Sunday, October 21, 2012

ప్రపంచ తెలుగు మహాసభలకు సన్నాహాలు (world telugu conference)

తిరుపతి వద్ద 90 ఎకరాల్లో ఏర్పాట్లు

తిరుపతిలో నిర్వహించే నాల్గవ ప్రపంచ తెలుగు మహాసభలకు సన్నాహాలు ముమ్మరం చేశామని ప్రభుత్వ సాంస్కృతిక శాఖ కార్యదర్శి బలరామయ్య తెలిపారు. రవీంద్రభారతి కళాభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సభల ఏర్పాట్ల గురించి వివరించారు."డిసెంబర్‌లో 27, 28, 29 తేదీల్లో నిర్వహించనున్న ప్రపంచ తెలుగు మహాసభల కోసం జూన్ నుంచే పనులు ప్రారంభించాం. తిరుపతి వద్ద 90 ఏకరాల స్థలాన్ని మహాసభల వేదిక ప్రాంగణంగా నిర్ణయించాం.

మహాసభల ఇతివృత్త గీతం ప్రముఖ కవులతో రాయించడమే కాకుండా ఔత్సాహిక రచయితల నుంచి ఎంట్రీలు కోరుతున్నాం. ప్రజల్లో అవగాహన కలిగించేందుకు గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తెలుగు భాష, సంస్కృతిపై పోటీలు నిర్వహించనున్నాం. అధిక సంఖ్యలో తెలుగు వారు నివసిస్తున్న రాష్ట్రాల్లో నవంబర్‌లో సదస్సులు నిర్వహించే బాధ్యతను పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోని అంతర్జాతీయ తెలుగు కేంద్రం వారికి అప్పగించాం.మరిన్ని వివరాలను www.worldteluguconference.com వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాం'' అని చెప్పారు.

ప్రభుత్వం తరపున చేపడుతున్న ఏర్పాట్లను సాంస్కృతిక శాఖ సంచాలకులు కవితాప్రసాద్ వివరించారు. మహాసభలను మొక్కుబడిగా కాకుండా ప్రజలందరి భాగస్వామ్యంతో పూర్తి చేస్తామని సాంస్కృతిక మండలి అధ్యక్షుడు రమణమూర్తి అన్నారు. కార్యక్రమ నిర్వహణకు ఇప్పటికే రూ. 25 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసిందని, అవసరాన్ని బట్టి పెంచుకునే అవకాశముందని తెలిపారు.

No comments: