Thursday, October 11, 2012

కేసీఆర్‌ తో చర్చలు లే..

ప్రత్యేక తెలంగాణ అంశంపై తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావుతో తాము చర్చలు జరపటం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. అలాగే.. ఈ విషయంపై అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయం తెలుసుకునేందుకు ఇప్ప ట్లో అఖిలపక్ష సమావేశం నిర్వహించే ప్రణాళిక కూడా ఏదీ లేదని తేల్చిచెప్పింది. తాము కేంద్రంలోని పెద్దలతో చర్చలు జరుపుతున్నామని కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ ఒకవైపు చెప్తుండగా.. 

 టీఆర్‌ఎస్ నాయకత్వంతో కానీ, ప్రత్యేకించి కేసీఆర్‌తో కానీ తాము ఎలాంటి చర్చలూ జరపటం లేదని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే విస్పష్టంగా చెప్పారు. ఆయన బుధవారం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్, కేటీఆర్‌లు ఇటీవలి కాలంలో ఢిల్లీలో మకాం వేయటం, తర్వాత హైదరాబాద్‌లో పలువురితో మాట్లాడుతూ.. తాము యూపీఏ సర్కారుతో, కాంగ్రెస్ అధిష్టానంతో తెలంగాణ అంశంపై చర్చలు జరుపుతున్నామని చెప్పటం తెలిసిందే. దసరా పండుగలోగానే ప్రకటన వస్తుందని, అప్పుడు తెలంగాణవాదులు సంబరాలు జరుపుకోవచ్చని కూడా కేసీఆర్ పేర్కొన్నారు.

బుధవారం షిండే వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించగా.. తెలంగాణ అంశంపై చర్చలు జరిపేందుకు ఏ తేదీనీ ఖరారు చేయలేదని, కేంద్రం మనసులో ఎలాంటి తుది గడువూ లేదని ఆయన స్పష్టంచేశారు. లాంఛనంగా చర్చలు జరుగుతున్నాయా అని ప్రశ్నించగా.. ‘‘వాళ్లు మమ్మల్ని కలుస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలూ కలుస్తున్నారు. అవి నిర్మాణాత్మకమైన చర్చలు కావు. అఖిలపక్ష సమావేశం విషయమై ఇంకా ఎలాంటి ప్రయత్నమూ లేదు. మామూలుగా ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. కాబట్టి దానిపై చర్చిస్తున్నాం.. అంతే’’ అని షిండే చెప్పుకొచ్చారు.

ఇటీవలి తెలంగాణ మార్చ్ విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ‘కేసీఆర్ చెప్తున్నట్లుగా దసరా పండుగకు ముందుగా అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తారా?’ అని ప్రశ్నించగా.. ‘‘దసరా ముందా.. దసరా తర్వాతా.. లేక దీపావళి తర్వాతా.. అనేదానిపై ఏ తేదీనీ నిర్ణయించలేదు. ఈ సంక్లిష్టమైన అంశంపై ఎప్పుడు, ఎలా ముందుకెళ్లాలి అనేదానిపై నిర్దిష్టంగా నిర్ణయం తీసుకోలేదు’’ అని షిండే పేర్కొన్నారు.

No comments: