Friday, November 2, 2012

మోడీకి తోడెవరు?

'మీ భార్య ఎక్కడ' అంటూ గుజరాత్ సీఎంను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ప్రశ్నించారు. తన భార్య యశోద గురించిన వివరాలపై మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారని.. ఆమెను ఎందుకు దాచిపెడుతున్నారని నిలదీశారు. "యశోదా బెన్‌ను మోడీ పెళ్లి చేసుకున్నారా లేదా? అలా అయితే విడాకులిచ్చారా? ఆమెతో ఎందుకు కలిసి ఉండట్లేదు? తన వైవాహిక స్థితిని ఆయన ఎందుకు ప్రకటించలేదు'' అని దిగ్విజయ్ ప్రశ్నల వర్షం కురిపించారు

ఆయన వివాహితుడా.. లేక బ్రహ్మచారా..?
వైవాహిక జీవితానికి ఎందుకు దూరం
ఆశయాలే కారణమా?
మోడీ వ్యక్తిగత జీవితంలోని సత్యాలు..


గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ బ్రహ్మచారే కానీ, అందరూ అనుకుంటున్నట్లు ఆయన అవివాహితుడు మాత్రం కాదు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఆయన వివాహితుడా, అవివాహితుడా అన్న అంశం కూడా ప్రత్యర్థుల ప్రచారానికి ఓ అస్త్రంగా మారింది. మోడీకి పెళ్లి అయింది. ఆయనకు భార్య ఉన్నారు. సంతానం మాత్రం లేదు. చాలా కాలంపాటు మోడీ భార్య గురించి ఎవరికీ తెలియలేదు. కానీ, 2002లో గోద్రా అల్లర్లు జరిగిన తరువాత రాజకీయ ప్రత్యర్థులు మోడీ వ్యక్తిగత చరిత్రను తవ్వి తీయడంతో ఆమె ఉనికి వెలుగులోకి వచ్చింది.

సాధారణ వ్యక్తిగా..
నరేంద్ర మోడీ భార్య పేరు.. యశోదాబెన్ చిమన్‌లాల్ మోడీ. వయసు 57 సంవత్సరాలు. ప్రస్తుతం గుజరాత్‌లోని బనస్కాంత జిల్లా, రాజోసనా గ్రామంలో ఓ ప్రైమరీ స్కూల్‌లో టీచర్‌గా పని చేస్తున్నారు. ముడతలు పడిన మామూలు చీర, కొద్దిగా ఒంగిన నడుము, కాళ్లకు రబ్బరు చెప్పులు, వయసుకు మించిన వృద్ధాప్య లక్షణాలతో ఎంతో సాధారణ వ్యక్తిగా కనిపిస్తారు.. యశోదాబెన్. చూసినవారికి ఆమె గుజరాత్ సీఎం మోడీ భార్య అంటే ఒక పట్టాన నమ్మకం కలగదు. ఆమె ఎవరినీ కలుసుకోవడానికి ఇష్టపడరు.

నరేంద్ర దామోదర్‌దాస్ మోడీ తన భర్త అని సగర్వంగా చెప్పుకొంటారు. తన భర్త ఓ గొప్ప దేశ నాయకుడని, అంతకు మించి ఓ గొప్ప జాతీయవాది అని గొప్పగా చెబుతుంటారు. ఇంతకంటే మోడీ గురించి ఆమె ఏమీ మాట్లాడరు. ఆ ఊళ్లో యశోదాబెన్ నరేంద్ర మోడీ భార్యగానే అందరికీ తెలుసు. మోడీ కూడా ఏనాడూ ఆమె తన భార్య కాదని గానీ, అవునని గానీ చెప్పలేదు. ఆయన కూడా ఎక్కడా తన వ్యక్తిగత జీవితం గురించి ప్రస్తావించరు. సుమారు 2,500 జనాభా కలిగిన ఆ గ్రామంలో ముస్లింల సంఖ్యే ఎక్కువ. ఆమె పాఠాలు చెప్పేది కూడా ఎక్కువగా ముస్లిం విద్యార్థులకే.

చిన్నప్పుడే పెళ్లి
మోడీ స్వస్థలమైన మెహ్‌సానా జిల్లా వాద్‌నగర్ గ్రామంలో వారిద్దరికీ పెళ్లి అయిందని ఆమె బంధువులు చెప్పారు. అప్పుడు ఆమె వయసు 18. పెళ్లి జరిగే సమయానికి ఆమె చదువుకున్నది ఏడో తరగతి వరకే. అదే వారిద్దరి మ«ధ్య విభేదాలు సృష్టించిందని కొందరు బంధువులు అంటారు. పెళ్లయిన కొద్ది రోజుల తరువాత యశోదాబెన్‌ను పైచదువుల కోసం పుట్టింటికి పంపించేశారు. మోడీ ఆశయాలు, అభిరుచులకు తగినట్లు ఉన్నత విద్య అభ్యసించడం కోసం ఆమె అక్కడికి దగ్గరలోని ధోలకా పట్టణానికి వెళ్లి 1972లో ఎస్.ఎస్.సి పూర్తి చేశారు. తరువాత ప్రాథమిక ఉపాధ్యాయ శిక్షణ కోర్సు పూర్తి చేసి, అహ్మదాబాద్‌లోనే ఓ మూడు నెలలపాటు టీచర్‌గా ఉద్యోగం చేశారు.

మలుపు తిరిగిన జీవితం
అహ్మదాబాద్‌లో టీచర్‌గా పనిచేస్తున్న సమయంలోనే ఆమె వైవాహిక జీవితం మలుపు తిరిగిందని ఆమె బంధువులు చెబుతుంటారు. 1978 మార్చి 23న ఆమె బనస్కాంత జిల్లాలోని దేఖ్‌వాలీ గ్రామానికి వెళ్లి అక్కడ ఓ ప్రైమరీ టీచర్‌గా పనిచేయడం ప్రారంభించారు. ఆ తరువాత ఆమెను రూపాల్ గ్రామంలోని జిల్లా పంచాయతీ స్కూలుకు బదిలీ చేశారు. అక్కడ ఆమె 12 ఏళ్లపాటు పనిచేశారు. 1991లో ఆమె రాజసోనా గ్రామానికి వచ్చి, అక్కడ టీచర్‌గా పని చేయడం మొదలు పెట్టారు. ఆ తరువాత కూడా చాలా కాలం పాటు ఆమె తరచూ అహ్మదాబాద్ వెళ్లి వచ్చేవారు. కానీ, తనతో ఉండిపొమ్మని మోడీ ఏనాడూ కోరకపోవడంతో యశోదాబెన్ చివరికి రాజసోనాలోనే స్థిరపడిపోయారు.

ముస్లింలకెంతో అభిమానం
ఆమె తన వృత్తి పట్ల ఎంతో అంకిత భావంతో ఉంటారని, ఎందరో ముస్లిం విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దారని స్థానిక ముస్లింలు ఆనందంగా చెబుతుంటారు. యశోదాబెన్ ఈ ఏడాది తన టీచర్ పదవికి విరమణ చేస్తున్నారు. ఆమె పట్ల అక్కడి ముస్లింలకు విపరీతమైన అభిమానం. "నరేంద్ర మోడీ ఓ జాతీయ స్థాయి నాయకుడు. ఆయన శక్తిసామర్థ్యాలు అపారం. యశోదాబెన్ ఆయనకు సరైన జోడీ కాకపోవచ్చు. కానీ, ఆమె ఆయన భార్య. కనుక ఎప్పటికైనా మోడీ ఆమెను తీసుకు వెళ్లాలని కోరుకుంటున్నాం'' అని ఆమె ఇంటి పక్కనే కాపురం ఉంటూ, ఆమెకు చేదోడు వాదోడుగా ఉంటున్న ముస్లిం దంపతులు చెప్పారు.

సాధారణంగా ఆమె తన భర్త గురించి మాట్లాడరు. భర్తంటే ఆమెకు భయం. బీజేపీ నాయకులు ఆమెను ఎవరితోనూ మాట్లాడనివ్వరు. కాంగ్రెస్ నాయకులు ఆమెతో మోడీ గురించి మాట్లాడించి, ఆయనను రచ్చకెక్కించాలని తరచూ ప్రయత్నిస్తుంటారు. స్కూల్ సమయంలో ఆమె ఎవరితోనూ మాట్లాడకుండా హెడ్మాస్టర్ ఆమె మీద ఓ కన్ను వేసి ఉంచుతారు. ఇంటి దగ్గర ఆమె ఎవరితోనూ మాట్లాడకుండా స్థానిక పెద్దలు జాగ్రత్తలు తీసుకొంటుంటారు. తన మీద మరీ ఒత్తిడి వస్తే ఆమె అక్కడికి 20 కిలోమీటర్ల దూరంలోని బ్రాహ్మణవాడ గ్రామంలో ఉంటున్న తన అన్న ప్రకాశ్‌భాయ్ ఇంటికి వెళ్లిపోతారు.

ఒంటరి జీవితం
ఆమెకు ఆ స్కూల్లో ఇచ్చే జీతం పదివేల రూపాయలు. గ్రామంలోనే ఓ చిన్న ఇంట్లో ఆమె నివాసం ఉంటున్నారు. ఆమె ఎవరన్నది అందరికీ తెలిసిన విషయమే కనుక సాధారణంగా ఆమె జోలికి ఎవరూ రారు. ఆమెది పూర్తిగా ఒంటరి జీవితం. ఆదివారం వచ్చిందంటే ఆమె ఓ షేర్ ఆటో ఎక్కి తన సోదరుడి ఇంటికి వెళ్లిపోతారు. ఆయన ఓ చిన్న పచారీ దుకాణాన్ని నడుపుకొంటున్నారు. రోజంతా అక్కడే ఉండి మర్నాడు ఉదయం తిరిగి వస్తారు.

తన భర్త నుంచి ఏదైనా ఫోన్ కాల్ వస్తుందేమోనని ఆమె ప్రతి క్షణం ఎదురు చూస్తుంటారు. ఏదో ఒక రోజున ఆయన ఫోన్ చేయకపోతారా, తాను అహ్మదాబాద్ వెళ్లి ఆయనతో శేష జీవితాన్ని గడపకపోతానా అని ఆమె ఆశిస్తూ ఉంటారు. ఇక యశోదాబెన్ తన వైవాహిక జీవితం గురించి సంప్రదించని జ్యోతిషుడు ఆ చుట్టుపక్కల లేడు. భార్యాభర్తా కలిసే ఉంటారని దాదాపు అందరూ ఆమెకు జోస్యం చెప్పారు. ఆమెలో దైవభక్తి, ఆధ్యాత్మిక చింతన ఓ పాలు ఎక్కువే.

స్పర్థలకు కారణమేమిటి?
ఇంతకూ, మోడీ తన భార్యను వదిలేశారా? లేక ఆమే ఆయనను విడిచిపెట్టారా? ఇది తేలని ప్రశ్నగా మారిపోయింది. అయితే, బాగా చిన్నతనం నుంచీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో ఉన్న మోడీకి వైవాహిక జీవితం మీద కంటే, వ్యక్తిగత ఆశయాల మీదే శ్రద్ధ ఎక్కువ. చాలామంది సంఘ్ ప్రచారక్‌ల మాదిరిగానే ఆయన పూర్తిగా సైద్ధాంతిక కార్యక్రమాలలో మునిగిపోయారు.ఆ విషయాన్ని ఆయన యశోదాబెన్‌తో అనేక పర్యాయాలు చెప్పారని, దాంతో ఆమె ఎవరి వ్యక్తిగత ఆశయాలకు వారు అంకితం కావడమే మంచిదని భావించారని, పరస్పర అంగీకారం మీద వారు విడి విడిగాఉండడం ప్రారంభించారని ఆమె బంధువులే కాక, ఇరుగు పొరుగు వారు సైతం చెబుతుంటారు.

మోడీకి తల్లి అంటే ఎంతో ప్రేమ. ఇటీవలి వరకూ ఆయన అమ్మ దగ్గరికి వెళ్లి వస్తుండేవారు. ప్రస్తుతం ఆయన ఒక్కరే ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో ఉంటున్నారు. మోడీ తన బంధువులెవరినీ దగ్గరకు రానివ్వలేదు. ఆయన సమీప బంధువులు పలువురు ఇంకా చిన్న ఇళ్లల్లోనో, పెంకుటిళ్లలోనో నివాసం ఉంటున్నారు. విచిత్రమేమిటంటే, గుజరాత్‌లో ఆయనను ఎక్కువగా అభిమానించేది మహిళలే. ఆయన సభలకు ఎక్కువగా హాజరయ్యేది మహిళలే.

No comments: