Sunday, November 25, 2012

పాడిపై పిడుగు

ఏపీ డెయిరీ చరిత్రలో తొలిసారి..
సెల్ మెసేజ్‌ల ద్వారా జారీ అయిన ఆదేశాలు

 పాడి రైతులను ప్రభుత్వం దెబ్బ కొట్టింది. నెలకు ఏకంగా మూడురోజుల పాటు పాలసేకరణను నిలిపివేసింది. పదిరోజుల కో రోజు చొప్పున నెలలో మూడురోజులు పాలసేకరణకు ‘సెలవు’ ప్రకటించింది. ఈ మేరకు ‘ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్’ (ఏపీడీడీసీ) నుంచి ఆయా జిల్లాలకు సెల్ మెసేజ్‌ల ద్వారా ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రభుత్వం ఇలా పాల సేకరణను ఉన్న పళాన నిలిపివేయడం పాడిరైతుల పాలిట పిడుగుపాటు కానుంది. రోజుకు 6 లక్షల లీటర్ల చొప్పున మూడురోజుల్లో 18 లక్షల లీటర్ల పాలు రైతుల వద్ద మిగిలిపోనున్నాయి. ‘ప్రపంచ వ్యవసాయ సదస్సు’ సన్నాహక కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ జూబ్లీహాల్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పాడిరైతుల అభ్యున్నతికి తమ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించి 24 గంటలైనా కాకముందే.. పాడిరైతుల నడ్డి విరిచే ఆదేశాలు జారీ కావడం గమనార్హం.


చిత్తూరు నుంచి మొదలు.. 1.2 లక్షల లీటర్ల పాలు వృథా

ఆదివారం చిత్తూరు జిల్లాలో ఏపీ డెయిరీ పాలు సేకరించలేదు. దాదాపు 1.2లక్షల లీటర్ల పాలు వృథా అయినట్లు సమాచారం. 26 సాయంత్రం, 27 ఉదయం వరంగల్‌లోను, 27, 28న మహబూబ్‌నగర్, 28, 29న మెదక్, 29, 30న అనంతపురం, 30, డిసెంబర్1న నిజామాబాద్, డిసెంబర్ 1, 2తేదీల్లో తూర్పుగోదావరి, 2, 3 న పశ్చిమగోదావరి, 3, 4న కడప, 4, 5 తేదీల్లో కృష్ణాజిల్లాలో పాల సేకరణను నిలిపివేయాల్సిందిగా ‘ఏపీ డెయిరీ’ ఆదేశాలు జారీ చేసింది. పది రోజుల వ్యవధితో మళ్లీ వరస ప్రకారం అన్ని జిల్లాల్లో పాల సేకరణ నిలిపివేస్తారు. ఏపీ డెయిరీ ఈ జిల్లాల్లోనే పాల సేకరణ జరుపుతోంది.

ప్రైవేటు డెయిరీల ఇష్టారాజ్యం: ప్రభుత్వరంగ సంస్థ ‘ఏపీ డెయిరీ’ చేతులెత్తేస్తే ప్రైవేటు డెయిరీలు చెలరేగిపోవడం ఖాయమని ఈ రంగంలో నిపుణులు విశ్లేషిస్తున్నారు. ‘ఏపీ డెయిరీ’ మార్కెట్‌లో ఉండబట్టే ప్రైవేటు డెయిరీలు ఈ మాత్రమైనా రైతులకు ధర చెల్లిస్తున్నాయని, ఇప్పుడు ‘ఏపీ డెయిరీ’ ప్రొక్యూర్‌మెంట్ హాలిడే ప్రకటించిన నేపథ్యంలో అవి మరింతగా పాల సేకరణ ధర తగ్గించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఏపీ డెయిరీ సామర్థ్యం రోజుకు 4.5 లక్షల లీటర్లు. అయితే ప్రస్తుతం 6 లక్షల లీటర్ల పాలు వస్తున్నాయి. అంటే 1.5 లక్షల లీటర్ల పాలు అదనంగా వస్తున్నాయి. వీటిని ఇతర పాల పదార్థాలుగా మార్చి మార్కెట్ చేసుకోవాలి. అయితే లీటరుపై సంస్థకు దాదాపు రూ.5 వరకూ నష్టం వస్తోందని ‘ఏపీ డెయిరీ’ చెబుతోంది. పాలు అధికంగా వచ్చే నాలుగు నెలల కాలానికి నెలకు రూ.2.5 కోట్ల వంతున నాలుగు నెలలకు రూ.10 కోట్లు ప్రభుత్వం సబ్సిడీగా ‘ఏపీ డెయిరీ’కి ఇస్తే సమస్య పరిష్కారమవుతుంది. లక్ష కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం పాడి రైతులను ఆదుకునేందుకు రూ.10 కోట్లు కేటాయించక పోవడం దారుణమని డెయిరీ వర్గాలంటున్నాయి.

ప్రభుత్వ సహకారం లేదు..: ‘ప్రభుత్వం నుంచి మాకు జీరో సపోర్ట్. రోజుకు దాదాపు 2 లక్షల లీటర్ల పాలు అదనంగా వస్తున్నాయి. వాటిని హ్యాండిల్ చేయడం శక్తికి మించిన పని అవుతోంది. అందుకే పదిరోజులకు ఒక రోజు చొప్పున పాల సేకరణ ఆపాల్సి వస్తోంది. అక్టోబర్‌లో ‘ఏపీ డెయిరీ’కి రూ.2.35 కోట్లు నష్టమొచ్చింది. వెయ్యి టన్నుల పాలపొడి, వెయ్యి టన్నుల వెన్న నిల్వలు పేరుకుపోయాయి. సంస్థ మునిగిపోకుండా ఉండాలంటే, ప్రభుత్వమైనా సాయం చేయాలి.. లేకపోతే, పాల సేకరణ అయినా తగ్గించుకోవాలి’ అని ఏపీ డెయిరీ ఎండీ రఫత్ అలీ చెప్పారు.
మదనపల్లె (చిత్తూరు), న్యూస్‌లైన్: చిత్తూరు జిల్లాలో కేవలం మదనపల్లె డివిజన్‌లో మాత్రమే ఏపీ డెయిరీ పాలు సేకరిస్తోంది. మిగతా ప్రాంతాల్లో ప్రైవే టు డెయిరీలు పాలు సేకరిస్తున్నాయి. స్థానిక పాలశీతలీకరణ కేంద్రం సామర్థ్యం 75 వేల లీటర్లు కాగా అధికంగానే పాలు సేకరిస్తున్నారు. డివిజన్‌లోని 13 బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్ (బీఎంసీయూ)ల నుంచి రోజూ 1.20 లక్షల లీటర్ల చొప్పున ఏపీడీడీసీ పాలు సేకరిస్తోంది. ఏడు ట్యాంకర్ల ద్వారా హైదరాబాద్‌కు పాలు సరఫరా చేస్తున్నారు. అయితే సేకరణ నిలిపివేత ఆదేశాల్లో భాగంగా మొదటిరోజు ఆదివారం డివిజన్‌లో ఉన్నట్టుండి పాలసేకరణను సంస్థ నిలిపివేసింది. దీంతో సుమారు 6 వేలమంది పాడిరైతులు లబోదిబోమంటున్నారు. మిగిలిపోయిన పాలను ఏం చేసుకోవాలో అర్థం కాక దిక్కుతోచని స్థితిలో పడ్డారు. శీతలీకరణకు ఎలాంటి సౌకర్యం లేని రైతులు పాలను పారబోయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిని ఉన్నతాధికారులకు నివేదించినట్లు పాలశీతలీకరణ కేంద్రం డిప్యూటీ డెరైక్టర్ రమేష్‌రెడ్డి తెలిపారు. దీనిపై ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఎలా బతికేది..?

నెలలో మూడురోజుల పాల కొనుగోలు నిలిపివేస్తే మేము ఎలా బతికేది. పాడిపరిశ్రమపై ఆధారపడ్డాం. అధికారుల నిర్ణయంతో మా బతుకులు రోడ్డున పడ్డాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. - రఘురామిరెడ్డి, పాడి రైతు, కలిచెర్ల.

స్పందించకపోతే ఆందోళన

వేరుశెనగ పంట పోయింది. పాడిపైనే ఆధారపడ్డాం. ఇప్పుడేమో పాలు తీసుకోనంటున్నారు. ఏం చేయాలో తోచడం లేదు. 
- సుబ్బారెడ్డి, పాడిరైతు, పెద్దమండ్యం.

No comments: