Friday, October 12, 2012

జన్యు మార్పిడి (జీఎం) విత్తనాలపై స్వామినాథన్ ఆందోళన

దేశంలోకి జన్యు మార్పిడి (జీఎం) విత్తనాలను అనుమతించే ముందు వాటిపై సమగ్రమైన, లోతైన అధ్యయనం, పరిశోధనలు సాగాలని ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ అభిప్రాయపడ్డారు. స్వామినాథన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం హైటెక్స్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన,  జీఎం పంటలతో చాలా ప్రమాదాలున్నాయని, ముఖ్యంగా స్థానిక జీవ వైవిధ్యానికి విఘాతమేర్పడే ముప్పు ఉందని స్వామినాథన్ ఆందోళన వ్యక్తం చేశారు.

జీఎం విత్తనాలను ఒక దేశం నుంచి మరో దేశానికి బదిలీ చేసే క్రమంలో స్థానిక పంటలు, మొక్కలు కలుషితమయ్యే ప్రమాదం ఉందని.. అందుకే అమెరికా అధికారులు జీఎం విత్తనాల దిగుమతిలో చాలా జాగ్రత్తలు పాటిస్తారని వివరించారు. అక్కడి ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (ఎఫ్‌డీఏ) తదితర మూడు సంస్థలు సమగ్ర అధ్యయనం, లోతైన పరిశీలన జరిపాకే అమెరికాలో జీఎం విత్తనాలను అనుమతిస్తారని తెలిపారు. మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు జన్యు పరివర్తిత జీవాల (ఎల్ఎంవో)ల విషయంలో మరింత జాగ్రత్తపడాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ పంటలను అనుమతించే ముందు.. స్థానిక పరిస్థితులను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. తీర ప్రాంతాలను రక్షిత ప్రాంతాలుగా ప్రకటిస్తున్న ప్రభుత్వాలు.. స్థానికుల హక్కులను మాత్రం పరిగణలోకి తీసుకోవట్లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధి అనేది స్థానికులకు ఉపాధి కల్పించేదిగా ఉండాలిగానీ.. వారి పొట్టకొట్టి సాగించే వృద్ధి నిజమైన అభివృద్ధి కాదని అభిప్రాయపడ్డారు.

No comments: