Sunday, November 18, 2012

నేడు భూమికి సునీత

నాలుగు నెలలుగా అంతరిక్షంలో ఉన్న భారత అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్.. మరో ఇద్దరు సహచర వ్యోమగాములతో కలిసి భూమికి తిరిగి రానున్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్) బాధ్యతలను నాసాకు చెందిన సహచర వ్యోమగామి కెవిన్ ఫోర్డ్‌కు అప్పగించారు. సునీతతోపాటు జపాన్ ఎయిరోస్పేస్ ఏజెన్సీకి చెందిన అకి హోషిడే, రష్యా సోయుజ్ కమాండర్ యూరి మలెన్‌చెంకోలు కూడా భూమికి తిరుగు ప్రయాణమయ్యారు.



ఐఎస్‌ఎస్ 33వ యాత్రకు సంబంధించి క్రూ కమాండర్‌గా వ్యవహరిస్తున్న సునీత.. జూలై నుంచి అంతరిక్షంలో ఉన్నారు. 33వ యాత్రలో ఫ్లైట్ ఇంజనీర్‌గా సేవలందించిన కెవిన్.. ఇప్పుడు ప్రారంభమైన ఐఎస్‌ఎస్ 34వ యాత్రకు కమాండర్‌గా వ్యవహరిస్తారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 10:26 గంటలకు సోయుజ్ టీఎంఏ-05ఎం.. సునీతతోపాటు హోషిడే, మలెన్‌చెంకోలతో ఐఎస్‌ఎస్ నుంచి బయలుదేరి, సోమవారం ఉదయం 7:23 గంటలకు కజకస్థాన్‌లో భూమిపై దిగుతుంది. ఈ ఏడాది జూలై 15న కజకస్థాన్ నుంచి అంతరిక్షంలోకి వెళ్లిన సునీతా విలియమ్స్ 127 రోజుల తర్వాత తిరిగి భూమిపై అడుగుపెడుతున్నారు.

No comments: