Saturday, November 3, 2012

రాష్ట్రీయం ప్రమాదాల్లో మరణించిన ప్రముఖులు

రాష్ర్టంలో జరిగిన ఘోర ప్రమాదాల్లో పలువురు ప్రముఖులు అశువులు బాశారు. వీరిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసిన జీఎంసీ బాలయోగి, మాజీ మంత్రులు ధూళిపాళ్ల వీరయ్య చౌదరి, పి.ఇంద్రారెడ్డి, రాజారాం తదితరులతోపాటు తాజాగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కె.ఎర్రన్నాయుడు ఉన్నారు.

ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ రాజశేఖరరెడ్డి 2009 సెప్టెంబర్ 2వతేదీన హైదరాబాద్ నుంచి చిత్తూరుకు రచ్చబండ కార్యక్రమానికి వెళుతుండగా కర్నూలు జిల్లా నల్లకాలువ వద్ద జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.

2002లో అప్పటి లోక్‌సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు.

ప్రస్తుత హోంమంత్రి సబిత భర్త పి.ఇంద్రారెడ్డి షాద్‌నగర్‌లో ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

1994లో గుంటూరులో తెలుగురైతు సభ ఏర్పాట్లలో నిమగ్నమైన మాజీ మంత్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి తన స్వగ్రామానికి వెళుతూ రోడ్డు ప్రమాదంలోనే చనిపోయారు. 1979లో మంత్రిగా ఉన్న రాజారాం నిజామాబాద్‌లో రహదారి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆయన ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన చెట్టును ఢీకొనటంతో ఈ దుర్ఘటన జరిగింది.

తాజాగా టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కె.ఎర్రన్నాయుడు విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళుతుండగా ఆయన ప్రయాణిస్తున్న వాహనం ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొన్న ప్రమాదంలో మరణించారు.
-న్యూస్‌లైన్, హైదరాబాద్

No comments: