందశాతం రాబట్టుకోవడంలో గౌరి విజయం సాధించారు.

శశి భర్తగా సతీష్ పాత్రలో బాలీవుడ్ నటుడు ఆదిల్ హుస్సేన్ చక్కగా నటించారు. శశి, సతీష్ పాత్రల మధ్య సంబంధాలు ప్రస్తుత నాగరికత ప్రపంచంలో చోటు చేసుకునే అంశాలను దర్శకులు గౌరి చక్కగా తెరకెక్కించారు. ఓ షాపింగ్ మాల్ లో సహ ఉద్యోగినిని తన భర్త కౌగిలించుకున్నపుడు.. 'మనమధ్య ఇంత చనువు ఉన్నా.. నన్ను ఎందుకు కౌగిలించుకోవ'ని శశి పాత్రలో శ్రీదేవి చూపించిన హవభావాలు వాహ్ అనిపించకతప్పదు. ఆఫీస్ పనుల్లో ఉండి భార్యను పట్టించుకోకుండా.. చిన్న చూపు చూసే భర్త పాత్రను చక్కగా మలిచారు. మాటలను వణికిస్తూ శ్రీదేవి మాట్లాడే తీరు కొన్ని సందర్బాలలో సహజంగా అనిపించింది. ఇక చిత్ర క్లైమాక్స్ లో శ్రీదేవి నటన అమోఘమని చెప్పిన మాట తక్కువే అవుతుంది.

'ఇంగ్లీష్ రాకుండా అమెరికాలో ఎలా మేనేజ్ చేస్తావు అని వీసా కౌంటర్ లో అమెరికా అధికారి అడిగిన ప్రశ్నకు.. పక్కనే ఉన్న సహ ఉద్యోగి.. నీవు తెలుగు రాకుండా ఇక్కడ ఎలా మేనేజ్ చేస్తున్నావో అలానే', అమెరికాలో ఎందుకు పర్యటిస్తున్నారు అని యూఎస్ లో అధికారి అడిగిన ప్రశ్నకు నేను ఖర్చు చేసే ప్రతి డాలర్.. మీ ఆర్దిక వ్యవస్థకు సహాయపడేందుకు' అని అమితాబ్, అజిత్ (తెలుగు, తమిళం) చెప్పే అనే డైలాగ్స్ ప్రేక్షకుల చేత చప్పట్లు మోగించడం ఖాయం. అమితాబ్ (హిందీ), అజిత్(తెలుగు, తమిళం), ఫ్రెంచ్ నటుడు మెహదీ నెబూ అతిధి పాత్రలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిత్ర కథకు సరిపోయే విధంగా రణగొణ ధ్వనులు లేకుండా అమిత్ త్రివేది సంగీతాన్ని అందించారు. ఫ్యామిలీ వ్యామిలీతో ఈ చిత్రాన్ని చూడాలనకునే వాళ్లకు ఇంగ్లీష్ వింగ్లీష్ సరిగ్గా సరిపోతుంది.

No comments: