Tuesday, October 9, 2012

మూలకణ పరిశోధకులకు నోబెల్

2012కుగాను వైద్యశాస్త్రంలో పురస్కారాల ప్రకటన


బ్రిటన్, జపాన్ శాస్త్రవేత్తలకు సంయుక్తంగా...

జాన్ గుర్డన్, షిన్యా యమనకలకు పురస్కారం

స్టాక్‌హోమ్: బ్రిటన్‌కు చెందిన జాన్ బి.గుర్డన్ (79), జపాన్‌కు చెందిన షిన్యా యమనకలకు సంయుక్తంగా ఈ ఏడాది వైద్యశాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతి దక్కింది. స్టాక్‌హోమ్‌లోని స్వీడిష్ కరోలిన్‌స్కా కమిటీ సోమవారం ఈ విషయాన్ని ప్రకటించింది. వైద్యశాస్త్రం లేదా ఫిజియాలజీ విభాగంలో 2012కి గానూ వీరికి నోబెల్ బహుమతి ప్రదానం చేయనున్నట్లు కమిటీ తెలిపింది. పరిణతి చెందిన మూలకణాన్ని ప్లూరిపొటెంట్ రకపు కణంగా మార్చవచ్చు అనే విషయాన్ని శాస్త్ర పూర్వకంగా నిరూపించినందుకు వీరికి సంయుక్తంగా నోబెల్ బహుమతిని ప్రకటిస్తున్నట్టు కమిటీ వివరించింది. కణ, జీవుల అభివృద్ధిని అర్థం చేసుకోవడంలో వీరి పరిశోధనలు విప్లవాత్మకమైనవని అభిప్రాయపడింది.


జీవి అభ్యున్నతిలో అత్యంత క్లిష్టమైన, అత్యం త ప్రాధాన్యత ఉన్న ప్లూరిపొటెంట్ దశలోని కణాలను అవసరార్థం ఎలాంటి కణాలుగానైనా అభివృద్ధి చేయవచ్చు. అయితే పిండం ఆది దశలో ఉండగా ఏర్పడే వీటిని సేకరించడం అత్యంత దుర్లభం. దీనికి ప్రతిగా పరిణతి చెందిన కణాలనే, ప్లూరిపొటెంట్ దశకు మార్చే విధానాన్ని వీరు ఆవి ష్కరించారు. ఈ పరిశోధనకే నోబెల్ దక్కింది. ఈ పురస్కారం కింద వీరికి 11 లక్షల డాలర్లు (రూ.5.78 కోట్లు) దక్కనున్నాయి. ఇక ఈ వారంలో వివిధ విభాగాలకు సంబంధించి నోబెల్ ప్రకటనలు వెలువడతాయి. మంగళవారం భౌతిక శాస్త్రం, బుధవారం రసాయన శాస్త్రం, గురువారం సాహిత్యం, శుక్రవారం శాంతి, వచ్చే సోమవారం ఆర్థిక శాస్త్ర విభాగాల్లో నోబెల్ విజేతల పేర్లు విడుదల చేస్తామని కమిటీ వెల్లడించింది. అల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి సందర్భంగా డిసెంబర్ 10న వీటి ప్రదానం జరుగుతుంది.

సర్ జాన్ బి. గుర్డన్

ఈ ప్రొఫెసర్ దశాబ్దాల కాలంగా న్యూక్లియర్ ట్రాన్స్‌ప్లాంటేషన్, క్లోనింగ్ పరిశోధనల్లో తలమునకలై ఉన్నారు. ఈ రెండింట్లో ఈయన ప్రతిపాదనలు అనేక మంది పరిశోధకులకు మార్గదర్శకాలయ్యాయి. 1958లో ఈయన ఆక్స్‌ఫర్డ్ వర్సిటీలో ఒక కప్పను క్లోనింగ్ చేశారు. తన జీవిత కాలంలో ఎక్కువ భాగం కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో పరిశోధనలతోనే గడిపేశారు గుర్డన్. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఈయన 1962 నుంచి 1971 వరకూ జీవశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేశారు. బ్రిటన్ ప్రభుత్వం నుంచి నైట్‌హుడ్ పురస్కారాన్ని అందుకుని ‘సర్’ అయ్యారు. ప్రస్తుతం ‘ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ’గా కొనసాగుతున్నారు.

షిన్యా యమనక

అంతర్జాతీయ స్టెమ్‌సెల్స్ పరిశోధన సంస్థ ప్రస్తుత అధ్యక్షుడీయన. ఎముకల మూలుగు నుంచి సేకరించే స్టెమ్‌సెల్స్‌పై ఎన్నో పరిశోధనలు చేశారు ఈ జపాన్ పరిశోధకుడు. ప్లూరిపొటెంట్ పద్ధతి ద్వారా చర్మంలో యవ్వన గుణాలను పునరుద్ధరింప జేయడానికి చేసిన పరిశోధనలు ఈయనకు గుర్తింపు తెచ్చాయి. దీనికిగానూ క్యోటో యూనివర్సిటీ అవార్డు అందుకున్నారు.

No comments: