Tuesday, November 20, 2012

కాయగూరల చెట్ల పై పేనుబంక తెగులు పోవాలంటే..?

పేనుబంక తెగులును ఎఫిడ్స్ అంటారు. ఇది సాధారణంగా చిక్కుడు, కాకర, సొర, పొట్ల వంటి తీగమొక్కలకు వచ్చే తెగులే. దీనిని నివారించేందుకు పల్లెటూళ్లలో ఆకుల మీద బూడిదను చల్లుతుంటారు. తొలిదశలో ఇది కొంతవరకు పని చేస్తుంది కాని ఆ తర్వాత అంతగా ఫలితాలనివ్వదు. దాంతో చిక్కుడు పాదు నిలువెల్లా ఎండిపోతుంది, కాపు తగ్గిపోతుంది. కాబట్టి ‘రోగోర్’ అనే ద్రావకాన్ని లీటరుకు రెండు మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చేయాలి. దీని శాస్త్రీయనామం. డై మెథోయేట్. ఈ ద్రావకం ఆకులకు అంటుకునేందుకు కొద్దిపాటి సర్ఫును కూడా కలపాలి. సాధారణంగా ఈ ద్రావకాన్ని పొద్దున పూట లేదా సాయంత్రం వేళల్లో పిచికారీ చేయాలి. అలా పిచికారీ చేసేటప్పుడు ఆకుల కిందిభాగం తడిసేటట్లు చూడడం ముఖ్యం. ఎందుకంటే ఈ తెగులు ఆకుల కిందిభాగంలో ఎక్కువగా ఉంటుంది.


ఇలా రసాయనాలు ఉపయోగించడం ఇష్టం లేనివారు లేదా సాధ్యం కానివారు సీతాఫలం లేదా వావిలి ఆకులను తీసుకుని వాటిని కొద్దిపాటి నీటిలో వేసి బాగా మరిగించి చల్లారిన తర్వాత మరికొంత నీటిలో కలిపి దానిని క్రిమిసంహారకంగా వాడవచ్చు. ఇదే స్థానంలో వేపనూనెను కూడా వాడవచ్చు. దీనిని లీటరుకు మూడు మిల్లీలీటర్లు వాడాల్సి ఉంటుంది. దీనిలో కూడా కొద్దిమొత్తంలో సర్ఫ్ పొడి కలుపుకోవడం అవసరం.

No comments: