Tuesday, November 20, 2012

అమెరికా అంటే ముందుగా చట్టాలు, ఆ తర్వాతే మనుషులు

చట్టాన్ని, న్యాయాన్ని నిలబెట్టవలసి వచ్చినప్పుడు ‘ఎవరు, ఏమిటి’ అనే భేదాలు అమెరికాలో ఉండవు. అవతలివారు బలవంతులా? బలహీనులా? అన్న మీమాంస అక్కడి ‘లా’కి గాని, ‘లా ఎల్‌ఫోర్స్‌మెంట్’కి గాని ఉండదు. ‘యు.ఎస్. అంటే ముందుగా చట్టాలు, న్యాయం. ఆ తర్వాతే మనుషులు, మమతలు’ అనే వ్యాఖ్య తరచూ వినిపిస్తూ ఉంటుంది.

ఆ మధ్య ఒబామా అడ్మినిస్ట్రేషన్‌లో ఒక ముఖ్యుడు డ్రంకెన్ డ్రైవింగ్‌కి బుక్ అయ్యి, పదవి వదులుకున్నాడు. ఇటీవల ఒక సి.ఐ.ఏ. డెరైక్టర్ వివాహేతర సంబంధం బయటపడి రాజీనామా చేశాడు. ఈ మధ్యనే విదేశీ విద్యార్థుల్ని మోసగించిన ఒక యూనివర్సిటీ అధికారికి 80 ఏళ్లకి పైగానే జైలు శిక్ష పడవచ్చంటున్నారు. ఒక కుక్క ఒక పిల్లిని చంపితే ఆ డాగ్ ఓనర్‌ని మూడేళ్ళు ఖైదులో పెట్టే దేశం అది! పోలీసులు కూడా అక్కడ చట్టాల్ని సర్వస్వతంత్రంగా అమలు జరుపుతారు.

టెక్సాస్‌లోని శాన్‌యాంటోనియోలో ఒక వృద్ధమహిళ అనుమతి లేనిచోట రోడ్డు దాటుతుండగా ఒక యువతి డ్రైవ్ చేస్తున్న కారు ఆమెని ఢీకొని అక్కడికక్కడే ఆమె మృతి చెందింది. పోలీసులు వచ్చి చూసి, అందులో డ్రైవర్ తప్పు ఏమీ లేదని నిర్ణయించి కేసు కూడా బుక్ చెయ్యకుండానే ఆ యువతిని కొద్దిసేపట్లోనే ప్రమాదస్థలం నుంచి పంపేశారు.

యు.ఎస్.లో ‘లా’ చెయ్యాలనుకునే భారతీయ విద్యార్థులు అక్కడి చట్టాలలోను, చట్టపాలనలోను ఉన్న ఈ వైవిధ్యాన్ని ముందుగా అర్థం చేసుకోవాలి. అక్కడి న్యాయవిద్య అక్కడి అవసరాలకు తగినవిధంగా రూపొందినదే అయినా, ఇంటర్‌నెట్ మూలంగా ప్రపంచమంతా ఒకే గ్రామంలాగ మారిన ఈ రోజుల్లో దాని ప్రయోజనం ఇక్కడి ‘లా’ విద్యార్థులకు కూడా పెరుగుతోంది. మొట్టమొదటి ‘లా’ కోర్సుని అక్కడ చేసేవాళ్లకంటే అడ్వాన్స్‌డ్ స్టడీస్ కోసం వెళ్ళే మన ‘లా’ గ్రాడ్యుయేట్స్‌కి న్యాయశాస్త్ర అధ్యయనం ఎక్కువ ఉపయోగపడుతుంది.

 
అంతర్జాతీయ వాణిజ్యంలో యు.ఎస్. గ్లోబల్ లీడర్‌గా ఉండడంతో అమెరికాతో భారతీయ కంపెనీల వ్యాపారం కూడా బాగా పెరిగింది. పట్టు తప్ప విడుపు తెలియని అక్కడి చట్టాలకు అనుగుణంగా ఉండడానికి; ఏమైనా చిక్కులు తలెత్తినప్పుడు పరిష్కరించడానికి యు.ఎస్.లో వ్యాపారం, లావాదేవీలు జరుపుతున్న ఇండియన్ కంపెనీలు ఇప్పుడు అమెరికన్ ‘‘లా’’ కూడా చేసిన భారతీయ లాయర్లకు ప్రాధాన్యం ఇస్తున్నాయి.

 
ఫార్మా (ఔషధాల తయారీ) పరిశ్రమ, ట్రేడ్ మార్కులు, పేటెంట్లు; బిజినెస్ వివాదాలు, ఉత్పత్తులలో లోపాలకి సంబంధించిన వ్యాజ్యాల మీద భారతీయ సంస్థలు అమెరికాలో ఎక్కువ డబ్బునే ఖర్చుపెడుతున్నాయి. అడ్వర్‌టైజ్‌మెంట్‌లో చెప్పిన నాణ్యత వస్తువులో లేకపోతే అక్కడి ప్రజలు కోర్టు కేసులు వెయ్యడం కూడా యు.ఎస్.లో సర్వసాధారణం కాబట్టి ఈ కారణం వల్ల కూడా ఇండియన్ కంపెనీలకు ఇక్కడి చట్టాలు తెలిసిన మన లాయర్ల అవసరం ఎక్కువ.



‘లా’ చదవడం అంటే లాయర్, జడ్జి అవ్వడం మాత్రమే కాదు. రాజకీయాలు, వ్యాపారం, జర్నలిజం, లా ఎన్‌ఫోర్స్‌మెంట్, విద్యాబోధన, ఆర్థికరంగం, దౌత్యనీతి లాంటి అనేక ముఖ్యరంగాలలో కూడా న్యాయశాస్త్రం చదివినవారు బాగా రాణిస్తారు. కాగా అమెరికాలో న్యాయశాస్త్ర విద్య బాగా టఫ్‌గా ఉండే ప్రొఫెషనల్ ఫార్మాట్ మీద ఉంటుంది. అక్కడ మొదటి ‘లా’ డిగ్రీని జె.డి (జ్యూరిస్ డాక్టర్) అంటారు. దీని తర్వాత ‘మాస్టర్ ఆఫ్ లా’ (ఎల్.ఎల్.ఎం.) చెయ్యవచ్చు.



జె.డి. ఫుల్ టైమ్ కోర్సు 3-ఏళ్ళు. మొదటి సంవత్సరం లీగల్ రైటింగ్ లాంటి వాటితో విదేశీ విద్యార్థులకి కొద్దిగా కష్టంగానే ఉంటుంది. సెకండ్ ఇయర్‌లో ‘లా’ రివ్యూ, ‘మూట్ కోర్టు’ లాంటి ప్రాక్టీస్ కార్యక్రమాలు ఉంటాయి. రెండో ఏడాది, మూడో ఏడాది మధ్య సమ్మర్ మంత్స్‌లోనే విద్యార్థులు లీగల్ ఇంటర్న్‌షిప్ చేస్తారు. థర్డ్ ఇయర్‌లో ఇంటర్నేషనల్ లా, యాంటీ ట్రస్ట్ లా, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లా ఉంటాయి.



యు.ఎస్.లో ‘లా’ ప్రాక్టీస్ చెయ్యాలనుకునేవారు కూడా థర్డ్ ఇయర్ నుంచే అమెరికన్ బార్ అసోసియేషన్ (ఏ.బి.ఏ) పరీక్షకి ప్రిపేర్ అవుతారు. అక్కడ జె.డి. చెయ్యగానే అటార్నీగా ప్రాక్టీస్ చెయ్యడానికి వీలులేదు. తాము ప్రాక్టీస్ చెయ్యదలుచుకున్న యు.ఎస్. రాష్ట్రం నుంచి ఏ.బి.ఏ పరీక్షను క్లియర్ చెయ్యాలి. యు.ఎస్.లో దాదాపు 200 లా స్కూల్స్‌ని ఏ.బి.ఏ. అప్రూవ్ చేసింది.

No comments: