Tuesday, December 4, 2012

ఆయుర్వేదం సాధించిన అద్భుతం నడుమునొప్పి మాయం

చిన్న ప్రమాదంలో నడుముకు తగిలిన దెబ్బ నాలుగేళ్లు స్వాతిని వేధించింది. చూడని ఆర్థోపెడిక్ డాక్టర్ లేరు. తీయించని ఎక్స్‌రేలు, ఎంఆర్ఐ స్కానింగ్‌లు లేవు. నడుము నొప్పికి కిడ్నీలో రాళ్లు కూడా కారణం కావచ్చన్న అనుమానంతో మరికొన్ని స్కానింగ్‌లు. ఏ వైద్యానికి లొంగని ఆ నడుము నొప్పి నెల రోజుల్లోనే మటుమాయమైంది. ఇది ఆయుర్వేద వైద్యంలోని వైశిష్ట్యమని అంటున్నారు డాక్టర్ బుక్కా మహేశ్‌బాబు.

ఆమె పేరు స్వాతి. వయసు 28 సంవత్సరాలు. స్వస్థలం అమలాపురం. భర్త ఉద్యోగరీత్యా కర్నూలులో ఉంటున్నారు. వారికి ఒక నాలుగేళ్ల పాప. ఒకరోజు అమలాపురంలో భర్తతో కలసి బైక్ మీద వెళుతూ ప్రమాదవశాత్తు కింద పడింది స్వాతి. ఫ్రాక్చర్ లాంటిదేదీ కానప్పటికీ నడుం దగ్గర కొద్దిగా నొప్పి ఉండేది. మామూలు నొప్పే కదా తగ్గిపోతుందిలా అనుకున్నారామె. అయితే నెలరోజులైనా నొప్పి తగ్గలేదు సరికదా పెరుగుతూ పోతోంది. కర్నూలులో ఒక ఆర్థోపెడిక్ డాక్టర్‌ను ఆమె సంప్రదించారు. ఆయన రాసిన పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు క్యాప్సిళ్లను గుప్పిళ్లు గుప్పిళ్లు మింగినప్పటికీ ఎటువంటి ప్రయోజనం కనిపించలేదు. నొప్పి మాత్రం తగ్గలేదు.

నొప్పికి కారణం ఏమిటో తెలుసుకోవడానికి ఎంఆర్ఐ తీయించారు ఆ డాక్టర్. డిస్క్ కొంచెం తేడాగా ఉంది... అరిగినట్లు కనపడుతోంది...విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుందని చెప్పి బెల్ట్ వేసుకోమన్నారు ఆ డాక్టర్. ఇలా ఒక సంవత్సరం గడిచింది. విశ్రాంతి తీసుకున్నా, బెల్ట్ పెట్టుకున్నా నొప్పిలో మాత్రం మార్పు లేదు. సూదులతో పొడుస్తున్నట్లు వచ్చే నడుంనొప్పిని పంటి బిగువున భరిస్తూ ఇంటి పని, వంట పని చూసుకోవడం ఆమెకు నరకంగా మారింది. ఈ నొప్పి ఇంతేనా? జీవితాంతం భరించాల్సిందేనా? అన్న ఆవేదన ఆమెను చుట్టుముట్టేవి. ఆ సమయంలో మరో ఆర్థోపెడిక్ డాక్టర్‌ను సంప్రదించారు ఆమె. ఆయన సలహామేరకు మళ్లీ నడుముకు ఎక్సరేలు, ఎంఆర్ఐ స్కాన్‌లు అన్నీ తీయించారు.

నడుముకు స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వాలని చెప్పారు ఆ డాక్టర్. అయితే స్టెరాయిడ్ ఇంజెక్షన్ తీసుకోవద్దని ఆమె సన్నిహితులు సలహా ఇవ్వడంతో డాక్టర్ దగ్గర వెన్నులో ఇంజెక్షన్ తీసుకోకుండా కేవలం మందులు మాత్రం తీసుకున్నారు స్వాతి. నెల రోజులు మందులు వాడినా ఏ విధమైన ప్రయోజనం లభించలేదు. నిరాశా నిస్పృహలు ఆమెను ఆవహించాయి. జీవితం దుర్భరంగా మారుతోంది. ఈ క్రమంలో కర్నూలులో ఉన్న ఆర్థో డాక్టర్లు, సర్జన్లనందరినీ సంప్రదించారు స్వాతి. ఆయా డాక్టర్లు తమ అనుభవాన్నంతా రంగరించి తమకు తోచిన విధంగా చికిత్స చేశారు. ఇలా మూడు సంవత్సరాలు గడచిపోయాయి.

కొంతమంది డాక్టర్లు ఈ నొప్పి కిడ్నీలో రాళ్ల వల్ల వస్తున్నదేమో అన్న అనుమానంతో యూరాలజిస్ట్‌ని సంప్రదించవలసిందిగా ఆమెకు సలహా ఇచ్చారు. దాంతో యూరాలజిస్ట్‌ని కలిశారు. ఆయన దాదాపు 30 రకాల స్కానింగ్‌లు తీయించారు. కిడ్నీలో చాలా సూక్ష్మమైన రాళ్లు ఉన్నాయి...వాటి వల్ల ఇంత నొప్పి వచ్చే అవకాశం లేదు కాబట్టి బాగా నీళ్లు తాగమని, ఆ రాళ్లు వాటంతటవే కరిగిపోతాయని ఆమెకు సలహా ఇచ్చారు. బిందెల కొద్దీ నీళ్లు తాగినా ఎటువంటి ఫలితం కనిపించలేదు. నొప్పి యథాప్రకారం అక్కడే తిష్టవేసుకుని కూర్చుంది. కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఆర్థో సమస్య కాదనుకుని యూరాలజిస్ట్ దగ్గరకు వెళితే మళ్లీ ఆర్థో డాక్టర్‌నే కలవమని ఆయన సలహా ఇచ్చారు. సమస్య ఏమిటో తెలియకుండా తిరిగిన డాక్టర్ల దగ్గరకే మళ్లీ వెళ్లవలసి వచ్చినందుకు స్వాతిలో తీవ్రమైన ఆవేదన, నైరాశ్యం అలుముకున్నాయి.

దుష్ప్రభావాలు మొదలయ్యాయి...
డాక్టర్లు రాసిన మందులు ఎక్కువకాలం గుప్పిళ్ల కొద్దీ మింగడం వల్ల కడుపులో మంట, ఎసిడిటీ, గ్యాస్ పెరగటం, విపరీతంగా బరువు పెరగటం లాంటి దుష్ప్రభావాలు స్వాతిలో తలెత్తాయి. ఈ సైడ్ ఎఫెక్ట్స్‌ని తగ్గించుకోవడానికి చాలా డబ్బు ఖర్చుపెట్టి బరువు తగ్గించే మందులు కూడా ఆమె వాడారు. అయినా బరువు తగ్గలేదు... నడుము నొప్పీ పోలేదు. అసలు వ్యాధి ఏమిటో ఎన్ని ఎక్స్‌రేలు, ఎంఆర్ఐ స్కానింగ్‌లు, కిడ్నీ స్కానింగ్‌లు చేసినా నిర్ధారణ కాలేదు. అసలు వ్యాధి నిర్ధారణ జరిగేతేనే కదా ఔషధం పనితీరు ప్రభావం తెలిసేది! ఈ పరిస్థితుల్లో అంతిమ పరిష్కారంగా మొట్టమొదటిసారి ధైర్యం కూడగట్టుకుని ప్రత్యామ్నాయ మార్గాలను వెదకడం ప్రారంభించారు ఆమె.

తమ కుటుంబ మిత్రుడొకరికి గుండుసూది కూడా మోపలేనంతగా శరీరమంతటా సొరియాసిస్ ఆవరించి ఉన్న పరిస్థితుల్లో ఆయుర్వేద మందులతో పూర్తిగా తగ్గిపోయిన విషయం ఆమె దృష్టికి వచ్చింది. వెంటనే ఆ మిత్రుడిని కలుసుకుని ఆయర్వేదం గురించి వాకబు చేశారామె. ఆ మిత్రుడు ఇచ్చిన సలహా మేరకు కర్నూలు నుంచి పయనమై నన్ను సంప్రదించారు ఆమె. నెలరోజుల క్రితం స్వాతి నా దగ్గరకు వచ్చినపుడు ఆమె చెప్పిన వ్యాధి లక్షణాలు ఇలా ఉన్నాయి.

వ్యాధి లక్షణాలు

- నడుములో కుడివైపు భాగంలో తీవ్రమైన నొప్పి.

- మెలిపెట్టినట్లు, గట్టిగా పిండినట్లు నడుములో నొప్పి.

- నొప్పి వచ్చినపుడు కుడికాలు పూర్తిగా స్పర్శను కోల్పోతుంది. అడుగు తీసి అడుగు వేయడం సాధ్యం కాదు.

- పద్మాసనం వేసుకుని కూర్చుంటే రెండు కాళ్లలో తిమ్మిర్లు.

- పాదాలు కింద పెడితే అరికాళ్లలో మంటలు.

- ఓ గంట సేపు కూర్చుని లేవాలంటే కాళ్లు సహకరించవు.

- నొప్పి ఉన్న వైపు పడుకుంటేనే ఉపశమనంగా ఉండేది.

- పడుకున్నపుడు అటు, ఇటు తిరగడానికి వీలయ్యేది కాదు.

- పడుకున్న తరువాత నిద్రలేవాలంటే కాళ్లు సహకరించేవి కావు. కాళ్లు స్వాధీనంలోకి రావడానికి అరగంట పట్టేది.

- తన సొంత పనులను కూడా చేసుకోలేని పరిస్థితి.

- మోకాలి పిక్కలు ఎవరో పిసికేసినట్టుగా నొప్పి వస్తుంది.

ఈ వ్యాధి లక్షణాలతో దాదాపు నాలుగైదు సంవత్సరాలుగా ఆమె బాధపడుతున్నారు.

వ్యాధి నిర్ధారణ ఇలా జరిగింది...
ఆమె శారీరక లక్షణాలను బట్టి ఈ వ్యాధిని కుడివైపు వచ్చే గృద్రసి వాత వ్యాధిగా నిర్ధారణ చేయడం జరిగింది. దీనితోపాటుగా ఇతరత్రా వివరాల కోసం ఎంఆర్ఐ రిపోర్ట్స్‌ను నిశితంగా పరిశీలించి వ్యాధి నిర్ధారణకు అవసరమయ్యే సమాచారాన్ని సేకరించడం జరిగింది. అతి సూక్ష్మమైన ఇసుకరేణువుల రూపంలో ఉన్న రాళ్లు కిడ్నీలో ఉన్నప్పటికీ నిరంతరం అతి తీవ్రమైన నడుమునొప్పి ఆ ప్రాంతంలో ఉండదు. అందుచేత ఆ అంశానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. కిడ్నీలోని రాళ్లు కరగడానికి ఒక ప్రత్యేకమైన ఆకును వండి తినవలసిందిగా సూచించడం జరిగింది. ఎంఆర్ఐలోని అంశాలు ఇలా ఉన్నాయి.

ఎల్3-ఎల్4, ఎల్4-ఎల్5 డిస్క్‌ల మధ్య నుంచి వచ్చే వెన్నుపాము నర్వ్ సిగ్నల్స్ తగ్గినట్లుగా తేలింది. ఇది చిన్న వయసులో ఎముకల అరుగుదల ఏర్పడటం వల్ల వచ్చే సమస్య. డి-12 వర్టిబ్రా నుంచి ఎల్-4 వర్టిబ్రా వరకు స్క్రూమోల్ కణుపులు అంటే వెన్నెముక చివరలో కొవ్వు గడ్డలాంటివి పెరగటం జరిగింది. ఎల్3-ఎల్4, ఎల్4-ఎల్5 మధ్యలో వెనుక భాగంలో డిస్క్ బల్జ్‌లు జరిగాయి. వెన్నుపాము వెళ్లేదారి ఇరుకై వెన్నుపాముపై పొరపై ఒత్తిడి పెరిగింది. ఇది ఎల్4-ఎల్5 మధ్య ఎక్కువగా ఉంది.

దీనికి తోడు రోగి మెడనొప్పితో బాధపడుతున్నప్పటికీ నడుము నొప్పి తీవ్రంగా ఉండటం వల్ల ఆ విషయానికి ఆమె అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. అయితే మెడ ప్రాంతంలోని సి2- సి3, సి4-సి5, సి5-సి6 ప్రాంతంలో వెన్నెముకల్లో అరుగుదల ఏర్పడినట్లు తేలింది. దీనివల్ల ఈ వెన్నెముకల వెనుక భాగంలో డిస్క్ బల్జ్‌లు ఏర్పడి వెన్నుపాము పైపొరపై ఒత్తిడిని కలుగచేస్తున్నాయి. దీనిని డీ జనరేటివ్ సర్వైకల్ డిస్క్ డిసీజ్ అంటారు.

ఇంకో అతి ముఖ్యమైన విషయం నడుము నిటారుగా నిలబెట్టడానికి అవసరమయ్యే లిగమెంటమ్ ఫ్లేవమ్ పట్టుజారి డి10 వర్టిబ్రా ప్రాంతంలో వెన్నుపాముపైన, వెన్నుపాము పైపొరపైన ఒత్తిడి కలుగచేస్తోంది. ఎంఆర్ఐ రిపోర్ట్స్‌ను సమగ్రంగా పరిశీలించిన తర్వాత పేషెంట్ వాహనం మీద నుంచి పడటం వల్లనే వెన్నుకు దెబ్బతగలడం వల్ల సమస్య ఇంత తీవ్రతరం అయ్యిందని కచ్ఛితమైన నిర్ధారణకు రావడం జరిగింది. అనంతరం చికిత్స ప్రణాళికను రూపొందించడం జరిగింది. మొట్టమొదటిగా చెదిరిన డిస్క్‌లు, సాగిన ఫ్లేవమ్ లిగమెంట్లను సరిచేసి వెన్నుపాముపై ఒత్తిడి తగ్గడానికి, నొప్పి తగ్గడానికి కావలసిన ఔషధాలను, వాటి డోసేజ్‌లను నిర్ధారించుకుని చికిత్స మొదలు పెట్టాము.

చికిత్సా విధానం ఇలా ఉంది...
వ్యాధి నిర్ధారణ, ఔషధాల ఎంపిక, వాటి డోసేజ్‌ల పరిమాణం, అవి వాడే విధివిధానం, ఏమేమి సలహాలు, సూచనలు పాటించాలి, చికిత్సలో మెరుగైన ఫలితాలు చికిత్సలో మెరుగైన ఫలితాలు పొందడానికి అతి ముఖ్యమైన అంశాలు. ఈ రోగి విషయానికి వస్తే సాధారణంగా అందరూ చెప్పే పథ్యాలైన వంకాయ, గోంగూర, దుంపకూరలు, సెనగపిండి లాంటివి తినవద్దని సూచించలేదు. కేరళ వైద్యం లాంటి మసాజ్‌లు కూడా ఏమీ చెప్పలేదు. మేము చేపట్టిన చికిత్సలో తైలమర్ధనలు అన్న ప్రయోగమే లేదు.

చెదిరిన డిస్క్‌లు సరిచేయడానికి, సాగిన లిగమెంట్ మామూలు స్థితికి రావడానికి, ఎముకల అరుగుదల సరిచేయడానికి ప్రాచీన కాలంలోనే ఆయుర్వేద సిద్ధ శాస్త్రవేత్తలు కనిపెట్టిన అత్యంత సూక్ష్మ ఔషధాలను(నానో) ఉపయోగించాము. ఇవి అత్యంత ప్రభావశీలమైన ఔషధ గుణాలతో కూడిన ఆకులు, బెరడులు, గింజలు, వేర్లు, జిగుర్లు, శుద్ధి చేసిన ఖనిజ భస్మాలతో తయారుచేసిన ఔషధాలు. నిరపాయకరమైన ఈ ఔషధాలు శరీర జీవ క్రియను మెరుగుపరచి, అత్యంత సూక్ష్మమైన కణాలలోకి కూడా బయో మాలిక్యూల్స్‌ను తీసుకువెళతాయి. రోగికి నెలరోజులకు అవసరమైన ఔషధాలను చికిత్సగా అందచేయడం జరిగింది.

చికిత్సా ఫలితం
నాలుగు వారాలపాటు ఔషధాలను వాడిన స్వాతికి అద్భుతమైన ఫలితాలు కనిపించాయి. నాలుగేళ్లుగా పట్టిపీడిస్తున్న నడుము నొప్పి పూర్తిగా మాయమైపోయింది. నాలుగడుగులు నడవడానికే కష్టపడే ఆమె ఇప్పుడు నాలుగు గంటలసేపు నిలబడి వంటచేయగలుగుతోంది. కాళ్లలో వచ్చే తిమ్మిర్లు తగ్గిపోయాయి. ఏ ఆసరా లేకుండానే చకచకా నడవగలుగుతోంది.

కూర్చున్నా, లేచినా, నిలబడినా వేధించే నొప్పి ఇప్పుడు లేనేలేదు. నిద్రించే సమయంలో అటు, ఇటు తిరగడం ఇప్పుడు సులువైంది. నిద్ర లేచిన వెంటనే సొంత పనులే కాక ఇంటి పనులు కూడా చేయగలుగుతోంది. ప్రశాంతంగా నిద్రించడంతోపాటు బరువు కూడా తగ్గడం మొదలైంది. మరో రెండు నెలల పాటు ఔషధ చికిత్సను కొనసాగించడం వల్ల నడుము నొప్పి ఇతర సమస్యలన్నీ కూడా ఆమెకు శాశ్వతంగా దూరమైపోవడం ఖాయం.

నాలుగేళ్లుగా పట్టిపీడిస్తున్న నడుము నొప్పి పూర్తిగా మాయమైపోయింది. నాలుగడుగులు నడవడానికే కష్టపడే ఆమె ఇప్పుడు నాలుగు గంటలసేపు నిలబడి వంటచేయగలుగుతోంది. కాళ్లలో వచ్చే తిమ్మిర్లు తగ్గిపోయాయి. ఏ ఆసరా లేకుండానే చకచకా నడవగలుగుతోంది.

Saturday, December 1, 2012

హెచ్‌ఐవీ వైరస్... తెలివితేటలు!

హెచ్‌ఐవీ వైరస్ చాలా తెలివైనది. అది శరీరంలోకి ప్రవేశించాక రోగనిరోధకశక్తిని ఇచ్చే సీడీ-4 సెల్స్‌ను నాశనం చేయడం పాటు తన సంతతిని వృద్ధి చేసుకుంటుంది. యాంటీ రెట్రోవైరల్ (ఏఆర్‌డీ) మందులు సీడీ-4 సెల్‌కౌంట్‌ను తగ్గకుండా చూస్తాయన్నమాట. ఈ వైరస్ ఎంత తెలివైనదంటే ఒకరకం మందులకు అలవాటు పడ్డ తర్వాత ఆ మందుకు తన నిరోధకశక్తి (రెసిస్టెన్స్) ని పెంచుకుంటుంది. తద్వారా తనను తాను (కాపీ చేసుకోవడం ద్వారా) వృద్ధి చేసుకోవడం మళ్లీ ప్రారంభిస్తుంది. అందుకే దాన్ని తప్పుదారి పట్టించేందుకు మూడు రకాల ఏఆర్‌వీ మందులు ఇవ్వాల్సి ఉంటుంది. అలా చేయడం ద్వారా అది ఏ మెడిసిన్ పట్లా తన నిరోధకశక్తిని పెంపొందించుకోకుండా చేయవచ్చు.

హెచ్‌ఐవి - జానకి......

జానకిలాంటి వాళ్లందరికీ ఎయిడ్స్ డే సందర్భంగా అభినందనలు

జబ్బు నుంచి విముక్తి పొందడం కన్నా
సమాజం నుంచి విముక్తి పొందడం కష్టం.
భయం, అనుమానం, అవమానం, నిషేధం... వంటి క్రూరమైన ఆయుధాలతో సమాజం కొందరిని బాధ పెడుతుంది.
నువ్వు అక్కర్లేదు పో అని తరిమికొడుతుంది.
ఎదరించి నిలవడం, పోరాడి జీవించడం చాలా కష్టం.
కాని- జానకి సాధించింది. తనను మొదట ఒక మనిషిగా, ఆ తర్వాత హెచ్‌ఐవి బాధితురాలిగా యధాతధంగా గుర్తించే స్థితికి చేరుకుంది. తనకూ గౌరవప్రదంగా జీవించే హక్కు ఉందని నినదించింది. తనలాంటి వాళ్లకు అదే స్థాయిభరోసాను ఇచ్చే స్థాయికి ఎదిగింది.

జానకి వయసు 35 ఏళ్లు. హైదరాబాద్ వనస్థలిపురంలో తమ్ముడి కుటుంబంతో కలిసి ఉంటుంది. ప్రతి రోజూ ఉదయం అక్కడి నుంచే హైదరాబాద్ లోని ఓ ఆర్గనైజేషన్‌కు చేరుకుంటుంది. అక్కడకు వచ్చిన హెచ్‌ఐవి బాధిత గుండెల్లో ధైర్యం నింపుతుంది. అన్నిం టి కంటే మించి వాళ్లకు నవ్వడం నేర్పుతుంది. నవ్వడం మర్చిపోయేంత భయంకరమైన నేరం వారేం చేశారని? అడిగితే- ‘‘ఎనిమిదేళ్ల కిందట నవ్వడం మానేశాను. హెచ్‌ఐవి సోకిందని తెలిసి నేడో రేపో చావు ఖాయం అనుకున్నాను. కాని, ఇవాళ ఎంతోమంది హెచ్‌ఐవి బాధిత కళ్లల్లో వెలుగులు నింపుతూ సంతృప్తిగా జీవిస్తున్నాను’’ అంది జానకి. ఆమె కథనం ఆమె మాటల్లో...

‘‘మా అమ్మనాన్నలకు నలుగురం ఆడపిల్లలం. ఒక మగపిల్లాడు. పద్దెనిమిదేళ్ల వయసులో మేనత్త కొడుకుతో పెళ్లయింది. ఆయన ముంబయ్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. అక్కడ అత్తమామ, ఇద్దరు మరుదులున్న ఉమ్మడి కుటుంబంలో ఏడేళ్లపాటు సంసారం సజావుగా సాగిపోయింది. ఏ ఒడిదొడుకులు లేవనుకున్న ఇంట్లో ఓ రోజు మా ఆయన జబ్బు కలకలం రేపింది. జ్వరం తగ్గుతున్నట్టే ఉండేది. మళ్లీ వచ్చేది. మెడికల్ షాపుల నుంచి మందుబిళ్లలు తెచ్చి వేశాం. తగ్గలేదు. డాక్టర్ల చుట్టూ తిరిగాం. వారు చెప్పిన మందులు వాడాం. వారం రోజుల్లోనే మనిషి బాగా నీరసించిపోయాడు. విపరీతమైన దగ్గు. దీంతో గవర్నమెంట్ ఆసుపత్రిలో చేర్పించాం. అక్కడ పరీక్షించిన డాక్టర్లు మా అత్తమామలకు ఏం చెప్పారో తెలియదు. కాని, మళ్లీ వస్తామని చెప్పి వెళ్లిన వారు ఆసుపత్రి వంక రావడమే మానేశారు. ఏం జబ్బు అని నర్సులను అడిగితే హెచ్‌ఐవి అన్నారు. ఆ జబ్బు ఏమిటో ఎందుకు వస్తుందో నాకు తెలియదు. డాక్టర్లు చూస్తున్నారు, మందులు వాడుతున్నాం, తగ్గిపోతుందిలే అనుకున్నాను. చంటిపిల్లాడికి మల్లే సపర్యలు చేశాను. కాని, మనిషి దక్కలేదు. పదిరోజులైనా కాకముందే... నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్లిపోయాడు.’’

వెంటాడిన తప్పు..

‘‘ఎనిమిది రోజులకే ఎనభై ఏళ్లకు సరిపడా నరకం అనుభవించాననిపించింది ఆ ఆసుపత్రిలో. మా అమ్మనాన్నలకు ఈ విషయం తెలిసి వచ్చారు. వారికీ ఈ జబ్బు గురించి ఏమీ తెలియదు. మా అత్తమామతో గొడవపెట్టుకున్నారు. మా అత్త- కొడుకే పోయాడు, కోడలు మాత్రం ఎందుకు అనడంతో పుట్టెడు దుఃఖాన్ని గుండెలో పెట్టుకొని అమ్మనాన్నలతో కలిసి హైదరాబాద్ వచ్చేశాను. ఏడాది తర్వాత ఉన్నట్టుండి నాకూ దగ్గు, ఆయాసం, జ్వరం మొదలయ్యాయి. సాధారణంగా వచ్చే సమస్యలే కదా అనుకొని కొన్నాళ్లు ఇంటి జాగ్రత్తలే పాటించాను. కాని లాభం లేకపోయింది. ప్రైవైట్ డాక్టర్లను సంప్రదించాను. ఏడాది పాటు ఎవరేం చెప్పినా ఆ మందులన్నీ వేసుకున్నాను. కాని అవేవీ పనిచేయలేదు. బరువు ఇరవై కేజీలకు పైగా తగ్గిపోయాను. నా ఒంటిరంగు, జుట్టు రంగూ మారిపోయాయి.

ఓ డాక్టర్ సలహా మేరకు ఎర్రగడ్డలోని చెస్ట్ ఆసుపత్రిలో చేరాను. అక్కడ టెస్టులు చేసి, హెచ్‌ఐవి పాజిటివ్ అని చెప్పారు. అప్పుడు నా వయసు 27. బరువు 27. సిడి4 కౌంట్ 27. (ఆరోగ్యంగా ఉన్నవారిలో సిడి4 కౌంట్ 500పైగా ఉంటుంది. హెచ్‌ఐవి ఉన్నవారి లో ఈ కౌంట్ 350 కన్నా తగ్గితే ప్రమాదమని వైద్యులు చెబుతారు) సిడి4అంటే ఏంటో, హెచ్‌ఐవి అంటే ఏంటో అది ఎందుకు వస్తుందో తెలియదు. కాని అనారోగ్య కారణంగా పడే బాధలను తట్టుకోలేక చచ్చిపోతానా... అనిపించేది. మా ఆయన వల్లే ఈ జబ్బు నాకు సంక్రమించిందని అప్పుడూ తెలియలేదు. చెస్ట్ ఆసుపత్రి డాక్టర్లు ఉస్మానియా హాస్పిటల్‌లోని ఎఆర్‌టి సెంటర్‌కి రాశారు. అక్కడ వాళ్లు ఈ జబ్బు గురించి కొంత చెప్పారు. కాని అంతా గందరగోళంగా, భయం భయంగా అనిపించింది. ఈ జబ్బు ఎంత భయంకరమైనదో మెల్ల మెల్లగా తెలిసొచ్చింది.’’

సైడ్ ఎఫెక్ట్స్...

‘‘డాక్టర్లు ఇచ్చిన మందులు వేసుకుంటే ఒక బాధ, వేసుకోకపోతే ఒక బాధలా అయ్యింది నా పరిస్థితి. చాలా పవర్ ఉన్న ట్యాబ్లెట్లు అవడం వల్ల కడుపులో అల్సర్లు వచ్చాయి. విపరీతమైన మంట. బాధను తట్టుకోలేక విలవిల్లాడుతూ అరుస్తుంటే మా అమ్మ ఇంటి బయటకు వెళ్లిపోయి ఏడుస్తూ కూర్చునేది. ఇదేమి జబ్బో అని నన్ను తాకడానికి కూడా భయపడేది. రాత్రుళ్లు ఇంట్లో ఎవరికీ నిద్రలే ఉండేవి కావు. నా కంచం, మంచం, గ్లాసు, సబ్బు... అన్నీ వేరయిపోయాయి. మా చెల్లెళ్ల పిల్లలను దగ్గరకే రానిచ్చేవారు కాదు. ఇంట్లో ఈ తేడా నన్ను మరింతగా కుంగదీసింది. ఇవి చాలదన్నట్టు ఆ మందుల ఎఫెక్ట్‌కి చూపులో తేడా వచ్చింది. ఎడమకన్ను పూర్తిగా చూపు కోల్పోయింది. వీపు మీద పెద్ద కణతి ఏర్పడింది. ఇన్ని సమస్యలను తట్టుకుంటూ ఇంకా బతకడం అవసరమా అని ఏడ్వని రోజు లేదు.’’

బతుకుపై బరోసానిచ్చింది ఓ  సంస్త ...

‘‘మందుల ప్రభావానికి శరీరం అలవాటు పడటం మొదలుపెట్టింది. ఎ.ఆర్.టి సెంటర్ వాళ్లు ఇచ్చే సూచనలు పాటించాను. అక్కడే ఓ అనే ఎన్.జి.ఓ సంస్థ గురించి తెలిసింది. అక్కడ నాలాంటి వారికి ఎన్నో సహాయసహకారాలు అందిస్తున్నారిని తెలిపింది. నా సమస్య నేనే పరిష్కరించుకోవాలని బెరుకుబెరుగ్గానే ఆ  సంస్థ సభ్యులను కలిశాను. నాకొచ్చిన సమస్య చెప్పాను. ‘ఇక్కడ ఉన్నవారంతా హెచ్‌ఐవి బాధితులే. భయపడాల్సిన అవసరం లేదు. జాగ్రత్తలతో వ్యాధిని నియంత్రణలో పెట్టుకోవచ్చు. అన్నింటికన్నా కావల్సింది మనోధైర్యం’ అని చెప్పారు వాళ్లు. అక్కడికెళ్లినప్పుడు ఎంత భయపడ్డానో, వారిచ్చిన కౌన్సెలింగ్ వల్ల అంత ధైర్యం వచ్చింది. పర్వాలేదు ఉన్నన్నాళ్లూ ఆరోగ్యంగా బతకగలను అనే నమ్మకం వచ్చింది.

పోషకాలు గల ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా ఎయిడ్స్ మందులు వాడటం, రోజూ ఏదో రకంగా ఆ  సంస్థ సభ్యులను కలుసుకోవడం చేశాను. అలా తొందరగానే కోలుకోగలిగాను. నాలాంటి హెచ్‌ఐవి బాధితులకు కౌన్సెలింగ్ చేయాలనుకున్నాను. అదే విషయం  సంస్థ సభ్యులకు చెప్పి, వారి సహకారంతో కౌన్సెలింగ్ చేయగలిగే స్థాయికి ఎదిగాను. ఇప్పుడు ఆ సాయం నాలో ఎనలేని సంతృప్తిని నింపుతోంది. పిల్లలులేని నేను ఓ పాపను పెంచుకుంటున్నాను. ఇప్పుడా పాపకు ఏడేళ్లు. ఆ పాప భవిష్యత్తులోనే నా ఆనందాన్ని వెతుక్కుంటున్నాను’’ అని ముగించారు జానకి.

చావే పరిష్కారం అనుకునే ఎంతో మంది హెచ్‌ఐవి బాధితులకు మరణం అంచుల దాకా వెళ్లొచ్చిన జానకి కథనం ఓ ఆదర్శం. హెచ్‌ఐవి సమస్యను అధిగమించడానికి ఎంతోమంది అమాయకులకు కావలసిన మనోధైర్యాన్ని ఇవ్వగలిగే స్థాయికి చేరుకున్న జానకిలాంటి వాళ్లందరికీ ఎయిడ్స్ డే సందర్భంగా అభినందనలు తెలుపుదాం.

హెచ్‌ఐవి బాధితులు మళ్లీ పెళ్లి చేసుకోవచ్చు. సంసారజీవితాన్ని సరైన జాగ్రత్తలతో సుఖసంతోషాలతో గడపవచ్చు. నన్నూ పెళ్లి చేసుకోమని కొంతమంది సూచించారు. కాని పెళ్లి చేసుకో వాలనే ఆలోచన నాకు లేదు. ఎందుకంటే జీవితంలో నాకో దిశ కనిపించింది. గమ్యం ఏంటో అర్థమైంది. అందుకే నాలో ధైర్యాన్ని నింపిన  ఆర్గనైజేషన్‌లోనే కౌన్సెలర్‌గా చేరాను.
- జానకి

Friday, November 30, 2012

మన ఆహారం... మన గొప్పదనం...

(ఇండియన్ డైటేటిక్ అసోసియేషన్ స్వర్ణోత్సవాల సందర్భంగా ‘భారత ఆహారాలు-ఆరోగ్యం’పై సెప్టెంబర్ 29 నుంచి డిసెంబర్ 1వరకు హైదరాబాద్‌లో సదస్సు జరుగుతున్న నేపథ్యంలో...)

తిండి కలిగితే కండ గలదోయ్... అన్నాడు మహాకవి గురజాడ. పనిచేయాలంటే తగినంత శక్తి ఉండాలి కదా... అయితే పనిచేయడానికి మాత్రమే కాదు మనిషి మూర్తిమత్వాన్ని, వ్యక్తిత్వాన్ని, వ్యవహారశైలిని కూడా తినే తిండి నిర్దేశిస్తుందని మన వేదాలు ఘోషిస్తున్నాయి. మనిషి వ్యవహారశైలి, పని స్వభావంపై ఆహారం ప్రభావం చూపిస్తుందని భగవద్గీతలో ప్రస్తావన ఉంది. ఆహారం మెదడుపైన ప్రభావం చూపిస్తుంది కనుకనే మనలో సత్వ, రజో, తమో గుణాలు ప్రేరేపణకు గురవుతుంటాయి. మన న్యాయశాస్త్రంలోనూ ఆహార పదార్థాల గురించిన వివరణ ఉంది. ద్రవ్య, గుణ, కర్మ, సామాన్య, విశేష, సమావయ, అభవ పదార్ధాలుగా వాటిని వివరించారు. అందుకే వేదకాలానికి పూర్వం నుంచే అన్నం పరబ్రహ్మ స్వరూపమైంది.

వ్యాధులు, ఆరోగ్యంలో ఆహార పదార్ధాల పాత్రపై మన పూర్వీకులకు పూర్తి అవగాహన ఉండేది. ఉప్పు అధికంగా తీసుకంంటే వచ్చే ఎగ్జిమా, అసిడిటీల గురించి, స్వీట్లు ఎక్కువ తింటే పెరిగే కఫ దోషాల గురించి వారికి అనాడే తెలుసు. వాటికి విరుగుడుగా మంచి ఆహార అలవాట్లను, దోషనివారణకు అనువైన సాంప్రదాయ వైద్య ప్రక్రియలను అనాడే అభివృద్ధి చేసుకున్నారు. కానీ కాలం మారింది. నేడు కొత్త తరం ఆహార పదార్ధాలు వచ్చేశాయి. మనదేశంలో ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో ఆహార అలవాట్లలో విపరీతమైన మార్పులు వచ్చాయి. జీవన విధానమూ మారిపోయింది. సాంప్రదాయ భారత ఆహారం గింజధాన్యాలతో నిండి ఉండేది. దంపుడు బియ్యం స్థానంలో బాయిల్డ్ రైస్ వచ్చి చేరాయి. తెల్లబియ్యం వచ్చిన తర్వాత మిగిలిన రకాలను తినడమే మానేశారు.

గోధుమ పరిస్థితీ ఇంతే. చపాతీల స్థానాన్ని రిఫైన్డ్ గోధుమతో తయారయ్యే బ్రెడ్‌లు ఆక్రమించాయి. అమెరికన్లు, యూరోపియన్లు మన వంటకాలు నేర్చుకుని వాటిలో ఉన్న పోషక విలువలను తెలుసుకుని ఆశ్చర్యపోతుంటే భారతీయులు మాత్రం వారి పిజ్జాలు, బర్గర్ల వెంటపడుతున్నారు. జొన్నలు, సజ్జలు, రాగులను పూర్తిగా వదిలేశారు. ఇపుడు తింటున్న రిఫైన్డ్ ఆహారంలో చాలా రకాల విటమిన్లు, మినరల్స్ ఉండడం లేదు. దాంతో రోగనిరోధక శక్తి కనుమరుగైపోతున్నది. వ్యాధులు పెరిగిపోయాయి. వయసుతో నిమిత్తం లేకుండా గుండె సంబంధ వ్యాధులు, హైపర్‌టెన్షన్, ఊబకాయం, డయాబెటిస్ వంటివి దాడి చేస్తుండడానికి కారణం మనం తినే ఆహారమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మన శరీర తత్వాన్ని, మన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆహారపు అలవాట్లను మార్చుకోవడం ద్వారా అనేక వ్యాధుల బారి నుంచి తప్పించుకోవచ్చని వారు చెబుతున్నారు. సరిహద్దులో నిరంతరం దేశరక్షణ బాధ్యతలను చూస్తున్న సైన్యాన్ని ఇందుకు ఉదాహరణగా తీసుకోవచ్చు. వారు ఎడారిలో, కొండకోనల్లో, మైదాన ప్రదేశాలలో కాపలా కాస్తుంటారు. అందుకే వారి కోసం రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) ప్రత్యేక ఆహారాన్ని అందిస్తున్నది. సైనికులు దేశాన్ని రక్షిస్తున్నట్టే మనమూ మన దేహాన్ని రక్షించుకోవాలి. ఈ విషయంలో మన పరిశోధనా సంస్థలు తీసుకుంటున్న జాగ్రత్తల నుంచి మనమూ పాఠం తీసుకోవాలి. మన ఆరోగ్యాన్ని, శరీరాన్ని దృష్టిలో ఉంచుకుని ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. అపుడే ఆరోగ్య భారత్ ఆవిష్కృతమవుతుంది.

- పి. తులసీకుమారి


రుచుల సోయగం

సోయ... అంటే సో గుడ్.
సోయ... ఉంటే సో హెల్దీ.
సోయ... వండితే సో టేస్టీ.
వీకెండ్‌లో హోటల్‌వైపు పరుగులు తీసే జిహ్వను కట్టిపడేసేలా ‘సోయ’ వంటకాలతో
ఇంటిల్లిపాదికి వెరైటీ విందు ఇవ్వండి.
వీకెండ్‌ను యమ్మీగా మార్చావంటూ కితాబు అందుకోండి.


సోయాబీన్ సటయ్

కావలసినవి

సోయాబీన్స్ - 100 గ్రా.
(సోయాబీన్స్‌ను మిక్సర్ జార్‌లో వేసి, మెత్తగా పొడి చేయాలి.) ఉప్పు - తగినంత
పీ నట్ బటర్ - 100 గ్రా. 
సోయ పాలు - తగినన్ని
పై పదార్థాలన్నీ చపాతీ పిండిలా కలిపి, పక్కనుంచాలి.
చాప్ స్టిక్స్ - తగినన్ని
సటయ్ మ్యారినేట్ కోసం... 
లెమన్‌గ్రాస్(మార్కెట్లో లభిస్తుంది) - అర కప్పు, ఉల్లిపాయలు - 2 (చిన్నవి), వెల్లుల్లి రెబ్బలు - 4 
కారం - అర టీ స్పూన్ 
అల్లం - చిన్నముక్క
పసుపు - చిటికెడు 
ధనియాలపొడి - టీ స్పూన్ 
సోయా సాస్- 2 టేబుల్‌స్పూన్లు 
నూనె - 3 టేబుల్ స్పూన్లు 

తయారి

మ్యారినేట్ కోసం చెప్పిన పదార్థాలన్నీ మిక్సర్ వేసి, బ్లెండ్ చేసి పక్కన ఉంచాలి. సోయాబీన్ మిశ్రమాన్ని సమానభాగాలు చేసి, కావలసిన షేప్ చేయాలి. వీటికి పుల్లలు గుచ్చి, వాటిమీద మారినేట్ మిశ్రమాన్ని పోయాలి. అన్నివైపులా తడిసేలా జాగ్రత్త తీసుకొని, ప్లేట్‌పైన మరో మూత పెట్టి లేదా కవర్‌తో మూసేయాలి. దీనిని గంటసేపు బయట ఉంచి, మరో గంట ఫ్రిజ్‌లో ఉంచి, ఆ తర్వాత ఈ ముక్కలను గ్రిల్ చేయాలి. రెండు వైపులా గ్రిల్ చేశాక, ప్లేట్‌లోకి తీసుకొని గార్నిష్ చేయాలి. పెనం మీద కాల్చుకోవాలంటే సరిపడా నూనెను వాడాలి. వీటిని టొమాటో చట్నీతో సర్వ్ చేయాలి.

టోఫు పీస్ మసాలా

కావలసినవి

సోయాటోఫు (మార్కెట్లో లభిస్తుంది) - 100 గ్రా., పచ్చి బఠాణీలు - అర కప్పు 
ఉల్లిపాయలు - 2, టొమాటో - 2 
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్ 
బాదంపప్పు - 4, జీడిపప్పు - 4
ఎండుమిర్చి - 4, ధనియాలు - టేబుల్ స్పూన్, ఏలకులు - 2, 
సోంపు - అర టీ స్పూన్, 
దాల్చినచెక్క - చిన్న ముక్క
కారం - 2 టీ స్పూన్లు (తగినంత)
ఉప్పు - తగినంత, కొత్తిమీర - తగినంత 

తయారి

ఉల్లిపాయలను, టొమాటోలను ముక్కలుగా కట్ చేసుకోవాలి. టోఫులను నీళ్లలో వేసి, బయటకు తీసి, పేపర్ టవల్ మీద ఉంచాలి. (ఇలా చేస్తే టోఫుల్లోని నీళ్లన్నీ ఇంకిపోతాయి). మెత్తబడిన టోఫులను కావలసిన పరిమాణంలో ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టౌ మీద పాన్ పెట్టి, టేబుల్‌స్పూన్ నూనె వేసి, సన్నని మంటమీద టోఫు ముక్కలను పది నిమిషాలు రెండువైపులా వేయించాలి. టోఫులను విడిగా గిన్నెలోకి తీసుకొని, చల్లారనివ్వాలి. అదే పాన్‌లో మరొక టీ స్పూన్ నూనె వేసి, దాల్చినచెక్క, ఏలకులు, సోంపు, ధనియాలు, ఎండుమిర్చి కూడా వేసి వేయించాలి. ప్లేట్‌లోకి తీసుకొని చల్లారనివ్వాలి. అదే పాన్‌లో ఉల్లిపాయముక్కలు వేయించి, దాంట్లో టొమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించాలి. ఉడికిన టొమాటో ముక్కలను గరిటెతో చిదిమి, చల్లారనివ్వాలి. బాదం, జీడిపప్పులను వేయించి, పేస్ట్ చేసి, ఒక గిన్నెలోకి తీసుకోవాలి. వేయించిన దినుసులను మిక్సర్ జార్‌లో వేసి, పొడి చేయాలి. దీంట్లోనే టొమాటో మిశ్రమం వేసి పేస్ట్ చేయాలి. స్టౌ పై పాన్ పెట్టి, టీ స్పూన్ నూనె వేసి వేడయ్యాక, టొమాటో మిశ్రమం, జీడిపప్పు పేస్ట్ వేసి, కప్పు నీళ్లు పోసి కలపాలి. దీంట్లో ఉప్పు, కారం వేసి మరో పది నిమిషాలు మరిగించాలి. మిశ్రమం బాగా చిక్కబడిన తర్వాత టోఫు ముక్కలు వేసి రెండు నిమిషాలు ఉడికించాలి. ఉప్పు, కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకొని, చివరగా కొత్తిమీర వేసి దించాలి. ఈ కర్రీ చపాతీలోకి, అన్నంలోకి రుచిగా ఉంటుంది. 

సోయ కబాబ్

కావలసినవి

సోయాబీన్ పొడి - 100 గ్రా.
బ్రెడ్ క్రంబ్ పౌడర్ - 100 గ్రా.
అల్లం - చిన్నముక్క (సన్నగా తరగాలి)
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్
పచ్చిమిర్చి - 4
గరంమసాలా, 
జీలకర్ర పొడి - 
అర టీ స్పూన్ చొప్పున
ఆమ్‌చూర్ పొడి 
(మార్కెట్లో లభిస్తుంది) 
మిరియాల పొడి - చిటికెడు 
ఉప్పు - తగినంత
కొత్తిమీర తరుగు - టీ స్పూన్
నూనె - తగినంత

తయారి: 

కడాయిలో నూనె వేసి, ఉల్లిపాయలు, అల్లం తరుగు, కొత్తిమీర, అల్లం-వెల్లుల్లి పేస్ వేయించాక కారం, గరం మసాలా, ఉప్పు వేసి కలపాలి. తర్వాత సోయాబీన్ పొడి, బ్రెడ్ క్రంబ్ పొడి వేసి కలిపి, వేయించాలి. ముద్దగా అయిన ఈ మిశ్రమాన్ని తగినంత తీసుకొని, చేతులతో మిర్చి బజ్జీ అంత సైజు చేయాలి. వీటిని బొగ్గుల మీద లేదా గ్రిల్‌లోనైనా కాల్చుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే చాకుతో మధ్యకు కట్ చేయాలి. వీటిని పుదీనా చట్నీతో సర్వ్ చేయాలి.

Thursday, November 29, 2012

HIV......తల్లీ, బిడ్డా క్షేమం కోసం...

తల్లి నుంచి బిడ్డకు హెచ్‌ఐవీ వ్యాపించడాన్ని ‘మదర్ టు ఛైల్డ్ ట్రాన్స్‌మిషన్’ అంటారు. తల్లికి హెచ్‌ఐవీ ఉన్న ప్పుడు ప్రసవం ముందర కొద్దికాలంపాటు యాంటీ రిట్రోవైరల్ డ్రగ్స్ ఇవ్వాలి. ఇది ఎప్పుడు ఇవ్వాలి, ఏ మోతాదులో ఇవ్వాలి, ఏ సమయం వరకు ఇవ్వాలన్న అంశాన్ని డాక్టర్లు నిర్ణయిస్తారు. ప్రసవం తర్వాత పుట్టిన పాపకూ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక చనుబాల విషయానికి వస్తే, తల్లికి ఇన్ఫెక్షన్ ఉంటే బిడ్డకు చనుబాలు ఇవ్వకపోవడమే మంచిది.

తల్లి నుంచి బిడ్డకు హెచ్‌ఐవీ వ్యాపించకుండా ఉండేందుకు వాడే మందుల్లో నెవిరపిన్, జిడోవుడిన్ (దీన్ని ఏజడ్‌టీ అని కూడా అంటారు) అనే ఔషధాలు ఉంటాయి. తల్లికి హెచ్‌ఐవీ ఉందని గుర్తించడంలో ఆలస్యం జరిగి ప్రసవానికి కొద్దిరోజుల ముందే ఆ విషయాన్ని కనుగొంటే... హెచ్‌ఐవీ బిడ్డకు రాకుండా నివారించడం కోసం ‘నెవరపిన్’ వాడటం మినహా మార్గాంతరం లేదు.

దీనివల్ల పూర్తిగా నివారణ సాధ్యమవుతుందని చెప్పలేం. కానీ ముందు నుంచీ తీసుకునే చర్యల ద్వారా చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో తల్లి నుంచి బిడ్డకు వ్యాప్తిని నిరోధించడం సాధ్యమైంది. తద్వారా అక్కడ తల్లి నుంచి బిడ్డకు వ్యాప్తి చెందే అవకాశాలు కేవలం 1% కంటే కూడా తక్కువే. కాబట్టి ఇప్పుడు గర్భవతులకు ముందే పరీక్షలు నిర్వహించి హెచ్‌ఐవీ ఉందా లేదా తెలుసుకోవడం తప్పనిసరి అయ్యింది.

Tomorrow AIDS DAY

ఎయిడ్స్‌ను కనుగొన్ననాటి నుంచి ఇప్పటివరకూ చికిత్స లేని వ్యాధిగా ఇది తీవ్ర భయాందోళనలను, రోగుల పట్ల వివక్షనూ పెంచింది. ఇంతటి సంచలనాలకు కారణమైన ఈ వ్యాధిపై ఎన్నో అపోహలు, అనుమానాలు. వ్యాధిగ్రస్తులపై ఎన్నో ఆంక్షలు. అందుకే ఎయిడ్స్‌పై ప్రపంచవ్యాప్త అవగాహనను కలిగించడం తప్పనిసరై ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో 1998 నుంచి డిసెంబరు మొదటితేదీని ‘ప్రపంచ ఎయిడ్స్‌దినం’ గా జరుపుకోవడం ప్రారంభమైంది. రేపు ప్రపంచ ఎయిడ్స్ డేసందర్భంగా హెచ్‌ఐవీ/ ఎయిడ్స్‌పై అవగాహన కలిగించేలా సమగ్రమైన ప్రత్యేక కథనం ఇది...

‘హ్యూమన్ ఇమ్యునో డెఫీషియెన్సీ వైరస్’కు ఇంగ్లిష్ సంక్షిప్తరూపమే ‘హెచ్‌ఐవీ’. ఈ వైరస్‌తో కలిగే ఇన్ఫెక్షన్ వల్ల మనకు వ్యాధినిరోధకశక్తిని ఇచ్చే కణాలు దెబ్బతిని (అంటే ప్రధానంగా సీడీ4 కణాలు, పాజిటివ్ టీ సెల్స్, మేక్రోఫేజెస్) రోగనిరోధకశక్తి క్రమంగా మందగిస్తూ ఒక దశలో అసలు వ్యాధినిరోధక వ్యవస్థే లేని పరిస్థితి వస్తుంది. దాంతో హెచ్‌ఐవీ ఉన్నవారికి ఏ చిన్నపాటి జబ్బు/ఇన్ఫెక్షన్ వచ్చినా... అది ప్రాణాపాయానికి దారితీస్తుంది.

హెచ్‌ఐవీని తెలుసుకోవడం ఎలా?

ఎయిడ్స్ అంటే ‘అక్వైర్డ్ ఇమ్యునో డెఫీషియెన్సీ సిండ్రోమ్’కి సంక్షిప్తరూపం. హెచ్‌ఐవీ సోకిన వారికి ముందుగా ఎలాంటి లక్షణాలూ బయటకు కనిపించవు. అసలు సోకినట్లే తెలియదు. కొద్దిమందిలో మాత్రం కాస్త టైమ్ గడిచాక వారిలో సీరోకన్వర్షన్ జరిగే సమయంలో (అంటే... వారిలో ఇన్ఫెక్షన్ కారణంగా వచ్చే మార్పులతో రక్తంలో యాంటీబాడీస్ ప్రవేశించేవేళ) ‘‘యాంటీ రెట్రోవైరల్ సిండ్రోమ్’’ అనే దశ కనిపిస్తుంది. ఇందులో జ్వరం రావడం, ఒళ్లంతా ర్యాష్, లింఫ్‌నోడ్స్ వాచడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సీరో కన్వర్షన్‌లో ఉండే ఈ లక్షణాలు ఇన్ఫెక్షన్ సోకిన 1 నుంచి 6 వారాల వరకు ఎప్పుడైనా కనిపించవచ్చు. ఆ సమయంలో ఒక వ్యక్తికి హెచ్‌ఐవీ నిర్ధారణకు రక్తపరీక్ష చేసి హెచ్‌ఐవీ యాంటీబాడీస్ ఉన్నాయా లేవా అని తెలుసుకోవడమే మార్గం. హెచ్‌ఐవీ సోకాక వేర్వేరు దశల్లో కనిపించే లక్షణాల ద్వారా అది ఏ దశలో ఉందో తెలుసుకోవచ్చు.

హెచ్‌ఐవీ లక్షణాలు...

జ్వరం, గొంతునొప్పి, తలనొప్పి, కండరాల నొప్పులు, కీళ్లనొప్పులు (ఈ లక్షణాలు రెండు వారాల పాటు ఉండవచ్చు) చర్మం కింద ఉండే కొన్ని శరీరభాగాల వాపు. ప్రధానంగా గొంతుభాగానికి ఇరుపక్కలా, బాహుమూలాల్లో ఉండే లింఫ్‌నోడ్స్ వాపు. (ఈ లక్షణం దీర్ఘకాలికంగా హెచ్‌ఐవీ తో బాధపడేవారిలోనూ కనిపిస్తుంది) ముఖం, మెడ, ఛాతీపై ర్యాష్.

దీర్ఘకాలంగా అంటే చాలా ఏళ్ల పాటు హెచ్‌ఐవీ ఉన్నప్పుడు:

జ్వరం, కడుపునొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు, అకస్మాత్తుగా బరువు తగ్గడం ఇతర ఇన్ఫెక్షన్లు (ప్రధానంగా ఊపిరితిత్తుల, మెదడు, కంటి ఇన్ఫెక్షన్స్‌తో పాటు నోటిలో ఈస్ట్ ఇన్ఫెక్షన్ కచ్చి దాంతో నోరంతా చేదుగా ఉండటంతో పాటు తెల్లమచ్చలు రావడం)

ఇలాంటి దశలన్నీ దాటాక... రోగనిరోధకశక్తి క్రమంగా తగ్గుతూ ఏ చిన్నపాటి ఇన్ఫ్‌క్షనైనా ప్రాణాపాయానికి దారితీసే కండిషన్‌ను ఎయిడ్స్‌గా చెప్పవచ్చు.

హెచ్‌ఐవీ రోగితో వ్యవహరించగానే ఏం చేయాలి?

హెచ్‌ఐవీ సోకినవారితో సెక్స్‌లో పాల్గొనడం లేదా అలాంటి వారికి చికిత్స చేసే సమయంలో ఉపయోగించిన సూది ప్రమాదవశాత్తూ ఇతరులకు గుచ్చుకోవడం వంటివి జరిగినప్పుడు... తక్షణం డాక్టర్‌ను కలిసి పోస్ట్ ఎక్స్‌పోజర్ ప్రొఫిలాక్సిస్ చికిత్స తీసుకోవాలి. సోకినట్లు నిర్ధారణ కాకపోయినా... అంటే అనుమానం ఉండగానే తీసుకోవాల్సిన చికిత్స ఇదన్నమాట.

పోస్ట్ ఎక్స్‌పోజర్ ప్రొఫిలాక్సిస్ అంటే...?

హెచ్‌ఐవీ రోగులతో వ్యవహరించే సమయంలో అది ఏదైనా చర్య వల్ల మనకు సోకినట్లుగా అనుమానించగానే కొన్ని యాంటీరిట్రోవైరల్ మందులను వాడాలి. ఇలా ముందుజాగ్రత్తగా మందులు వాడటాన్ని పోస్ట్ ఎక్స్‌పోజర్ ప్రొఫిలాక్సిస్ అంటారు. అయితే దీనివల్ల నూరు శాతం ఇన్ఫెక్షన్ సోకదనే గ్యారంటీ లేదు. కాబట్టి ముందు జాగ్రత్త అవసరం. ఈ పోస్ట్ ప్రొఫిలాక్సిస్ ట్రీట్‌మెంట్ తీసుకోవడాన్ని రోగి నుంచి ఆరోగ్యకరమైన వ్యక్తికి సోకిందని అనుమానించిన 72 గంటల లోపే మొదలుపెట్టాలి. ఇక 28 రోజుల పాటు ఎలాంటి అంతరాయమూ లేకుండా దాన్ని కొనసాగించాలి.

చికిత్స ఎలా?

హెచ్‌ఐవీ సోకినవారికి రోగనిరోధకశక్తిని కలిగించేలా ‘యాంటీ రెట్రోవైరల్’ (ఏఆర్‌వీ) మందులు ఇస్తే... వాళ్ల జీవన వ్యవధి (లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ) కూడా మామూలు వ్యక్తుల్లాగే ఉంటుంది. ఈ ఏఆర్‌వీ మందులు వైరస్‌ను తనను తాను కాపీ చేసుకుంటూ వృద్ధి చెందడాన్ని, రోగనిరోధకశక్తిని కలిగించే సీడీ-4

సెల్స్‌ను దెబ్బతీసే శక్తిని హరిస్తాయి. ఇలా ఏఆర్‌వీ మందులు ఇవ్వడాన్ని యాంటీ రెట్రోవైరల్ డ్రగ్ థెరపీ అంటారు. ఈ ప్రక్రియలో భాగంగా ఏఆర్‌వీ మందులనే రెండు మూడింటిని కలిపి ఇస్తారు.

హెచ్‌ఐవీ వ్యాపించేదెలా?
సురక్షితం కాని సెక్స్ ద్వారా (యోని మార్గంలోనైనా, మలద్వారం సెక్స్, చాలా తక్కువ కేసుల్లో ఓరల్ సెక్స్ ద్వారా కూడా) ఒకరి నుంచి ఒకరికి హెచ్‌ఐవీ వ్యాపించవచ్చు

కలుషిత సిరంజ్‌లు, సూదులు లేదా ఇతరత్రా వాడిగా ఉండే వస్తువుల ద్వారా
తల్లికి హెచ్‌ఐవీ ఉంటే ప్రసవానంతరం బిడ్డకువచ్చే అవకాశం ఉంది. అలాగే హెచ్‌ఐవీ ఉన్న మహిళ ఇచ్చే చనుబాలతోనూ సోకవచ్చు

హెచ్‌ఐవీ ఉన్న వారి రక్తాన్ని ఎక్కించడం వల్ల.

ఈ కండిషన్లలో చికిత్స తప్పనిసరి...

హెచ్‌ఐవీ రోగుల్లో దానితో పాటు కొన్ని ఇరత వ్యాధులు ఉండే అవకాశం ఉంది. అవి...
హెచ్‌ఐవీ - అసోసియేటెడ్ నెఫ్రోపతి (హెచ్‌ఐవీ వల్ల వచ్చే కిడ్నీల వ్యాధి).

హెచ్‌ఐవీ - అసోసియేటెడ్ ఛేంజెస్ ఇన్ బ్రెయిన్ ఫంక్షనింగ్ (హెచ్‌ఐవీ కారణంగా మెదడు పనితీరులో మార్పులు రావడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు).

హెపటైటిస్ బి / హెపటైటిస్ సి.

టీబీ (ట్యూబర్క్యులోసిస్).

పై వ్యాధులు ఉన్నప్పుడు సీడీ కౌంట్‌తో నిమిత్తం లేకుండా చికిత్స తప్పనిసరి.

హెచ్‌ఐవీ ఎయిడ్స్‌గా మారే క్రమం ఇలా..

మన శరీరంలో ఉండే సీడీ-4 కణాలు రోగనిరోధకశక్తిని కలిగిస్తాయి. హెచ్‌ఐవీ ఆ సీడీ-4 కణాల సంఖ్య తగ్గిస్తుంది. హెచ్‌ఐవీ సోకిన తర్వాత ఎలాంటి చికిత్సా తీసుకోలేదనుకుందాం. అప్పుడు రోగనిరోధకశక్తి క్రమక్రమంగా తగ్గుతూ 10-12 ఏళ్ల తర్వాత ఏదైనా సాధారణ ఇన్ఫెక్షన్‌కూడా వెంటనే ప్రమాదకరంగా మారే పరిస్థితి వస్తుంది. అలాంటి స్థితిని ఎయిడ్స్ అంటారు. వైద్యపరిభాషలో చెప్పాలంటే సీడీ కౌంట్‌ను పరిగణనలోకి తీసుకుంటే అది 200/ఎంఎం క్యూబ్ కంటే తగ్గడం అన్నమాట. అప్పుడు రోగి ఏ సాధారణ ఇన్ఫెక్షన్‌తోనైనా ప్రమాదకరమైన పరిస్థితిలోకి వెళ్లే అవకాశం చాలా ఎక్కువ.

సెక్స్ ద్వారా వ్యాప్తిని నిరోధించడం ఎలా?
మీ భాగస్వామితో తప్ప ఇతరులతో సెక్స్‌లో పాల్గొనకుండా ఉండటం.

ఒకవేళ పాల్గొనాల్సి వస్తే పురుషులు కండోమ్ వాడటం. స్త్రీలు ఫిమేల్ కండోమ్ వాడటం.

కండోమ్ ఎంత సురక్షితం?
సెక్స్ ద్వారా వ్యాపించే వ్యాధులతో పాటు హెచ్‌ఐవీ వ్యాప్తిని నిరోధించడంలో కండోమ్ చాలా ప్రభావపూర్వకమైన పాత్ర పోషిస్తుంది. సెక్స్‌లో పాల్గొన్న ప్రతిసారీ దాన్ని సరైన రీతిలో ఉపయోగించాలి. సరిగా ఉపయోగించనప్పుడు అది సెక్స్ మధ్యలోనే జారిపోవడం, పగిలిపోవడం వల్ల వ్యాధుల నుంచి రక్షణ అవకాశాలు కూడా తగ్గిపోతాయి.

సున్తీ చేయించుకుంటే సోకదా?
సున్తీ చేయించుకున్నవారు హెచ్‌ఐవీ ఉన్న పార్ట్‌నర్‌తో సురక్షితం కాని సెక్స్‌లో (అంటే కండోమ్ లేకుండా) పాల్గొంటే హెచ్‌ఐవీ సోకే అవకాశాలు కాస్త తగ్గవచ్చు. అంతేగాని సున్తీ వల్లనే పూర్తి రక్షణ లభించడం మాత్రం జరగదు.

ఏయే చర్యల ద్వారా వ్యాప్తిచెందదు...?
షేక్‌హ్యాండ్ ఇవ్వడం ద్వారా

పొడి ముద్దుల వల్ల (ఒకరినుంచి ఒకరికి లాలాజలం వ్యాపించేలా పెట్టుకునే తడిముద్దుల వల్ల హెచ్‌ఐవీ వ్యాప్తిచెందుతుందని చెప్పేందుకు కూడా ఆధారాలేవీ లేవు. అయినప్పటికీ వీలైనంతవరకు తడిముద్దులను అవాయిడ్ చేయడమే మంచిది).

హెచ్‌ఐవీ ఉన్న రోగిని కాటేసిన దోమ ఇంకొకరిని కాటేయడం వల్ల.

హెచ్‌ఐవీ ఎక్కడ ఉంటుంది?
హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్ సోకినవారిలో ఆ వైరస్ ప్రధానంగా శరీరంలోని ద్రవాల్లో ఉంటుంది. అంటే అది రక్తం, వీర్యం, మహిళల్లోనైతే యోనిద్రవాలు, చనుబాలలో ఉంటుంది.

ఇతరత్రా జాగ్రత్తలూ అవసరమే
మందులు క్రమం తప్పకుండా వాడటం.

బలవర్థకమైన ఆహారం, శుభ్రమైన నీరు తీసుకోవడం

వ్యక్తిగత పరిశుభ్రత పాటు పరిసరాల శుభ్రత

ఇన్ఫెక్షన్లకు కారణమయ్యేందుకు దోహదం చేసే చోట్లలో ఉండకుండా వాటిని అవాయిడ్ చేయడం.

Wednesday, November 28, 2012

ఇక్రిశాట్... రైతుకోసం.... రైతే లోకం.....

పేద రైతులకు ఒక వరం... 
తగిన వర్షపాతం లేని కరవు దేశాలకు ఆలంబన...
ఉష్ణమండల ప్రాంత పంటల అభివృద్ధికి దిక్సూచి... 
భారత్‌సహా 55 దేశాల్లోని కోట్లాది పేద రైతులకు వెలుగుదారి... 
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న ‘ఇక్రిశాట్’ ఘనత ఇది!
తన సుదీర్ఘ సేవా ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లను అందుకొన్న ఈ సంస్థ ప్రస్తుతం 40వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది.. 
ఈ సందర్భంగా.. సమాజానికి ఇక్రిశాట్ అందించిన కొన్ని ‘రత్నాల’ గురించి తెలుసుకుందాం...
 

వాటర్‌షెడ్‌లతో సుస్థిర గ్రామీణాభివృద్ధి

సామాజిక కోణంలో వాటర్‌షెడ్‌ల నిర్వహణ తో సమీకృత గ్రామీణాభివృద్ధికి బాటలు వేయడమే ఈ కార్యక్రమ ఉద్దేశం. వర్షపాతం తక్కువగా ఉండే ఉష్ణమండల పొడినేలల ప్రాంతాల్లో నీటికొరతే పేదరికానికి తొలి కారణమవుతోంది. సహజవనరుల లేమితోపాటు పంటల దిగుబడి చిన్న రైతులకు సవాలే. దీనికి చెక్ పెట్టేందుకు ఇక్రిశాట్ సామాజిక వాటర్‌షెడ్ నిర్వహణను చేపట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ పరిశోధన సంస్థలను, పౌర, వ్యవసాయ సంఘాలను సంఘటితం చేసి క్షేత్రస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించింది. 
ఇవీ ఫలితాలు... రంగారెడ్డి జిల్లా కొత్తపల్లి సుస్థిర అభివృద్ధి సాధించిన గ్రామంగా రికార్డులకెక్కింది. సైన్స్ ఆధారిత గ్రామీణాభివృద్ధికి మార్గదర్శిగా మారింది. ఇక్రిశాట్ సహకారంతో అమలుచేసిన ఆద ర్శ్ వాటర్‌షెడ్ నిర్వహణ , ఇతర కార్యక్రమాలే గ్రామ రూపురేఖలు మార్చేశాయి. వాటర్‌షెడ్‌లతో నీటి లభ్యత పెంచడం, కూరగాయలతోపాటు విలువ గల పంటలు పండించడం, దిగుబడులు పెంచడం వల్లే ఇది సాధ్యమైంది. ఆదిలాబాద్ జిల్లాలోని పవర్‌గూడ గ్రామంలోనూ పశుపోషణ, ఆయిల్ విత్తనాల పంటలు, నర్సరీలు, వర్మీ కంపోస్టింగ్ వంటివాటితో గ్రామస్థుల సగటు ఆదాయం ఏకంగా 77% పెరిగింది. రాజస్థాన్‌లో భూగర్భజలాలు 5.7 మీటర్ల వరకూ పెరిగాయి. దిగుబడులు 2-3 రెట్లు పెరిగాయి. పంటల విస్తీర్ణం 51% పెరిగింది. చైనా, వియత్నాం దేశాల్లోనూ ఈ వాటర్‌షెడ్‌లను ఇక్రిశాట్ అమలు చేస్తోంది. దీనివల్ల ఆసియాలో కనీసం 2 కోట్ల మంది జీవితాలు మారిపోయాయని అంచనా. 

సూక్ష్మమోతాదులతో భారీ ప్రయోజనాలు..

సరైన సమయంలో, సరైన ప్రదేశంలో ఎరువులను సూక్ష్మ మోతాదులో వినియోగించడం ద్వారా వ్యవసాయంలో భారీ ప్రయోజనాలను పొందే ఈ కార్యక్రమాన్ని ఆఫ్రికాలోని ఉప సహారా ప్రాంతంలోని పలు దేశాల్లో ఇక్రిశాట్ అమలుచేసింది. పంట విత్తే సమయంలో పొలమంతా ఎరువులు చల్లకుండా విత్తనంతోపాటే కొద్ది మోతాదులో- అదీ నేలకు అవసరమైన ఎరువునే వేసే ఈ పద్ధతి వల్ల పంట దిగుబడి, ఆదాయం గణనీయంగా పెరిగింది. జొన్న, తృణధాన్యాల దిగుబడులు సుమారుగా 44-120 శాతం వరకూ పెరిగాయి. జింబాబ్వే తదితర దేశాల్లోని వేలాది పేద రైతుల ఆదాయం ఏకంగా 50-130 శాతం వరకూ పెరిగింది. 2012 చివరికల్లా ఈ పద్ధతిని ఆఫ్రికాలో 3.60 లక్షల మంది రైతులకు నేర్పించాలన్నది ఇక్రిశాట్ ప్రాంతీయ ప్రాజెక్టు లక్ష్యం. 

వ్యవసాయ అభివృద్ధికి గ్రామస్థాయి అధ్యయనాలు...

గ్రామస్థాయిలో ప్రజలను ఆధారం చేసుకుని అంతర్జాతీయ అధ్యయనం ద్వారా ఉష్ణమండల ప్రాంతంలో వ్యవసాయ అభివృద్ధికి ఉన్న మార్గాలు, ఆటంకాలను గుర్తించే గ్రామస్థాయి అధ్యయనాలకు శ్రీకారం చుట్టి క్షేత్రస్థాయిలో రైతుల నుంచి సమగ్ర సమాచారాన్ని ఒకచోటికి చేర్చి డాటా బ్యాంక్‌గా అందుబాటులో ఉంచేందుకు నడుం కట్టింది. ఇక్రిశాట్ 1975 నుంచి సేకరిస్తున్న ఈ సమాచారమే ఇప్పుడు అనేక అంతర్జాతీయ పరిశోధనలకు కీలకమవుతోంది. 

ఎఫ్లాటాక్సింగ్ టెస్టింగ్ కిట్...

శిలీంధ్రాల నుంచి విడుదలయ్యే ఎఫ్లాటాక్సిన్ అనే విషపూరిత రసాయనం నుంచి వేరుశనగ తదితర పంటలకు అతితక్కువ ఖర్చుతోనే విముక్తి కలిగిస్తూ పేదదేశాల రైతులకు ప్రయోజనం కల్పించాలన్న ఉద్దేశంతో చేసిన ఆవిష్కరణ ఇది. ఎఫ్లాటాక్సిన్ విషపూరిత రసాయనం వల్ల వేరుశనగ, జొన్న, మొక్కజొన్న, మిరప వంటి అనేక పంటలు కలుషితమవుతాయి. ఎఫ్లాటాక్సిన్ బీ1 అనే రసాయనం పశువులకు, మనుషులకూ చాలా ప్రమాదకరం. అందుకే వెనకబడిన దేశాల రైతుల పంటలకు అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ బాగా పడిపోతోంది. అయితే, తేలికైన, చవకైన ఎఫ్లాటాక్సింగ్ టెస్టింగ్ కిట్ వల్ల పంటలను పరీక్షించడం, తగిన జాగ్రత్తలు తీసుకోవడం సులభం కావడంతో భారత్ సహా ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లోని రైతులు ప్రయోజనం పొందుతున్నారు.

రైతు నేస్తాలుగా ఇక్రిశాట్ వంగడాలు... 

ఆసియా, ఆఫ్రికా దేశాల వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ మంచి దిగుబడులనిచ్చే జొన్న, సజ్జ, కంది, శనగ తదితర పంటల వంగడాలను ఇక్రిశాట్ రూపొందించింది. 

కరవును తట్టుకునే వేరుశనగ...

వ్యాధులను, కరవును తట్టుకునేలా ఇక్రిశాట్ రూపొందించిన నాణ్యమైన వేరుశనగ వంగడం.. 60 ఏళ్లుగా వాడకంలో ఉన్న అనేక వంగడాల స్థానాన్ని ఆక్రమించి లక్షలాది బడుగు రైతుల్లో వెలుగులు నింపింది. ఇక్రిశాట్ రూపొందించిన అనంతజ్యోతి వంగడం ఇప్పుడు ఆ జిల్లా రైతులకు లబ్ధి కలిగిస్తోంది. 

40 శాతం అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ కంది... 

సంప్రదాయ కందివంగడాలతో పోల్చితే 40% వరకూ అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ కంది వంగడాలను ప్రైవేటు సంస్థలతో కలిసి ఇక్రిశాట్ రూపొందించింది. కెన్యా, మలావీ తదితర ఆఫ్రికా దేశాల రైతుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కంది వంగడాలు నాణ్యమైన దిగుబడులతో వారి ఆదాయాన్ని 80 శాతం వరకూ పెంచాయి. ఆసియా, ఆఫ్రికా, మధ్య, దక్షిణ అమెరికాల్లో ప్రధాన పంటల్లో ఒకటైన కంది జీనోమ్ (జన్యుపట ం)ను కూడా ఇక్రిశాట్ ఆవిష్కరించి పంట అభివృద్ధికి అనేక మార్గాలు అవలంబించేందుకు కృషిచేసింది. 

తీపి జొన్న...

ఇక్రిశాట్ రూపొందించిన ఈ వంగడం బహుళ ప్రయోజనకరం. ఆహారంగా మాత్రమే కాకుండా పీచు, ఇంధనంగా కూడా ఉపయోగపడుతుంది. కరవును, వాతావరణ మార్పును తట్టుకుంటుంది. జొన్న, మొక్కజొన్న కంటే రైతులకు ఎంతో లాభదాయకమైనది. 

అందరికీ అందుబాటులో విజ్ఞానం...

ఆహార భద్రతను పెంపొందించేందుకోసం ఇక్రిశాట్ జన్యు వనరులతో కూడిన జీన్‌బ్యాంకును నిర్వహిస్తోంది. ఈ బ్యాంకులో 1,20,000 జన్యువనరులు ఉన్నాయి. ఇక్రిశాట్ వెబ్‌సైట్‌లో ఇంటర్నేషనల్ పబ్లిక్ గూడ్స్ (ఐపీజీఎస్) పేరుతో పొందుపర్చిన జన్యువనరుల సమాచారాన్ని ప్రపంచ వ్యాప్తంగా అందరికీ అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా హైబ్రిడ్ పేరెంట్స్ రీసెర్చ్ కన్సార్షియం పేరుతో నిర్వహించే పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య శాస్త్రీయ ఆవిష్కరణలు, ఉత్పత్తులు పేదలకు ఐపీజీఎస్‌లో అందుబాటులో ఉంటాయి. సంస్థాగతమైన అనేక ఆవిష్కరణలు, పరిశోధనలు, ప్రాజెక్టుల వివరాలను కూడా భాగస్వాములు, ఔత్సాహికులు ఉచితంగానే పొందవచ్చు.

పేదల జీవనాధారం మెరుగుపర్చింది... 

ఇక్రిశాట్‌కు 40వ ఏడాది అయిన 2012 సంవత్సరాన్ని మైలురాయిగా భావిస్తున్నాం. ఉష్ణమండల ప్రాంత పేద ప్రజలకు ఇన్నేళ్లుగా సంస్థ చేసిన సేవలు, సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ ‘ద జివెల్స్ ఆఫ్ ఇక్రిశాట్’ పుస్తకాన్ని ప్రచురించాం. ఆసియా, ఆఫ్రికాలలోని 55 అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని సుమారు 80 కోట్లమందికి ఇక్రిశాట్ సేవలు అందుతున్నాయి. నాలుగు దశాబ్దాల ప్రస్థానంలో ఇక్రిశాట్ చేపట్టిన అనేక కార్యక్రమాలు గ్రామీణుల జీవనాధారాన్ని మెరుగుపర్చాయి. ఇక్రిశాట్ భాగస్వామిగా ఉన్న సీజీఐఆఏఆర్ సంస్థ పెట్టిన ప్రతి డాలరుకీ 17 డాలర్ల ప్రతిఫలాన్ని నమోదుచేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాగస్వాముల వల్లే ఈ ఘన విజయాలు సాధ్యమయ్యాయి.
- ‘ది జివెల్స్ ఆఫ్ ఇక్రిశాట్’ ముందుమాటలో ఆ సంస్థ డెరైక్టర్ జనరల్ విలియం డీ డార్

Tuesday, November 27, 2012

బిడ్డా.. కాల్మొక్తా........


  ఇంటికొస్తానని కొడుకును వేడుకున్న తండ్రి
నాలుగేళ్ల క్రితం ఇల్లు వదిలి.. 
వేములవాడలో కాకతాళీయంగా ఎదురుపడిన వైనం
వదిలించుకునేందుకు తనయుడి యత్నం... కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు
ఈ ఫొటోను చూశారా.. నడి రోడ్డుపై అమాయకంగా ఏదో అడుక్కుంటున్నట్టుందీ కదూ. ఔను.. తనను ఇంటికి తీసుకెళ్లాలని ఓ తండ్రి కన్నకొడుకును ప్రాధేయపడుతున్నాడు. బిడ్డా.. కాల్మొక్తా అని వేడుకున్నాడు. 

చించి పారేస్తే.. నెగెటివ్ ఆలోచనలు దూరం

ఎంత ప్రయత్నించినా.. అనవసరపు, చెడు, నెగెటివ్ ఆలోచనలను మాత్రం దూరం పెట్టలేకపోతున్నారా? అయితే, వాటిని ఓ కాగితంపై రాసి ముక్కముక్కలుగా చించి పారేయండి. అలా చేస్తే అనవసర ఆలోచనలు తప్పకుండా దూరం అవుతాయంటున్నారు ఓహియో స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు. ఆలోచనలను మనసులో అట్టే పెట్టుకోవడం కంటే, వాటిని కాగితంపై రాసి చించిపారేయడం వల్ల ఆ ఆలోచనలను మనం ఉపయోగించే పద్ధతిలో కొంచెం తేడా ఉంటుందని వారు వెల్లడించారు. ఇలాంటి పద్ధతిని ఉపయోగించి చేసే కొన్ని రకాల మానసిక చికిత్సలు మంచి ఫలితాలను ఇస్తాయని వర్సిటీ ప్రొఫెసర్ రిచర్డ్ పెట్టీ తెలిపారు. మనం మన ఆలోచనలను ఎలా చూస్తామో, వాటి గురించి అలాగే మాట్లాడతామని, ఆలోచనలను అలాగే ఉంచుకుంటామని అన్నారు. అందువల్ల ఆలోచనలను రాసి, విసిరివేయడం వల్ల వాటికి మనసులో విలువ తగ్గిపోతుందని, తద్వారా అవి దూరమవుతాయన్నారు. మూడు రకాల పరిశోధనల్లో వెల్లడైన వివరాల ద్వారా ఈ మేరకు మంచి ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు.

OU Dgree Exams Fee date...

ఉస్మానియా పరిధిలోని వివిధ కళాశాలల్లో చదువుతున్న రెగ్యులర్, దూరవిద్యా కేంద్రంలో బీఏ, బీకాం(కంప్యూటర్స్/జనరల్), బీఎస్సీ, బీబీఏ కోర్సుల ప్రథమ, ద్వితీయ,తృతీయ వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా డిసెంబర్ 26 వరకు ఆయా కళాశాలల్లో ఫీజు చెల్లించాలని కంట్రోలర్ ప్రొ.భిక్షమయ్య తెలిపారు. రూ.100 అపరాధ రుసుముతో డిసెంబర్ 31 వరకు ఫీజు చెల్లించాలన్నారు. ఫీజు చెల్లించు దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారానే ఓయూ పరీక్షల నియంత్రణ కేంద్రానికి అందజేయాలన్నారు.

Tea....Tea...



చక్కటి, రుచికరమైన టీని వేగవంతంగా తయారు చేయగల టీ మిషన్‌ను ఆవిష్కరించామని కేంబ్రిడ్జ్ పరిశోధకులు ప్రకటించారు. సంప్రదాయ పద్ధతుల్లో టీ కాచడానికి వీడ్కోలు పలుకుతూ, ఈ మిషన్ కేవలం రెండే నిమిషాల్లో టీ తయారు చేయగలదని వివరించారు. దీని ద్వారా టీ ‘స్ట్రాంగ్‌నెస్’ స్థాయిలను సెట్ చేసుకోవచ్చు. ధర పరంగా ఇది కాఫీ మిషన్‌లకన్నా తక్కువ స్థాయిలోనే దొరుకుతుంది. కాఫీ మిషన్లకు తమ సరికొత్త ఆవిష్కరణ సవాలు విసురుతుందని, టీని కొత్త పుంతలు తొక్కిస్తుందని ఆవిష్కర్తలు విశ్వాసం వ్యక్తం చేశారు.

1000 MW Solar Power Through Bidding......

బిడ్డింగ్ ద్వారా వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్‌ను కొనుగోలు చేయాలని విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి మృత్యుంజయ్ సాహు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ 2013 కంటే ముందుగా 1,000 మెగావాట్లు వచ్చేలా డిస్కంలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డిస్కంలు సూచించిన ప్రాంతాల్లో ప్లాంటును ఏర్పాటు చేయడంతోపాటు బిడ్డింగ్‌లో తక్కువ ధరను కోట్ చేసిన సంస్థల నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేయాలని డిస్కంలను ఆదేశించారు. అయితే, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి నిర్ణయించిన ధర కంటే డెవలపర్లు ఎక్కువ ధరను పేర్కొంటే... ఆ మొత్తాన్ని పరిశ్రమల నుంచి వసూలు చేసుకోవాలని ఇంధనశాఖ సూచించింది. పరిశ్రమలు ముందుకురాని పక్షంలో ప్రభుత్వమే భరిస్తుందని పేర్కొంది.

తెలుగువారందరూ పాల్గొనవచ్చు.....

తెలుగు మహాసభలపై సాంస్కృతిక శాఖ


ప్రతినిధులు మాత్రమే రూ.500 చెల్లించాలి...
ఇతర రాష్ట్రాలవారి కోసం ప్రత్యేక రైళ్లు, బస్సులు

తిరుపతిలో డిసెంబర్ 27, 28, 29 తేదీలలో జరగనున్న 4వ ప్రపంచ తెలుగు మహాసభల్లో తెలుగువారందరూ పాల్గొనవచ్చని రాష్ట్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి జి. బలరామయ్య తెలిపారు. ఈ మహాసభల్లో ఎలా పాల్గొనాలనే అంశంపై ప్రజల్లో సందేహాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ప్రతినిధులుగా పాల్గొనదలిచిన వ్యక్తులు మాత్రమే రూ.500ల రుసుం చెల్లిం చాల్సి ఉంటుందని, మిగతావారికి ఎలాంటి రుసుం ఉండదని తెలిపారు. ప్రతినిధులుగా నమోదు worldteluguconference.com లో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించామన్నారు. చివరి తేదీ డిసెంబర్ 7గా తెలిపారు. మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బలరామయ్య మాట్లాడారు. మహాసభల కోసం 5 ఉప వేదికలు, 5 సెమినార్ హాళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తెలుగు భాష ప్రావీణ్యం, సంస్కృతులపై సదస్సులు నిర్వహిస్తున్నట్లు, మహాసభల ప్రాంగణంలో 14 రకాల ప్రదర్శనశాలలు ఏర్పాటు చేయనున్నట్లు బలరామయ్య వివరించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారి కోసం ప్రత్యేక రైళ్లు, బస్సులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సభల నిర్వహణకు రూ.45 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసినట్లు చెప్పారు.



 

స్వాప్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌పై అవగాహన కల్పిస్తే.. ...

‘కేర్’లో స్వాప్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ 
భిన్న మతాలకు చెందిన వారైనా.. బంధువులు కాకపోయినా.. కిడ్నీల మార్పిడికి సిద్ధపడ్డ జంటలు

 ‘రక్త’సంబంధం ఇద్దరి ప్రాణాలను నిలిపింది. సరికొత్త జీవితాన్ని ప్రసాదించింది. హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రిలో రాష్ట్రంలోనే తొలిసారిగా ‘స్వాప్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్’(పరస్పర ఒప్పందంతో మార్పిడి) ద్వారా ఇద్దరు వ్యక్తులకు మూత్రపిండాలని అమర్చారు. సాధారణంగా ఎవరికైనా మూత్రపిండాలు అమర్చాలంటే.. ఆ వ్యక్తికి అవయవదానం చేసేవారు కుటుంబ సభ్యులై ఉండాలి లేదా వారి బంధువులైనా అయి ఉండాలి. లేదంటే కెడావర్ ఆర్గాన్ డొనేషన్ పద్ధతిలో భాగంగా క్లినికల్ డెత్(మరణశయ్యపై) అయిన వ్యక్తి నుంచి వాటిని తీసి ఇవ్వవచ్చు. కానీ ఇక్కడ మాత్రం ఈ రెండు పద్ధతుల్లో కాకుండా రెండు బాధిత కుటుంబాలకు చెందిన దాతలు(భార్యలు) పరస్పర అవగాహనతో కిడ్నీలను దానం చేయడంతో వారి భర్తల ప్రాణాలు నిలిచాయి. 

జరిగిందిదీ.. 

కరీంనగర్‌కు చెందిన ఎంఏ బేగ్ మూత్రపిండాల వ్యాధితో గత కొంతకాలంగా కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పదేళ్ల క్రితం కిడ్నీ మార్పిడి చేయించుకున్న ఆయనకు మళ్లీ సమస్య వచ్చింది. అప్పట్లో బేగ్ తమ్ముడు కిడ్నీ ఇచ్చారు. ఈసారి బంధువులు మూత్రపిండం ఇవ్వడానికి ముందుకొచ్చినా అవి సరిపోలేదు. దీంతో బేగ్ భార్య అయేషా కిడ్నీ ఇవ్వడానికి ముందుకొచ్చారు. అయితే, బేగ్ బ్లడ్‌గ్రూపు బి పాజిటివ్ కాగా.. అయేషాది ఎ పాజిటివ్. దీంతో ఆ ప్రయత్నమూ విఫలమైంది. అయితే, ఇదే సమయంలో కేర్ ఆస్పత్రికి కిడ్నీ సమస్యతోనేహైదరాబాద్ బీహెచ్‌ఈఎల్ ప్రాంతానికి చెందిన దేవీదాస్ అనే వ్యక్తి వచ్చారు. 

దేవీదాస్ భార్య నిర్మల ఆయనకు మూత్రపిండం ఇవ్వడానికి అంగీకరించినా.. దేవీదాస్ రక్తం గ్రూపు ఎ పాజిటివ్ కాగా, భార్యది బి పాజిటివ్ అయింది. ఇద్దరి సమస్యా ఒకటే. విషయం తెలుసుకున్నారు. భర్తలను దక్కించుకోవడానికి ఇద్దరు దాతలు(నిర్మల, అయేషా) అంగీకారానికి వచ్చారు. నిర్మల భర్తకు అయేషా కిడ్నీ ఇచ్చేందుకు, అయేషా భర్తకు నిర్మల మూత్రపిండమిచ్చేందుకు ఒప్పుకున్నారు. వీరి ప్రతిపాదనను కేర్ ఆస్పత్రి వైద్యులు ప్రభుత్వానికి పంపించారు. దీనికి ప్రభుత్వం ఆమోదం తెలపడంతో నవంబర్ 7న బేగ్, దేవీదాస్‌లకు విజయవంతంగా మూత్రపిండాల మార్పిడి చేశారు. శస్త్రచికిత్స అనంతరం ఇరువురి కిడ్నీల పనితీరు సాధారణంగానే ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. ఇప్పటి వరకూ ముంబై, ఢిల్లీ, కోల్‌కతాల్లో మాత్రమే ఇలాంటి మార్పిడి జరిగిందని, ఆంధ్రప్రదేశ్‌లో ఇదే మొదటిసారని ఈ ఆపరేషన్లలో పాల్గొన్న వైద్యులు తెలిపారు. ఈ శస్త్రచికిత్సలు నిర్వహించిన డా.రాజశేఖర్ చక్రవర్తి, డా.విక్రాంత్‌రెడ్డి, డా.కె.రామరాజు, డా.కె.ప్రసాదరాజు, డా.బి.వి.రామరాజుల బృందం కిడ్నీ మార్పిడి చేయించుకున్న కుటుంబాలతో కలిసి మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఈ విధానాన్ని ‘స్వాప్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్’ అంటారని చెప్పారు. దేశంలో ఏటా 4 లక్షల మందికి కిడ్నీ సమస్య వస్తోందని, కానీ 4 వేల మందికి మాత్రమే అవయవ మార్పిడి జరుగుతోందని వైద్యులు తెలిపారు. స్వాప్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌పై అవగాహన కల్పిస్తే.. మరింతమందికి కొత్త జీవితాన్నివ్వవచ్చని వైద్య బృందం పేర్కొంది.